ముంబై: ఇప్పటివరకు రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న పార్టీలకు కొత్తగా వచ్చిన ఆమ్‌ఆద్మీ పార్టీతో తలనొప్పులు తప్పేలా లేవు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్య విజయం తర్వాత ఆ పార్టీ నెమ్మదిగా దేశ రాజకీయాలవైపు దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని 48 స్థానాల్లోనూ అభ్యర్థులను నిలబెట్టడం ద్వారా ప్రధాన పార్టీలకు సవాల్ విసిరింది. రాష్ట్రంలో కాంగ్రెస్, ఎన్సీపీ, బీజేపీ, శివసేన పార్టీలు బలంగా ఉన్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీపీ ఒక కూటమిగా, బీజేపీ, శివసేన కాషాయకూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. అలాగే మాయావతి నేతృత్వంలోని భారతీయ సమాజ్ పార్టీ(బీఎస్పీ) కూడా ఇక్కడ 48 స్థానాల్లో పోటీచేస్తోంది.
ఈ పార్టీ గతంలోనూ ఇక్కడ నుంచి అభ్యర్థులను నిలబెట్టినా ఖాతా మాత్రం తెరవలేకపోయింది. ఇదిలా ఉండగా శివసేన నుంచి బయటకు వచ్చిన రాజ్ ఠాక్రే స్థాపించిన మహారాష్ర్ట నవనిర్మాణ్ సేన కూడా రాష్ర్టంలో కొంత పట్టు సంపాదించింది. ప్రస్తుత ఎన్నికల్లో ఆ పార్టీ సుమారు 12 స్థానాల్లో తన అభ్యర్థులను నిలబెట్టనుంది. కాగా, ఇప్పుడు ఆమ్‌ఆద్మీ పార్టీ రాష్ట్రంలో మహాకూటమి, కాషాయకూటములకు ప్రత్యామ్నాయంగా ఎదగడానికి యత్నిస్తోంది. తమ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఉన్న క్లీన్ ఇమేజ్, పార్టీ విధివిధానాలు రాష్ట్రంలో పార్టీ అభ్యర్థుల విజయానికి సహకరిస్తాయని ఆప్ రాష్ట్ర కార్యదర్శి ప్రీతి మెనన్ శర్మ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘మేం ఢిల్లీలో మా సత్తా చాటుకున్నాం. ఎన్నికలకు ముందు .. తర్వాత కూడా మా విధివిధానాల్లో ఎటువంటి మార్పూ లేదు. పేదల సంక్షేమం కోసం పాటుపడటానికే మా మొదటి ప్రాధాన్యం..’ అని శర్మ అన్నారు.
ఇదిలా ఉండగా మూడేళ్ల కిందట ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే జాతీయస్థాయిలో ప్రారంభించిన అవినీతి వ్యతిరేక ఉద్యమం మహారాష్ట్రలో ఆప్ వేళ్లూనుకోవడానికి దోహదపడింది. ఈ ఉద్యమాన్ని ముందుకు నడిపించిన ప్రధాన వ్యక్తుల్లో ఒకడైన కేజ్రీవాల్, తర్వాత కాలంలో ఆమ్‌ఆద్మీ పార్టీని స్థాపించారు. ఆ పార్టీ ఢిల్లీ విధానసభ ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయితే 49 రోజుల పాలన తర్వాత జన్‌లోక్‌పాల్ బిల్లుకు మద్దతు కూడగట్టడంలో విఫలమయ్యామని ప్రకటించి పదవికి రాజీనామా చేశారు. తమ పార్టీ తరఫున సత్ప్రవర్తన కలిగిన వ్యక్తులనే బరిలో దింపుతామని చెబుతున్నప్పటికీ ఆర్థిక వనరుల లేమి ఆ పార్టీని ఇబ్బంది పెడుతోంది.
ఒకపక్క సామాజిక కార్యకర్త మేధా పాట్కర్‌ను ఈశాన్య ముంబై లోక్‌సభ స్థానం నుంచి అభ్యర్థిగా నిలబెట్టిన ఆ పార్టీ, దక్షిణ ముంబైలో మాజీ బ్యాంకర్ మీరా సన్యాల్‌ను బరిలో నిలిపిందంటే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చు. అలాగే ఉత్తర మధ్య ముంబై నుంచి ప్రముఖ న్యాయవాది ఫిరోజ్ పాల్కివాలా పోటీ చేస్తుండగా, బీడ్ నియోజకవర్గం నుంచి మరాఠీ నటుడు నందు మాధవ్ పోటీచేస్తున్నారు. ఆ స్థానం నుంచి బీజేపీ సీనియర్ నాయకుడు గోపినాథ్ ముండే బరిలో ఉన్న సంగతి తెలిసిందే. బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు నితిన్ గడ్కరీ పోటీలో ఉన్న నాగపూర్‌లో ఆప్ నుంచి రాష్ర్టంలో ఇరిగేషన్ కుంభకోణాన్ని బయటపెట్టిన అంజలి దమనియా బరిలో ఉన్నారు. ఎన్సీపీలో బలమైన నాయకుడిగా ముద్రపడిన ఛగన్ భుజ్‌బల్ బరిలో ఉన్న నాసిక్‌లో మాజీ ఐఏఎస్ అధికారి విజ్ పంధారే ఆప్ తరఫున తన ప్రతాపం చూపనున్నారు.
ఇరిగేషన్ స్కాం బయటపెట్టడంతో ఇతడు కూడా కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. అలాగే హత్కనంగాలే స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ రాజు శెట్టిపై ప్రముఖ రైతు నాయకుడు రఘునాథ్ పాటిల్ ఆప్ తరఫున పోటీ చేస్తున్నారు. కాగా, ఆప్‌లో పలువురు నాయకులు ఎన్నికలో నిలబడటానికి..కనీస ఖర్చులను అధిగమించడానికి సైతం తగిన ఆర్థిక వనరులు లేక ఇబ్బంది పడుతున్నారు. కాగా ఈ ఇబ్బందుల నుంచి బయటపడటానికి నాగపూర్‌లో రోడ్డుపక్కన, సిగ్నల్స్ వద్ద తమ కార్యకర్తలు చందాలు సమీకరిస్తున్నారని.. ప్రజలు కూడా తమకు సహకరిస్తున్నారని ముంబై పార్టీ కోశాధికారి సురేశ్ ఆచార్య తెలిపారు. అలాగే పార్టీ కార్యకర్తలు తమ బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, సామాన్య పౌరులనుంచి కూడా ఎంతోకొంత చందాలు సేకరిస్తున్నారని ఆయన వివరించారు. సేకరించిన, ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి లెక్క ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
‘ఇలా ఇప్పటివరకు కొన్ని రూ.లక్షలు మాత్రమే సేకరించగలిగాం.. మరిన్ని నిధుల సేకరణలో భాగంగానే నాగపూర్‌లో ఇటీవల కేజ్రీవాల్‌తో డిన్నర్ ఏర్పాట్లు వంటి ప్రత్యేక నిధుల సేకరణ కార్యక్రమాలను చేపడుతున్నా’మని ఆచార్య చెప్పారు. ‘మా పార్టీకి ప్రజల మద్దతు చాలా ఉంది.. అయితే నిధులే చాలినంత లేవు..’ అని ఆయన అన్నారు. కాగా ఆప్ రాష్ట్రంలో ఎన్ని సీట్లు కచ్చితంగా గెలుచుకుంటుంది అనేది ఇప్పుడే చెప్పడం కష్టమని బోరివలిలోని ఆ పార్టీ అభిమాని ఆనంద్ జోషీ వ్యాఖ్యానించారు. సామాన్యుల అభిమానం ఆప్‌కు పెట్టని కోటగా ఆయన అభివర్ణించారు. దీనివల్లనే తటస్థ ఓటర్లు ఆప్ వైపు మళ్లే అవకాశాలు చాలా ఉన్నాయని ఆయన విశ్లేషించారు. అయితే బహిరంగసభలు, ర్యాలీలు నిర్వహించేందుకు తగిన నిధులు లేకపోయినా ‘మేమూ మీలాంటి వాళ్లమే..’ అనే నినాదంతో గడప గడపకు ఆప్ అంటూ తాము ముందుకు పోతున్నామని ఆచార్య తెలిపారు.
సామాన్యుడి ‘చీపురు’
Published Fri, Mar 28 2014 10:40 PM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement