ఇండియా కూటమి ఎఫెక్ట్‌..! కన్ప్యూజన్‌లో ఎగ్జిట్ పోల్స్‌ | Exit Poll Surveys May Creates Confusion On India Bloc Over Lok Sabha Elections 2024, More Details Inside | Sakshi
Sakshi News home page

ఇండియా కూటమి ఎఫెక్ట్‌..! కన్ప్యూజన్‌లో ఎగ్జిట్ పోల్స్‌

Published Sat, May 25 2024 2:27 PM | Last Updated on Sat, May 25 2024 4:58 PM

exit poll surveys may confusion on india bloc over lok sabha election 2024

సార్వత్రిక ఎన్నికల్లో ఆరు విడుతల పోలింగ్ పూర్తయ్యేసరికి ఫలితాలపై ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. అసలు పోటీలో లేదనుకున్న ఇండియా కూటమి కొన్ని రాష్ట్రాల్లో గట్టిపోటీ ఇస్తోందనే వార్తలొస్తున్నాయి. దీంతో జూన్ ఒకటిన జోస్యం చెప్పబోయే ఎగ్జిట్ పోల్ సంస్థలు కన్ప్యూజన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. 

‘అబ్‌కీ బార్ చార్సౌ పార్’ నినాదంతో.. ఈసారి బీజేపీ ప్రచారంలో అందరికంటే ముందు నిలిచింది. మోదీ చరిష్మాతో మరోసారి అధికారం చేజిక్కించుకోవాలనే పక్కా ప్రణాళికతో బీజేపీ ఎన్నికల ప్రచారం కొనసాగించింది. ఓ వైపు మోదీ మరోవైపు అమిత్ షా దేశాన్ని చుట్టేశారు. నాలుగు వందల సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే మొదటి రెండు విడతల పోలింగ్ ముగిసిన తరువాత ఇండియా కూటమి సైతం కాస్త పోటీపడినట్లు కనిపించింది. బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కూటమి బలం పుంజుకుందనే వార్తలు వచ్చాయి. దీంతో ఎన్నికలు ఏకపక్షం కాదనే వాదనలు ప్రారంభమయ్యాయి. 

యూపీలో సైతం తాము చాలా సీట్లు గెలుస్తామని ఇండియా కూటమి ప్రకటించడంతో.. ఫలితాలపై ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. ఎలక్షన్ చివరి అంకానికి చేరుకున్న  నేపధ్యంలో ఎన్నికలు నువ్వా.. నేనా.. అన్నట్లు జరిగాయనే అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. దీంతో అసలు దేశంలో ఏం జరగబోతుందనే కొత్త చర్చ ప్రారంభం అయింది. చాలామంది ఎలక్షన్ పండితులు బీజేపీ సీట్లు తగ్గుతాయనే అభిప్రాయం చెబుతున్నా.. ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందా అనే విషయంపై మాత్రం ఏ ఒక్కరూ కాన్ఫిడెంట్‌గా లేరు.

400సీట్ల టార్గెట్‌తో రంగంలోకి దిగిన బీజేపీ.. నిజంగా తన లక్ష్యాన్ని సాధిస్తుందా  అనే చర్చతో ఈ సారి సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమయ్యాయి. 2019లో సింగిల్‌గా 303సీట్లు సాధించిన బీజేపీ చరిత్రను తిరగరాసింది. ఇందిరాగాంధి మరణానంతంరం వచ్చిన సానుభూతితో 1984లో కాంగ్రెస్‌ పార్టీ 300 మార్కును దాటింది.  ఆ తరువాత మళ్లీ ఏ పార్టీ కూడా సింగిల్‌గా 300మార్కు దాటలేదు. 

కూటమిగా ఎన్డీయే 2019లో ఏకంగా 353 స్థానాలు సాధించింది. ఇది నిజంగా భారీ రికార్డు. తన రికార్డునే తానే తిరగరాస్తానంటూ మోదీ 400 సీట్లు సాధిస్తామని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ కూటమి ప్రచారం కంటే ముందే కుదేలైపోయింది. బీజేపీ ట్రాప్‌లో పడిపోయిన ఇండియా కూటమి నాయకులు.. బీజేపీ 400 సాధించలేదంటూ ప్రకటనలు చేసేశారు. కాని బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడానికి 272 సీట్లు చాలన్న చిన్న లాజిక్‌ను కాంగ్రెస్ కూటమి మరిచిపోయింది. 

తప్పును ఆలస్యంగా తెలుసుకున్న ఇండియా కూటమి నాయకులు తరువాతి కాలంలో అసలు బీజేపి అధికారంలోకి రాలేదంటూ ప్రకటనలు చేయడం ప్రారంభించారు. అయితే అప్పటికే కీలకమైన రెండు విడతల పోలింగ్ పూర్తైపోయింది.  ఈ రెండు విడతల్లో జాతీయ స్థాయిలో మోదీ ఉండాలా వద్దా అనే విషయంపై రెఫరెండంగా ఎన్నికలు జరిగినట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అందుకే మొదటి రెండు విడతల్లో.. పోలింగ్ జరిగిన 190 స్థానాల్లో బీజేపీ హవా కొనసాగినట్లు పోల్ పండిట్లు అంచనా వేస్తున్నారు. 

మోదీ హాట్రిక్ నినాదంతో ఎన్నికలు ప్రారంభం కావడానికి ముందే బీజేపీ గెలిచేసిందనే వాదనలు ప్రారంభమయ్యాయి. అయితే మూడు, నాలుగు విడతల పోలింగ్ జరిగే సరికి లోక్‌సభ ఎన్నికల్లో లోకల్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ప్రభావితం చూపించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 40 స్థానాలున్న బీహార్‌లో తేజస్వీ యాదవ్ తన ప్రచారంలో ఎక్కువగా నిరుద్యోగం అంశాన్ని హైలైట్ చేశారు. 2019లో బీహార్‌లో ఎన్డీయే కూటమి 39 స్థానాలు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి ఇక్కడ కాంగ్రెస్ కూటమి కొన్ని స్థానాలు గెలుస్తుందనే వార్తలు వస్తున్నాయి.  

యూపీలో అఖిలేష్ మీటింగ్లకు సైతం భారీగా జనం హాజరవడం ఎన్నికల సరళిపై కొత్త చర్చకు తెరలేపింది. 80 లోక్‌సభ స్థానాలున్న యూపీలో బీఎస్పీ ఈసారి తన ప్రాభవాన్ని కోల్పోతుందని.. దీనివల్ల లాభపడేది ఎవరనే దానిపై యూపీ రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయనేది విశ్లేషకుల అంచనా. ఇక యూపీ తరువాత అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్రలో మరాఠా అస్మితా పేరుతో ఉద్ధవ్ ఠాక్రే తీసుకొచ్చిన ఆత్మగౌరవం నినాదంపైనా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అటు కర్ణాటకలోనూ ప్రజ్వల్ రేవన్న అంశం బీజేపీ కూటమికి వ్యతిరేకంగా పనిచేసినట్లు తెలుస్తోంది. దీంతో మూడునాలుగు విడతల పోలింగ్ పూర్తయ్యేసరికి ఇండి కూటమి పోటీలోకి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. 

బీజేపీ 400 సీట్ల నినాదం కేవలం ప్రతిపక్షాలను ట్రాప్ చేయడానికే అనేది స్పష్టమైపోయింది. అయితే బీజేపీ మాత్రం ఇప్పటికీ 400 సీట్లు సాధ్యమనే అంటోంది. 2019లో 353 సీట్లు సాధించిన ఎన్డీయే మరో 40 సీట్లు సాధించడం కష్టమేమి కాదని కొంతమంది ఎన్నికల విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షం బలహీనంగా ఉండటం వల్ల బీజేపీకి పోటీలేకుండా పోయిందని.. కొంతమంది పోల్స్టర్స్ విశ్లేషిస్తున్నారు. 

మోదీకి ప్రత్యామ్నాయం లేకపోవడం… విదేశీవిధానం, ఆర్ధిక పురోగతిలాంటి అంశాలు బీజేపీకి కలిసివచ్చే అంశాలనే వీరు వాదిస్తున్నారు. నాలుగు వందల సీట్లు సాధ్యమే అని…  ఒకవేళ 400సాధ్యం కాకపోయినా… గతం కంటే బీజేపీ సీట్లు పెరుగుతాయని వీరు వాదిస్తున్నారు. ఇక బీజేపీ ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని… బీజేపీ సొంతంగా 300 సీట్లు గెలుస్తుందని సీఎస్డీఎస్ సంస్థకు చెందిన సంజీవ్ కుమార్ అంటున్నారు.

అయితే బీజేపీ మిత్రపక్షాలు మాత్రం చాలా ఘోరంగా ఓడిపోతారని దీంతో నాలుగు వందల సీట్లు సాధ్యం కాదని సంజీవ్ అంచనా వేస్తున్నారు. రాక్ఫెల్లర్ ఇంటర్నేషనల్ చైర్మన్ రుచిర్ శర్మ ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడుతూ… ఈసారి పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉందని.. అయితే ఇప్పటికీ బీజేపీకే ఎక్కువ అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. అమెరికాలో స్థిరపడ్డ రుచిర్ శర్మ గత పాతికేళ్లుగా భారత ఎన్నికల సరళిపై అధ్యయనం చేస్తున్నారు.  ఇక కాంగ్రెస్ పార్టీకి కాస్త అనుకూలంగా వ్యవహరించే యోగేంద్రయాదవ్ లాంటి సెఫాలజిస్టులు కాస్త డిఫరెంట్ వాదన ముందుకు తెస్తున్నారు. 

ముఖ్యంగా యూపీ, బీహార్, కర్ణాటక, మహారాష్ట్రలో బీజేపీదాని మిత్రపక్షాలు గతంతో పోలిస్తే 60 నుంచి 70స్థానాలు కోల్పోతారని యాదవ్ అంటున్నారు. బీజేపీ సొంతంగా 250 సీట్లకు పరిమిత అవుతుందని యోగేంద్రయాదవ్ బాంబు పేలుస్తున్నారు. ఇదే నిజం అయితే బీజేపీ కూటమి మద్దతు లేకుండా ప్రభుత్వం నడపలేదని స్పష్టం అవుతోంది. 

ఎన్నికల చివరి అంకానికి చేరుకున్న నేపథ్యంలో ఇప్పుడు.. ఎగ్జిట్‌ పోల్స్‌పై చాలా సర్వే సంస్థలు గుంభనంగా ఉన్నాయి. డేటాను విశ్లేషించడంలో తలమునకలైన కీలక సంస్థలన్నీ ఈ సారి ఎన్నికల సరళిపై ఎగ్జిగ్‌ పోల్స్‌ ఇవ్వడం అంత ఆశామాషీ కాదనే అభిప్రాయానికి వచ్చాయి. 2019లో కొంత ఈజీగా అనిపించిన ఎగ్జిట్‌ పోల్స్‌ ఈసారి మాత్రం కత్తిమీద సాము అని పొలిటికల్ పండిట్లు అంటున్నారు.

:::: ఇస్మాయిల్, ఇన్‌పుట్‌ ఎడిటర్, సాక్షి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement