
తిరువనంతపురం: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తన కుమారుడిపై కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడు లోక్‌సభ ఎన్నికలో ఓటమిపాలు కావాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఏకే ఆంటోని కుమారుడు అనిల్ ఆంటోని బీజేపీ తరఫున పతనంతిట్ట పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోని మంగళవారం మీడియాతో మాట్లాడారు.
‘నా కుమారుడు అనిల్ ఆంటోని అభ్యర్థిగా పోటీ చేస్తున్న బీజేపీ పార్టీ పతనంతిట్ట సెగ్మెంట్‌లో ఓడిపోతుంది. అక్కడ నా కుమారుడు అనిల్ ఆంటోని ఓడిపోవాలని ఆశిస్తున్నా. అదేవిధంగా కేరళ సౌత్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆంటో ఆంటోనీ గెలుస్తారు. కాంగ్రెస్ నేతల పిల్లలు బీజేపీ చేరటం చాలా పెద్ద తప్పు.
..కాంగ్రెస్ పార్టీనే నా మతం. ఎప్పటి నుంచో కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ... ప్రధానమంత్రి మోదీ, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లతో పోరాడుతోంది. సీఎం పినరయి విజయన్ చేసే ఆరోపణలను కేరళ ప్రజలు అంత సీరియస్ తీసుకోరు. ఆ మాటలను కేరళ ప్రజలు అస్సలు నమ్మరు’ అని ఏకే ఆంటోని అన్నారు. బీజేపీ ప్రభావం రోజురోజుకు తగ్గుతోందని..ప్రతిపక్షాల ఇండియా కూటమికి ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఏకే ఆంటోని జోష్యం చెప్పారు. ఇక.. 2023లో అనిల్ ఆంటోని బీజేపీలో చేరిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment