
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఏడో విడత సార్వత్రిక ఎన్నికల ప్రచారం శుక్రవారంతో ముగిసింది. 38 రోజుల పాటు ఏకధాటిగా సాగిన ఎన్నికల ప్రచారానికి తెరపడింది. చివరి దశ ఎన్నికల్లో భాగంగా 7 రాష్ట్రాలు, ఓ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన 59 లోక్‌సభ స్థానాలకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. కోల్‌కతాలో బీజేపీ చీఫ్ అమిత్ షా సభ సందర్భంగా టీఎంసీ–బీజేపీ శ్రేణుల మధ్య ఘర్షణలతో బెంగాల్‌లో గురువారం రాత్రి 10 గంటల వరకే ఎన్నికల ప్రచారానికి ఈసీ అనుమతించింది. ఉత్తరప్రదేశ్(13), పంజాబ్(13), పశ్చిమబెంగాల్(9), బిహార్(8), మధ్యప్రదేశ్(8), హిమాచల్‌ప్రదేశ్(4), జార్ఖండ్(3)తో పాటు చండీగఢ్ సీటుకు ఏడో విడతలో భాగంగా మే 19న ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఈసీ అన్ని ఏర్పాట్లను పూర్తిచేసింది.
నేతల విస్తృత ప్రచారం..
2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈ 59 స్థానాల్లో బీజేపీ ఏకంగా 32 సీట్లను ౖకైవసం చేసుకుంది. బీజేపీని కేంద్రంలో అధికారానికి దూరంగా ఉంచడమే తమ లక్ష్యమనీ, తమకు ప్రధాని పదవిఅక్కర్లేదనీ కాంగ్రెస్ నేత గులాంనబీ ఆజాద్ ఇటీవల చేసిన ప్రకటనను రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. విపక్షాల ఏకీకరణలో భాగంగానే హస్తం పార్టీ వ్యూహాత్మకంగా ఈ ప్రకటన చేసిందని చెబుతున్నారు. చివరి విడత ఎన్నికల్లో ప్రధాని మోదీ(వారణాసి)తో పాటు బీజేపీ నేతలు కిరణ్‌ఖేర్(చండీగఢ్), భోజ్‌పురి నటుడు రవికిషన్(గోరఖ్‌పూర్) కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా(ఘాజీపూర్) కాంగ్రెస్ నేత పవన్‌కుమార్ బన్సల్(చండీగఢ్)లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment