కాలపరీక్షకు నిలబడినవి మార్చడమా? | Ex Army Major General Ashok Mehta Special Article On Agnipath Scheme | Sakshi
Sakshi News home page

కాలపరీక్షకు నిలబడినవి మార్చడమా?

Published Fri, Jun 24 2022 2:37 AM | Last Updated on Fri, Jun 24 2022 2:37 AM

Ex Army Major General Ashok Mehta Special Article On Agnipath Scheme - Sakshi

అగ్నిపథ్‌ పథకం లక్ష్యం స్పష్టం. పెన్షన్లు, సైనికుల వేతన బిల్లుల కోతే దీనికి కారణం. సైనిక నియామకాల వ్యవస్థను మాత్రమే కేంద్రం మరమ్మతు చేయడం లేదు... సైనిక చర్యల సమయంలో సైనికుల సంఖ్య విస్తృతంగా అవసరమయ్యే కూర్పునే మార్చేయాలని చూస్తున్నారు. సుదీర్ఘకాలానికి బదులుగా నాలుగేళ్ల వ్యవధి నియామకాల వ్యవస్థను తేవడమే యువత ఆగ్రహానికి కారణం. ప్రభుత్వం చేస్తున్న పెద్ద తప్పిదం ఏమిటంటే, కాలపరీక్షకు నిలిచిన రెజిమెంటల్‌ వ్యవస్థను ధ్వంసం చేయాలనుకోవడం. అఖిల భారత స్థాయిలో ఉన్న సైన్యాన్ని సింగిల్‌ క్లాస్‌గానూ, వ్యవస్థీకృత యూనిట్లను సబ్‌ యూనిట్లుగానూ మార్చేయాలని చూస్తున్నారు. తండ్రి నుంచి కుమారుడి వరకు తరాలపాటు సైన్యంలో కొనసాగిన బంధాలు ఇకపై కనిపించవు.

ప్రభుత్వంలోని మిత్రులతో ఎవరు శత్రుత్వం కోరుకుంటారు? ప్రభుత్వం మొత్తంగా ఇప్పుడు అగ్నివీర్‌లను కాపాడుకునేందుకు అగ్నిపోరాటం చేస్తోంది. సీనియర్‌ ఆర్మీ అధికారులతో చర్చించామని ప్రభుత్వం పదే పదే చెబుతోంది కానీ, తనతో ఏకీభవించేవారితోనే ప్రభుత్వం చర్చించిందని స్పష్టంగా తెలుస్తోంది. అగ్నిపథ్‌ అనే అవివేకపు పథకం వల్ల సైన్యంతో పోలిస్తే తక్కువగా ప్రభావితమయ్యే భారతీయ వాయుసేన, నేవీ చీఫ్‌లు ఈ పథకానికి వ్యతిరేకంగా రేగిన హింసా కాండను చూసి దిగ్భ్రాంతి చెందినట్లు అంగీకరించారు. తప్పుడు సమాచారం, అనవగాహనే ఈ హింసాకాండకు కారణమని వీరు తేల్చి చెప్పేశారు.

నాలుగేళ్ల సైనిక సేవలో పెన్షన్‌ తదితర ప్రయోజనాలకు దూరమవడంతోపాటు గౌరవాన్ని కూడా కోల్పోతున్న అగ్నివీర్‌లను సరిగా అర్థం చేసుపోవడంలో విఫలమవుతున్నారు కాబట్టే ఈ హింసా కాండను చూసి ప్రభుత్వవర్గాలు భీతిల్లుతున్నాయి. 2032 నాటికి భారత సైన్యంలో 50 శాతం మంది రెగ్యులర్‌ సైనికులుగానూ, 50 శాతంమంది అగ్నివీర్‌లుగానూ ఉండబోతున్న తరహా వ్యవస్థలో నిర్వహణాత్మక లోపాలను గురించి అతిశయోక్తులు చెప్పనవసరం లేదు. జనరల్స్, వారికి సమానమైన హోదా కలిగిన వారు ప్రభుత్వ బాకారాయుళ్లగా ఉంటారు. అగ్నివీర్‌లు మాత్రం రాజకీయ ఫుట్‌ బాల్‌లో పావులుగా తయారవుతారు.

ఈ విప్లవాత్మకమైన ప్రాజెక్టును కేంద్రప్రభుత్వం ఉన్నట్లుండి ప్రకటించిన అయిదు రోజుల తర్వాత త్రివిధ దళాధిపతులు అసాధారణంగా మీడియో ముందుకు వచ్చి మరోసారి అగ్నివీర్‌ పథకం విశిష్టత గురించి వివరించారు. సైన్యంలో వ్యవస్థీకృత మార్పు నకు యువశక్తి ప్రధాన చోదకశక్తిగా ఉంటుందని వీరు నొక్కిచెప్పారు. పెన్షన్లు, సైనికుల వేతన బిల్లుల కోతే అగ్నివీర్‌ పథకానికి వెనుక ఉన్న హేతువు అని వీరు ఒక్కసారి కూడా తమ బ్రీఫింగులో పేర్కొనలేదు. గత రెండు సంవత్సరాలుగా రిక్రూట్‌మెంట్‌ని సస్పెండ్‌ చేయడానికి కోవిడ్‌ కారణం అని చెప్పడం అసత్యం. 

ఈ రెండేళ్ల కాలంలో అనేక ఎన్నికలు, కుంభమేళాలు నిర్వహించ గలిగినప్పుడు రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలను ఎందుకు చేపట్టలేకపోయా రని వీధుల్లోకి వచ్చిన యువత ప్రశ్నిస్తోంది. అగ్నివీర్‌ పథకం ప్రక టించిన నాటికి సైన్యంలో చేరదలిచిన అభ్యర్థులు మెడికల్‌ పరీక్షలు, శారీరక పరీక్షలు పూర్తి చేసుకుని రాత పరీక్షకు సిద్ధమవుతున్నారు. భారతీయ వాయుసేన విషయంలో అన్ని ప్రక్రియలనూ అభ్యర్థులు పూర్తి చేసుకున్నారు కానీ ఇప్పటికీ వీరికి కాల్‌ రాలేదు. మనం ఈ విషయంలో స్పష్టంగా ఉందాం.

సుదీర్ఘకాలం సైనిక కెరీర్‌లో కొన సాగడానికి బదులుగా నాలుగేళ్ల వ్యవధి ఉండే మౌలిక నియామకాల వ్యవస్థను తీసుకురావడమే యువత ఆగ్రహానికి కారణమైంది. పైగా అగ్నిపథ్‌ నుంచి వెనక్కు మళ్లే ప్రశ్నే లేదు; క్రమశిక్షణా వ్యతిరేక చర్యల్లో పాల్గొనలేదని యువత ప్రతిన చేయటమే కాకుండా ఆగస్ట్‌ మధ్యనాటికి రిక్రూట్‌మెంట్‌ ర్యాలీకి వచ్చేటప్పటికి పోలీసు వెరిఫికేషన్‌ సర్టిఫికెట్‌ కూడా తీసుకురావాల్సి ఉంటుందని త్రివిధ దళాధిపతుల తమ బ్రీఫింగ్‌లో తెలియపర్చారు.

అగ్నిపథ్‌ పథకం వెనకాల లక్ష్యం స్పష్టంగా వెల్లడవుతోంది. సైనిక నియామకాల వ్యవస్థను మాత్రమే మీరు మరమ్మతు చేయడం లేదు... సైనిక చర్యల సామర్థ్యంలో సైనికుల సంఖ్య విస్తృతంగా అవసర మయ్యే కూర్పునే మౌలికంగా మార్చివేయాలని చూస్తున్నారు. సైనిక నిర్వహణాపరమైన సవాళ్లు ‘రెండున్నర’ (చైనా, పాకిస్తాన్, తీవ్ర వాదం) యుద్ధరంగాలలో ప్రత్యక్షంగా కనిపిస్తాయి. అంతేకాక పలు అంతర్గత ఇబ్బందులు దీనికి అదనం. ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, బ్రెజిల్‌ లాంటి దేశాలు భారత్‌ ఎదుర్కొంటున్న ప్రమాదాలు, సవాళ్లను కలిగి లేవన్నది గుర్తుంచుకోవాలి.

మన ప్రస్తుత రాజకీయ, సైనిక నాయకత్వం యుద్ధాలను చూడలేదు. తీవ్రవాద వ్యతిరేక, ఉగ్రవాద వ్యతిరేక చర్యల అనుభవం మాత్రమే ఉంది. టైగర్‌ హిల్స్‌ను కైవసం చేసుకున్న యువ సైనికులు రెగ్యులర్‌ సైనికులు అని గుర్తించాలి. వీరికి పెన్షన్లు అందుతాయి. నైపు ణ్యంతో కూడిన రెజిమెంటల్‌ వ్యవస్థ వీరికి వెన్నుదన్నుగా నిలిచింది. ఆ వ్యవస్థ జవాన్‌ను ఆద్యంతం కాపాడుకుంటూ వస్తోంది. నాలుగేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు విక్టోరియా క్రాస్‌లను గెల్చుకుంటా రంటూ కొంతమంది వృద్ధ ఆఫీసర్లు సైనికుల స్థితిని తప్పుగా కోట్‌ చేస్తున్నారు.

ఏడు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువగా సైనిక వృత్తిలో పనిచేసిన వారికి మాత్రమే 95 శాతం అవార్డులు వచ్చాయని మర్చిపోరాదు. ఒకే ఒక్క రైఫిల్‌మ్యాన్‌ మాత్రమే విక్టోరియా క్రాస్‌ గెలుచుకున్నారు. చిన్నవయసులో నాలుగేళ్ల సేవ పూర్తి చేసుకునే అగ్ని వీర్‌లకు 26 నుంచి 32 సంవత్సరాల వయస్సులో సైనికజీవితంలో లభ్యమయ్యే విశిష్టమైన అనుభవం సిద్ధించదు. నాలుగేళ్ల సేవ తర్వాత కూడా సైన్యంలో కొనసాగాలనుకునే అగ్నివీర్‌లలో 75 శాతాన్ని సాగ నంపుతారు. పైగా వీరికి ఉద్యోగాలు, విద్యావకాశాలు, ధన సహాయం కల్పించి వారు రెండో కెరీర్‌ ప్రారంభించడానికి మద్దతునిస్తామని ఇప్పుడు ఆర్భాటంగా ప్రకటనలు చేస్తున్నారు. కానీ నోటిమాటలు పనిచేయవు కదా.

నా తరంలోని సైనికులు అన్ని యుద్ధాలు, తీవ్రవాద వ్యతిరేక పోరాటాల్లో పాలుపంచుకున్నారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న అతిపెద్ద తప్పిదం ఏమిటంటే కాలపరీక్షకు నిలిచిన, జాగ్రత్తగా పెంచిపోషించిన రెజిమెంటల్‌ వ్యవస్థను ధ్వంసం చేయాలనుకోవ డమే. ఈ వ్యూహాత్మక సంపదను అర్థం చేసుకోవడంపై మన రాజకీయ నాయకత్వం ఏమాత్రం దృష్టి పెట్టలేదు. అఖిల భారత స్థాయిలో ఉన్న సైన్యాన్ని సింగిల్‌ క్లాస్‌గానూ, వ్యవస్థీకృత యూనిట్లను సబ్‌ యూనిట్లుగానూ మార్చేయాలని చూస్తున్నారు.

ఈ క్రమంలో సిక్కు, గర్వాల్, కుమావూ, అస్సామ్‌ తదితర రెజిమెంట్లు తమ గుణాన్ని, ఆత్మను కోల్పోతాయి. రెజిమెంట్‌ సంప్రదాయాలు, తండ్రి నుంచి కుమారుడి వరకు తరాలపాటు సైన్యంలో కొనసాగిన స్నేహబంధం కూడా ఇకపై కనిపించవు. క్లాస్‌ అస్తిత్వం, యుద్ధ నినాదం అనేవి మార్చలేని ప్రేరణ శక్తులు. గతంలోకూడా ప్రభుత్వాలు ఆల్‌ ఇండియా, ఆల్‌ క్లాస్‌ అని ప్రబోధిస్తూ ఇలాంటి విశిష్ట బృందాలను తొలగించాలని ప్రయత్నించాయి కానీ అలాంటి ప్రయోగాలు విఫలమయ్యాయి. ఒకే భారత్, ఒకే క్లాస్‌ అనే భావాన్ని సైన్యంపై రుద్దడం అంటే రెజిమెంటల్‌ విలువలపై దాడి చేయడమే అవుతుంది.

నమ్రత కలిగిన గూర్ఖాల గురించి కాస్సేపు ఆలోచిద్దాం. 43 ఇన్‌ఫాంట్రీ బెటాలియన్లతో కూడిన గూర్ఖా బ్రిగేడ్‌ని ప్రధానంగా నేపాల్‌ నుంచి రిక్రూట్‌ చేసుకునేవారు. అగ్నివీర్‌ ప్రధాన శిల్పి అయిన ప్రధాని మోదీ 2014లో నేపాల్‌ సందర్శించినప్పుడు, భారత సార్వ భౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను కాపాడటంలో నేపాలీ గూర్ఖాల త్యాగాలను ఎంతగానో కొనియాడారు. నేపాల్‌తో భారత్‌ సంబంధా లను, ప్రభావాన్ని చైనా దెబ్బతీస్తున్న సమయంలోనే లక్షలాదిమంది మాజీ సైనికులు, ప్రస్తుత గూర్ఖా సైనికులు భారత అనుకూల వైఖరిని ప్రదర్శించేవారు. ఒకే భారత్, ఒకే శ్రేణి అనే విధానాన్ని గూర్ఖా అగ్నవీర్‌లకు కూడా వర్తిస్తే భారత్, నేపాల్‌ ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయి.

జనరల్‌ ఇయాన్‌ హామిల్టన్‌ రాసిన ‘మై రెజిమెంటల్‌ హిస్టరీ’ ముందుమాట చివరలో ఈ కొటేషన్‌ ఉంది. ‘‘ఉత్కృష్టమైన 5వ గూర్ఖా రైఫిల్స్‌ కీర్తి ఎన్నడూ అంతరించదు. ఏ రాజకీయ నేత అయినా గూర్ఖా కేడర్‌ను తొలగించాలని కానీ, వారి సంఖ్యను మార్చాలని కానీ భావిం చినట్లయితే అతడి చెయ్యి పక్షవాతానికి గురై స్తంభించిపోవచ్చు.’’


వ్యాసకర్త: అశోక్‌ కె. మెహతా,  
ఆర్మీ మేజర్‌ జనరల్‌ (రిటైర్డ్‌),
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement