అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకాంశంగా మారిన వైనం
తమకే సానుకూలం అంటున్న డెమొక్రాట్లు
అధ్యక్ష ఎన్నికతో పాటు అబార్షన్‌పైనా ఓటేయనున్న 10 రాష్ట్రాలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అబార్షన్ హక్కులు కీలకంగా మారాయి. అధ్యక్షుడు ఎవరనేది అవే నిర్ణయించినా ఆశ్చర్యం లేదని పరిశీలకులూ అభిప్రాయపడుతున్నారు. అబార్షన్ హక్కులను 2022లో అమెరికా సుప్రీంకోర్టు కొట్టేయడం తెలిసిందే. వాటిపై దేశవ్యాప్తంగా నిరసనలు పెల్లుబికాయి. ఆ తర్వాత జరుగుతున్న తొలి అధ్యక్ష ఎన్నికలివి. ఈ నేపథ్యంలో 10 కీలక రాష్ట్రాల్లోని ఓటర్లు అధ్యక్ష ఎన్నికల్లో ఓటింగ్‌తో పాటు అబార్షన్ హక్కులపైనా తమ అభిప్రాయాన్ని తెలపనున్నారు. అధ్యక్ష అభ్యర్థులతో పాటు అబార్షన్ హక్కుల సవరణ (4) అంశాన్ని కూడా ఆ రాష్ట్రాలు బ్యాలెట్‌లో పొందుపరిచాయి.
గర్భస్రావాన్ని నిషేధిస్తూ అమెరికాలో కనెక్టికట్ రాష్ట్రం 1821లో తొలిసారిగా చట్టం చేసింది. దాంతో అప్పటిదాకా సాధారణ చికిత్సగా ఉన్న గర్భస్రావం నేరంగా మారిపోయింది. 1880వ దశకం చివర్లలో పలు ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి చట్టాలే చేశాయి. జేన్ రో అనే మహిళ దీన్ని వ్యతిరేస్తూ 1971లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గర్భస్రావం అందుబాటులో ఉండేలా చూడాలని, పునరుత్పత్తి సంబంధిత విషయాల్లో నిర్ణయాధికారం మహిళలకే ఉండాలని వాదించారు. దాంతో గర్భస్రావాన్ని చట్టబద్ధం చేస్తూ రెండేళ్ల తర్వాత కోర్టు తీర్పునిచ్చింది. ‘రోవర్సెస్ వేడ్’ కేసుగా ఇది చరిత్రకెక్కింది. తర్వాత చాలా రాష్ట్రాలు మహిళలకు అబార్షన్ సదుపాయాన్ని కల్పించినా కొన్ని మాత్రం నిషేధం కొనసాగించాయి.
పోప్ వ్యాఖ్యలతో..
అబార్షన్ హక్కులను 1951లో పోప్ గట్టిగా విమర్శించారు. ‘‘గర్భంలోని బిడ్డకు కూడా జీవించే హక్కుంది. ఆ బిడ్డనిచ్చింది దేవుడు. అంతే తప్ప తల్లిదండ్రులు, ఈ సమాజమో లేదా మనిషో సృష్టించిన ప్రభుత్వాలు కాదు’’ అంటూ సందేశమిచ్చారు. ఆ తర్వాత గర్భస్రావంపై ఆంక్షలను సుప్రీంకోర్టే తొలగించడం మత సమూహాలకు సమస్యగా మారింది. దాన్ని అడ్డుకోడానికి రిపబ్లికన్ పార్టీని మాధ్యమంగా అవి ఎంచుకున్నాయి. ఫలితంగా 1970వ దశకంలో అంతంతమాత్రంగా ఉన్న పార్టీ ఈ మత సమూహాలతో కలిసి ప్రభావశీలంగా మారింది. 1968–88 మధ్య ఆరు అధ్యక్ష ఎన్నికల్లో ఏకంగా ఐదింటిలో విజయం సాధించింది.
జడ్జీల ద్వారా ఎత్తులు
1983లో పార్లమెంటులో గర్భస్రావ చట్ట సవరణకు ప్రతిపాదనలు ప్రవేశపెట్టినా ఆమోదం పొందలేదు. గర్భస్రావాన్ని నిషేధించడం పార్లమెంటు ద్వారా సాధ్యం కాదని, కోర్టు ద్వారానే ముందుకెళ్లాలని భావించారు. కానీ దానికోసం సంప్రదాయవాద జడ్జిలు అవసరమయ్యారు. అమెరికాలో జడ్జీలను అధ్యక్షుడే నియమిస్తారు. సుప్రీంకోర్టు జడ్జీల నియామకంపై పార్టీలు దశాబ్దాలుగా రెండుగా చీలుతున్నాయి.
అధికారం రిపబ్లికన్ల చేతుల్లో ఉంటే గర్భస్రావాన్ని వ్యతిరేకించే జడ్జీలు, డెమొక్రాట్ల చేతిలో ఉంటే సమర్థించే వాళ్లు వచ్చేవారు. ట్రంప్ హయాంలో గర్భస్రావ వ్యతిరేక ధోరణి ఉన్న జడ్జీల నియామకం ఎక్కువగా జరిగింది. దాంతో అబార్షన్‌ను చట్టబద్ధం చేసిన 50 ఏళ్ల నాటి తీర్పును సుప్రీంకోర్టు 2022లో కొట్టివేసింది. అమెరికాలో అబార్షన్ హక్కులను ఈ తీర్పు పూర్తిగా మార్చేసింది. రాష్ట్రాలు తమ పరిధిలో అబార్షన్ అనుమతులను మార్చుకోవచ్చని పేర్కొంది. దీని ఆధారంగానే టెక్సాస్ రిపబ్లికన్ గవర్నర్ గ్రెగ్ అబాట్ ఒక కొత్త గర్భస్రావం చట్టాన్ని అమలు చేశారు. ఈ బాటలో మరిన్ని రాష్ట్రాలు నడిచాయి.
మెజారిటీ అమెరికన్ల వ్యతిరేకత
2022 నాటి సుప్రీంకోర్టు తీర్పుతో మెజారిటీ అమెరికన్లు విభేదించారు. ఇది ఆ ఏడాది జరిగిన మధ్యంతర ఎన్నికల్లో డెమొక్రాట్ల విజయానికి కారణమైంది. ఇప్పుడు మాత్రం పునరుత్పత్తి హక్కుల కంటే ఆర్థిక వ్యవస్థ గురించి ఓటర్లలో ఎక్కువ ఆందోళన ఉందని సర్వే లు చెబుతున్నాయి. కానీ డెమొక్రాట్ల అభ్యర్థి, కమలా హారిస్ మాత్రం తన ప్రచా రంలో అబార్షన్ హక్కులనే ప్రస్తావిస్తున్నారు. అబార్షన్ల అనుకూల తీర్పును రద్దు చేసిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకంలో తన పాత్రను ట్రంప్ ప్రచారం మొదట్లో పదేపదే పేర్కొంటున్నారు. ఇటీవల మాత్రం అబార్షన్ హక్కులపై నిర్ణయాధికారం రాష్ట్రాలదేనంటున్నారు.
డెమొక్రాట్లకే సానుకూలం
ఫ్లోరిడా, అరిజోనా, నెవడా, కొలరాడో, మోంటానా, సౌత్ డకోటా, మిస్సోరి, న్యూయార్క్, మేరీలాండ్, నెబ్రాస్కాల్లో అధ్యక్ష ఎన్నికలతో పాటు అబార్షన్ హక్కులపై కూడా ఒకేసారి ఓటింగ్ జరుగుతోంది. అబార్షన్ హక్కులుండాలా, పూర్తిగా రద్దు చేయాలా అనే విషయమై ఓటర్లు నిర్ణయం వెలువరించనున్నారు. ఈ విషయాలను అధ్యక్ష బ్యాలెట్‌తో పాటుగా జోడించడం అరిజోనా, నెవడా వంటి రాష్ట్రాల్లో డెమొక్రాట్లకు కలిసి రానుందని చెబుతున్నారు. గత ఎన్నికల్లో రిపబ్లికన్లకు ఓటేసిన ఫ్లోరిడా కూడా ఈసారి డెమొక్రాట్లకు మద్దతుగా నిలుస్తుందని అంచనా.
ఫ్లోరిడా ఓటర్లలో 46 శాతం మంది చట్ట సవరణకు అనుకూలంగా, 38 శాతం వ్యతిరేకంగా, 16 మంది తటస్థంగా ఉన్నారని అక్టోబర్‌లో న్యూయార్క్ టైమ్స్/సియానా కాలేజ్ నిర్వహించిన సర్వే వెల్లడించింది. కాకపోతే వచ్చే మంగళవారం జరగనున్న అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌లో అబార్షన్ అంశం ఏ మేరకు ప్రభావం చూపిస్తుందనే దానిపై ఇప్పటికైతే స్పష్టత లేదు. ఎందుకంటే ఎకానమీనే ఈ ఎన్నికల్లో అతి పెద్ద సమస్యగా ఏకంగా 28 శాతం మంది ఓటర్లు చూస్తున్నట్టు సియానా కాలేజ్ పోల్ సర్వే పేర్కొంది. అబార్షన్ హక్కులను పెద్ద సమస్యగా భావిస్తున్నది 14 శాతమే. ఇక ట్రంప్ అత్యంత ప్రాధాన్యమిస్తున్న అక్రమ వలసల అంశానికి 12 శాతం మంది మాత్రమే ప్రాధాన్యమిస్తున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment