భారత సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్‌కు 36 గంటల ముందే ప్రచారానికి తెర పడుతుంది. కానీ అమెరికాలో అలా కాదు. కనీసం నాలుగు వారాల పాటు ప్రచారం, ఓటింగ్ సమాంతరంగా సాగుతాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలకు మరో 12 రోజులే ఉంది. నవంబర్ 5న దేశవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. కానీ ఏకంగా 2.1 కోట్ల మంది అమెరికన్లు ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ హోరాహోరీగా తలపడుతుండటం తెలిసిందే.
1.33 కోట్ల పోస్టల్ ఓట్లు
ఫ్లోరిడా వర్సిటీ ఎలక్షన్ ల్యాబ్ డేటా ప్రకారం 78 లక్షల ఓట్లు వ్యక్తిగత పద్ధతుల ద్వారా పోలయ్యాయి. మిగతా 1.33 కోట్ల పై చిలుకు ఓట్లు పోస్టల్ బ్యాలెట్ల ద్వారా పోలయ్యాయి. ఆసియన్ అమెరికన్లలో మాత్రం 1.7 శాతం మంది మాత్రమే ముందస్తు ఓటింగ్‌ను ఉపయోగించుకున్నట్టు ఎలక్షన్ ల్యాబ్ తెలిపింది. దాని గణాంకాల ప్రకారం వ్యక్తిగత ప్రారంభ ఓటర్లలో 41.3 శాతం మంది రిప బ్లికన్లు ఓటు వేయగా, డెమొక్రాట్లు 33.6 శాతం మంది ఓటు వేశారు. పోస్టల్ బ్యా లెట్ల ద్వారా డెమొ క్రాట్లు 20.4 శాతం, రిపబ్లికన్లు 21.2 శాతం ఓటు హక్కును వినియో గించుకున్నారు.
జార్జియా రాష్ట్రంలో నాలుగో వంతు ఓటర్లు ఇప్పటికే ఓటేశారు. 18.4 లక్షల మంది జార్జియన్లు ఓటు హక్కును వినియోగించుకున్నారని సెక్రటరీ ఆఫ్ స్టేట్ కార్యాలయం తెలిపింది. ఇలినాయీ, టెక్సాస్ రాష్ట్రాల్లోనూ ముందస్తు ఓటింగ్ ఎక్కువగా జరిగింది. ఓటింగ్ సెంటర్లలో ఎక్కడ చూసినా పార్కింగ్ ప్రదేశాలు కిక్కిరిసి కన్పించాయి.
అత్యధికంగా ఓటేసింది రిపబ్లికన్లే
7 అతి కీలక స్వింగ్ స్టేట్లయిన అరిజోనా, నెవెడా, విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేని యా, నార్త్ కరోలినా, జార్జియాల్లో ఫలితాలే అధ్యక్ష ఎన్నికల విజేతను నిర్ణయిస్తాయని అమెరికా రాజకీయ పండితులు చెబుతుంటారు. ఈ కీలక యుద్ధభూమి రాష్ట్రాల్లో ముందస్తు ఓటింగ్‌లో రిపబ్లికన్ ఓటర్లే పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారని సీనియర్ పొలి టికల్ జర్నలిస్ట్ మార్క్ హాల్పెరిన్ అన్నారు. బహుశా మాజీ అధ్యక్షుడు ట్రంప్ విజయానికి ఇది సూచిక కావచ్చని అభిప్రాయపడ్డారు. రిపబ్లికన్లు ఊహించిన దానికంటే ఎక్కువ సంఖ్యలో ముందస్తు ఓటింగ్‌లో పాల్గొంటున్నట్టు న్యూయార్క్ టైమ్స్ తెలిపింది. ఈ విషయంలో రిపబ్లికన్ పార్టీ బాగా శ్రమించిందని అరిజోనాలో ముందస్తు బ్యాలెట్లను ట్రాక్ చేసే డెమొక్రాటిక్ రాజకీయ వ్యూహకర్త శామ్ అల్మీ అంగీకరించారు.
ప్రత్యేక సౌలభ్యం..
ముందస్తు ఓటింగ్ అమెరికా ఓటర్లకున్న ప్రత్యేకమైన సౌలభ్యం. వారు మెయిల్– ఇన్– బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించుకుంటారు. దీన్ని మన దగ్గరి పోస్టల్ బ్యాలెట్‌తో పోల్చవచ్చు. కొన్ని చోట్ల పోలింగ్ రోజుకు వారాల ముందే పోలింగ్ కేంద్రాలను తెరుస్తారు. ముందుగానే ఓటేయాలనుకునే వారు నిర్ధారిత బూత్‌లకు వెళ్లి ఓటు హక్కును వినియోగించుకుంటారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
USA Presidential Elections 2024: ఓటేసిన 2.1 కోట్ల అమెరికన్లు
Published Thu, Oct 24 2024 5:00 AM | Last Updated on Thu, Oct 24 2024 11:20 AM
Comments
Please login to add a commentAdd a comment