ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్ పూర్తి అయింది. ఏడో విడత పోలింగ్ జూన్1న జరగనుంది. ఏడో విడత పోలింగ్ కోసం ప్రధాన పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. అయితే విపక్షాల ఇండియా కూటమి ఆల్ పార్టీ మీటింగ్ జూన్ 1(శనివారం)న జరగనున్నట్లు తెలుస్తోంది. అదే రోజు ఏడో విడత పోలింగ్ కూడా ఉంది.
కూటిమిలోని అన్ని భాగస్వామ్య పార్టీలకు ఫలితాలకు నాలుగు రోజుల ముందు దేశ రాజధాని ఢిల్లీలో జరిగే సమావేశానికి హాజరు కావాలని ఆహ్వానం పంపినట్లు సమాచారం. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తిరిగి తీహార్ జైలుకు వేళ్లే ఒక రోజు ముందు ఇండియా కూటమి మీటింగ్ జరగనుంది. సీఎం కేజ్రీవాల్ జైలుకు వెళ్లడాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా అదే రోజు సమావేశం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ సమావేశంలో విపక్ష కూటమి తీసుకోవల్సిన చర్యలు, లోక్ సభ ఎన్నికల్లో ఆయా పార్టీలు కనబర్చిన పనితీరుపై చర్చ జరగనున్నట్లు సమాచారం. ప్రతిపక్ష పార్టీల ముఖ్యమంత్రులైన తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్, సామాజ్‌వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, ఇతర కీలక నేతలకు ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది.
ఇక.. ఎన్డీయే కూటమిని ప్రతిపక్షాల ఇండియా కూటమి స్వీప్ చేస్తుందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.
‘‘ఆరు విడుతల పోలింగ్ పూర్తి అయింది. 486 స్థానాలకు పోలింగ్ ముగిసింది. పదవి నుంచి దిగిపోయే ప్రధాని రిటైర్‌మెంట్ ప్రణాళికలు రచించుకుంటున్నారు. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ విధి పూర్తిగా మూసివేయబడింది. దక్షిణంలో పూర్తిగా, ఉత్తర, పశ్చిమ, తూర్పు భారతంలో సంగానికి బీజేపీ పడిపోయింది’’ అని జైరాం రమేష్ అన్నారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దే దించడానికి లక్ష్యంగా 28 విపక్ష పార్టీలతో కలిసి ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంట్ ఇన్‌క్లూషన్ అలియన్స్ (INDIA) పేరుతో కూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment