కేజ్రీవాల్‌పై పిడిగుద్దులు
ఢిల్లీలో ప్రచారం సందర్భంగా యువకుడి దాడి
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అగ్రనేత అరవింద్ కేజ్రీవాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. దక్షిణపురి ప్రాంతంలో ఓ యువకుడు కేజ్రీవాల్‌పై దాడికి పాల్పడ్డాడు. దీంతో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి తన రోడ్ షోను హఠాత్తుగా రద్దు చేసుకోవాల్సి వచ్చింది. శుక్రవారం ఢిల్లీలోని దక్షిణపురి ప్రాతంలో కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కేజ్రీవాల్ రోడ్‌షో సందర్భంగా ఆయనతో కరచాలనం చేసేందుకు స్థానికులు ఉత్సాహం చూపించారు.
ఈ సమయంలో అబ్దుల్ వహీద్ (19) అనే యువకుడు ఒక్కసారిగా కేజ్రీవాల్‌పై వెనుక నుంచి దాడికి పాల్పడ్డాడు. పిడిగుద్దులు కురిపించి.. ముఖంపైనా కొట్టేందుకు ప్రయత్నించాడు. వెంటనే తేరుకున్న ఆప్ కార్యకర్తలు అతడిని అడ్డుకుని పక్కకు లాగేశారు. అతన్ని చితకబాది స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై కేజ్రీవాల్ స్పందిస్తూ.. తనపై దాడి బీజేపీ నేతల పనే అని ఆరోపించారు.
‘‘కొంతమంది వ్యక్తులు ప్రధానమంత్రి అయ్యేందుకు ఎంతకైనా తెగిస్తున్నారరు. వారు ఏం చేస్తారో చేసుకోనివ్వండి. మనది అహింసా సిద్ధాంతం. మనం పిడికిలి బిగిస్తే ఇటువంటి వాటికి ముగింపు పలకవచ్చు’’ అని అన్నారు. కార్యకర్తలు ఎటువంటి హింసాత్మక ఘటనలకూ పాల్పడవద్దని ఈ సందర్భంగా కేజ్రీవాల్ సూచించారు. ఈ దాడి ఘటనతో కేజ్రీవాల్ తన రోడ్‌షోను రద్దు చేసుకుని ఇంటికి వెళ్లిపోయారు. కాగా, తనపై దాడి వెనుక తమ హస్తం ఉందన్న కేజ్రీవాల్ ఆరోపణలను కమలనాథులు ఖండించారు.