లక్నో: ఉత్తరప్రదేశ్ ఎన్నికల పర్వంలో కొత్త అంశం కనిపించింది. పోటాపోటీగా ప్రచారం చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), జేడీ(యూ) పార్టీల కంటే ‘నన్ ఆఫ్ ది ఎబో(నోటా)’ మీటకు పడిన ఓట్లే ఎక్కువ అని కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) వెబ్‌సైట్‌లోని గణాంకాల్లో వెల్లడైంది. మొత్తం పోలైన ఓట్లలో ఆప్‌నకు 0.35 శాతం, జేడీయూకు 0.11 శాతం ఓట్లు పడ్డాయి. అయితే, వీటికంటే ఎక్కువగా నోటాకు 0.69 శాతం ఓట్లు పడటం విశేషం. ఎంఐఎం పార్టీకి 0.47 శాతం ఓట్లు పడ్డాయి. సీపీఐ పార్టీకి 0.07 శాతం, ఎన్‌సీపీ పార్టీకి 0.05 శాతం, శివసేనకు 0.03 శాతం ఓట్లు పోలయ్యాయి.
ఇక సీపీఎం, సీపీఐ(ఎంఎల్), ఎన్‌జేపీ(ఆర్‌వీ) పార్టీలు 0.01 శాతం ఓట్లు దక్కించుకున్నాయి. ఏఐఎఫ్‌బీ, ఐయూఎంఎల్, ఎల్‌జేపీలకు ఒక్క ఓటు కూడా పడలేదని ఈసీ గణాంకాలు చెబుతున్నాయి. ఇక భారీ మెజారిటీతో గెలిచి అధికారాన్ని కైవసం చేసుకున్న బీజేపీకి 41.6 శాతం ఓట్లు పడ్డాయి. సమాజ్‌వాదీ పార్టీకి 32 శాతం ఓట్లు, బీఎస్పీకి 12.8 శాతం, రాష్ట్రీయ లోక్‌దళ్‌కు 3.02 శాతం ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ 2.38 శాతం ఓట్లు సాధించింది.
మరోవైపు.. దశాబ్దాల పాటు దేశాన్ని అప్రతిహతంగా ఏలిన కాంగ్రెస్ పార్టీ నానాటికీ తీసికట్టుగా మారుతూ వస్తోంది. ముఖ్యంగా 2014 నుంచి ఒకటీ అరా తప్పిస్తే ప్రతి ఎన్నికల్లోనూ ఘోర పరాభవాలే చవిచూస్తోంది. పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీ అంతర్గత కలహాలు ప్రధానంగా ఆ పార్టీ ఓటమికి కారణాలయ్యాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ మణిపూర్, గోవా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలను దక్కించుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment