పంజాబ్ ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్
లూథియానా(పంజాబ్): సిక్కులకు వ్యతిరేకంగా 1984లో జరిగిన అల్లర్లపై ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) చేత దర్యాప్తు జరిపించాలని తొలిసారిగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వమే సిఫారసు చేసిందని ఆ పార్టీ చీఫ్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. శనివారం పంజాబ్‌లో లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన సిక్కు ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు.
లూథియానాలోని దానా మండిలో జరిగిన రోడ్‌షోలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. లూథియానాలో ఆప్ లోక్‌సభ అభ్యర్థి,న్యాయవాది హెచ్‌ఎస్ ఫూల్కా సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితుల కోసం పోరాడుతున్నారని అన్నారు. సిక్కుల కోసం బీజేపీ, అకాలీదళ్ పార్టీలు చేసిందేమీ లేదని, ఆ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. ఫూల్కాను ఎన్నుకుంటే సిక్కు బాధితుల కోసం పార్లమెంటులోనూ పోరాటం కొనసాగిస్తారని హామీనిచ్చారు. పంజాబ్‌లోని అకాలీదళ్-బీజేపీ సర్కారు యువతను డ్రగ్స్ మత్తులోకి తోస్తోందని ఆరోపించారు. రాష్ట్ర మంత్రి ఒకరు మాదకద్రవ్యాల వ్యాపారాన్ని పెంచిపోషిస్తున్నారని, ఆయనకు ఒక్కరోజు కూడా పదవిలో కొనసాగే హక్కు లేదన్నారు.
1984 అల్లర్లపై సిట్ దర్యాప్తు కోరింది మేమే
Published Sun, Apr 13 2014 1:43 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement