lathicharge
-
వరద బాధితులపై సర్కార్ దమనకాండ
భవానీపురం (విజయవాడ పశ్చిమ): బుడమేరు వరదలో సర్వం కోల్పోయి సాయం అందించాలని కోరిన భవానీపురం కరకట్టవాసులపై చంద్రబాబు ప్రభుత్వం దమనకాండకు దిగింది. పోలీసులతో లాఠీచార్జి చేయించి, అణచివేసేందుకు ప్రయత్నించింది. అయినా బాధితులు వెనక్కి తగ్గకపోవడంతో దిగివచ్చిన అధికారులు ఎన్యూమరేషన్ చేస్తామని చెప్పారు. ఇందుకు రేషన్ కార్డులు కావాలని చెప్పడంతో వరదలో పోయిన కార్డులను ఎక్కడ తెమ్మంటారంటూ బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలి బుడమేరు వరదకు భవానీపురం కరకట్ట ప్రాంతం మునిగిపోయింది. అయినా ఇప్పటివరకు ఈ ప్రాంతంలోని బాధితులకు ప్రభుత్వం ఎటువంటి సాయం అందించలేదు. వరద బాధితులకు పరిహారమిచ్చేందుకు ఎన్యూమరేషన్ కూడా చేయడంలేదు. అదేమంటే ఈ ప్రాంతం రెడ్ జోన్లో లేదని అధికారులు చెబుతున్నారు. 15 రోజుల క్రితం ఈ బాధితులు పెద్ద ఎత్తున రాస్తారోకో చేయగా తహసిల్దార్ వారికి రేషన్ మాత్రం అందించారు. ఎన్యూమరేషన్ చేయించలేదు. దీంతో బాధితులంతా రోడ్డెక్కారు. బుడమేరు వరద కారణంగా మా ఇళ్లు మునగ లేదా.. మేం బాధితులం కాదా అంటూ సోమవారం సాయంత్రం దాదాపు 500 మంది బాధితులు విద్యాధరపురం కుమ్మరిపాలెం సెంటర్లో జాతీయ రహదారిపై పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రోజువారీ పనులు చేసుకుంటూ జీవించే తాము ఎన్యూమరేషన్ అధికారులు వస్తారేమోననని పనులకి కూడా వెళ్లకుండా ఇళ్ల దగ్గరే ఉంటున్నామని, అయినా ఇంతవరకు ఎవరూ తమ గోడు వినలేదంటూ కన్నీటి పర్యంతమయ్యారు. అదేమంటే తమ ప్రాంతం రెడ్ జోన్ కాదంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలు రోడ్డు మీద బైఠాయించారు. రెండు గంటలపాటు సాగిన ఈ ఆందోళనతో కుమ్మరిపాలెం సెంటర్లో ఉద్రిక్తత నెలకొంది. వెస్ట్ ఏసీపీ దుర్గారావు, భవానీపురం సీఐ ఉమామహేశ్వరరావు ఇతర పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అయినా బాధితులు వెనక్కి తగ్గలేదు. ఇంతలో ఏడీసీపీ గుణ్ణం రామకృష్ణ వచ్చారు. ఆయన ఆదేశాలో ఏమిటో తెలియదుగానీ వెంటనే పోలీసులు రెచ్చిపోయి బాధితులపై లాఠీచార్జ్ చేశారు. అయినా బాధితులు వెరవకుండా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రోప్ పార్టీ వచ్చి వారిని వెనక్కి నెట్టేసేందుకు ప్రయత్నించినా బాధితులు లెక్క చేయకుండా ఆందోళన కొనసాగించారు. పశ్చిమ తహసిల్దార్‌ను పిలిపించి మాట్లాడిస్తానని ఏడీసీపీ రామకృష్ణ బాధితులకు చెప్పి రోడ్డు మీదున్న వారందరినీ ఒక పక్కకు మళ్లించారు. చివరకు వెస్ట్ తహసిల్దార్ ఇంతియాజ్ పాషా వచ్చి బాధితులతో మాట్లాడారు. కలెక్టర్‌కు విషయం తెలిసి తనను పంపించారని, మంగళవారం ప్రత్యేక బృందాలతో ఎన్యూమరేషన్ చేయిస్తానని చెప్పారు. రేషన్ కార్డ్ తదితర ధృవపత్రాలను తీసుకురావల్సి ఉంటుందని చెప్పారు. ఇళ్లన్నీ మునిగిపోతే అవన్నీ ఎక్కడ నుంచి వస్తాయని బాధితులు ప్రశ్నించారు. చివరకు అధికారుల హామీతో ఆందోళన విరమించారు. -
దేశమంతటా ‘అగ్ని’గుండం
ఢిల్లీ: సైనిక దళాల్లో నియామకాలకు కేంద్రం తీసుకొచ్చిన కొత్త పథకం అగ్నిపథ్ రాజేసిన అగ్గి కార్చిచ్చుగా మారి దేశమంతటినీ కమ్మేసింది. పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా యువత చేపట్టిన నిరసనలు, ఆందోళనలు శుక్రవారం మూడో రోజు తారస్థాయికి చేరాయి. రైల్వేస్టేషన్లను ముట్టడించడం, హైవేలను దిగ్బంధించడంతో పాటు చాలాచోట్ల హింసాకాండ కూడా చోటుచేసుకుంది. బిహార్, యూపీ మొదలుకుని పశ్చిమ బెంగాల్, ఒడిశా, మధ్యప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ... ఇలా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటాయి. కోపోద్రిక్తులైన యువకులు పలు రాష్ట్రాల్లో 7 రైళ్లకు, వందలాది వాహనాలకు నిప్పుపెట్టారు. గంటల తరబడి రోడ్లపై, పట్టాలపై బైఠాయించారు. రైళ్లు, బస్సులు, ఇతర వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. వాటిపైకి రాళ్లు రువ్వారు. ప్రభుత్వ ఆస్తులతో పాటు టోల్ ప్లాజాలను కూడా ధ్వంసం చేశారు. పలుచోట్ల రైల్వేస్టేషన్లలో విధ్వంసానికి పాల్పడ్డారు. బిహార్‌లో ఉప ముఖ్యమంత్రితో పాటు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుని నివాసాలపై దాడికి దిగారు. బీజేపీకి, కేంద్రానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిపారు. ‘అగ్నిపథ్‌ను వెనక్కు తీసుకోవాలి’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. లాఠీచార్జీలో వందలాది మంది గాయపడ్డారు. యువత భవిష్యత్తును అంధకారంగా మార్చే ఈ పథకాన్ని తక్షణం వెనక్కు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఆందోళనలు, విధ్వంసాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 200కు పైగా రైళ్లు రద్దయ్యాయి. 300 పై చిలుకు రైళ్ల రాకపోకలు ప్రభావితమయ్యాయి. చాలాచోట్ల ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ వంటి సేవలను నిలిపేయాల్సి వచ్చింది. యువతను శాంతింపజేసేందుకు కేంద్రం హుటాహుటిన రంగంలోకి దిగినా పెద్దగా ఫలితం కనిపించలేదు. అగ్నిపథ్ అన్నివిధాలా ఆలోచించి రూపొందించిన పథకమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వివరించారు. పైగా దీనికింద సైనిక దళాల్లో చేరేందుకు గరిష్ట వయో పరిమితిని ఈ ఏడాదికి 23 ఏళ్లకు పెంచడం యువతకు సువర్ణావకాశమని వారన్నారు. నాలుగేళ్ల సర్వీసు అనంతరం పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలు, ప్రైవేటు రంగంలో చక్కని ఉద్యోగావకాశాలు ఉంటాయని చెప్పారు. అయినా యువత శాంతిస్తున్న సూచనలు గానీ, ఆందోళనలు తగ్గుముఖం పడుతున్న జాడలు కానీ కన్పించడం లేదు. పైగా అగ్నిపథ్ నియామకాలకు అతి త్వరలో శ్రీకారం చుడుతున్నట్టు ర్రివిధ దళాధిపతులు ప్రకటించిన నేపథ్యంలో ఆందోళనలు మరింతగా పెరిగేలా కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అగ్నిపథ్ పథకంపై శనివారం త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్ సమావేశమై చర్చించే అవకాశముందని తెలుస్తోంది. యూపీ, బెంగాల్, ఒడిశాల్లో... యూపీలో కనీసం 17 నగరాల్లో భారీ ఆందోళనలు జరిగాయి. బలియాలో రాష్ట్ర రవాణా మంత్రి క్యాంపు కార్యాలయంపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఓ రైలుకు నిప్పు పెట్టారు. అలీగఢ్ వద్ద హైవేపై పలు బస్సులపై రాళ్లు రువ్వారు. వారణాసి, ఫిరోజాబాద్, అమేథీ తదితర చోట్ల పలు రైళ్లపై దాడికి పాల్పడటంతో పాటు రాళ్లు రువ్వినట్టు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో రైల్వేస్టేషన్ ముట్టడి సందర్భంగా కాల్పుల్లో ఓ యువకుడు మరణించాడు. ఢిల్లీ, బెంగాల్, ఒడిశాల్లో హైవేల దిగ్బంధం జరిగింది. అట్టుడికిన బిహార్... అగ్నిపథ్ ఆందోళనతో బిహార్ అట్టుడికింది. రాజధాని పట్నా, హాజీపూర్, సమస్తిపూర్, లఖీసరాయ్ వంటి పలు పట్టణాల్లో రైళ్లకు నిప్పుపెట్టారు. దాంతో 10 ఇంజన్లతో పాటు 60 కోచ్‌లకు పైగా దగ్ధమయ్యాయి. హైవేలపై టైర్లు తదితరాలు తగలబెట్టి రాకపోకలను స్తంభింపజేశారు. శనివారం రాష్ట్ర బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. పట్నా శివార్లలో ఓ టోల్ ప్లాజా, నవడాలో ఓ పోలీసు జీపుకూ నిప్పు పెట్టారు. పశ్చిమ చంపారన్ జిల్లా బెట్టియాలో ఉప ముఖ్యమంత్రి రేణూ దేవి ఇంటిపై దాడి చేశారు. బిహార్ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ ఇంటిని పాక్షికంగా ధ్వంసం చేశారు. తన ఇంటిని పేల్చేసేందుకు సిలిండర్ బాంబు కూడా పెట్టారని ఆయన ఆరోపించారు. మోతీహారీలో బీజేపీ ఎమ్మెల్యే వినయ్ బిహారీ కారును తగలబెట్టారు. 320 మందిని అరెస్టు చేసినట్టు అదనపు డీజీపీ సంజయ్‌సింగ్ తెలిపారు. రాష్ట్రంలో 12 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను రెండు రోజుల పాటు నిలిపేశారు. -
హైదరాబాద్: ఎన్టీఆర్ అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్
-
జూ. ఎన్టీఆర్ ఫ్యాన్స్‌పై లాఠీచార్జ్
యంగ్‌టైగర్ ఎన్టీఆర్ అభిమానులపై హైదరాబాద్ పోలీసులు లాఠీచార్జ్ చేశారు. నేడు(మే 20) ఎన్టీఆర్ 39వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి గురువారం అర్థరాత్రి అభిమానులంతా ఆయన ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఎన్టీఆర్ ఇంట్లో లేకపోవడంతో.. ఆయన రాకకోసం రోడ్డుపైనే ఎదురుచూశారు. ఈ క్రమంలో కొంతమంది అభిమానులు కేక్ కట్ చేసి.. జై ఎన్టీఆర్ అంటూ రోడ్డుపై హంగామ సృష్టించారు. దీంతో అటువైపు వెళ్తున్న వాహనదారులకు ఇబ్బంది ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసలు..ఎన్టీఆర్ ఇంటివద్దకు చేరుకొని..అభిమానులను పక్కకు తరలించే ప్రయత్నం చేశారు. ఫ్యాన్స్ అంతా వెళ్లిపోవాలని ఆదేశించినా.. పట్టించుకోకుండా డాన్స్ చేస్తూ రచ్చరచ్చ చేశారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. కొంతమంది అభిమానులను అదుపులోకి కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. పెద్ద ఎత్తున పోలీసులు వచ్చి..లాఠీచార్జ్ చేయడంతో అభిమానులు అక్కడ నుంచి వెళ్లిపోయారు. -
అల్లు అర్జున్ ఫ్యాన్స్‌పై లాఠీచార్జ్.. పలువురికి గాయాలు
Police Lathicharge on Allu Arjun Fans at N Convention Hyderabad: మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ సెంటర్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అల్లు అర్జున్‌తో ఫోటో సెషన్ కోసం భారీగా అభిమానులు తరలివచ్చారు. అయితే ఫ్యాన్ మీట్ ప్రోగ్రాం రద్దైందంటూ నిర్వాహకులు ప్రకటించడంతో అభిమానులు ఆందోళనకు దిగారు. ఎన్ కన్వెన్షన్ గేట్లు విరగొట్టి లోపలికి చొచ్చుకెళ్లారు. ఈ క్రమంలో పరిస్థితిని అదుపు చేసేందుకు అభిమానులను చెదరగొట్టిన పోలీసులు వారిపై లాఠీచార్జ్ చేశారు. ఈ తోపులాటలో పలువురు అభిమానులకు గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా ఫ్యాన్ మీట్ అంటూ నిర్వాహకులు పాసులు సైతం జారీ చేశారు. దీంతో పెద్దె ఎత్తున ఎన్ కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకున్న అభిమానులు ఫోటోసెషన్ క్యాన్సిల్ కావడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. పాసులు ఉన్నా అనూహ్యంగా ప్రోగ్రాం ఎలా క్యాన్సిల్ చేస్తారంటూ ఆందోళన చేస్తున్నారు. -
విద్యార్థులపై లాఠీఛార్జ్ జరగలేదు: ఎస్పీ ఫక్కీరప్ప
సాక్షి, అనంతపురం: సాయిబాబా కాలేజీలో విద్యార్థులపై లాఠీఛార్జ్ జరగలేదని ఎస్పీ ఫక్కీరప్ప సృష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విద్యార్థుల ముసుగులో కొందరు రాళ్ల దాడి చేసినట్లు అనుమానాలు ఉన్నాయన్నారు. రాళ్ల దాడి వల్లే గాయపడ్డానని విద్యార్థిని జయలక్ష్మి నిజాయితీగా చెప్పారు. ఘటనపై లోతుగా విచారణ చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. అబద్ధాలు సృష్టించి ధర్నాలు చేయడం మానుకోవాలని ఎస్పీ ఫక్కీరప్ప హితవు పలికారు. -
కోల్‌కతాలో యుద్ధ వాతావరణం
కోల్‌కతా/హౌరా: బీజేపీ చేపట్టిన ‘చలో సెక్రటేరియట్’ కార్యక్రమం సందర్భంగా గురువారం కోల్‌కతా, హౌరాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ కార్యకర్తల హత్యలకు నిరసనగా భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) చేపట్టిన కార్యక్రమం హింసాత్మకంగా మారింది. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు పోలీసులతో ఘర్షణలకు దిగారు. పోలీసులు పెట్టిన బారికేడ్లను ధ్వంసం చేశారు. పోలీసులపై రాళ్లు విసిరారు. దాంతో, పోలీసులు వారిపై వాటర్ కెనాన్లను, టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. లాఠీచార్జ్ చేశారు. ఘర్షణల్లో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు గాయపడ్డారు. ఘర్షణల నేపథ్యంలో కోల్‌కతా, హౌరాల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. రోడ్లపై ఎక్కడ చూసినా.. కాల్చిన టైర్లు, రువ్విన రాళ్లు కనిపించాయి. కరోనా నిబంధనలను పట్టించుకోకుండా, వేలాది కార్యకర్తలు మధ్నాహ్నం 12.30 గంటల ప్రాంతంలో సచివాలయం వైపునకు వెళ్లడం ప్రారంభించారు. హౌరా మైదాన్ నుంచి బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు తేజస్వీ సూర్య, రాష్ట్ర బీజేవైఎం అధ్యక్షుడు సౌమిత్ర ఖాన్ మార్చ్ ప్రారంభించారు. వారిని మాలిక్ గేట్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఘర్షణ చోటు చేసుకుంది. ఒక కార్యకర్త నుంచి బుల్లెట్లతో ఉన్న పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. బీజేపీ కార్యకర్తలు తమపై నాటు బాంబులు వేశారని పోలీసులు ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయంతన్ బసు నేతృత్వంలో సాగిన మార్చ్‌ను సాంత్రాగచి వద్ద పోలీసులు అడ్డుకోవడంతో, అక్కడా ఘర్షణ జరిగింది. పోలీసులతో ఘర్షణల్లో బీజేపీ నేత రాజు బెనర్జీ, ఎంపీ జ్యోతిర్మయి సింగ్ మహతో గాయపడ్డారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాస్ విజయ్‌వర్ఘీయ, జాతీయ ఉపాధ్యక్షుడు ముకుల్ రాయ్‌ల నేతృత్వంలో సాగిన చలో సెక్రటేరియట్ మార్చ్‌ను కోల్‌కతాలోని హాస్టింగ్స్–ఖిద్దర్‌పోర్ క్రాస్ రోడ్స్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, టీఎంసీ గూండాలు తమపై దాడి చేశారని విజయ్‌వర్ఘీయ ఆరోపించారు. దాదాపు వంద మందికి పైగా బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. బీజేవైఎం తలపెట్టిన మార్చ్‌కు అనుమతి లేదని పోలీసులు తెలిపారు. పశ్చిమ బెంగాల్లో ప్రజాస్వామ్యం లేదు పశ్చిమ బెంగాల్లో కొనసాగుతున్న తృణమూల్ కాంగ్రెస్ నియంతృత్వ పాలనకు చరమగీతం పాడుతామని బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదన్నారు. మమత సర్కారును సాగనంపాలని రాష్ట్ర ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారన్నారు. మమత బెనర్జీ అవినీతిమయ, హింసాత్మక, నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ కార్యకర్తలు పోరాటం కొనసాగిస్తారన్నారు. మమత పాలనకు బీజేపీ అంతం పలకడం ఖాయమన్నారు. ‘మమత తన సచివాలయాన్ని మూసివేసుకునేలా ధీరులైన మా బీజేవైఎం కార్యకర్తలు పోరాడారు. ఆమె ప్రజా విశ్వాసాన్ని కోల్పోయారనేందుకు ఇదే ఉదాహరణ’ అని నడ్డా ట్వీట్ చేశారు. రాజకీయ ప్రత్యర్థులను అణచివేసే విషయంలో మాత్రం గత వామపక్ష ప్రభుత్వం కన్నా మమత సర్కారు మెరుగ్గా ఉందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. లాఠీచార్జీలో గాయపడి, రోడ్డుపైనే పడిపోయిన ఓ కార్యకర్త -
భగ్గుమంటున్న అగ్రరాజ్యం
వాషింగ్టన్/మినియాపొలిస్: మినియాపొలిస్‌లో రాజుకున్న అశాంతి అగ్గి అమెరికాలోని ఇతర నగరాలకూ వ్యాపిస్తోంది. జార్జి ఫ్లాయిడ్ అనే ఆఫ్రికన్‌అమెరికన్‌ను శ్వేత జాతి పోలీసు అధికారులు పొట్టనబెట్టుకోవడంపై ఆగ్రహం పెల్లుబికింది. పోలీసులతో ఆందోళనకారులు బాహాబాహీకి దిగడంతో పాటు షాప్‌లు, ఆఫీస్‌లు, వాహనాలకు నిప్పుపెట్టారు. ఫ్లాయిడ్ మృతికి నిరసనగా వాషింగ్టన్లో ఆదివారం శాంతియుతంగా ప్రదర్శన జరిగింది. ఆందోళనకారులు అధ్యక్ష భవనం సమీపంలో చెత్త కుప్పకు నిప్పుపెట్టారు. న్యూయార్క్‌లో ఓ యువతి అరెస్ట్ దృశ్యం ఆందోళనలకు కేంద్ర బిందువైన మినియాపొలిస్‌లో పోలీస్‌స్టేషన్‌ను చుట్టుముట్టిన ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్, రబ్బర్ బుల్లెట్లను ప్రయోగించారు. నగరంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం 4 వేల నేషనల్ గార్డులను రంగంలోకి దించింది. ఇండియానాపొలిస్‌లో జరిగిన కాల్పుల్లో ఒకరు చనిపోయారు. రెండు రోజుల క్రితం డెట్రాయిట్, మినియాపొలిస్‌ల్లో జరిగిన ఘటనల్లోనూ ఇద్దరు మరణించారు. ఫిలడెల్ఫియాలో ఆందోళనకారుల దాడిలో 13 మంది పోలీసులు గాయపడగా నాలుగు పోలీసు వాహనాలు కాలిబూడిదయ్యాయి. న్యూయార్క్‌లో వీధుల్లోకి వచ్చిన ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు యత్నించడం కొట్లాటలకు దారి తీసింది. గురువారం నుంచి ఇప్పటి వరకు 22 నగరాల్లో 1,669 మందిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ఇందులో సగం అరెస్టులు లాస్ఏంజెలిస్లోనే జరిగాయి. లాస్ఏంజెలిస్ నగరంలో నిరసన కారులు భవనాలు, వాహనాలకు నిప్పుపెడుతుండటంతో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. అట్లాంటా, డెన్వెర్, లాస్ఏంజెలిస్, మినియాపొలిస్, శాన్ ఫ్రాన్సిస్కో, సియాటెల్ సహా 12కు పైగా నగరాల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. నా రెస్టారెంట్ కాలిపోయినా సరే.. మినియాపొలిస్ నిరసనలకు బంగ్లాదేశీయుడు, స్థానిక ‘గాంధీ మహల్ రెస్టారెంట్’ యజమాని రుహేల్ ఇస్లాం(44) మద్దతుగా నిలిచారు. మినియాపొలిస్ పోలీస్ ఆఫీస్ దగ్గర్లో ఇతన రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్‌కు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. ఆ రోజు జరిగిన ఘటనపై రుహేల్ కుమార్తె హఫ్సా (18) ఫేస్బుక్లో పెట్టిన పోస్టు అందరి ప్రశంసలు అందుకుంటోంది. ‘ఆ రోజు నాన్న పక్కనే కూర్చుని టీవీలో వార్తలు చూస్తున్నా. నాన్న ఎవరితోనో ఫోన్లో.. నా బిల్డింగ్‌ను తగలబడనివ్వండి. బాధితులకు మాత్రం న్యాయం దక్కాలి. బాధ్యులను జైల్లో పెట్టాలి..అని అంటుండగా విన్నాను. మాకు నష్టం జరిగినా సరే, పొరుగు వారికి సాయంగా, బాసటగా నిలవాలన్న మా సంకల్పం ఏమాత్రం సడలదు’ అని అందులో హఫ్సా పేర్కొంది. -
మాకు కరోనా సోకుతుంది.. శవాన్ని తీసుకురావొద్దు
చండీగఢ్ : కరోనా సోకిందేమో అన్న అనుమానంతో గ్రామస్తులు ఓ మహిళ అంత్యక్రియలు అడ్డుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి సర్ధిచెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో వారిపై లాఠీచార్జ్ ప్రయోగించారు. పంజాబ్‌లోని అంబాల కంటోన్మెంట్ సమీపంలోని చంద్‌పురా గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సోమవారం ఓ మహిళ శ్వాసకోస సమస్యలతో బాధపడుతూ సోమవారం కన్నుమూసింది. దహనసంస్కారాల నిమిత్తం బందువులు మృతదేహాన్ని శ్మశానానికి తీసుకెళ్తుండగా, అక్కడి స్థానికులు అడ్డుకున్నారు. కరోనా సోకి చనిపోయివుండొచ్చనే అనుమానంతో అడ్డుతగిలారు. దీంతో మృతురాలి బంధువులు పోలీసులను ఆశ్రయించగా రంగంలోకి దిగిన పోలీసులు గ్రామస్తులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ముందు జాగ్రత్త చర్యగా కోవిడ్ పరీక్షల కోసం నమూనా సేకరించినట్టు ఆసుపత్రి వర్గాలు సైతం చెప్పాయని పేర్కొన్నారు. అయినప్పటికీ గ్రామస్తులు వినకపోవడంతో పరిస్థితిని అదుపుచేసేందుకు స్వల్పంగా లాఠీచార్జ్ చేయాల్సి వచ్చిందని పోలీస్ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. ఎట్టకేలకు మృతురాలి దహన సంస్కారాలు జరిపించామని అంబాలా పోలీసు సూపరింటెండెంట్ అభిషేక్ జోర్వాల్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పలువురిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. -
‘కేసీఆర్ సూచనతోనే విద్యార్థులపై లాఠీచార్జ్’
సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ముట్టడికి యత్నించిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్రంగా తప్పుపట్టారు. పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని, దీన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం పరాయి పాలనలో ఉన్నట్టు ఉందని, ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సూచన మేరకే పోలీసులు లాఠీచార్జ్ చేశారన్నారు. విద్యార్థులను బూట్లతో తన్నారని.. జంతువుల మీద కూడా ఇంత కఠినంగా వ్యవహరించరని మండిపడ్డారు. విద్యార్థుల వల్లనే తెలంగాణ వచ్చిందని.. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న పదవులు వారి వల్లేనని వ్యాఖ్యానించారు. (సీఎం కేసీఆర్ రాజీనామా చేస్తారా?) ప్రగతిభవన్ గేటు కూడా దాటలేరు తొమ్మిది యూనివర్సిటీల్లో అసలు వీసీలే లేరని ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. డిమాండ్ల సాధన కోసం వాళ్లు ధర్నా చేశారని తెలిపారు. విద్యార్థులను తక్కువ అంచనా వేయకూడదని హితవు పలికారు. ఇక ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ఇద్దరు బడా పారిశ్రామిక వేత్తలు రూపొందించారని విమర్శించారు. త్వరలోనే కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం అవుతారని వ్యాఖ్యానించారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ.. విద్యార్థుల బలిదానాల వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. కానీ ఇప్పుడు వారిపైనే లాఠీచార్జ్ చేస్తూ పోలీసులు వ్యవహరించిన తీరు దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన పోలీసులపై హత్యాయత్న కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు తలుచుకుంటే సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ గేట్ కూడా దాటలేరని విమర్శించారు. (అసెంబ్లీ ముట్టడికి ఏబీవీపీ యత్నం) చదవండి: బీజేపీ అధ్యక్ష పదవికి నేనంటే నేనే.. -
‘జామియా’ లాఠీచార్జీ వీడియో లీక్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జీ చేసిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. జామియా సమన్వయ కమిటీ (జేసీసీ) విడుదల చేసిన ఈ వీడియోలో.. గత డిసెంబర్ 15న పారామిలటరీ, పోలీసు సిబ్బంది లైబ్రరీలో విద్యార్థులను కొడుతున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. 48 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో 8 మంది భద్రతా సిబ్బంది పాత రీడింగ్ హాల్లోకి వచ్చి విద్యార్థులను కర్రలతో కొడుతున్నట్లు ఉంది. ఈ సందర్భంగా పారామిలటరీ, పోలీసు సిబ్బంది కనబడకుండా ఉండేందుకు ముఖాలకు చేతిరుమాలును కట్టుకున్నారు. ఈ వీడియోపై విచారణ జరుపుతున్నట్లు ప్రత్యేక పోలీస్ కమిషనర్ ప్రవీర్ రంజన్ తెలిపారు. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా వర్సిటీలో తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తడం, పోలీసులు క్యాంపస్‌లోకి ప్రవేశించి లాఠీచార్జీ చేయడం తెలిసిందే. -
కొట్టరాని చోటా కొట్టారు
న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ విద్యార్థులు చేప్టటిన నిరసనల్లో హింస చోటుచేసుకుంది. పార్లమెంటు వద్దకు ర్యాలీగా వెళుతూ నిరసనలు తెలిపేందుకు విద్యార్థులకు పోలీసులు అనుమతి ఇవ్వకపోయినప్పటికీ.. విద్యార్థులు ర్యాలీగా బయలుదేరారు. అయితే పోలీసులు వారిని బారికేడ్లతో అడ్డుకున్నారు. మరిన్ని బలగాలను రప్పించి విద్యార్థులను కట్టడి చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు తమపై లాఠీచార్జీ చేశారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. బెల్టు కింది భాగంలో లాఠీలతో కొట్టారని, కాళ్లకేసి కొట్టారని చెప్పారు. అంతేగాక బారికేడ్ల వద్ద ముందు వరుసలో ఉన్న వారి మర్మావయవాలపై పోలీసులు దాడి చేశారని, ఇందులో ఓ విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయని విద్యార్థులు ఆరోపించారు. కొంత మందిని గొంతుపట్టుకొని ఊపిరి ఆడకుండా చేశారని చెప్పారు. దీంతో పలువురు నిరసనల అనంతరం 20 మంది విద్యార్థులు ఆస్పత్రిలో చేరారు. అందులో ఎనిమిది మందికి వైద్యులు చికిత్స చేసి ఇంటికి పంపారని, ఈ 8 మందిలో 5 మంది అమ్మాయిలే ఉన్నారని విద్యార్థులు చెప్పారు. -
లాఠీఛార్జ్‌ని ఖండించిన వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: ఏపీకి ప్రత్యేకహోదాతో పాటు, విభజన హామీలు నెరవేర్చాలంటూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ప్రత్యేక హోదా సాధన సమితి ధర్నా నిర్వహించిన విషయం తెలిసిందే. వామపక్ష పార్టీల నాయకులతో పాటు, పలు విద్యార్థి సంఘాల నాయకులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. అయితే ప్రత్యేక హోదా కోసం శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తీవ్రంగా ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం ఢిల్లీలో ధర్నా చేసిన ప్రత్యేక హోదా సాధన సమితి, ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలపై లాఠీచార్జ్, అరెస్టులను ఆయన ఖండించారు. ఢిల్లీలో ఉన్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుకు ఫోన్ చేసి మాట్లాడారు. ఉద్యమ కారులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా వైఎస్ జగన్ తెలిపారు. -
పోలీసు లాఠీలకు ఓటరు బలి
మన్ననూర్ (అచ్చంపేట): పోలీసులు అత్యుత్సాహంతో చేసిన లాఠీచార్జిలో గాయపడిన ఓ గిరిజన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ ఉమామహేశ్వర కాలనీకి చెందిన చందూ నాయక్ (40) భార్య, ముగ్గురు పిల్లలతో కలసి హైదరాబాద్‌లో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓటు వేసేందుకు శుక్రవారం ఆయన కుటుంబంతో కలసి గ్రామానికి వచ్చాడు. ఆయన ఓటు వేసేందుకు ఉదయం పోలింగ్ కేంద్రానికి ఆయన వచ్చిన సమయంలో... గ్రామంలో ఘర్షణ వాతావరణం నెలకొందని ఓ ప్రధాన పార్టీ నాయకుడు పోలీసులకు తప్పుడు సమాచారం చేరవేశాడు. దీంతో సీఐ లాఠీచార్జికి ఆదేశాలు జారీ చేయగా.. సివిల్ పోలీసులతో పాటు స్పెషల్ పార్టీ పోలీసులు అక్కడ ఉన్నవారిపై లాఠీచార్జి చేశారు. ఈ ఘటనలో పోలీసులు సుమారు 20 మంది ఓటర్లను చితకబాదారు. వీరిలో కొందరికి స్వల్ప గాయాలు కాగా చందూ నాయక్‌తో పాటు జెన్కో ఉద్యోగి వెంకటయ్య కూడా తీవ్రంగా గాయపడ్డారు. చందూను ఆస్పత్రికి తరలించగా.. మూత్రపిండాలు దెబ్బతిన్నాయంటూ వైద్యులు చికిత్స ప్రారంభించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం ఆయన మృతి చెందాడు. -
బనారస్ వర్సిటీలో హింస
వారణాసి/లక్నో: ఈవ్ టీజింగ్ ఘటనకు నిరసనగా బనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ)లో విద్యార్థులు శనివారం రాత్రి చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. పోలీసులు లాఠీచార్జీ చేయడంతో పలువురు విద్యార్థులు, ఇద్దరు జర్నలిస్టులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిలో విద్యార్థినులు కూడా ఉన్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని డివిజినల్ కమిషనర్‌ను ఆదేశించారు. ‘గత గురువారం చోటుచేసుకున్న ఈవ్ టీజింగ్ ఘటనపై ఆందోళన చేపట్టిన విద్యార్థులు వర్సిటీ వైస్ చాన్స్‌లర్‌ను ఆయన నివాసంలో కలిసేందుకు శనివారం రాత్రి యత్నించారు. దీంతో వీసీ నివాస సెక్యూరిటీ గార్డులు పోలీసులకు సమాచారమిచ్చి, విద్యార్థులను నిలిపేశారు. అయినా వినకుండా లోనికి వెళ్లేందుకు విద్యార్థులు విఫల యత్నం చేశారు. ఆ సమయంలో విద్యార్థులతో కలసిపోయిన బయటి వ్యక్తులు రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు’ అని పోలీసు, వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఘర్షణలో పోలీసులకు కూడా గాయాలయ్యాయని పోలీసు అధికారులు తెలిపారు. తాజా ఘటన నేపథ్యంలో సోమవారం నుంచి అక్టోబర్ 2 వరకు యూనివర్సిటీ సెలవులు ప్రకటించింది. విద్యార్థినులపై లాఠీచార్జీని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఖండించారు. బీజేపీ దృష్టిలో బేటీ బచావో, బేటీ పడావో అంటే ఇదేనా అంటూ ఎద్దేవా చేశారు. -
‘గ్యాస్’ మంటలు
తంజావూరు జిల్లా కదిరిమంగళం గ్రామ పంట పొలాల్లో ఏడుచోట్ల ఓఎన్జీసీ బావులను ఏర్పాటుచేసి క్రూడాయిల్ తోడే పనులు జరుగుతున్నాయి. ఈ దశలో శుక్రవారం సాయంత్రం బావికి అడుగుభాగంలో అమర్చిన పైప్‌లైన్‌కు పగుళ్లు ఏర్పడగా క్రూడాయిల్ లీకై పంట పొలాల్లో ప్రవహించింది. దీంతో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు క్రూడాయిల్ వెలికతీత పనులు నిలిపివేయాలని రాస్తారోకో చేపట్టారు. ఓఎన్జీసీ ఉద్యోగులను వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో ఆందోళకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో క్రూడాయిల్ లీకవుతున్నచోట కొందరు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. పెద్దఎత్తున మంటలు రేగడంతో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు. ఈ దుశ్చర్యకు కారకులైన కొందరు ఆందోళనకారులను అరెస్ట్‌చేసి జైళ్లలో పెట్టారు. అరెస్టులకు నిరసనగా శనివారం గ్రామంలో దుకాణాలను మూసివేశారు. ఐదు వందల మందికి పైగా పోలీసులు గ్రామంలో పహారా కాస్తున్నారు. గ్రామాల్లో శాంతి సామరస్యాన్ని కాపాడాల్సిన అధికారులు సాయుధ పోలీసులతో లాఠీచార్జ్ జరిపించడమా అని విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉండగా, తంజావూరు జిల్లా కలెక్టర్ అన్నాదురై శనివారం ఉదయం 10 గంటలకు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఓఎన్జీసీ సమస్యపై ప్రజలతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ప్రజల కోర్కెను తప్పక నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఓన్ఎజీసీ బావుల వల్ల ప్రజలకు ఎటువంటి నష్టం కలుగకుండా చూస్తామని చెప్పారు. క్రూడాయిల్ ప్రవహించిన ప్రాంతంలో వందురోజుల ఉపాధి పథకాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీసుల వలయంలో మెరీనా తంజావూరు గ్రామంలో పోలీసుల జరిపిన లాఠీ చార్జ్‌కి, అరెస్టులకు నిరసనగా ఆందోళనకారులకు సంఘీభావం తెలుపుతూ చెన్నై మెరీనా బీచ్‌లో దీక్షలు చేపట్టాలని కొన్ని యువజన సంఘాలు నిర్ణయించుకున్నాయి. పోలీసులకు శుక్రవారం రాత్రి ఈ సమాచారం అందింది. జల్లికట్టు తరహాలో ఉద్యమాన్ని చేపట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచాలని యువకులు సిద్ధం కావడంతో ఆందోళన చెందిన పోలీసు శాఖ రాత్రికి రాత్రే మెరీనా బీచ్‌ను తన అదుపులోకి తీసుకుంది. సుమారు 200 మంది పోలీసులు మెరీనా బీచ్ రోడ్డులోని లైట్‌హౌస్ నుంచి నెప్పియార్ బ్రిడ్జి వరకు బందోబస్తు చేపట్టారు. షిప్టు పద్ధతిలో 24 గంటలపాటూ బందోబస్తు కొనసాగనుంది. నగర పౌరులు ప్రతిరోజూ ఉదయాన్నే మెరీనాబీచ్ సర్వీసు రోడ్డులో వాహనాలను పార్కింగ్ చేసి జాగింగ్ చేయడం పరిపాటి. అయితే ఓఎన్జీసీ ఆందోళన నేపధ్యంలో వాహనాలను అనుమతించలేదు. దీంతో లైట్‌హౌస్ సమీపంలోని వాలాజా రోడ్డులో వాహనాలను నిలిపి జాగింగ్ చేశారు. -
హుస్నాబాద్‌లో పోలీసుల లాఠీచార్జి
హుస్నాబాద్: కరీంనగర్ జిల్లా హుస్నాబాద్, కోహెడ మండలాలను సిద్ధిపేటలో కలపవద్దంటూ ప్రజలు ఆందోళనకు దిగారు. సిద్ధిపేటలో కలపడాన్ని నిరసిస్తూ పట్టణంలో ప్రజలు ర్యాలీ తీశారు. పలుచోట్ల పోలీసులకు ప్రజలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. -
లాఠీచార్జిని ఖండిస్తున్నాం: అంబటి
హైదరాబాద్: చిత్తూరు జిల్లాలో ఆర్టీసీ కార్మికులపై లాఠీచార్జి చేయడాన్ని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఖండించారు. న్యాయబద్దమైన హక్కుల కోసం పోరాడితే లాఠీచార్జి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. చిత్తూరులో సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులపై పోలీసులు విచక్షణారహితంగా లాఠీచార్జి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. -
ఆర్టీసీ కార్మికులను చావబాదారు
చిత్తూరు: తమ డిమాండ్ సాధన కోసం సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులపై ఏపీ పోలీసులు లాఠీలు ఝుళిపించారు. బస్సు డిపోల ఎదుట శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తున్న ఆర్టీసీ కార్మికులను చెదరగొట్టేందుకు లాఠీచార్జి చేశారు. విచక్షణారహితంగా బాదారు. వెంటాడి మరీ కార్మికులను కొట్టారు. మహిళలు అని కూడా చూడకుండా చావబాదారు. లాఠీచార్జితో మనస్థాపం చెంది ఉష అనే మహిళా కండక్టర్ ఆత్మహత్యయత్నం చేసింది. ఆమెను వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసుల లాఠీచార్జిని ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు ఖండించారు. -
తిరుపతిలో పోలీసులు లాఠీఛార్జీ
తిరుపతి: నగరంలోని ఓ ప్రైవేట్ కాలేజీలో నిబంధనలకు విరుద్ధంగా ఇంటర్ విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తుండటంపై అటు విద్యార్థులు, ఇటు విద్యార్ధి సంఘాలు ఆందోళనకు దిగాయి. దాంతో పోలీసులు కళాశాల వద్దకు చేరుకుని... విద్యార్థులను ఆందోళన విరమించాలని కోరారు. అందుకు వారు ససేమిరా అనడంతో పోలీసులకు వారికి మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో పోలీసులు ఆందోళనకారులపై లాఠీచార్జ్ చేశారు. అయినా తాము ఇక్కడి నుంచి కదలే ప్రసక్తి లేదని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
రైతన్నలపై లాఠీ
* కరెంటు కోతలపై అన్నదాతల రాస్తారోకో * లాఠీలతో విరుచుకుపడిన పోలీసులు * పలువురు రైతులకు తీవ్రగాయాలు * సీఎం సొంత జిల్లాలోనే ఘటన * ప్రజా సంఘాలు, రైతు సంఘాల మండిపాటు * ఇతర జిల్లాల్లోనూ భారీగా ఆందోళనలు * సబ్స్టేషన్ల ముట్టడి, సిబ్బంది నిర్బంధం (సాక్షి నెట్వర్క్): కరెంట్ కోసం ఆందోళనకు దిగిన అన్నదాతలపై పోలీసులు ప్రతాపం చూపించారు. విచక్షణారహితంగా లాఠీలు ఝుళిపించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా మెదక్‌లో చోటుచేసుకున్న ఈ లాఠీచార్జ్‌లో అనేకమంది రైతులు గాయపడ్డారు. జిల్లాలో నాలుగు రోజులుగా విద్యుత్ కోతలు ఎక్కువయ్యాయి. రోజుకు రెండు గంటలు కూడా కరెంట్ ఇవ్వకపోవడంతో పంటలు ఎండుతున్నాయన్న ఆవేదనతో రైతులు సోమవారం పలుచోట్ల ఆందోళన చేపట్టారు. చేగుంట మండలం నార్సింగిలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఉదయం 8 గంటల నుంచే రాస్తారోకోకు దిగారు. దాదాపు నాలుగు గంటల పాటు ఇది కొనసాగింది. సమీపంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు ఇందులో పాల్గొన్నారు. రోడ్డు మీద టైర్లు వేసి నిప్పు పెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే సమయంలో సహనం కోల్పోయిన రామాయంపేట సీఐ గంగాధర్, ఆయన వెంట వచ్చిన ప్రత్యేక పోలీసు బలగాలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. చేతికి దొరికిన నారాయణ అనే రైతును చావబాదారు. అతని తలకు తీవ్రమైన గాయమైంది. వల్లబోయిని శ్రీను, ఇక్బాల్‌తో పాటు మరికొందరు రైతులకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో కోపోద్రిక్తులైన అన్నదాతలు ఎదురుతిరిగారు. రైతుల ధాటికి తట్టుకోలేక సీఐ గంగాధర్ తప్పించుకుని పారిపోతుండగా పోలీసు వాహనం టైర్లలో గాలిని తీసేశారు. వాహనాలను వెళ్లనీయకుండా రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మెదక్ ఆర్డీవో వనజాదేవి సంఘటన స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు శాంతించలేదు. ఆమె వాహనానికి అడ్డుగా నిలిచారు. తమపై లాఠీచార్జి చేసిన సీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులంతా సబ్‌స్టేషన్ వద్దకు వస్తే విద్యుత్ సమస్యపై చర్చిస్తానని, ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తానని ఆర్డీవో హామీ ఇవ్వడంతో కాస్త శాంతించి రాస్తారోకో విరమించారు. పలు ప్రజా సంఘాలతోపాటు యువజన సంఘాలు, రైతు సంఘాల నాయకులు పోలీసుల చర్యను ఖండించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై లాఠీచార్జి చేసిన సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇతర జిల్లాల్లోనూ నిరసనలు కరెంటు కోతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇతర జిల్లాల్లోనూ రైతులు రోడ్డెక్కారు. నల్లగొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లలో ఆందోళనలు, రాస్తారోకోలు, నిర్బంధాలకు దిగారు. నల్లగొండ జిల్లా తుర్కపల్లి సబ్‌స్టేషన్ గదికి తాళాలు వేసి, ఏఈని చుట్టుముట్టి నిలదీశారు. మోత్కూరులోనూ సబ్‌స్టేషన్, ఏఈ కార్యాలయంపై దాడి చేశారు. రోడ్డుపై ట్రాక్టర్లను అడ్డుగా నిలిపి రాస్తారోకో నిర్వహించారు. వలిగొండ సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా చేసి, సిబ్బందిని నిర్బంధించారు. సంస్థాన్ నారాయణపురంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆరుతడి పంటలపై అవగాహన సదస్సును అడ్డుకున్నారు. చిట్యాల మండలం వట్టిమర్తి, వనిపాకల, గుమ్మలబావి గ్రామాలకు చెందిన రైతులు రామన్నపేట సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. బొమ్మలరామారం మండలంలోని సోలిపేట్ సబ్‌స్టేషన్ సిబ్బందిని నిర్బంధించారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మిర్యాలగూడ ట్రాన్స్‌కో డీఈ కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. భూదాన్‌పోచంపల్లి మండలంలోని కనుముకుల, వంకమామిడి, ధర్మారెడ్డిపల్లి, దంతూర్, జిబ్లక్‌పల్లి గ్రామాలకు చెందిన 300 మంది రైతులు పోచంపల్లి చౌరస్తాలో ధర్నా చేశారు. తిరుమలగిరి సబ్ స్టేషన్ ఎదుట వివిధ గ్రామాల రైతులు మూడు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. ఇక మహబూబ్‌నగర్ జిల్లాలో బిజినేపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించి కార్యాలయానికి తాళం వేశారు. ఈ నిరసనలో పాల్గొన్న పాలెం గ్రామానికి చెందిన సొప్పరి బాలస్వామి అనే రైతు పురుగు మందు డబ్బాతో కలకలం సృష్టించాడు. అయిజ, వడ్డేపల్లి మండలాలకు చెందిన రైతులు అయిజ విద్యుత్ సబ్ స్టేషన్‌ను ముట్టడించారు. పలువురు రైతులు పురుగుమందు డబ్బాలను చేతబట్టుకుని ఆందోళనకు దిగారు. కర్నూలు ప్రధాన రహదారిపై ముళ్లకంచె వేసి రాస్తారోకో చేపట్టారు. గోపాల్పేట మండలం బుద్దారంలోనూ ఇదే రకమైన ఆందోళన కొనసాగింది. మరోవైపు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం కల్లెడిలో సబ్‌స్టేషన్‌పై రైతులు దాడి చేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. భీమ్‌గల్ మండలం కుప్కల్లో సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. మోర్తాడ్ మండలంలోని వడ్యాట్ రైతులు సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండలం లక్ష్మాపూర్, బీర్కూరు మండలం నస్రుల్లాపూర్ గ్రామాల్లో ఆందోళన చేశారు. పిట్లం మండలం తిమ్మానగర్, కొడప్గల్, బిచ్కుందలలోనూ నిరసన తెలియజేశారు. కామారెడ్డి నియోజకవర్గం దోమకొండ మండలం బీబీపేటలో ధర్నా నిర్వహించారు. భిక్కనూరు, మాచారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట, ఎల్లారెడ్డి మండలాల్లో రైతులు రాస్తారోకోలు చేపట్టారు. కాగా, దోమకొండ మండలంలో పర్యటించిన వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి స్థానిక రైతులు తమ గోడు వెల్లడించారు. కోతలు లేకుండా చూస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. రైతులు రోడ్లపైకి రావొద్దు: పోచారం రైతులు రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగించవద్దని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కోరారు. కరెంట్ సమస్యను రాజకీయం చేసే శక్తుల మాయలో పడవద్దని విజ్ఞప్తిచేశారు. థర్మల్‌విద్యుత్ ఉత్పాదనలో ఇబ్బందులు తలెత్తడంతో రెండురోజులుగా రైతులకు సరిగ్గా కరెంట్‌ను ఇవ్వలేకపోయామన్నారు. ఇప్పుడు సమస్య పరిష్కారమైనందున కరెంట్ సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మెదక్జిల్లాలో రైతులపై పోలీసులు లాఠీచార్జి చేయడం బాధ కలిగించిందని దాన్ని ఖండిస్తున్నామన్నారు. సోమవారం సచివాలయం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని, ఈ విషయంలో సీఎం కేసీఆర్ జోక్యంచేసుకుని కరెంట్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారని’ అన్నారు. కరెంట్ అడిగితే కొడతారా: పొన్నాల మెదక్ జిల్లా రైతాంగంపై పోలీసుల లాఠీచార్జ్ అమానుషమని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. కరెం ట్ సరఫరా చేయాలని ఆందోళన చేస్తే లాఠీలతో జవాబిస్తారా? అని ఆయన సోమవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో ఒక్క రైతుపైనా దాడి జరగలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రెండు నెలల కేసీఆర్ పాలనలో 120 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. మూడు రోజుల్లోనే ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. అన్నదాతల ఆత్మహత్యలు రాష్ట్రానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదన్నారు. పోలీసు కొత్త వాహనాల కొనుగోలుకు రూ.వందల కోట్లు కేటాయించడంతోపాటు వాటిని పరిశీలించేందుకు గంటల కొద్ది సమయం వెచ్చించిన కేసీఆర్.. రైతుల సమస్యలపై పదినిమిషాలు సమయం కేటాయించినా ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. లాఠీచార్జి అమానుషం: కిషన్‌రెడ్డి కరెంటు కోతలను నిరసిస్తూ రోడ్డెక్కిన రైతులపై లాఠీచార్జి చేయడం అమానుషమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా పిట్లం, మెదక్ జిల్లా చేగుంటల్లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు అకారణంగా లాఠీచార్జి చేసి కేసులు పెట్టడాన్ని ఓ ప్రకటనలో ఆయన ఖండించారు. వారిపై బనాయించిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలని, నిరంతర విద్యుత్తు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఎంసెట్ కౌన్సిలింగ్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వును యథాతథంగా అమలు చేయాలని కిషన్‌రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. ఇప్పటికే జాప్యం జరిగినందున సత్వరమే ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. లాఠీదెబ్బలు తినడానికేనా తెలంగాణ?: షబ్బీర్‌అలీ మెదక్‌లో విద్యుత్‌కోతలపై ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసుల లాఠీచార్జ్‌ను శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత షబ్బీర్‌అలీ తీవ్రంగా ఖండించారు. తెలంగాణ కోసం పోరాడిన రైతాంగానికి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చే బహుమతి ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. సీఎల్పీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నాలుగైదు రోజులుగా కరెంట్ రాక పొలాలు ఎండిపోతుంటే రైతులు రోడ్డెక్కారు. అయినా పట్టని కేసీఆర్ ప్రభుత్వం విందులు, వినోదాలతో జల్సా చేసుకుంటోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుపు కోసం టీఆర్ఎస్ నేతలు మంతనాలు చేస్తున్నారు. తెలంగాణ సాధించుకున్నది లాఠీదెబ్బలు తినడానికేనా?’అని షబ్బీర్‌అలీ మండిపడ్డారు. -
లాఠీచార్జిపై మంత్రి సీరియస్
సంగారెడ్డి మున్సిపాలిటీ : చేగుంట మండలం నార్సింగ్ వద్ద రైతులపై జరిగిన లాఠీచార్జి ఘటనపై సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి హరీష్‌రావు తీవ్రంగా స్పందించారు. దీనిపై ఇన్చార్జి కలెక్టర్ శరత్‌ను విచారణ జరపాలని ఆదేశించారు. ఈ మేరకు మెదక్ ఆర్డీవో వనజాదేవి విచారణ జరిపి అందజేసిన నివేదిక ఆధారంగా చేగుంట విద్యుత్‌శాఖ సహాయ ఇంజనీర్ పెంట్యానాయక్‌ను సస్పెండ్‌చేస్తూ శరత్ ఉత్తర్వులు జారీ చేశారు. రామాయంపేట అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ అధికారి శ్రీనివాస్‌రెడ్డిని బదిలీ చేయాలని ట్రాన్స్‌కో ఎస్ఈకి సిఫార్సు చేశారు. విద్యుత్ సరఫరాపై రైతులకు వాస్తవ పరిస్థితులు తెలియజేయడంలో ఏఈ విఫలమయ్యారని, రైతులకు అందుబాటులో లేరని ఆర్డీవో విచారణలో తేలిందని శరత్ తెలిపారు. ఏడీఈ సైతం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తెలిపారు. ఆర్డీవో నివేదికఆధారంగా ఏఈని సస్పెండ్ చేసినట్టు చెప్పారు. జిల్లాలో విద్యుత్ శాఖ ఏఈలు, ఏడీఈలు విద్యుత్ సరఫరాను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి రైతులకు కనీసం 6 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించారు. జిల్లాలో పారిశ్రామికరంగానికి విద్యుత్ కోతను విధించైనా రైతులకు మెరుగైన విద్యుత్‌సరఫరా చేయాలని ఆ శాఖ ఎస్ఈని ఇన్చార్జి కలెక్టర్ ఆదేశించారు. అంతకుముందు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఉన్నతాధికారులు ఇన్చార్జి కలెక్టర్‌తో విద్యుత్ సరఫరాపై సమీక్షించినట్టు సమాచారం. -
'వారిది న్యాయమైన పోరాటం'
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులపై లాఠీచార్జ్‌ను కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీలు మధుయాష్కీ, వివేక్, రాజయ్య, పొన్నం ప్రభాకర్ ఖండించారు. ఉద్యోగాల కోసం విద్యార్ధుల చేస్తున్నది న్యాయమైన పోరాటమని సమర్థించారు. ఇంటికో ఉద్యోగమన్న హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఓయూ విద్యార్ధుల పోరాట ఫలితంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిందన్న వాస్తవాన్ని టీఆర్ఎస్ నాయకులు మర్చిపోరాదని అన్నారు. తమకు ఉద్యోగాలు రావన్న విద్యార్ధుల ఆందోళనపై టీఆర్ఎస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల పర్మినెంట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. -
అంగన్వాడీలపై లాఠీచార్జి అమానుషం
బద్వేలుఅర్బన్ , తమ న్యాయమైన సమస్యలు తీర్చాలంటూ హైదరాబాద్‌లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై పోలీ సులు లాఠీచార్జి చేయడం అమానుషమని సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు వీరశేఖర్ పేర్కొన్నారు. అంగన్వాడీలపై జరిగిన లాఠీచార్జిని నిరసిస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక నాలుగు రోడ్ల కూడలిలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీలు ఎంతో దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నా ప్రభుత్వంగుడ్డిగా వ్యవహరించడం దారుణమన్నారు. 6 నెలల నుంచి ఇప్పటివరకు పెంచిన జీతభత్యాలు ఇవ్వలేదని వాపోయారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు ప్రభాకర్‌రెడ్డి, వెంకటేష్, చాంద్‌బాష, వెంకటరమణ, వెంకటపతి, చిన్ని తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీ కార్యకర్తలపై లాఠీ చార్జ్
అంగన్వాడీ కార్యకర్తలు తమ డిమాండ్ల పరిష్కారం కోసం మంగళవారం బేగంపేటలోని సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించారు. తమ డిమాండ్ల పరిష్కారం కోసం వెంటనే చర్యలు చేపట్టాలని కార్యకర్తలు ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం కిరణ్‌ను కలసేందుకు తమకు అనుమతి ఇవ్వాలని అంగన్వాడీ కార్యకర్తలు సీఎం కార్యాలయం సిబ్బందికి విజ్ఞప్తి చేశారు. అందుకువారు సమ్మతించకపోవడంతో పోలీసులకు, అంగన్వాడీ కార్యకర్తలు మధ్య తీవ్ర తోపులాట చేసుకుంది. దాంతో పోలీసులు అంగన్వాడీ కార్యకర్తలపై లాఠీ చేశారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఇటీవలే అంగన్వాడీ కార్యకర్తలు నగరంలోని ఇందిరా పార్క్‌వద్ద నిరవధిక నిరాహరదీక్ష చేపట్టారు. ఆ దీక్షను పోలీసులు భగ్నం చేసిన సంగతి తెలిసిందే.