తిరువనంతపురం: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విమర్శలు గుప్పించారు. మత, హిందుత్వ రాజకీయాలను ఎదుర్కొవటంలో కాంగ్రెస్ పార్టీ విఫలైమైందన్నారు. సీఎం పినరయి శనివారం అలప్పుజలో మాట్లాడారు.
‘సీపీఐ(ఎం) మేనిఫెస్టోలో దేశంలో విభజన సృష్టించే సీఏఏను రద్దు చేయాలనే ఉద్దేశాన్ని స్పష్టంగా చెప్పింది. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మాత్రం దానికి సంబంధించి ప్రస్తావన లేదు. సీఏఏ విషయంలో కాంగ్రెస్ మౌనం వహించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం, మనీలాండరింగ్ చట్టం (పీఎంఎల్‌ఏ) వంటి కఠినమైన చట్టాలను రద్దు చేస్తామని సీపీఐ(ఎం) హామీ ఇచ్చింది’ అని సీఎం విజయన్ తెలిపారు.
సీఏఏ చట్టంపై కాంగ్రెస్ పార్టీ కనీసం బహిరంగ విమర్శలు కూడా చేయలేదన్నారు. సీఏఏపై కాంగ్రెస్ పార్టీ వైఖరిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ విధానాలు కూడా సింఘ్ పరివార్ విధానాలకు దగ్గరగా ఉంటాయన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయటం వల్ల భవిష్యత్తులో దేశ ప్రజలకు ఏ ఉపయోగం ఉండదని అన్నారు.
బీజేపీ తీసుకువచ్చిన పలు చట్టాలను లెఫ్ట్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని, వాటికే ఓటు వేయాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని తెలిపారు. మొత్తం 20 స్థానాలు ఉన్న కేరళలో రెండు దఫాల్లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరిగి.. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment