సీట్లు వద్దు.. ఓట్లు చాలు?
కామ్రేడ్లకు సీట్లు కేటాయించకుండాబేషరతు పొత్తుకు కాంగ్రెస్ ప్రతిపాదన?
రాష్ట్రంలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం మధ్య పొత్తుపై గందరగోళం
అసలు ఇంత వరకు పొత్తుదిశగా ఆ పార్టీల మధ్య చర్చల్లేవ్
పొత్తున్నా లేకపోయినా భువనగిరిలో పోటీచేస్తామంటున్న సీపీఎం
19న నామినేషన్ వేసేందుకు పార్టీ సన్నాహాలు
తెలంగాణలో ఐక్యత లేని ‘ఇండియా’ కూటమి
లోక్‌సభ ఎన్నికల్లో పరస్పర పొత్తు విషయమై తెలంగాణలో ‘ఇండియా’ కూటమి పార్టీల మధ్య ఇంకా చర్చలే ప్రారంభం కాలేదు. ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం మధ్య ఐక్యతారాగం వినిపించడంలేదు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్, లెఫ్ట్, ఇతర పార్టీల మధ్య పొత్తులు, చర్చలు జరుగుతుండగా, తెలంగాణలో ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదని కామ్రేడ్లు వాపోతున్నారు.
కాంగ్రెస్‌తో విసిగి వేసారిన సీపీఎం భువనగిరి లోక్‌సభ స్థానంలో తన అభ్యర్థిని ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్కడితో ఆగకుండా ఈ నెల 19న తమ పార్టీ అభ్యర్థి జహంగీర్ నామినేషన్ కూడా వేస్తారని ఆ పార్టీ తెలిపింది. కాగా, ఇప్పటికే అక్కడ కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని కూడా ప్రకటించింది.
పొత్తులు కుదరకుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా సీపీఎం ప్రచారం చేయనుంది. అక్కడ సీపీఎంకు గణనీయమైన ఓట్లు ఉన్నందున అది కాంగ్రెస్‌కు నష్టం జరుగుతుందని అంటున్నారు. మరోవైపు సీపీఐ కూడా తనకు ఒక సీటు కావాలని కోరుతోంది.
బేషరతు పొత్తుకు కాంగ్రెస్ ప్రతిపాదన?
పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో 17 స్థానాల్లో సీపీఐ, సీపీఎంలకు చెరో సీటు ఇవ్వడం సాధ్యమయ్యే పనికాదన్న భావనలో కాంగ్రెస్ ఉన్నట్లు తెలుస్తోంది. సీట్ల కోసం భారీగానే పోటీ ఉన్నందున కేటాయించడం కుదరదని అంటున్నారు. ఈ నేప థ్యంలో ఒకవేళ వామపక్షాలతో పొత్తులపై చర్చ జరిగితే, భేష రతు మద్దతు కోరాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలిసింది. అంటే ఒక్క సీటు కూడా కేటాయించకుండా అన్ని సీట్లలోనూ కాంగ్రెస్ అభ్యర్థులకు వామపక్షాలు మద్దతు ఇవ్వాలన్నమా ట.
అలా మద్దతు ఇస్తే రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ పదవులు లేదా స్థానిక సంస్థల ఎన్నికల్లో పదవులు ఇచ్చేలా ప్రతిపా దనను కాంగ్రెస్ తెరపైకి తీసుకురానుంది. అయితే జాతీయ పార్టీ హోదాను కాపాడుకోవాలంటే దేశవ్యాప్తంగా ఓట్ల శా తం, సీట్లు వంటివి తెచ్చుకోవడం వామపక్షాలకు అవసరం. ఆ పార్టీ అగ్రనాయకత్వం తెలంగాణలో ఒక్క సీట్లోనైనా గట్టిగా పోటీ చేయాల్సిందేనని సూచించినట్లు నేతలు చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
కామ్రేడ్లను కాంగ్రెస్ దూరం పెడుతోందా..?
గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ మధ్య పొత్తు కుదిరింది. సీపీఐ ఒక సీటులో పోటీ చేసి, మిగిలిన సీట్లలో కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది. అయితే అప్పుడు సీపీఎం, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు కుదరని సంగతి తెలిసిందే. దీంతో సీపీఎం ఒంటరిగా 19 స్థానాల్లో బరిలో నిలిచి.. బీజేపీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉన్నచోట్ల కాంగ్రెస్‌కు, మరికొన్నిచోట్ల బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చింది. అయితే 19 స్థానాల్లోనూ సీపీఎం తన పరువు పోగొట్టుకుంది.
ఒక్క సీట్లో కూడా డిపాజిట్ దక్కించుకోలేకపోయింది. పార్టీ నిర్ణయాన్ని అప్పట్లో కార్యకర్తలు పూర్తిస్థాయిలో ఆమోదించలేదన్న వాదన బలంగా వినిపించింది. తదనంతర పరిణామాల్లో బీజేపీని ఓడించే సత్తా హస్తం పార్టీకే ఉండటం... ఇండియా కూటమిలో భాగస్వామ్యులుగా ఉండటంతో కలిసి పని చేయాలని భావించారు. అయితే కాంగ్రెస్ మాత్రం వామపక్షాలను పెద్దగా పట్టించుకోవడంలేదన్న చర్చ జరుగుతోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీలకు పెద్దగా ఓట్లు పడలేదన్న భావన ఉండటమే కారణమని అంటున్నారు. అయితే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం, నల్లగొండ, భువనగిరి, మహబూబాబాద్ వంటి చోట్ల వామపక్షాలకు వేలల్లోనే ఓట్లు ఉంటాయనీ, వాటిని పోగొట్టుకోవడం ఎందుకన్న భావన కాంగ్రెస్‌లోని కొందరు నేతల్లో ఉంది. దీంతో నామినేషన్ల నాటికి పొత్తులపై చర్చలు జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
-బొల్లోజు రవి
Comments
Please login to add a commentAdd a comment