మహాసునామీ.. మహాయుతి హవా | Mahayuti won 138 seats with 50percent plus vote share | Sakshi
Sakshi News home page

మహాసునామీ.. మహాయుతి హవా

Published Mon, Nov 25 2024 4:57 AM | Last Updated on Mon, Nov 25 2024 4:58 AM

Mahayuti won 138 seats with 50percent plus vote share

మహారాష్ట్రలో మహాయుతి హవా 

6 ప్రాంతాల్లోనూ ఎంవీఏపై ఆధిపత్యం

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి సాధించిన కనీవినీ ఎరగనంతటి ఘనవిజయం రాజకీయ వర్గాలనే ఆశ్చర్యపరుస్తోంది. 288 అసెంబ్లీ స్థానాల్లో ఏకంగా నాలుగింట మూడొంతులకు పై చిలుకు సీట్లను అధికార సంకీర్ణం కైవసం చేసుకోగా విపక్ష మహా వికాస్‌ గఘాడీ (ఎంవీఏ) కేవలం 49 సీట్లకు పరిమితం కావడం తెలిసిందే. బీజేపీ ఏకంగా 132 స్థానాలు గెలుచుకోగా కాంగ్రెస్‌ కేవలం 16 స్థానాలకు పరిమితమైంది. ఇవి రాష్ట్ర చరిత్రలోనే బీజేపీకి అత్యధిక, కాంగ్రెస్‌కు స్థానాలు కావడం విశేషం! మహారాష్ట్రలోని ఆరు ప్రాంతాలకు గాను అన్నిచోట్లా మహాయుతి జైత్రయాత్ర అప్రతిహతంగా సాగడమే ఈ అఖండ విజయానికి కారణమైంది.

పశ్చిమ మహారాష్ట్ర 
షుగర్‌ బెల్ట్‌గా పిలిచే ఈ ప్రాంతం నిజానికి ఎంవీఏకు కంచుకోట వంటిది. ఇక్కడ కూడా ఈసారి విపక్ష కూటమికి దారుణ ఫలితాలే ఎదురయ్యాయి. 70 స్థానాలకు గాను మహాయుతి ఏకంగా 53 చోట్ల విజయనాదం చేస్తే ఎంవీఏ కేవలం డజను సీట్లకు పరిమితమైంది. మరీ ముఖ్యంగా 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 12 సీట్లు నెగ్గిన కాంగ్రెస్‌ ఈసారి కేవలం 2 స్థానాలతో సరిపెట్టుకుంది. 

ఈ ప్రాంతం నుంచి బరిలో దిగిన పృథీ్వరాజ్‌ చవాన్, బాలాసాహెబ్‌ థోరట్‌ వంటి కాకలుతీరిన కాంగ్రెస్‌ నేతలు కూడా ఓటమి చవిచూశారు. శివసేన (యూబీటీ)కీ రెండే సీట్లు దక్కాయి. వాటితో పోలిస్తే ఎంవీఏలోని మూడో పక్షమైన శరద్‌ పవార్‌ ఎన్సీపీ మెరుగైన ప్రదర్శన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ నెగ్గిన 10 స్థానాల్లో ఏకంగా 8 పశి్చమ మహారాష్ట్రలోనే కావడం విశేషం. ఈ ప్రాంత పరిధిలోని కొల్హాపూర్‌ జిల్లాలోనైతే మహాయుతి ఏకంగా 10కి 10 స్థానాలు కైవసం చేసుకుంది.

మరాఠ్వాడా
ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి ఏడు స్థానాల్లో ఏకంగా 6 ఎంవీఏ ఖాతాలోకి వెళ్లాయి. ఆర్నెల్లకే పరిస్థితి పూర్తిగా తిరగబడింది. ఇక్కడి 46 అసెంబ్లీ సీట్లలో ఏకంగా 41 చోట్ల మహాయుతి జెండా ఎగిరింది. ఎంవీఏ కేవలం 5 సీట్లకు పరిమితమైంది. బీజేపీ 20 చోట్ల పోటీ చేస్తే ఏకంగా 19 స్థానాలు గెలుచుకుంది. శివసేన (షిండే) 16 స్థానాల్లో 13, ఎన్సీపీ (అజిత్‌) 9 సీట్లకు ఏకంగా 8 నెగ్గాయి. మరాఠా రిజర్వేషన్ల అంశానికి విరుగుడుగా ఓబీసీలను మహాయుతి పక్షాలు విజయవంతం సంఘటితం చేయగలిగాయి. ఈ సోషల్‌ ఇంజనీరింగే ఈ ప్రాంతంలో అధికార కూటమి విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. అయితే ఇక్కడి నాందేడ్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ నెగ్గడం ఎంవీఏ కూటమికి కాస్తలో కాస్త ఊరటనిచి్చంది. 

విదర్భ 
లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి 10 స్థానాల్లో 7 ఎంవీఏ పరమయ్యాయి. ఇప్పుడు మహాయుతి 62 అసెంబ్లీ సీట్లకు గాను ఏకంగా 49 స్థానాలను నెగ్గింది. వీటిలో ఒక్క బీజేపీ వాటాయే 39 కావడం విశేషం! కాంగ్రెస్‌ ఇక్కడ కేవలం 8 స్థానాలు గెలవగలిగింది. ఇక్కడి సాకోలీ స్థానం నుంచి పీసీసీ చీఫ్‌ నానా పటోలే కూడా కేవలం 208 ఓట్ల మెజారిటీతో అతి కష్టమ్మీద గట్టెక్కారు!

కొంకణ్‌ 
ఈ ప్రాంతాన్ని మహాయుతి దాదాపుగా క్లీన్‌స్వీప్‌ చేసేయడం విశేషం. 39 అసెంబ్లీ సీట్లకు గాను ఏకంగా 35 స్థానాలు అధికార కూటమి ఖాతాలో పడ్డాయి. ఇక్కడ కాస్తో కూస్తో పట్టున్న శివసేన (యూబీటీ) ఒక్కటంటే ఒక్క స్థానమే గెలవగలిగింది. ఆరెస్సెస్‌ దన్నుతో పాటు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేకు కొంకణ్‌పై ఉన్న పట్టు ఈ ఫలితాలకు ప్రధాన కారణంగా నిలిచింది. 

ఉత్తర మహారాష్ట్ర
మహాయుతి దాదాపుగా క్లీన్‌స్వీప్‌ చేసిన మూడు ప్రాంతాల్లో ఇదొకటి. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడి 7 స్థానాల్లో ఆరు ఎంవీఏ ఖాతాలో పడ్డాయి. ఈసారి మాత్రం 35 అసెంబ్లీ స్థానాల్లో మహాయుతి ఏకంగా 33 చోట్ల గెలిచింది. ఎంవీఏ కూటమి ఇక్కడ కేవలం ఒక్క స్థానానికి పరిమితమైంది. 

సోదిలో లేని చిన్న పార్టీలు 
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి కీలక పాత్ర పోషిస్తాయని అంతా భావించిన చిన్న పార్టీలు సోదిలో కూడా లేకుండా పోవడం విశేషం. రాజ్‌ ఠాక్రే మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌), అంబేడ్కర్‌ మనవడు ప్రకాశ్‌ అంబేడ్కర్‌ సారథ్యంలోని వంచిత్‌ బహుజన్‌ అఘాడీ (వీబీఏ) వంటివి కూడా ప్రభావం చూపలేకపోయాయి. 125 చోట్ల పోటీ చేసిన ఎంఎన్‌ఎస్, 200 స్థానాల్లో బరిలో దిగిన వీబీఏ కనీసం ఖాతా కూడా తెరవలేదు! అత్యధికంగా 237 చోట్ల పోటీ చేసిన బీఎస్పీ కూడా ఒక్కచోటా గెలవలేదు. 28 చోట్ల పోటీ చేసిన ఆజాద్‌ సమాజ్‌ పార్టీ (కాన్షీరాం)దీ అదే పరిస్థితి. రైతుల్లో బాగా ఆదరణ ఉన్న స్వాభిమాని పక్ష, ప్రహార్‌ జనశక్తి వంటివి కూడా సున్నా చుట్టాయి. సమాజ్‌వాదీ, జన్‌ సురాజ్య శక్తి పార్టీలు కాస్త మెరుగ్గా రెండేసి స్థానాలు నెగ్గాయి. సీపీఎం, మజ్లిస్‌తో పాటు రా్రïÙ్టయ యువ స్వాభిమాన్‌ పార్టీ, రా్రïÙ్టయ సమాజ్‌ ప„Š , పిజెంట్స్‌ అండ్‌ వర్కర్స్‌ పార్టీ, రాజర్షి సాహూ వికాస్‌ అఘాడీ ఒక్కో స్థానంతో సరిపెట్టుకున్నాయి. ఈసారి మహారాష్ట్రలో ఏకంగా 158 పార్టీలు ఎన్నికల బరిలో దిగడం విశేషం.  

ముంబై 
ఎంవీఏ కాస్త మెరుగైన ప్రదర్శన చేసిన ఏకైక ప్రాంతం. రాజధాని నగరంతో పాటు శివారు ప్రాంతాలతో కలిపి 36 సీట్లుంటే విపక్ష కూటమి 14 సీట్లు దక్కించుకుంది. వాటిలో 10 స్థానాలు ఉద్ధవ్‌ శివసేనకే దక్కగా మూడుచోట్ల కాంగ్రెస్‌ నెగ్గింది. శరద్‌ పవార్‌ పార్టీకి ఒక్క సీటూ రాలేదు. మహాయుతి 22 చోట్ల గెలిచింది. వాటిలో 15 బీజేపీకే దక్కడం విశేషం.


ముఖాముఖిల్లో షిండే, అజిత్‌ పార్టీల హవా
    36 చోట్ల ఉద్ధవ్‌ సేనపై షిండే సేన గెలుపు 
    29 చోట్ల శరద్‌ పార్టీపై నెగ్గిన అజిత్‌ ఎన్సీపీ 
శివసేన, ఎన్సీపీ వర్గ పోరులో సీఎం ఏక్‌నాథ్‌ షిండే, ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ వర్గాలు స్పష్టంగా పై చేయి సాధించాయి. ఉద్ధవ్‌ ఠాక్రే శివసేన (యూబీటీ), షిండే శివసేన 50 అసెంబ్లీ స్థానాల్లో ముఖాముఖి తలపడ్డాయి. వాటిలో 36 చోట్ల షిండే సేన నెగ్గింది. 14 చోట్ల మాత్రం ఉద్ధవ్‌ సేన గెలిచింది. ఆ పార్టీ మొత్తం 95 చోట్ల బరిలో దిగినా కేవలం 20 సీట్లే గెలుచుకుంది. షిండే సేన 81 చోట్ల పోటీ చేయగా 57 స్థానాలు కైవసం చేసుకుంది. 2022లో షిండే మెజారిటీ ఎమ్మెల్యేలతో కలిసి శివసేనను చీల్చడం, బీజేపీతో కలిసి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తెలిసిందే. 

ఇక రెండు ఎన్సీపీలు 35 చోట్ల ముఖాముఖి తలపడ్డాయి. అజిత్‌ ఎన్సీపీ 29 స్థానాల్లో శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీని ఓడించింది. ఆరుచోట్ల మాత్రం ఆ పార్టీ చేతిలో ఓటమి చవిచూసింది. అజిత్‌ పార్టీ మొత్తం 59 చోట్ల పోటీ చేయగా ఏకంగా 41 స్థానాలు గెలుచుకుంది. శరద్‌ పార్టీ మాత్రం ఏకంగా 86 చోట్ల పోటీ చేస్తే కేవలం పదింట మాత్రమే నెగ్గింది. శరద్‌ పవార్‌ స్థాపించిన ఎన్సీపీని గతేడాది అజిత్‌ చీల్చి బీజేపీ–షిండే సేన సంకీర్ణ ప్రభుత్వంలో చేరారు. రెండు వర్గాల్లో అసలైన పార్టీలు ఎవరివంటూ నాటినుంచీ సాగుతున్న చర్చకు ఈ ఫలితాలతో తెర పడింది.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement