సాక్షి, హైదరాబాద్: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి నడవాలని సీపీఐ, సీపీఎం అనుకుంటున్నాయి. రాష్ట్రంలో బీజేపీని ఓడించేందుకు ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్‌తో సర్దుబాటు చేసుకోవాలని నిర్ణయించాయి. 17 లోక్‌సభ సెగ్మెంట్‌లలో చెరో సీటులో పోటీ చేస్తామని స్పష్టం చేశాయి. అయితే పొత్తులపై సీపీఐ, సీపీఎం ప్రకటన చేసినా, కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంతవరకూ స్పందించలేదు. దీంతో కామ్రేడ్లు కాస్తంత గుర్రుగా ఉన్నారు.
బీజేపీని నిలువరించాలంటే తమ మద్దతు అవసరమని, కాబట్టి కాంగ్రెస్ త్వరగా తేల్చాలని లెఫ్ట్ పార్టీ నేతలు అంటున్నారు. ఇప్పటికే దేశంలో పలుచోట్ల కాంగ్రెస్ పార్టీ పొత్తులపై దృష్టి సారించిందని, రాష్ట్రంలో కూడా త్వరగా ఒక నిర్ణయానికి వస్తే ముందస్తుగా ప్రచారంలోకి దూసుకెళ్లొచ్చని అంటున్నాయి.
సీపీఎం వైఖరిలో మార్పు
గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో సీపీఐ, సీపీఎం ముందస్తుగా బీఆర్‌ఎస్‌తో పొత్తుకు ప్రయత్నించాయి. ఆ పార్టీతో పొత్తు చిత్తవడంతో కాంగ్రెస్‌తో కలిసి నడవాలని అనుకున్నాయి. సీట్ల విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో చివరకు సీపీఐ ఒక్క సీటుకు ఒప్పుకొని కొత్తగూడెంలో విజయం సాధించింది. సీపీఎం మాత్రం కాంగ్రెస్‌తో రాజీప డక ఒంటరిపోరుకు సిద్ధమై 19 అసెంబ్లీ స్థానాల్లో తన అభ్యర్థులను బరిలోకి దింపింది. అయితే ఆ పార్టీకి ఎక్కడా డిపాజిట్లు దక్కలేదు. ఇటీవల జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశాల్లోనూ కొన్ని జిల్లాలకు చెందిన నాయకులు ఈ విషయాన్ని బాహాటంగానే విమర్శించినట్టు సమాచారం.
కాంగ్రెస్‌తో వెళ్లి ఉంటే కనీసం అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉండేదని చర్చ జరిగినట్టు తెలిసింది. అంతేగాక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు కొన్ని చోట్ల, బీఆర్‌ఎస్‌కు మరికొన్నిచోట్ల మద్దతు ఇవ్వడం కూడా సరైన నిర్ణయం కాదన్న వాదనలు కూడా ఆ పార్టీలో తలెత్తాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌కే తమ మద్దతు అని పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేస్తే, రాష్ట్ర పార్టీ నాయకత్వం మాత్రం బయటకు ఏదీ నేరుగా చెప్పకుండా అంతర్గతంగా బీఆర్‌ఎస్‌కు, కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వడంపైనా విమర్శలు వచ్చా యి. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో సీపీఎం వైఖరిలో మార్పు వచ్చింది. కాంగ్రెస్‌తోనే ముందుకు నడవాలని నిర్ణయించింది.
అసెంబ్లీ ఓట్లతో బయటపడ్డ వాస్తవాలు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తాను పోటీ చేసిన పాలేరు అసెంబ్లీ స్థానంలో పరువు దక్కించుకోలేకపోయారు. ఆ పార్టీకి పాలేరులో 5,308 ఓట్లు, మిర్యాలగూడలో 3,23 4 ఓట్లు, వైరాలో 4,439 ఓట్లు వచ్చాయి. అంతేకాదు మొదట్లో అడిగిన ఐదింటిలోని భద్రాచ లంలో 5,860 ఓట్లు, మధిరలో 6,575 ఓట్లు, ఇబ్రహీంపట్నంలో 3,948 ఓట్లు మాత్రమే సాధించింది. మొత్తం 19 స్థానాల్లో పోటీ చేసిన సీపీఎం అన్నిచోట్లా కలిపి కేవలం 52,349 ఓట్లే సాధించింది. కనీసం ఎక్కడా డిపాజిట్ రాలేదు. కాంగ్రెస్ ప్రతిపాదించినట్టుగా మిర్యాలగూడ అసెంబ్లీ స్థానంతోపాటు, రెండు ఎమ్మెల్సీలు తీసుకొని ఉంటే ఎలాగోలా గౌరవం దక్కేదన్న చర్చ కూడా సీపీఎంలో జరుగుతోంది.
ఒక్కో లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో సరాసరి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి. కాబట్టి తమ ఓట్లు గణనీయంగా ఉంటాయని లెఫ్ట్ నేతలు చెబుతున్నారు. కాగా, రాష్ట్రంలో బీజేపీ ప్రమాదం ముంచుకొస్తుందని, కాబట్టి ఆ పార్టీకి ఎలాగైనా ఎంపీ సీట్లలో గండిపెట్టాలని వామపక్షాలు భావిస్తున్నాయి. చెరో ఎంపీ సీటు ఇస్తే సరేసరి... లేకుంటే కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చే విషయంలోనూ ఆ పార్టీలు సమాలోచన చేస్తున్నట్టు సమాచారం. మద్దతు ఇచ్చినందుకు చెరో ఎమ్మెల్సీ స్థానం కోరే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అయితే కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment