ఇండియా కూటమిలో లుకలుకలు
కాంగ్రెస్ తీరుపై భాగస్వాముల్లో తీవ్ర ఆగ్రహం
సారథ్యం మరొకరికి అప్పగించాలని డిమాండ్లు
తాను సిద్ధమన్న దీదీ వ్యాఖ్యలపై కలకలం
మమతకు మద్దతు ప్రకటించిన సమాజ్‌వాదీ
కూటమిలో విభేదాలు నిజమేనని వ్యాఖ్యలు
మమత వ్యాఖ్యలు పెద్ద జోక్: కాంగ్రెస్
న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల్లో వరుస పరాజయాల నేపథ్యంలో విపక్ష ‘ఇండియా’ కూటమిలో లుకలుకలు బయటపడుతున్నాయి. కూటమి పార్టీలకు పరస్పరం పొసగడం లేదు. కూటమి భవిష్యత్తు గురించి కొత్త చర్చ మొదలైంది. కూటమిలో అతి పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ తీరు పట్ల మిత్రపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నేతలు గొంతు విప్పుతున్నారు. సమాజ్‌వాదీ పార్టీ ఒకడుగు ముందుకేసి మహారాష్ట్రలో కాంగ్రెస్ సారథ్యంలోని మహా వికాస్ అఘాడీ (ఎంవీఎస్) నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించింది!
అదానీ వ్యవహారంపై పార్లమెంట్‌లో చర్చకు ఇండియా పక్షాలు చేస్తున్న ఆందోళన కార్యక్రమాల్లో సమాజ్‌వాదీ, తృణమూల్ కాంగ్రెస్ పాల్గొనడం లేదు. ఇతర అంశాల్లోనూ భాగస్వాముల మధ్య ఏకాభిప్రాయం కనిపించడం లేదు. పార్లమెంట్ లోపల, బయట కలిసి ఒక్కతాటిపై పని చేస్తున్న దాఖలాలు లేవు. ప్రధానంగా హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కూటమిలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ ఆధిపత్యాన్ని కొందరు నాయకులు ప్రశ్నిస్తున్నారు. ప్రజాభిమానం కోల్పోయి బలహీనపడుతున్న కాంగ్రెస్ విపక్ష కూటమిని ముందుకు నడిపించలేదని కుండబద్ధలు కొడుతున్నారు. సారథ్యం నుంచి కాంగ్రెస్ తప్పుకుని సమర్థులకు బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూటమి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి సిద్ధమన్న పశి్చమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ వ్యాఖ్యలు కూటమిలో కలకలం రేపాయి. ఇండియా కూటమికి ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చైర్‌పర్సన్‌గా ఉన్నారు.
ఇదేనా పొత్తు ధర్మం?
బీజేపీ హఠావో.. దేశ్ బచావో నినాదంతో లోక్‌సభ ఎన్నికలకు ముందు 2023 జూన్‌లో 17 పార్టీలతో ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్ (ఇండియా) ఫ్రంట్ ఏర్పాటైంది. బీజేపీని వ్యతిరేకించే పార్టీలు ఒకే వేదికపైకి చేరాయి. కాంగ్రెస్‌తో పాటు భావసారూప్యం కలిగిన పార్టీలు చేతులు కలిపాయి. అయితే, బీజేపీ ఓటమే లక్ష్యంగా ఇండియా కూటమి ఏర్పాటుకు చొరవ తీసుకున్న జేడీ(యూ) చీఫ్, బిహార్ సీఎం నితీశ్ కుమార్ తర్వాత బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరిపోయారు! ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా పక్షాలు కొన్నిచోట్ల కలివిడిగా, మరికొన్ని రాష్ట్రాల్లో విడివిడిగా పోటీచేశాయి. అంతిమంగా పరాజయమే మిగిలింది.
లోక్‌సభలో స్వీయ బలం పెరగడం ఒక్కటే కాంగ్రెస్‌కు కొంత ఊరట కలిగించింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్, హరియాణాలో మిత్రపక్షాలను పక్కనపెట్టి దాదాపుగా ఒంటరిగా పోటీచేయడం వికటించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌వి ఒంటెత్తు పోకడలంటూ భాగస్వామ్య పార్టీలు మండిపడుతున్నాయి. అందరినీ కలుపుకొని వెళ్లడం లేదని, పొత్తుధర్మం పాటించడంలేదని ఆక్షేపిస్తున్నాయి. అన్ని వైపులా ఒత్తిడి పెరుగుతుండడంతో కాంగ్రెస్ ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్ ఆత్మవిమర్శ చేసుకోవాలి
సమాజ్‌వాదీ ఇప్పటికీ ఇండియా కూటమిలోనే ఉందని ఆ పార్టీ ఎంపీ జావెద్ అలీఖాన్ చెప్పారు. అయితే కూటమిలో అభిప్రాయభేదాలు నిజమేనని అంగీకరించారు. లుకలుకలపై కాంగ్రెసే స్పందించి భాగస్వాములను సమాధానపరచాలని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా సూచించారు. మిత్రపక్షాలను లెక్క చేయకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తే ఇక కూటమి ఎందుకని ప్రశ్నించారు. ‘‘అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వల్ల సీట్ల పంపకం సక్రమంగా జరగలేదు, అందుకే అవమానాలు ఎదురయ్యాయి’’ అని ఆరోపించారు.
కూటమి ఒక్కటిగా కలిసి ఉంటుందన్న నమ్మకం తమకు లేదని, ఏ క్షణమైనా అది ముక్కలయ్యే అవకాశం ఉందని జేడీ(యూ) సీనియర్ నేత రాజీవ్ రంజన్ వ్యాఖ్యానించారు. కూటమికి ఎవరు సారథ్యం వహించాలో త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ తెలిపారు. సారథ్యానికి సిద్ధమన్న మమత ప్రతిపాదనపై దృష్టి పెట్టాలని సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఉదయ్‌వీర్ సింగ్ కోరారు. ఆమెకు తమ మద్దతు, సహకారం ఉంటాయని స్పష్టంచేశారు. కాంగ్రెస్ మాత్రం మమత వ్యాఖ్యలపై గుర్రుగా ఉంది. తమ కూటమి పెద్దగా మరొకరు అవసరమని భావించడం లేదని కాంగ్రెస్ ఎంపీ వర్ష గైక్వాడ్ తేల్చిచెప్పారు. మమత వ్యాఖ్యలను పెద్ద జోక్‌గా కాంగ్రెస్ నేత మాణిక్కం ఠాకూర్ కొట్టిపారేశారు.
ఎంవీఏకు సమాజ్‌వాదీ గుడ్‌బై
ముంబై: మహారాష్ట్రలోని ప్రతిపక్ష కూటమి ఎంవీఏతో తెగదెంపులు చేసుకుంటున్నామని సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ) తెలిపింది. 1992లో జరిగిన బాబ్రీ మసీదు విధ్వంసం ఘటనను కీర్తిస్తూ శివసేన(యూబీటీ) ఇటీవల ఒక పత్రికా ప్రకటన ఇచ్చింది. అదేవిధంగా ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే సన్నిహితుడు, ఎమ్మెల్సీ మిలింద్ నర్వేకర్ మసీదు విధ్వంసాన్ని పొగుడుతూ ‘ఎక్స్’లో వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఎస్‌పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాం’అని మహారాష్ట్ర ఎస్‌పీ చీఫ్ అబూ అజ్మీ చెప్పారు. ఈ పరిణామంపై శివసేన(యూబీటీ) స్పందించింది. బాబ్రీ మసీదుపై తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని పేర్కొంది. ఈ విషయం తెలుసుకునేందుకు ఎస్‌పీకి దశాబ్దాలు పట్టిందని వ్యాఖ్యానించింది. మహారాష్ట్ర అసెంబ్లీలో ఎస్‌పీకి ఇద్దరు ఎమ్మెల్యేలున్నారు. మహారాష్ట్రలోని మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లో కాంగ్రెస్, శివసేన(యూబీటీ), నేషనలిస్ట్ కాంగ్రెస్(ఎస్‌పీ),ఎస్‌పీ ఉన్నాయి.
‘‘ఇండియా కూటమి తీరు సరిగా లేదు. నాకు చాన్సిస్తే కూటమి సారథ్య బాధ్యతలకు సిద్ధం. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా, కూటమి అధినేతగా కొనసాగడం కష్టమేమీ కాదు. ఆ సామర్థ్యం నాకుంది. విపక్షాలను ఒక్కతాటిపైకి తెచ్చి కూటమి ఏర్పాటు చేశా. ప్రస్తుత సారథులు దాన్ని సమర్థంగా నడిపించగలరో లేదో వాళ్లే చెప్పాలి. లేదంటే ప్రత్యామ్నాయం చూడాలి. అందరినీ కలుపుకొని ముందుకెళ్లాలన్నదే నా సూచన’’
– శుక్రవారం మీడియాతో మమత
Comments
Please login to add a commentAdd a comment