టండ్రా ద్వీపంలో చిట్టచివరి పోలింగ్‌కేంద్రం
రాత్రి ఒంటిగంటకు ఓటేయనున్న స్థానికులు
ఎటు చూసినా మంచు. గడ్డి తప్పించి నిలబడటానికి ఒక్క చెట్టు కూడా పెరగడానికి అనుకూలంగాకాని మైదాన ప్రాంతాలు. ఎవరికీ పట్టని అమెరికా చిట్టచివరి ప్రాంతంగా మిగిలిపోయిన అలాస్కా గురించి మళ్లీ వార్తలు మొదలయ్యాయి. గత 12 సంవత్సరాల ప్రజాస్వామ్య సంప్రదాయానికి మళ్లీ అక్కడి ఓటర్లు సిద్ధమవడమే ఇందుకు కారణం.
అమెరికా పశి్చమ దిశలో చిట్టచివరి పోలింగ్ కేంద్రం ఈ టండ్రా ద్వీపంలోనే ఉంది. అడాక్ ద్వీప ప్రజలు గతంలో మెయిల్ ద్వారా ఓటు పంపించే వారు. 2012 అమెరికా ఎన్నికలప్పుడు మేం కూడా అందరిలా స్వయంగా పోలింగ్‌కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటామని ఉత్సాహం చూపారు. దాంతో అమెరికా ప్రభుత్వం ఇక్కడ తొలిసారిగా పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటుచేసింది.
అప్పటి నుంచి ప్రధాన ఓటర్ల జాబితాలో ఇక్కడి వాళ్లంతా చేరిపోయారు. ‘‘మా నగర వాసులం చిట్టచివర్లో ఓటేస్తాం. ఓటింగ్ సరళిని బట్టి ఆలోపే దాదాపు విజేత ఎవరో తెల్సేవీలుంది. అయినాసరే చివర్లో ఓటేస్తున్నామన్న ఉత్సాహం మాలో రెట్టిస్తుంది. ఆ రోజు మాకందరికీ ప్రత్యేకమైన రోజు. మేం ఓటేసేటప్పటికి అర్ధరాత్రి దాటి సమయం ఒంటిగంట అవుతుంది’’అని సిటీ మేనేజర్ లేటన్ లాకెట్ చెప్పారు.
అమెరికా చిట్టచివరి భూభాగం
అలాస్కా ప్రాంతం అగ్రరాజ్యానికి ప్రత్యేకమైనది. గతంలో రష్యా అ«దీనంలో ఉండేది. ఎందుకు పనికిరాని భూభాగంగా భావించి చాన్నాళ్ల క్రితం అమెరికాకు అమ్మేసింది. ఇటీవలికాలంలో ఇక్కడ చమురు నిక్షేపాలు బయటపడటంతో ఈ ప్రాంతమంతా ఇప్పుడు బంగారంతో సమానం. అత్యంత విలువైన సహజవనరులతో అలరారుతోంది. చిట్టచివరి పోలింగ్ కేంద్రాలున్న అడాక్ ద్వీపం నిజానికి అలేటియన్ ద్వీపాల సముదాయంలో ఒకటి. పసిఫిక్ మహాసముద్రంలో భాగమైన బేరింగ్ నది ఈ ద్వీపసముదాయాలకు ఉత్తరదిశలో ఉంటుంది. దక్షిణ దిశలో పసిఫిక్ మహాసముద్ర ఉత్తరప్రాంతం ఉంటుంది.
అమెరికా ఈ ద్వీపాన్ని రెండో ప్రపంచ యుద్ధంలో స్థావరంలా ఉపయోగించుకుంది. తర్వాత నేవీ స్థావరంగా అభివృద్ధిచేసింది. ‘‘ఇక్కడ చివరిగా ఓటేసింది నేనే. 2012లో మిట్ రోమ్మీపై బరాక్ ఒబామా బరిలోకి దిగి గెలిచిన విషయం మాకు మరుసటి రోజు ఉదయంగానీ తెలీలేదు’అని 73 ఏళ్ల మేరీ నెల్సన్ చెప్పారు. గతంలో అక్కడ పోలింగ్ సిబ్బందిగా పనిచేసిన ఆమె ప్రస్తుతం వాషింగ్టన్ రాష్ట్రానికి మారారు. అలాస్కా ఆవల ఉన్న గ్వామ్, మేరియానా ద్వీపాలు, అమెరికన్ సమోవా వంటి ద్వీపాల్లో ప్రజలు ఉన్నా వారిని ఓటర్లుగా గుర్తించట్లేరు. దీంతో చివరి ఓటర్లుగా అలాస్కా ఓటర్లు చరిత్రలో నిలిచిపోయారు.
రెండో ప్రపంచయుద్ధ స్థావరం
ఎక్కువ రోజులు మంచును చవిచూసే అలాస్కా గతంలో యుద్ధాన్ని చవిచూసింది. రెండో ప్రపంచయుద్దకాలంలో జపాన్ అ«దీనంలోని అటూ ద్వీపాన్ని ఆక్రమించేందుకు అమెరికా తన సేనలను ఇక్కడికి పంపింది. 1942 ఆగస్ట్‌లో సేనలు ఇక్కడికొచ్చి సైనిక శిబిరాల నిర్మాణం మొదలెట్టాయి. దీంతో శత్రుదేశ విమానాలు ఇక్కడ 9 భారీ బాంబులను జారవిడిచాయి. 1943 మేలో 27,000 మంది అమెరికా సైనికులు ఇక్కడికి చేరుకున్నారు. మెషీన్ గన్లమోతలతో ఈ ప్రాంతం దద్దరిల్లింది. ఈ ప్రాంతంపై మక్కువతో రచయితలు డాషిల్ హామెట్, గోరే విడల్ కొన్నాళ్లు ఇక్కడే ఉన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ రూజ్‌వెల్డ్, బాక్సింగ్ ఛాంపియన్ జో లెవీస్, పలువురు హాలీవుడ్ తారలు తరచూ ఇక్కడికి వచి్చపోతుంటారు.
33 వృక్షాల జాతీయవనం !
అలాస్కాలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు భారీ వృక్షాల ఎదుగుదలకు సరిపడవు. దీంతో ఇక్కడ గడ్డి, చిన్న మొక్కలు తప్పితే వృక్షాలు ఎదగవు. ఇక్కడ చెట్లు పెంచి అడవిని సృష్టించాలని అమెరికా ప్రభుత్వం 1943–45కాలంలో ఒక ప్రయత్నంచేసింది. చివరికి చేసేదిలేక చేతులెత్తేసింది. అప్పటి ప్రయత్నానికి గుర్తుగా 1960లలో అక్కడి 33 చెట్ల ముందు ఒక బోర్డ్ తగిలించింది. ‘‘మీరిప్పుడు అడాక్ జాతీయ వనంలోకి వచ్చి వెళ్తున్నారు’అని దానిపై రాసింది. నేవీ బేస్ ఉన్నంతకాలం 6,000 మందిదాకా జనం ఉండేవారు. తర్వాత ఇక్కడ ఉండలేక చాలా మంది వలసవెళ్లారు.
2020 జనాభా లెక్కల ప్రకారం ఇక్కడ కేవలం 171 మంది ఉంటున్నారు. 2024 అనధికార గణాంకాల ప్రకారం ఇక్కడ స్థిరనివాసం ఏర్పర్చుకున్నది కేవలం 50 మంది మాత్రమే. కనీసం పది మంది విద్యార్థులయినా వస్తే స్కూలు నడుపుదామని నిర్ణయించుకున్నారు. ఎలాగోలా గత ఏడాది ఆరుగురు విద్యార్థులతో స్కూలు మొదలుపెట్టారు. తీరా గత ఏడాది నవంబర్‌కు వచ్చేసరికి ఐదుగురు మానేశారు. ఇప్పుడు అక్కడ ఒకే విద్యార్థి ఉన్నారని అలేటియన్ రీజియన్ స్కూల్ డిస్ట్రిక్ సూపరింటెండెంట్ మైక్ హన్లీ చెప్పారు. ‘‘జనం వెళ్లిపోతున్నారు. చివరికి ఎవరు మిగులుతారో. ఈసారి చివరి ఓటు ఎవరేస్తారో చూడాలి’అని అడాక్ సిటీ క్లర్క్ జేన్ లికనాఫ్ చెప్పారు.
– యాంకరేజ్(అమెరికా)
Comments
Please login to add a commentAdd a comment