Agneepath Scheme: Violent Protests Continue Across the Country - Sakshi
Sakshi News home page

Agneepath Scheme: దేశమంతటా ‘అగ్ని’గుండం

Published Sat, Jun 18 2022 1:56 AM | Last Updated on Sat, Jun 18 2022 10:30 AM

Agneepath Scheme: Violent protests continue across in the country - Sakshi

పట్నాలోని దానాపూర్‌ స్టేషన్‌లో అగ్నికీలల్లో బోగీలు, మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో అగ్నికి ఆహుతవుతున్న బస్సులు

ఢిల్లీ: సైనిక దళాల్లో నియామకాలకు కేంద్రం తీసుకొచ్చిన కొత్త పథకం అగ్నిపథ్‌ రాజేసిన అగ్గి కార్చిచ్చుగా మారి దేశమంతటినీ కమ్మేసింది. పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా యువత చేపట్టిన నిరసనలు, ఆందోళనలు శుక్రవారం మూడో రోజు తారస్థాయికి చేరాయి. రైల్వేస్టేషన్లను ముట్టడించడం, హైవేలను దిగ్బంధించడంతో పాటు చాలాచోట్ల హింసాకాండ కూడా చోటుచేసుకుంది.

బిహార్, యూపీ మొదలుకుని పశ్చిమ బెంగాల్, ఒడిశా, మధ్యప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ... ఇలా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటాయి. కోపోద్రిక్తులైన యువకులు పలు రాష్ట్రాల్లో 7 రైళ్లకు, వందలాది వాహనాలకు నిప్పుపెట్టారు. గంటల తరబడి రోడ్లపై, పట్టాలపై బైఠాయించారు. రైళ్లు, బస్సులు, ఇతర వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. వాటిపైకి రాళ్లు రువ్వారు. ప్రభుత్వ ఆస్తులతో పాటు టోల్‌ ప్లాజాలను కూడా ధ్వంసం చేశారు.

పలుచోట్ల రైల్వేస్టేషన్లలో విధ్వంసానికి పాల్పడ్డారు. బిహార్లో ఉప ముఖ్యమంత్రితో పాటు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుని నివాసాలపై దాడికి దిగారు. బీజేపీకి, కేంద్రానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిపారు. ‘అగ్నిపథ్‌ను వెనక్కు తీసుకోవాలి’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. లాఠీచార్జీలో వందలాది మంది గాయపడ్డారు. యువత భవిష్యత్తును అంధకారంగా మార్చే ఈ పథకాన్ని తక్షణం వెనక్కు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్‌ చేశాయి. ఆందోళనలు, విధ్వంసాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 200కు పైగా రైళ్లు రద్దయ్యాయి.

300 పై చిలుకు రైళ్ల రాకపోకలు ప్రభావితమయ్యాయి. చాలాచోట్ల ఇంటర్నెట్, ఎస్‌ఎంఎస్‌ వంటి సేవలను నిలిపేయాల్సి వచ్చింది. యువతను శాంతింపజేసేందుకు కేంద్రం హుటాహుటిన రంగంలోకి దిగినా పెద్దగా ఫలితం కనిపించలేదు. అగ్నిపథ్‌ అన్నివిధాలా ఆలోచించి రూపొందించిన పథకమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వివరించారు. పైగా దీనికింద సైనిక దళాల్లో చేరేందుకు గరిష్ట వయో పరిమితిని ఈ ఏడాదికి 23 ఏళ్లకు పెంచడం యువతకు సువర్ణావకాశమని వారన్నారు.

నాలుగేళ్ల సర్వీసు అనంతరం పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలు, ప్రైవేటు రంగంలో చక్కని ఉద్యోగావకాశాలు ఉంటాయని చెప్పారు. అయినా యువత శాంతిస్తున్న సూచనలు గానీ, ఆందోళనలు తగ్గుముఖం పడుతున్న జాడలు కానీ కన్పించడం లేదు. పైగా అగ్నిపథ్‌ నియామకాలకు అతి త్వరలో శ్రీకారం చుడుతున్నట్టు ర్రివిధ దళాధిపతులు ప్రకటించిన నేపథ్యంలో ఆందోళనలు మరింతగా పెరిగేలా కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అగ్నిపథ్‌ పథకంపై శనివారం త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్‌ సమావేశమై చర్చించే అవకాశముందని తెలుస్తోంది.

యూపీ, బెంగాల్, ఒడిశాల్లో...
యూపీలో కనీసం 17 నగరాల్లో భారీ ఆందోళనలు జరిగాయి. బలియాలో రాష్ట్ర రవాణా మంత్రి క్యాంపు కార్యాలయంపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఓ రైలుకు నిప్పు పెట్టారు. అలీగఢ్‌ వద్ద హైవేపై పలు బస్సులపై రాళ్లు రువ్వారు. వారణాసి, ఫిరోజాబాద్, అమేథీ తదితర చోట్ల పలు రైళ్లపై దాడికి పాల్పడటంతో పాటు రాళ్లు రువ్వినట్టు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో రైల్వేస్టేషన్‌ ముట్టడి సందర్భంగా కాల్పుల్లో ఓ యువకుడు మరణించాడు. ఢిల్లీ, బెంగాల్, ఒడిశాల్లో హైవేల దిగ్బంధం జరిగింది.

అట్టుడికిన బిహార్‌...
అగ్నిపథ్‌ ఆందోళనతో బిహార్‌ అట్టుడికింది. రాజధాని పట్నా, హాజీపూర్, సమస్తిపూర్, లఖీసరాయ్‌ వంటి పలు పట్టణాల్లో రైళ్లకు నిప్పుపెట్టారు. దాంతో 10 ఇంజన్లతో పాటు 60 కోచ్‌లకు పైగా దగ్ధమయ్యాయి. హైవేలపై టైర్లు తదితరాలు తగలబెట్టి రాకపోకలను స్తంభింపజేశారు. శనివారం రాష్ట్ర బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. పట్నా శివార్లలో ఓ టోల్‌ ప్లాజా, నవడాలో ఓ పోలీసు జీపుకూ నిప్పు పెట్టారు.

పశ్చిమ చంపారన్‌ జిల్లా బెట్టియాలో ఉప ముఖ్యమంత్రి రేణూ దేవి ఇంటిపై దాడి చేశారు. బిహార్‌ బీజేపీ అధ్యక్షుడు సంజయ్‌ జైస్వాల్‌ ఇంటిని పాక్షికంగా ధ్వంసం చేశారు. తన ఇంటిని పేల్చేసేందుకు సిలిండర్‌ బాంబు కూడా పెట్టారని ఆయన ఆరోపించారు. మోతీహారీలో బీజేపీ ఎమ్మెల్యే వినయ్‌ బిహారీ కారును తగలబెట్టారు. 320 మందిని అరెస్టు చేసినట్టు అదనపు డీజీపీ సంజయ్‌సింగ్‌ తెలిపారు. రాష్ట్రంలో 12 జిల్లాల్లో ఇంటర్నెట్‌ సేవలను రెండు రోజుల పాటు నిలిపేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement