పార్టీ బతకడం కష్టమా? | tdp loosing its strength in telangana | Sakshi
Sakshi News home page

పార్టీ బతకడం కష్టమా?

Published Tue, Feb 16 2016 2:10 PM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

పార్టీ బతకడం కష్టమా? - Sakshi

పార్టీ బతకడం కష్టమా?

(సాక్షి వెబ్ ప్రత్యేకం)
వరుస పరంపరగా జరిగిన ఎన్నికల్లో ఘోర పరాజయంతో తెలుగుదేశం పార్టీ మనుగడ ప్రశ్నార్థంగా మారింది. రానున్న రోజుల్లో టీడీపీని జాతీయస్థాయి పార్టీగా ప్రచారం చేసుకుంటున్న తరుణంలో ఆ పార్టీ మరింతగా కుంచించుకుపోతోంది. ఇటీవల జరిగిన వరంగల్ లోక్‌సభ ఉపఎన్నిక ఫలితం, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో పాటు తాజాగా మెదక్ జిల్లా నారాయణఖేడ్ ఉపఎన్నికలో టీడీపీ ఘోర పరాజయం ఆ పార్టీ తెలంగాణలో మనుగడ సాధించడమే కష్టంగా మారుతోంది.

2014 సాధారణ ఎన్నికల్లో లభించిన ఓట్ల వివరాలతో పోల్చితే ఇటీవలి కాలంలో వరుసగా జరిగిన వరంగల్ ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ, నారాయణఖేడ్ ఉపఎన్నికల్లో వచ్చిన ఓట్ల సరళిని విశ్లేషిస్తే టీడీపీ దాదాపు 12 శాతానికి పైగా ఓట్లను కోల్పోయింది. గతంలో బలం ప్రదర్శించిన ప్రాంతాల్లోనూ టీడీపీ ఓట్లు చెల్లాచెదురు కావడం ఆ పార్టీ మనుగడను ప్రశ్నార్థకంగా మార్చింది.

తెలంగాణలో టీడీపీ మనుగడ కష్టతరంగా మారుతున్న పరిణామాలు ఆయా ఉపఎన్నికల ఫలితాల సరళి తెలియజేస్తుండగా నాయకులు కూడా ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు. నేతలు వెళ్లిపోతున్న పరిణామం కూడా పార్టీ అస్తిత్వం ఉంటుందా అన్న అనుమానాలకు తావిస్తోంది. ఇటీవల జరిగిన వరంగల్ ఎన్నికల్లో మిత్రపక్షమైన బీజేపీకి టీడీపీ మద్దతునివ్వగా ఆ పార్టీ కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. 24 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో విస్తరించి ఉన్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మొత్తం 150 సెగ్మెంట్లలో కేవలం ఒకే ఒక్క డివిజన్ గెలుచుకుని టీడీపీ పూర్తిగా చతికిలపడిన విషయం తెలిసిందే. అది కూడా బీజేపీ మద్దతుతో రంగంలోకి దిగిన టీడీపీ ఇంతటి దారుణమైన పరిస్థితి ఎప్పుడు ఎదుర్కోలేదు.

వరంగల్ లోక్ సభ ఫలితాలు
2014 సాధారణ ఎన్నికల్లో వరంగల్ లోక్‌సభ స్థానంలో టీఆర్ఎస్‌కు 6,61,639 ఓట్లు రాగా రెండో స్థానంలో కాంగ్రెస్ (2,69,065) నిలిచింది. టీడీపీ మద్దతునిచ్చిన బీజేపీ మూడో స్థానానికి (1,87,639) పరిమితమైంది. ఆ తర్వాత టీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి తన పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో 2015 లో జరిగిన ఉపఎన్నికల్లో కొత్త ఆశలతో బరిలోకి దిగిన బీజేపీ-టీడీపీకి మరింత చేదు అనుభవం ఎదురైంది. 2015 ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ (6,15,403), కాంగ్రెస్ (1,56,311), టీడీపీ మద్దతునిచ్చిన బీజేపీ (1,30,178) మూడో స్థానానికే పరిమితమైంది. ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీతో పాటు మిత్రపక్ష టీడీపీ-బీజేపీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయారు. అదే కాకుండా ఆ జిల్లాకు చెందిన ధర్మారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు లాంటి నేతలు ఎంతోమంది ఇప్పటికీ టీడీపీకి గుడ్‌బై చెప్పారు.

గ్రేటర్‌లో దారుణం
గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో టీడీపీ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. 2014 సాధారణ ఎన్నికల్లో టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ మద్దతుతో గ్రేటర్ పరిధిలోని 24 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆ రెండు పార్టీలు (టీడీపీ 9, బీజేపీ 5) 14 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నాయి. మొత్తంగా ఆ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిపి 34.42 శాతం ఓట్లను సాధించగా ఇటీవలి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీలు 11 శాతానికి పైగా ఓట్లను కోల్పోయాయి. ఈ నియోజకవర్గాల్లో ఓట్ల లెక్కలో చూస్తే.. సాధారణ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీకి 14,66,078 ఓట్లు రాగా, ఇటీవలి గ్రేటర్ ఎన్నికల్లో కేవలం 7,85,300 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఓట్ల పరంగా విశ్లేషిస్తే సగానికి సగం ఓట్లు ఆ పార్టీలు కోల్పోయాయి.

ఖేడ్‌లో డిపాజిట్ గల్లంతు
2014లో జరిగిన ఎన్నికల్లో మెదక్ జిల్లా నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అక్కడ గెలిచిన పట్లోళ్ల కిష్టారెడ్డి ఆకస్మిక మరణంతో ప్రస్తుతం ఉప ఎన్నిక జరిగింది. ఈ స్థానం తాజా ఎన్నికల్లో టీఆర్ఎస్ ఖాతాలో చేరగా, సాధారణ ఎన్నికల్లో టీడీపీ 40,405 ఓట్లు సాధించగా ప్రస్తుత ఉపఎన్నికలో కేవలం 14,787 ఓట్లను మాత్రమే సాధించింది. 2014 ఎన్నికలో నమోదైన స్థాయిలోనే తాజా ఉపఎన్నికలో కూడా పోలింగ్ నమోదు కాగా ఈ రెండేళ్లలో టీడీపీ 25,618 ఓట్లను కోల్పోయింది.

సైకిల్ దిగుతున్న నేతలు
తెలంగాణ ప్రాంతంలో గత సాధారణ ఎన్నికల్లో టీడీపీ 15 మంది ఎమ్మెల్యేలను గెలుచుకోగా వారిలో 10 మంది ఇప్పటికే ఆ పార్టీని వీడి టీఆర్ఎస్‌లో చేరారు. వారితో పాటు అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు, ద్వితీయ శ్రేణి నాయకులు కూడా టీడీపీని వీడుతున్నారు. మరిన్ని రాష్ట్రాల్లో విస్తరించి పార్టీని జాతీయ పార్టీ స్థాయికి తెస్తామని టీడీపీ నిర్వహించిన గత మహానాడులో ప్రకటించింది. పార్టీకి జాతీయ స్థాయి గుర్తింపు లేకపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు తనకు తానుగా పార్టీ జాతీయాధ్యక్షుడిగా, తన కుమారుడిని ప్రధాన కార్యదర్శిగా నియమించుకున్నారు. మూడు దశాబ్దాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రభావం చూపిన టీడీపీకి ఎదురవుతున్న పరిస్థితులు సబ్ రీజనల్ పార్టీ స్థాయికి కుదించుకుపోతోందని ఆ పార్టీ నేతలే విశ్లేషిస్తున్నారు.

ఏపీ ఎఫెక్ట్
గత సాధారణ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కన్నా కేవలం 5లక్షల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో అధికారం చేపట్టిన టీడీపీ ఇప్పుడు ఆ ప్రాంతంలోనూ ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నట్టు స్పష్టంగా తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. గత సాధారణ ఎన్నికల సందర్భంగా ఎంతోమంది టీడీపీ నేతలు హైదరాబాద్‌లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్న చాలామందిని  ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటుచేసి తరలించి ఓట్లు వేయించుకున్న విషయంపై అప్పట్లో వార్తలొచ్చాయి. అప్పట్లో టీడీపీకి ఓట్లు వేసినవారే ఇప్పుడు ఆ పార్టీని ఛీత్కరించడమంటే ఏపీ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత ఉన్నట్టు స్పష్టంగా కనబడుతోంది.

గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించడం, ఇటీవల జరిగిన కాపు రిజర్వేషన్ల ఉద్యమం విషయంలో అనుసరించిన దోబూచులాట వైఖరి, ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు మిగిలిన సామాజిక వర్గాలను విస్మరించడం, అభివృద్ధి విషయంలో ప్రాంతాల మధ్య సమతుల్యత పాటించకపోవడం, ఏపీకి కీలకమైన ప్రత్యేకహోదా సాధించలేక చతికిలపడటం వంటి వైఫల్యాలతో పాటు, రాజధాని నిర్మాణం, ప్రాజెక్టుల నిర్మాణాల్లో భారీ అవకతవకలు చోటుచేసుకున్నాయంటూ వస్తున్న విమర్శలు... టీడీపీ ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత ఏర్పడిందని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు.
-కె.సుధాకర్ రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement