
భువనేశ్వర్: ఒడిశాలో బీజేపీ అధికారంలో వచ్చాక మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయని నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు చేపట్టిన ర్యాలీతో గురువారం భువనేశ్వర్ రణరంగంగా మారింది. అసెంబ్లీ దిశగా దూసుకొస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను మహాత్మాగాంధీ మార్గ్‌లో అడ్డుకునేందుకు పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేశారు.
బారికేడ్లను దాటుకుని వస్తున్న కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులపైకి వారు రాళ్లు రువ్వారు. కుర్చిలను, బాటిళ్లను విసిరేశారు. ఒక పోలీసు వాహనానికి నిప్పుపెట్టేందుకు యత్నించారు. ఘటనలో 15 మంది పోలీసులతోపాటు ఒక టీవీ రిపోర్టర్ తలకు గాయాలయ్యాయి. దీంతో, పోలీసులు లాఠీచార్జి చేయడంతో 10 మంది వరకు గాయపడ్డారు. క్షతగాత్రులంతా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని డీసీపీ జగ్‌మోహన్ మీనా చెప్పారు.