నాగపూర్: దేశంలో కీలకమైన రంగాల్లో ఓబీసీలు, దళితులు, గిరిజనులకు వారికి జనాభా తగ్గుట్టుగా తగిన ప్రాతినిధ్యం లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన నిర్వహిస్తామని మరోసారి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ 139వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మహారాష్ట్రలోని నాగపూర్‌లో గురువారం ‘హై తయ్యార్ హమ్’ పేరిట నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగించారు.
రాజ్యాధికారాన్ని సామాన్య ప్రజల చేతికి అప్పగించాలన్నదే కాంగ్రెస్ ప్రధాన ఉద్దేశమని వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కోట్లాది మందిని పేదరికంలోకి నెట్టేసిందని ఆరోపించారు. పేదల ఇండియా, ధనికుల ఇండియా అనే రెండు దేశాలను తాము కోరుకోవడం లేదన్నారు. గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచి్చందో చెప్పాలని నిలదీశారు. దేశంలో నిరుద్యోగం అత్యధిక స్థాయికి చేరిందని ఆరోపించారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కలి్పస్తామని పేర్కొన్నారు.
మోదీ ఓబీసీనని ఎందుకు చెప్పుకుంటున్నారు
ప్రధాని మోదీ తాను ఓబీసీనని పదేపదే చెప్పుకుంటున్నారని, ఇప్పుడు కుల గణన గురించి తాము ప్రశ్నిస్తే నోరు విప్పడం లేదని రాహుల్ విమర్శించారు. పేదలు అనే ఒకే కులం ఉందని అంటున్నారని ఆక్షేపించారు. నిజంగా ఒకే కులం ఉంటే ఓబీసీనని ఎందుకు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. బీజేపీలో అగ్రనేతల నుంచి ఆదేశాలు వస్తుంటాయని, కాంగ్రెస్‌లో మాత్రం సామాన్య కార్యకర్తలు సైతం నాయకత్వాన్ని ప్రశ్నించే వెసులుబాటు ఉందని అన్నారు. దేశంలో పాలనా పగ్గాలు సాధారణ ప్రజల చేతుల్లో ఉండాలని ఆకాంక్షించారు. దేశంలో హరిత విప్లవం, శ్వేత విప్లవం, సమాచార సాంకేతిక విప్లవానికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు పునాది వేశాయని, వీటితో రైతులు, మహిళలు, యువత లబ్ధి పొందారని గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వం దేశంలో అన్ని వ్యవస్థలను చెరపట్టిందని రాహుల్ గాంధీ దుయ్యబట్టారు.
బీజేపీలో బానిసత్వం: రాహుల్
అధికార బీజేపీలో బానిసత్వం కొనసాగుతోందని ఆ పార్టీ ఎంపీ ఒకరు తనతో చెప్పారని రాహుల్ గాంధీ అన్నారు. గతంలో కాంగ్రెస్‌లో ఉన్న ఆ ఎంపీ ఇటీవల తనను ప్రైవేట్‌గా కలిశాడని చెప్పారు. బీజేపీలో ఉన్నప్పటికీ తన హృదయం మాత్రం కాంగ్రెస్‌తోనే ఉందని వెల్లడించాడని పేర్కొన్నారు. బీజేపీ పెద్దల నుంచి వచ్చే ఆదేశాలను ఎవరైనా పాటించాల్సిందేనని, నోరెత్తడానికి వీల్లేదని, పార్టీ కార్యకర్తల గోడును ఎవరూ పట్టించుకోరని ఆ ఎంపీ ఆవేదన వ్యక్తం చేశాడని రాహుల్ తెలిపారు.
ప్రతిపక్ష ఇండియా కూటమి అధికారం చేపట్టిన తర్వాత పేదలు, మహిళల సంక్షేమం కోసం కనీస వేతన పథకాన్ని(న్యాయ్ స్కీమ్) అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. ‘హై తయ్యార్ హమ్’ సభలో ఆయన ప్రసంగించారు. నాగపూర్ నగరం రెండు సిద్ధాంతాలకు కేంద్ర బిందువు అని చెప్పారు. ఒకటి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రవచించిన ప్రగతిశీల సిద్ధాంతమైతే, మరొకటి దేశాన్ని విచ్ఛన్నం చేసే ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతమని అన్నారు. దేశంలో బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం అంతమైపోతుందని హెచ్చరించారు. సామాజిక న్యాయం, సమానత్వానికి ప్రధాని నరేంద్ర మోదీ బద్ధ వ్యతిరేకి అని ఆరోపించారు. దేశంలో ప్రస్తుతం ప్రజాస్వామ్య వ్యవస్థ పెనుముప్పు ఎదుర్కొంటోందని అన్నారు. మోదీ పాలనలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగం ఆకాశం అంచులకు చేరాయని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment