ప్రభుత్వాలనే కూల్చిన పంచ్‌ డైలాగులు  | UP Assembly Election 2022: Political Punches Play Key Role In Assembly Elections | Sakshi
Sakshi News home page

ప్రభుత్వాలనే కూల్చిన పంచ్‌ డైలాగులు 

Published Mon, Feb 7 2022 7:10 AM | Last Updated on Mon, Feb 7 2022 8:32 AM

UP Assembly Election 2022: Political Punches Play Key Role In Assembly Elections - Sakshi

ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒక్కో పార్టీ ప్రత్యర్థులను ఎద్దేవా చేసే నినాదాలతో తమ ప్రచారాల్లో, సామాజిక మాధ్యమాల్లో హోరెత్తిస్తున్నాయి. యూపీ, యోగీ కలిస్తే ‘ఉప్‌యోగీ’ అంటూ బీజేపీ ఇప్పటికే ప్రచారాన్ని తీవ్రతరం చేయగా, ‘బదలావ్‌ కీ యే ఆంధీ హై.. నామ్‌ ప్రియాంక గాంధీ హై’ (ఇది మార్పు తుఫాను.. పేరు ప్రియాంక గాంధీ) అంటూ కాంగ్రెస్‌ ప్రచారం చేస్తోంది. ‘ఆడపిల్లను.. పోరాడగలను’ అంటూ నవయువతను ఆకట్టుకొనేందుకు కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రయత్నిస్తున్నారు.

అధికారంలోకి వచ్చేందుకు ఉవ్విళ్లూరుతున్న సమాజ్‌వాదీ సైతం ‘కృష్ణ, కృష్ణ హరే హరే.. అఖిలేశ్‌ భయ్యా ఘరే ఘరే’ అని నినాదాన్ని ఎత్తుకొని విస్తృత ప్రచారం చేస్తోంది. బీజేపీ కొత్తగా మథురలో కృష్ణమందిర నిర్మాణ అంశాన్ని తెరపైకి తేవడంతో దానికి చెక్‌ పెట్టేలా యాదవ కులపతి ‘కృష్ణుడే’ కలలోకి వచ్చి తనతో స్వయంగా మాట్లాడుతున్నాడని అఖిలేశ్‌ కౌంటర్‌ ఇచ్చారు.

ఎస్పీకి గట్టి మద్దతుదారులైన యాదవ సామాజికవర్గంపై సహజంగానే ఇది ప్రభావం చూపుతోంది. సమాజ్‌వాదీ పాలనలో ముస్లింల ఆగడాలు అంతుండేది కాదని పరోక్షంగా చెబుతూ ‘గతంలో రేషన్‌కార్డులైనా, ఇతర ప్రభుత్వ పథకాలైనా అబ్బాజాన్‌ అని పిలిచే వారికే దక్కేవి’ అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సంధించిన విమర్శనాస్త్రం జనంలోకి బాగా వెళ్లింది. 2017కు ముందు యూపీలో అరాచకం రాజ్యమేలేదని, అభివృద్ధి శూన్యమని... యోగి హయాంలో పరిస్థితి పూర్తిగా మారిపోయిందంటూ బీజేపీ టీవీల్లో ‘ఫరక్‌ సాఫ్‌ హై (మార్పు సుస్పష్టం) అంటూ ప్రకటనలను హోరెత్తిస్తోంది.

గతంలోనూ ఆయా పార్టీలు ఎత్తుకున్న నినాదాలే ప్రభుత్వాల ఏర్పాటులో కీలక భూమిక పోషించాయి. దళిత హక్కులపై మాయావతి లేవనెత్తిన నినాదం, రామ్‌ మందిరంపై బీజేపీ లేవనెత్తిన నినాదాలు ప్రజల మెదళ్లలోకి చొచ్చుకువెళ్లి ఆయా పార్టీలకు అధికార పీఠం కట్టబెట్టాయి. ఈ నేపథ్యంలో గత ఎన్నికలకు ముందు పార్టీలు చేసిన ప్రధాన నినాదాలను పరిశీలించినపుడు జనబాహుళ్యంలోకి ఇవి ఎంతగా బలంగా వెళ్లాయో, ఓటర్లను ఆలోచనా సరళిని ఎంతగా ప్రభావితం చేశాయో తెలుస్తుంది.

‘తిలక్‌ తరాజు ఔర్‌ తల్వార్, ఇన్‌కో మారో జూతే చార్‌’  
(అగ్రవర్ణాలైన బ్రాహ్మణులు, వైశ్యులు, రాజ్‌పుత్‌లకు నాలుగు తలిగించండి...)
ఈ నినాదాన్ని అణగారిన వర్గాల కోసం బహుజన నేత కాన్షీరాం తెరపైకి తెచ్చారు. బహుజనుల కోసం పదేళ్లుగా పోరాటం చేసినా సాధించిందేమీ లేకపోవడంతో 1984 ఆయన బహుజన్‌ సమాజ్‌ పార్టీని స్థాపించారు. ఈ సందర్భంగానేకాన్షీరాం చేసిన ఈ నినాదం రాష్ట్రవ్యాప్తంగా చాలా పాపులర్‌ అయింది. ‘జిస్‌కీ జిత్‌నీ సంఖ్యా భారీ..ఉస్‌కీ ఉత్‌నీ హిస్సేదారి’ (ఏ వర్గం సంఖ్య ఎక్కువుందో వారికే అధికారంలోనూ అంత ఎక్కువ వాటా దక్కాలి), ఓట్‌ హమారా, రాజ్‌ తుమ్హారా.. నహీ చలేగీ, నహీ చలేగీ’ (ఓట్లు మావి, రాజ్యం మీదా? ఇకపై చెల్లదు మీ పెత్తనం) అంటూ ఇచ్చిన నినాదాలు బాగా పనిచేశాయి. వీటిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో 1991లో కేవలం 12 సీట్లు గెలుచుకున్న బీఎస్పీ 1993లో 67 సీట్లకు చేరుకుంది. ఆ తర్వాత నాలుగుసార్లు మాయావతి ముఖ్యమంత్రి అయ్యేందుకు ఈ నినాదాలూ దోహదపడ్డాయి.

రాంలల్లా హమ్‌ లాయింగే.. మందిర్‌ వహీ బనాయేంగే 
(రామున్ని తీసుకొస్తాం..ఆలయం అక్కడే నిర్మిస్తాం) 
► 1991 ఎన్నికలకు ముందు బీజేపీ ఈ నినాదాన్ని ఎత్తుకుంది. 1990లో రామమందిర నిర్మాణాన్ని బలంగా డిమాండ్‌ చేసిన కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చేశారు. అధికారంలో ఉన్న ములాయంసింగ్‌ యాదవ్‌ ‘నా హయంలో బాబ్రీ మసీదుపై ఉన్న ఒక్క పక్షిని కూడా మరో పక్షి చంపలేదు’ అని ప్రకటించారు. అయినా కరసేవకులు చొచ్చుకొచ్చారు. వారిపైకి కాల్పులు జరపడంతో ఐదుగురు చనిపోయారు. ఈ సందర్భంగా బీజేపీకి నేతృత్వం వహించిన కల్యాణ్‌సింగ్‌ ఎత్తుకున్న ఈ నినాదం బలంగా పనిచేసి 1991 ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 221 సీట్లు సాధించింది. కల్యాణ్‌సింగ్‌ సీఎం అయ్యారు.

మిలే ములాయం, కాన్షీరాం.. హవా మే ఉడ్‌ గయే జై శ్రీరామ్‌
(కాన్షీరాం, ములాయం ఒక్కటయ్యారు. జై శ్రీరామ్‌ నినాదం గాల్లో కొట్టుకుపోయింది) 
► బాబ్రీ మసీదు కూల్చవేత తర్వాత 1992 డిసెంబర్‌ నుంచి 1993 డిసెంబర్‌ దాకా యూపీలో రాష్ట్రపతి పాలన కొనసాగింది. దాన్ని ఎత్తివేసేందుకు ముందు డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో ఎస్పీ, బీఎస్పీ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేశాయి. ఈ సందర్భంగానే ములాయం, మాయావతి ఈ నినాదాన్ని తెరపైకి తెచ్చారు. దళితులు–యాదవ్‌–ముస్లిం ఫార్ములా పనిచేసి ఈ ఎన్నికల్లో ఎస్పీ కూటమి అధికారంలోకి రాగా ములాయం ముఖ్యమంత్రి అయ్యారు.

‘చఢ్‌ గుండన్‌ కీ ఛాతీపర్‌ మొహర్‌ లగేగీ హాథీ కే’
(గూండాల గుండెలపై ఏనుగు బొమ్మను ముద్రిస్తాం’) 
► ఈ నినాదాన్ని బీఎస్పీ అధినేత్రి మాయావతి తెరపైకి తెచ్చారు. 1995లో మాయావతిపై ఎస్పీ ఎమ్మెల్యేలు దాడి చేశారు. ఈ ఘటన తర్వాత ఎస్పీతో దూరంగా ఉన్న మాయావతి తర్వాతి ఎన్నికల్లో ఈ నినాదంతో ముందుకు పోయారు. ముఖ్యంగా 2007 ఎన్నికల ముందు ఎస్పీ మద్దతుదారులను గూండాలంటూ మాయ పిలవడం ప్రారంభించారు. ఎస్పీకి వ్యతిరేకంగా ఈ నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఫలితంగా బీఎస్పీ ఏకంగా 206 సీట్లు సాధించి మాయావతి ముఖ్యమంత్రి అయ్యారు.

‘జిస్‌ కా జల్వా కాయం హై..ఉస్‌ కా నామ్‌ ములాయం హై’ 
(ఎవరి పనితీరైతే చెక్కుచెదరలేదో అతనే ములాయం) 
► 2012 ఎన్నికల సందర్భంగా ములాయంసింగ్‌ యాదవ్‌ ఈ నినాదంతో ప్రచారం చేశారు. తన హయాంలో ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజలు మరిచిపోలేదని, ఎన్నికల ప్రచారంలో హోరెత్తించారు. ఈ నినాదం యాదవ్‌లను బాగా ఆకర్షించడంతో ఏకంగా 224 సీట్లు సాధించింది. ములాయం కుమారుడు అఖిలేశ్‌ యాదవ్‌ ముఖ్యమంత్రి పీఠమెక్కారు. 

‘న గూండారాజ్‌.. న భ్రష్టాచార్‌.. అబ్‌ కీ బార్‌ భాజపా సర్కార్‌’ 
(గూండారాజ్యం వద్దు..అవినీతిపరులొద్దు.. ఈసారి బీజేపీ ప్రభుత్వం కావాలి)
► అఖిలేశ్‌ ప్రభుత్వ హయాంలో జరిగిన ముజఫర్‌నగర్‌ అల్లర్లు, గూండాల ఆధిపత్యం, ప్రభుత్వంలో పేరుకుపోయిన అవినీతిని ప్రధానంగా ప్రస్తావిస్తూ 2017లో బీజేపీ ఈ నినాదాన్ని ఎత్తుకుంది. దీనికి కౌంటర్‌గా ‘యూపీ కీ కంపల్షన్‌ హై.. అఖిలేశ్‌ జరూరీ హై’ (యూపీకి ఎస్పీ తప్పనిసరి.అఖిలేశ్‌ అవసరం చాలా ఉంది) అని ఎస్పీ నినాదం చేసినా అదంతగా పని చేయలేదు. ఫలితంగా బీజేపీ ఏకంగా 312 సీట్లు గెలిచింది.

►  ఇదివరకు రేషన్‌కార్డులు, పథకాలు ‘అబ్బా జాన్‌’ అనే వాళ్లకు మాత్రమే అందేవి
– యూపీ సీఎం యోగి 

►  సమాజ్‌వాదీ, రాష్ట్రీయ లోక్‌దళ్‌ పొత్తు పెట్టుకోవడంతో బీజేపీకి ఓటమి భయం పట్టుకుంది 
– ఎస్పీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement