మోడీ గ్యాస్ ధరను పెంచాలన్నారు
అంబానీకి సాయపడేందుకే: కేజ్రీవాల్
చండీగఢ్: ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై విరుచుకుపడ్డారు. పారిశ్రామికవేత్త ముఖే శ్ అంబానీకి సహాయపడేందుకు.. గ్యాస్ ధరను మూడింతలు పెంచాల్సిందిగా కోరుతూ ఆయన కేంద్రానికి లేఖ రాసినట్లు చెప్పారు. మోడీ ఇటీవల కేంద్రానికి రాసిన ఆ లేఖ తన వద్ద ఉందని ఇక్కడ తన తొలి రోడ్ షో సందర్భంగా కేజ్రీవాల్ తెలిపారు. గ్యాస్ ధరను మూడింతలు పెంచడంలోని పరమార్థం.. చమురు బావులు కలిగిన అంబానీకి లబ్ధి చేకూర్చడమేనని ఆయన ఆరోపించారు.
గ్యాస్ ధరలు పెంచడంతో ఎరువుల ధరలూ పెరుగుతాయని, తద్వారా ధరలన్నీ పెరిగి అంబానీకి లబ్ధి చేకూరుతుందని వివరించారు. బీజేపీ, కాంగ్రెస్‌లు రెండూ అంబానీ కోసమే పనిచేస్తున్నాయని కేజ్రీవాల్ ధ్వజమెత్తారు. మోడీ, రాహుల్ ఇద్దరూ తమ ప్రయూణం కోసం అంబానీ విమానాన్నే ఉపయోగిస్తారని.. ఆయనకు లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తారని చెప్పారు. కాగా, చండీగఢ్‌లో ఐదుగంటలకుపైగా సాగిన రోడ్‌షో తర్వాత కేజ్రీవాల్ అస్వస్థతకు గురయ్యారు. హర్యానాలోని పంచకుల, అంబాలా తదితర నగరాల్లో నిర్వహించాల్సిన రోడ్‌షోలను రద్దు చేసుకుని తిరిగి ఢిల్లీ చేరుకున్నారు.