మహారాష్ట్ర ఫలితాలపై కాంగ్రెస్‌లో నిరాశ
జార్ఖండ్‌లో విజయంతో ఊరట
కర్ణాటక ఉప ఎన్నికల్లో గెలుపుతో ఉపశమనం
వయనాడ్‌లో ప్రియాంక విజయం పట్ల సంబరం
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టికి కొంత నిరాశం, కొంత ఉపశమనం కలిగించాయి. మహారాష్ట్రలో కూటమి పక్షాలతో కలిసి అధికార బీజేపీ కూటమికి ఓటమి రుచి చూపిద్దామన్న కసితో పనిచేసిన కాంగ్రెస్‌కు ఫలితాలు ఊహించని షాక్ ఇచ్ఛాయి. సీట్ల పంపకాల్లో తప్పిదాలు, ఓట్ల బదిలీ జరగకపోవడం, పార్టీ ఇచ్చిన గ్యారంటీలను ప్రజలు పెద్దగా నమ్మకపోవడం ఘోర పరాజయానికి దారితీశాయి. జార్ఖండ్‌లో మాత్రం తన బలాన్ని నిలుపుకోవడం, కూటమి పార్టితో కలిసి తిరిగి అధికారంలోకి రావడం కాంగ్రెస్‌కు ఊపిరినిచ్చింది.
మహారాష్ట్రలో ఊహించని దెబ్బ
ఆరు నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ అద్భుత ప్రదర్శన కనబరించింది. మొత్తం 48 పార్లమెంట్ స్థానాలకు గానూ 30 స్థానాలను కైవసం చేసుకుంది. ఇందులో కాంగ్రెస్ 16.12 శాతం ఓట్లను రాబట్టుకొని 13 స్థానాలను గెలుచుకుంది. మిత్రపక్షాలైన శివసేన (ఉద్ధవ్) 9, ఎన్సీపీ(శరద్ పవార్) 8 స్థానాలు దక్కించుకున్నాయి.
కానీ, అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి కాంగ్రెస్ కేవలం 15 సీట్లకే పరిమితమైంది. తన ఓట్ల శాతాన్ని సైతం కోల్పోయి కేవలం 12 శాతం ఓట్లకు పరిమితమైంది. 2019 ఎన్నికల్లో 147 సీట్లలో పోటీ చేసి 44 సీట్లు రాబట్టుకున్న కాంగ్రెస్ ప్రస్తుత ఎన్నికల్లో 101 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ తన పేలవ ప్రదర్శనతో 15 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
దీనికి ప్రధాన కారణం తమకు బలమైన ఓటు బ్యాంకు కలిగిన ఉన్న నియోజకవర్గాలను మిత్రపక్షాలకు వదిలేయడమేనని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. మిత్రపక్షాలకు కేటాయించిన స్థానాలపై కాంగ్రెస్ ఎన్నికల కమిటీ భేటీలో అగ్రనేత రాహుల్‌గాంధీ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ విజయావకాశాలను, సీట్లను తగ్గించేలా నియోజకవర్గాల ఎంపిక జరిగిందని ఆరోపించారు. దీనికి తోడు 75 స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ ముఖాముఖి పోటీపడ్డాయి. ఆయా స్థానాల్లో 65కి పైగా స్థానాలను బీజేపీ గెలుచుకుంది. హిందువుల ఓట్ల ప్రాబల్యంతోపాటు గరిష్ట సంఖ్యలో మరాఠాలు బీజేపీకి జైకొట్టడంతో కాంగ్రెస్‌కు పరాజయం ఎదరయ్యింది.
జార్ఖండ్‌తో దక్కిన పరువు
జార్ఖండ్‌లోనూ ఎన్డీఏ కూటమి విజయం సాధిస్తుందని ఎగ్జిట్‌పోల్స్ చెప్పినప్పటికీ కాంగ్రెస్ నేతృత్వంలో ఇండియా కూటమి నెగ్గింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తన పూర్వవైభవాన్ని నిలబెట్టుకుంది. గత ఎన్నికల్లో 31 స్థానాల్లో పోటీచేసి 16 సీట్లు గెలిచిన ఆ పార్టీ ప్రస్తుత ఎన్నికల్లో 30 స్థానాల్లో పోటీచేసి 16 స్థానాలు దక్కించుకుంది. జేఎంఎం 41 స్థానాల్లో పోటీ చేసింది. కాంగ్రెస్ నుంచి పూర్తి సహకారం అందడంతో జేఎంఎం గెలుచుకున్న స్థానాలు 30 నుంచి 34కి పెరిగాయి. పొత్తులపై ముందునుంచే అవగాహన ఉండడం, జార్ఖండ్‌లో రాహుల్ గాంధీ విస్తృతంగా పర్యటించడం ఇండియా కూటమికి కలిసొచ్చింది.
ఉప ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు
వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. ఉత్తరప్రదేశ్‌లో 9 స్థానాలకు ఎన్నికలు జరగ్గా, మిత్రపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ 2 స్థానాలు గెలుచుకుంది. ఇక్కడ కాంగ్రెస్ పోటీ చేయలేదు. కాంగ్రెస్ నుంచి సరైన మద్దతు లేకపోవడంతో మరో 2 స్థానాలు గెలిచే అవకాశమున్నా ఎస్పీ తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయింది. పశి్చమ బెంగాల్‌లో ఉప ఎన్నికలు జరిగిన 6 స్థానాల్లోనూ మిత్రపక్షమైన తృణముల్ కాంగ్రెస్ గెలిచింది. ఈ ఎన్నికల్లో పొత్తు లేకపోవడంతో కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేసి ఓటమి చవిచూసింది.
పంజాబ్‌లోనూ నాలుగు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టితో పొత్తు లేకపోవడంతో కాంగ్రెస్ ఒక స్థానంలో నెగ్గింది. మూడు స్థానాల్లో ఆప్ గెలుపొందింది. రాజస్తాన్‌లో 7 స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక స్థానంలో విజయం సాధించగా, బీజేపీ, దాని మిత్రపక్షాలు ఆరింటిని గెలుచుకున్నాయి. కర్ణాటకలో 3 స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా, అన్నింటినీ కాంగ్రెస్ సొంతం చేసుకుంది. మరోవైపు వయనాడ్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికలో ప్రియాంక గాంధీ విజయం పట్ల కాంగ్రెస్‌లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
– సాక్షి, న్యూఢిల్లీ
Comments
Please login to add a commentAdd a comment