సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల్లో తమతో కలిసొచ్చేందుకు చిన్నాచితకా పార్టీలు ముందుకు రావడం, వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున నేతలు చేరుతుండటంతో సమాజ్‌వాదీ పార్టీకి నూతనోత్సాహాన్ని ఇచ్చినా.. వారందరికీ సీట్ల సర్దుబాటు అంశం మాత్రం పార్టీకి తలనొప్పిగా మారుతోంది. సొంత పార్టీ నేతలకు టికెట్ల కేటాయింపుపై ఇప్పటికే ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూనే. మిత్రపక్షాలతో పాటు కొత్తగా వచ్చి చేరుతున్న ఆశావహులకు టిక్కెట్ల కేటాయింపు ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌కు పెద్ద సవాల్ విసురుతోంది. ఇప్పటికే తమతో పొత్తు పెట్టుకునేందుకు సిధ్దమైన ఏడు మిత్రపక్ష పార్టీలతో చర్చలు చేసిన అఖిలే‹శ్, అతిత్వరలోనే కుల, వర్గ సమీకరణాలను దృష్టిలో పెట్టుకుంటూనే జాబితాలు విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు. గురువారం 10 మంది ఎస్పీ అభ్యర్థులు, 19 మంది ఆర్‌ఎల్‌డీ అభ్యర్థులతో ఎస్పీ సారథ్యంలోని కూటమి తొలి జాబితా వెలువడింది.
లెక్కలు తేల్చడం కత్తిమీద సామే..
ఎస్పీతో పొత్తు పెట్టుకునేందుకు ఇప్పటికే ఏడు పార్టీలు ముందుకొచ్చాయి. ఇందులో రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డీ), మహాన్‌దళ్, జన్‌వాదీ పార్టీ (సోషలిస్టు), కృష్ణ పటేల్ నేతృత్వంలోని ఆప్నాదళ్, సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ, ప్రగతిశీల్ సమాజ్‌వాదీ పార్టీ, గంద్వానా గణతంత్ర పార్టీలు ఉన్నాయి. 2017 ఎన్నికల్లో ఆర్‌ఎల్‌డీ 1.78 శాతం ఓట్లు సాధించుకోగా, ఒక ఎమ్మెల్యే గెలిచారు. ఆర్‌ఎల్‌డీకి పశ్చిమ యూపీలో గట్టి పట్టు ఉంది. ఇక్కడ ఉన్న 76 స్థానాలకు గానూ కనీసంగా 35–40 సీట్లలో జాట్‌ల ప్రాబల్యం బలంగా ఉంది.
జాట్–ముస్లింలు కలిస్తే అధిక సీట్లు కొల్లగొట్టొచ్చన్న అంచనాతో ఇక్కడ ఆర్‌ఎల్‌డీతో ఎస్పీ పొత్తు పెట్టుకుంది. గత ఎన్నికల్లో ఆర్‌ఎల్‌డీ 277 స్థానాల్లో పోటీ చేయగా, ఈ ఏడాది పొత్తుల కారణంగా కనీసంగా 40–50 స్థానాలకు పోటీ చేయాలని భావిస్తోంది. ఆ స్థాయిలో సీట్ల సర్దుబాటు అఖిలేశ్‌కు అంత సులభం కాదు. ఇక 30–35 స్థానాల్లో ప్రభావం చూపగల సుహెల్‌వేద్ పార్టీ నేత ఓంప్రకాశ్ రాజ్‌బర్ అఖిలేశ్ నిర్వహించిన విజయ్ రథ్ యాత్రల్లో ఆయన వెన్నంటే ఉన్నారు. గత ఎన్నికల్లో ఈ పార్టీ 0.70 శాతం ఓట్లు మాత్రమే సాధించింది. అయినా పోటీచేసిన 8 స్థానాల్లో 4 చోట్ల గెలిచింది.
ఈ సారి కనీసంగా 20–25 స్థానాలకు పట్టుబడుతోంది. తూర్పు యూపీలో రాజ్‌బర్‌లు దాదాపు 18 శాతం మంది ఉన్నారు. ఇక్కడే అధిక సీట్లకు ఆ పార్టీ పట్టుబట్టే అవకాశం ఉంది. మహాన్‌దళ్ నేత కేశవ్‌దేవ్ మౌర్య తమకు 12 స్థానాలు కోరుతున్నారు. గత ఎన్నికల్లో పార్టీ 57 స్థానాల్లో పోటీ చేయగా, 0.12శాతం ఓట్లు సాధించుకుంది. అయితే ఓబీసీకి చెందిన పెద్ద నేతలు పలువురు ఎస్పీలోకి వస్తున్న నేపథ్యంలో ఈ పార్టీకి 3–5 సీట్లకు మించి కేటాయించే అవకాశాలు లేవు. మిగతా మిత్రపక్ష పార్టీలకు పెద్దగా బలం లేనప్పటికీ వారందిరికీ కనీసంగా 2–3 సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిగినా, అవి కొలిక్కిరాలేదు.
కొత్తవారితో తలనొప్పులే
మిత్రపక్షాలకు సీట్ల కేటాయింపు ఒక తలనొప్పిగా ఉండగా, మరోపక్క కొత్తగా చేర్చుకుంటున్న నేతలకు టికెట్‌లు ఇవ్వడం అఖిలేశ్‌కు ఇబ్బందులు తెచ్చిపెట్టనుంది. ముఖ్యంగా ఇటీవలే బీజేపీ నుంచి ఎస్పీలో చేరిన మాజీ మంత్రి, ఓబీసీ నేత స్వామి ప్రసాద్ మౌర్య ఫాజిల్‌నగర్ నుంచి పోటీ చేసేందుకు సిద్దపడుతున్నారు. అయితే ఈ టికెట్‌ను బీజేపీ నుంచి ఆర్‌ఎల్‌డీలో చేరిన ఆమ్‌శీష్ రాయ్‌కు ఇస్తామని ఇప్పటికే ఆర్‌ఎల్‌డీ నేత జయంత్ చౌదరీ వాగ్దానం చేశారు. దీంతో ఈ సీటు కేటాయింపు చిక్కుల్లో పడింది. ఇక మౌర్య కుమారుడు ఉత్క్రిష్ట్ మౌర్య 2017లో ఊంచహార్ నుంచి పోటీ చేసి ఎస్పీ అభ్యర్ధి మనోజ్ పాండేపై ఓడిపోయారు.
ఇప్పుడు ఈ స్థానాన్ని మౌర్య పట్టుబడుతుండటంతో మనోజ్‌ను ఒప్పించడం అఖిలేశ్‌కు క్లిష్టంగా మారింది. ఇక మహానదళ్ నేత కేశవ్ మౌర్య కుమారుడు చంద్ర ప్రకాష్ మౌర్య ఇప్పటికే బిల్సీ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం మొదలుపెట్టారు. అయితే బిల్సీ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే శర్మ కొద్ది రోజుల క్రితం ఎస్పీలో చేరడంతో అభ్యర్థి ఎంపిక కష్టంగా మారింది. వీరితో పాటే ఎస్పీలోకి వస్తున్న దారాసింగ్ చౌహాన్ (యోగి కేబినెట్ నుంచి బుధవారం రాజీనామా చేశారు) మధుబన్ నియోజకవర్గంతో పాటు మవూ జిల్లాలో నాలుగు అసెంబ్లీ స్థానాలు తన మద్దతుదారులకు కోరుతున్నారు.
ఇక పశ్చిమ యూపీలో ఎస్పీలో చేరిన కాంగ్రెస్ నేత ఇమ్రాన్ మసూద్ సైతం తన మద్దతుదారులకు 6–8 సీట్లు కోరుతున్నారు. టికెట్‌లు దక్కవనే అంచనాతో బీజేపీ, బీఎస్పీ నుంచి కొత్తగా పార్టీలో చేరిన బ్రాహ్మణ నేతలు తమకు టిక్కెట్లు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. సామాజిక బలాలను దృష్టిలో పెట్టుకొని, పొత్తులకు గౌరవమిస్తూ, కొత్తవారికి టికెట్లు కేటాయించడం, సీట్లు సర్దుబాటు చేయడం అఖిలేశ్ ముందున్న అతిపెద్ద సవాల్.
Comments
Please login to add a commentAdd a comment