‘అగ్ని’లో నిగ్గుతేలిన నిజాలు | Vardhelli Murali special article on Agnipath Scheme | Sakshi
Sakshi News home page

‘అగ్ని’లో నిగ్గుతేలిన నిజాలు

Published Sun, Jun 19 2022 1:03 AM | Last Updated on Sun, Jun 19 2022 2:32 PM

Vardhelli Murali special article on Agnipath Scheme - Sakshi

‘అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని’... ఇది ‘సిరి వెన్నెల’ రాసిన గేయంలో ఒక పంక్తి. అగ్గి తోటి కడిగితే అది పునీతమవుతుందని మన విశ్వాసం. నిఖార్సయిన నిజాన్ని గురించి చెప్పడానికి నిప్పును ఉపమానంగా తెచ్చుకోవడం మన అలవాటు. అగ్నిపరీక్షలో పాసైతే పవిత్రత అనే సర్టిఫికెట్‌ ఆటో మేటిక్‌గా లభిస్తుంది.

ఇది మన సాంస్కృతిక భావజాలంలో ఊడలు దిగిన విశ్వాసం. సైనిక దళాల్లో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్‌’ కూడా సమాజ వాస్తవికతలపై ఒక అగ్నిపరీక్షగా పనిచేసింది. ఈ విధానానికి వ్యతిరేకంగా చెలరేగిన దావానలం యథార్థాల ముసుగుల్ని దహించి, నగ్నంగా నిలబెట్టింది.

ఈ దేశంలోని లక్షలాదిమంది యువకులు సైన్యంలో చేరడానికి చకోర పక్షుల్లా నిరీక్షిస్తున్నారనేది ఒక వాస్తవం. ఎదురు చూపులు ఉపాధి కోసమా? దేశభక్తి ప్రపూరితమా అన్నది ఇక్కడ అప్రస్తుతం. నిరుద్యోగం పెనుభూతమై పీడిస్తున్న దేశంలో ఉపాధి ఆరాటమే తొలి కారణం కావచ్చు. దానికి దేశభక్తి కూడా జతకూడి ఉండవచ్చు. కారణమేదైనా సుమారు లక్షా డెబ్బయ్‌ ఐదు వేలమంది యువకులు ఏడాది కిందనే ఫిజికల్‌ టెస్టులూ, మెడికల్‌ టెస్టులూ గట్టెక్కి ఉన్నారు.

నెలల తరబడి శిక్షణ తీసుకుని గురిపెట్టి విడిచిన బాణాల్లా పరుగులు తీసి పరీక్షలు పాసయ్యారు. ఇంకొక్క పరీక్ష. రాత పరీక్ష. అది పూర్తయితే ఇక సైన్యంలో చేరడమే! ఆలివ్‌ గ్రీన్‌ యూనిఫామ్‌లో తమను తాము ఎన్నిసార్లు ఊహించుకున్నారో! కరాన మర తుపాకీ... శిరాన ఉక్కుటోపీతో సరిహద్దుల్లో పహారా కాస్తున్నట్టు ఎన్ని కలలు కన్నారో! దూరంగా, సొంత ఊరిలో ఉన్న తల్లి దండ్రులకు నెలనెలా జీతం డబ్బులు పంపి అండగా నిలబడ బోతున్నామని ఎంత సంబరపడ్డారో! జస్ట్‌... ఒక్క పరీక్ష!!

అధికారులు చెబుతున్నట్టు కరోనా కారణంగానే అది వాయిదా పడుతూ వస్తున్నదని సర్దిచెప్పుకున్నారు. నేడో రేపో ఆ పరీక్ష పూర్తవబోతున్నదని ఎదురుచూస్తున్నారు. సైనిక బలగాల నియామకానికి పాత పద్ధతిని రద్దుచేస్తూ సరికొత్తగా ‘అగ్నిపథ్‌’ అనే పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు్ట ప్రకటన వెలువడగానే హతాశులయ్యారు. ఎదురుచూస్తున్న కొలువు ఎగిరిపోయింది.

నోటి దగ్గర ముద్ద నేల రాలింది. ‘కొత్తగా వచ్చే కొలువులు నాలుగేళ్లు మాత్రమే’ అని చెప్పడంతో వారి కలలన్నీ కరిగి పోయాయి. ఒక్కసారిగా లక్షా డెబ్బైఐదు వేల గుండెలు పగిలిన శబ్దానికి త్రీగోర్జెస్‌ డ్యామ్‌ బద్దలైనంత విధ్వంసం దేశమంతటా ప్రవహించింది. ఈ విధ్వంసంలో కొన్ని ప్రతిపక్షాల పాత్ర ఉన్న దని కేంద్రం ఆరోపిస్తున్నది. ప్రజల్లో అసంతృప్తి ఉన్న ప్పుడు ప్రతిపక్షం ఆజ్యం పోయడం సహజమే!

ప్రభుత్వం చెబుతున్నట్టు సైనిక బలాల నియామకాల హేతుబద్ధీకరణ చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న అంశమే. ఇందుకు పైకి చెబుతున్న కారణాలు ఎన్ని వున్నా ప్రధానమైన అంతర్గత కారణం పెన్షన్‌ భారం. రక్షణ రంగంలో ఇప్పటికే 32 లక్షలమంది పెన్షనర్లు ఉన్నారు. రక్షణ శాఖ మొత్తం వార్షిక బడ్జెట్‌లో పెన్షన్‌ల వాటా 26 శాతానికి చేరుకున్నది. ఏటా యాభై వేలమంది పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో ఈ శాతం ఏటా పెరుగుతూనే ఉంటుంది. అమెరికా రక్షణ బడ్జెట్‌లో పెన్షన్ల వాటా 10 శాతమే. యూ.కే.లో అది 14 శాతం.

సైనిక బలగాలకోసం ఖర్చుచేసే పెన్షన్‌ను భారంగా భావించే దేశంలో ఒక్కసారి ఎమ్మెల్యేగానో, ఎంపీగానో ఎన్నికైన వారికి జీవితాంతం ఇచ్చే పెన్షన్‌ను ఎలా సమర్ధించగలుగు తారు? ఈ ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. అందుకే ప్రభుత్వం ఇతర కారణాలను చెబుతున్నది. ‘అగ్నిపథ్‌’ కింద నియమించేవారిలో నాలుగో వంతు మందిని 15  ఏళ్ల సర్వీస్‌ వరకు కొనసాగిస్తామనీ, మిగిలిన వారికి స్వయంఉపాధికి దోహదపడే ఆర్థిక సహకారాన్ని అందజేస్తామనీ చెబుతున్నది.

ఈ పద్ధతి ప్రపంచంలోని చాలా దేశాల్లో అమల్లో ఉన్నదని ఉదాహరణలిస్తున్నది. ఏదైనా ఒక రంగంలో సమూల మార్పు లకు సిద్ధపడినప్పుడు అందుకు సంబంధిత ప్రజానీకాన్ని ముందుగానే సిద్ధం చేయడం అవసరమని ఈ వివాదం మరో సారి చాటి చెప్పింది. వ్యవసాయ చట్టాల సందర్భంలోనూ, ఇప్పుడు రక్షణ శాఖ నియామకాల హేతుబద్ధీకరణలోనూ ప్రభుత్వం తొందరపాటుగానే వ్యవహరించింది. 

ఈ పథకంలోని గుణదోషాల అంశాన్ని పక్కనపెట్టి పరిశీ లిస్తే... మన విద్యావ్యవస్థలోని లోపాలనూ, నిరుద్యోగ సమస్య తీవ్రతనూ ఈ సందర్భం ఎత్తిచూపింది. విద్యావ్యవస్థలోని నాణ్యతా ప్రమాణాల క్షీణత, నైపుణ్య లేమి యువతరానికి శాపంగా పరిణమిస్తున్న వైనానికి అద్దం పట్టింది. దేశంలో ఏటా 24 లక్షలమంది ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తు న్నారు. వారిలో 10 లక్షల మందికే క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారానో, ఇతర మార్గాల ద్వారానో చదువుకు తగిన ఉద్యోగాలు లభిస్తున్నాయి.

మిగిలిన వారిలో సగం మంది అతికష్టం మీద చదువుతో సంబంధం లేని దిగువశ్రేణి ఉద్యో గాల్లో సర్దుకోగలుగుతున్నారు. సుమారు ఆరేడు లక్షలమంది ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లు ప్రతియేటా రోడ్డు మీద మిగిలి పోతున్నారు. నాన్‌–ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేషన్, పోస్ట్‌ గ్రాడ్యు యేషన్‌ పూర్తిచేసిన వారిలో ఇంగ్లిష్‌ నైపుణ్యం, సాఫ్ట్‌ స్కిల్స్‌ ఉన్న కొంతమంది మాత్రమే మెరుగైన ఉద్యోగాలు పొందగలుగుతున్నారు.

మిగిలిన వారంతా తమ సోదర ఇంజనీరింగ్‌ సేన లతో కలిసి ఒక రిజర్వు నిరుద్యోగ ఫోర్స్‌గా ఉండిపోతున్నారు. ఆర్థిక పరిస్థితి బాగా ఉండి జీడీపీ వృద్ధిరేటును నమోదు చేస్తున్న పరిస్థితుల్లో ఏదో ఒక ఉపాధి వీరికి లభిస్తున్నది. లేదంటే అన్యాయమైన పరిస్థితుల్లో ఉండిపోతున్నారు.

నైపుణ్యాల క్షీణతతోపాటు విద్యారంగాన్ని వేధిస్తున్న మరో సమస్య... డ్రాపవుట్లు. ప్రభుత్వ విద్యాసంస్థల్లోని సౌకర్యాల లేమి, ఆర్థిక పరిస్థితుల వలన ప్రైవేట్‌ చదువు కొనలేని పరిస్థితి. ప్రోత్సాహం లేకపోవడం ఈ డ్రాపవుట్లకు కారణంగా కని పిస్తున్నది. ఫలితంగా ఉన్నత విద్యాప్రస్థానంలో టెన్త్, ఇంటర్‌ మజిలీల దగ్గరే చాలామంది మిగిలిపోతున్నారు.

వీళ్లంతా నిరుద్యోగ రిజర్వు ఫోర్సే! దినసరి కూలీపై దొరికే లేబర్‌ పనులే వీరికి దిక్కు. వీళ్ల క్వాలిఫికేషన్‌కు తగిన ప్రభుత్వ ఉద్యోగాల ప్రకటనలు వచ్చినప్పుడు మెరుగైన జీతం, జీవితం కోసం పోటీపడుతున్నారు. సైనికోద్యోగాలు కూడా అందులో ఒక భాగం.

ఆర్థిక వృద్ధి నమోదవుతున్న ప్రాంతాల్లో డిగ్రీ, పీజీ నిరుద్యోగ పెద్దన్నల మాదిరిగానే టెన్త్, ఇంటర్‌ నిరుద్యోగ సేన కూడా ఏదో ఒక పనిలో కుదురుకుంటున్నది. ఆర్థిక వృద్ధి మందగమన స్థితిలో ఉన్న ప్రాంతాల్లో ఉపాధి లభించక నిస్పృహతో నిరుద్యోగ సేన రోడ్డెక్కుతున్నది.

ఈ దేశాన్ని రానున్న కాలంలో నవజీవన బృందావనంగా తీర్చిదిద్దగల యువతరం రూపొందడానికి 4 కీలక అంశాలపై దృష్టి పెట్టవలసిన అవసరాన్ని ‘అగ్నిపథ్‌’ సందర్భం గుర్తు చేసింది. 1. ఆర్థిక వ్యవస్థను వృద్ధి గమనంలో నిలపడం, 2. రిజర్వు నిరుద్యోగసేనల సమస్య పరిష్కారం, 3. విద్యా రంగంలో ప్రమాణాలు, నైపుణ్యాల పెంపుదల, 4. డ్రాపవుట్లు లేకుండా చేయడం.

ఈ అంశాల ప్రాధాన్యాన్ని తొలిదశలోనే గుర్తించి అందుకు తగిన ప్రణాళికలను రచించిన ఒకే ఒక్క రాజకీయ నేత ఏపీ సీఎం జగన్‌. ఇది వైఎస్సార్‌సీపీ చెప్పుకుం టున్న ఘనత కాదు. ఏపీ ప్రభుత్వం చాటింపు చేసుకుంటున్న విషయం కూడా కాదు. స్వతంత్ర ఏజెన్సీలు, కేంద్ర ప్రభుత్వ సంస్థల గణాంకాలు ఘంటాపథంగా చెబుతున్న అక్షర సత్యాలు.

సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (సీఎమ్‌ ఐఈ) నివేదిక ప్రకారం జాతీయ నిరుద్యోగితా రేటు 7.8 శాతం. ఆంధ్రప్రదేశ్‌లో అది 4.4. శాతం మాత్రమే! ఎల్లో మీడియా నిత్యం బ్యాండు మేళం మోగిస్తూ స్వర్ణయుగంగా కీర్తించే చంద్ర బాబు హయాం చివరిరోజు నాటికి నిరుద్యోగితా రేటు 5.2 శాతం. ఆ తర్వాత కోవిడ్‌ కారణంగా దేశమంతటా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. రెండేళ్లపాటు వరసగా కోవిడ్‌ మహమ్మారి పీడించింది.

ఈ పరిస్థితుల్లో నిరుద్యోగితా రేటు పెరగడం సహజం. అలా అన్ని రాష్ట్రాల్లో పెరిగింది కూడా! కానీ ఏపీలో తగ్గింది. దీని వెనుక ఏ మాయా, మంత్రం లేవు. అల్లావుద్దీన్‌ అద్భుత దీపం లేదు. చిత్తశుద్ధి, దూరదృష్టి, తపన మాత్రమే ఉన్నాయి. ఎక్కువమంది ప్రజానీకానికి ఉపాధి కల్పిస్తున్న వ్యవసాయ, చిన్న పరిశ్రమల (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ) రంగాలను గుర్తించి వాటిని డైనమిక్‌గా నిలబెట్టడానికి పడిన శ్రమ ఉన్నది.

చిన్న, సూక్ష్మ పరిశ్రమల రంగం ఏపీలో 11 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నది. అందులో 20 శాతం మందిని కోవిడ్‌ కాలం లోనే ఈ రంగం ఇముడ్చుకోగలిగింది. ఈ ఒక్క ఉదాహరణ చాలు ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలను గతిశీలకంగా నిలబెట్టేందుకు ప్రభుత్వం అందజేసిన ప్రోత్సాహకాలు అర్థం చేసుకోవడానికి! 2021–22 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం జీఎస్‌డీపీ 18.47 శాతం వృద్ధి (ప్రస్తుత ధరల ప్రకారం)ని నమోదు చేసింది.

ఇందులో భాగంగా వ్యవసాయ రంగం కూడా 14.50 శాతం వృద్ధిని సాధించింది. రైతన్నను చేయి పట్టుకొని నడిపిస్తున్న ఆర్‌బీకే సెంటర్ల వలన, రైతు భరోసా వలన, సకాలంలో ఇస్తున్న ఇన్‌పుట్‌ సబ్సిడీ, పంటల బీమా ఫలితంగా, ఉత్పత్తుల ధరలు తగ్గకుండా మార్కెట్‌ ఇంటర్‌వెన్షన్‌ వ్యూహాన్ని అమలు చేస్తున్నం దువలన ఈ విజయం సాధ్యమైంది. జగన్‌ ప్రభుత్వం రిజర్వ్‌ నిరుద్యోగ సేనల సమస్యను పరిష్కరించిన తీరు నభూతో నభవిష్యతి.

పరిపాలనా వికేంద్రీకరణలో విప్లవాత్మక కార్యక్రమా నికి శ్రీకారం చుడుతూ, అందులో భాగంగా ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించగలిగింది. లక్షా 34 వేలమందికి ఒకేసారి గ్రామ సచివాలయాల్లో ఉద్యోగాలను కల్పించింది. వలంటీర్‌ వ్యవస్థ ద్వారా మరో 2 లక్షల 60 వేల మంది గౌరవభృతితో సేవా పథంలోకి అడుగు పెట్టగలిగారు.

విద్యారంగ సమూలక్షాళనకు విద్యార్థుల నైపుణ్యాభివృద్ధి – ఉన్నత ప్రమాణాల కోసం భారీ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ‘నాడు–నేడు’ కింద ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చింది. గేమ్‌ ఛేంజర్‌గా ఇంగ్లిషు మీడియాన్ని ప్రవేశపెట్టింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు దీటుగా ఆధునిక బోధనా పద్ధతులను అందుబాటులోకి తెచ్చింది.

ఎడ్‌టెక్‌  కంపెనీ ‘బైజూస్‌’తో ఒప్పందం చేసుకొని లెర్నింగ్‌ యాప్‌ ద్వారా శిక్షణ అందించే ఏర్పాట్లు చేసింది. మార్కెట్‌ అవసరాలకు అనుగుణంగా ఇంజనీరింగ్‌ విద్యను సంస్కరించింది. రెండు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ యూనివర్సిటీలతో పాటు 30 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ చర్యల ఫలితంగా రాబోయే విద్యార్థి తరాలు ప్రపంచస్థాయిలో పోటీ పడే సామర్థ్యాన్ని సంతరించుకుంటున్నాయి.

ఏ స్థాయిలోనూ డ్రాపవుట్లు ఉండకుండా అందరూ ఉచి తంగా, నాణ్యమైన విద్యను అభ్యసించేందుకు అనేక పథకాల ద్వారా ప్రభుత్వం ప్రోత్సహిస్తున్నది. అమ్మ ఒడి, విద్యా కానుక, విద్యాదీవెన, వసతి దీవెన... ఇలా పలు పథకాలతో విద్యా రంగంలో డ్రాపవుట్‌ లేకుండా చూసే ప్రయత్నాన్ని చేస్తున్నది. ఇవన్నీ అక్షరాలా అమలు జరుగుతున్న కార్యక్రమాలు. కానీ చంద్రబాబూ, మీడియా మొఘల్‌ శ్రీమాన్‌ రామోజీరావు నేతృ త్వంలో వాలతుల్యులు, తోకమాత్రులతో కూడిన యెల్లో మీడియా ఈ కార్యక్రమాలను రివర్స్‌ గేర్‌లో చూపెడుతున్నారు.

ఇది రివర్స్‌ పాలన నమ్మండని చెబుతున్నారు. మన విద్యార్థు లను పోటీ ప్రపంచంలో నిలబెట్టడానికి ఇంగ్లిష్‌ మీడియంను ప్రవేశపెట్టినప్పుడు తీవ్రంగా వ్యతిరేకించింది ఈ ముఠా. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిందట, ఇంగ్లిష్‌ మీడి యంలో చదివిస్తే మీ పిల్లలు మొద్దబ్బాయిలుగా తయారవు తారని రోడ్డు పక్కనున్న పల్లె జనానికి చంద్రబాబు సుద్దులు చెప్పబోయారు. వారు జై జగన్‌ అని బదులు చెప్పేసరికి పలాయనం చిత్తగించారు.

ఇంగ్లిష్‌ మీడియానికి వ్యతిరేకంగా తెలుగు ఉద్యమాన్ని రెచ్చగొట్టడానికి యెల్లో మీడియా శాయ శక్తులా ప్రయత్నించి తల్లిదండ్రుల వ్యతిరేకతతో తోక ముడి చింది. ఇప్పుడు బైజూస్‌ మీద విషపు దాడి ప్రారంభించారు. ఏటా 24 వేల ఖర్చు చేయాల్సిన ఈ బోధన ప్రభుత్వ స్కూళ్లలో ఉచితంగా లభించనుంది. విద్యాబోధనను ఆధునికం చేసే అదనపు ఉపకరణం. సమగ్ర అవగాహనకు దోహదపడే ఆయుధం. పేదల చేతికి ఆయుధం దొరకకూడదు. వారు సాధి కారత సాధించకూడదు. ఇదీ చంద్రబాబు, యెల్లో మీడియా జాయింట్‌గా అమలు చేస్తున్న కార్యక్రమం.

చంద్రబాబు లాంటి విజనరీ ప్రపంచాన లేడని పాత డప్పునే ఇప్పుడు మళ్లీ∙వాయిస్తున్నారు. ఈ ప్రచారం హోరులో నిజంగా తాను విజనరీ అనే భ్రమలోకి బాబు జారిపోయి చాలా కాలమైంది. అదే ఆత్మవిశ్వాసంతో నిన్న విజయనగరంలో మాట్లాడారు. ‘‘నేనే ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే కరోనా వచ్చేదా తమ్ముళ్లూ’’ అని ప్రశ్నించారు. ఇటువంటి మాటలు సామాన్య ప్రజలు ఎవరు మాట్లాడినా జనం అనుమానిస్తారు. ‘ఎవరికైనా చూపెట్టండర్రా’ అని సలహా ఇస్తారు. ఇలా మాట్లాడటం ఆయనకు కొత్త కాదు. ఒకసారి తాను తుపాన్లను అడ్డుకున్నానని చెప్పారు.

విజయవాడలో ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలు తగ్గించాలని ఆదేశించారు. రెయిన్‌ గన్స్‌తో ఒక ట్యాంకర్‌ నీళ్లను చిలకరించి కరువును జయించానని ప్రకటించారు. ఎవరు అడి గినా అడక్కపోయినా మధ్యమధ్య ‘నేను మెంటల్లీ ఫిట్‌’ అని ప్రకటిస్తుంటారు. ఆయన మాటలన్నీ గొప్ప విజన్‌తో కూడిన వని యెల్లో మీడియా ఊదరగొడుతున్నది. ఆయనొస్తే అభివృద్ధి పరుగులు పెట్టుకుంటూ వస్తుం దని దండోరా వేస్తున్నది. జగన్‌ హయాంలో జరుగుతున్న విప్లవాత్మక మార్పులపై మసిపూసే ప్రయత్నం చేస్తున్నది. నిజాలపై ముసుగు కప్పుతున్నది. కానీ నిజం నిప్పు లాంటిది. నిప్పునూ దాచలేరు! నిజాన్నీ దాచలేరు!

వర్ధెల్లి మురళి 
vardhelli1959@gmail.com

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement