Secunderabad Station
-
లొకేషన్‌తో మూడు గంటలపాటు ఛేజింగ్
బంజారాహిల్స్: అదృశ్యమైన వ్యక్తిని లొకేషన్ సాయంతో మూడు గంటలపాటు ఛేజింగ్ చేసిన పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం... బంజారాహిల్స్ రోడ్డునెంబర్–3లోని షౌకత్నగర్ బస్తీకి చెందిన షేక్ ఫిరోజ్ (42), నందినగర్‌కు చెందిన యువతిని ఆరేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి మూడేళ్ల కూతురు కూడా ఉంది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో భార్యతో గొడవ పడి గత సెప్టెంబర్ 1వ తేదీన ఫిరోజ్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. తన భర్త కనిపించడం లేదంటూ బాధితురాలు అదే రోజు బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదైంది. అయితే ఇంటి నుంచి వైజాగ్‌కు వెళ్లిపోయిన ఫిరోజ్ తన ఫోన్లో పాత సిమ్‌కార్డు తొలగించి కొత్తది వేసుకొని వినియోగిస్తున్నాడు. అయితే ఫిరోజ్‌పై ప్రత్యేక దృష్టిపెట్టిన బంజారాహిల్స్ ఎస్ఐ కె. రమేష్ నెలరోజుల నుంచి తన తల్లి, సోదరుడు, మిత్రుడితో ఫోన్లో మాట్లాడుతున్నట్లుగా గుర్తించాడు. ఈ క్రమంలో ఫిరోజ్ వాడే ఫోన్ లొకేషన్ ద్వారా రైలులో హైదరాబాద్ వస్తుండగా గుర్తించి సోమవారం ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్‌కు వెళ్లారు. అయితే అప్పటికే ఫిరోజ్ మెట్రో రైలు ఎక్కాడు. మళ్లీ ఫోన్ లొకేషన్ తీసుకున్న ఎస్ఐ మెట్రో రైల్లో బేగంపేట వైపు వెళ్తున్నట్లు గమనించి రోడ్డు మార్గంలో ఛేజ్ చేస్తూ యూసుఫ్‌గూడ మెట్రో రైల్వేస్టేషన్ వరకు వెళ్లాడు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో అంతకుముందే ఫిరోజ్ మెట్రో దిగి రహమత్‌నగర్ వైపు వెళ్లాడు. మళ్లీ ఎస్ఐ లొకేషన్ తీసుకోగా రహమత్‌నగర్ పీజేఆర్ విగ్రహం చూపించింది. వెంటనే అక్కడికి వెళ్లగా పోలీసులకు దొరక్కుండా మాస్క్ ధరించి ఉన్న ఫిరోజ్‌ను గుర్తించిన పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. అనంతరం విచారించి అతడి భార్యకు అప్పగించారు. సుమారు మూడు గంటలపాటు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి రహమత్‌నగర్ వైపు ఫిరోజ్‌ను పట్టుకోవడానికి ఎస్ఐ చేసిన ప్రయత్యాన్ని పలువురు అభినందించారు. ఎస్సై హరీశ్, యువతి ఆడియో సంభాషణ వైరల్ -
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు తొలిసారిగా రానున్న ప్రధాని
సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ రానున్న దృష్ట్యా దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి రాకపోకలు సాగించనున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఆయన ఇక్కడి నుంచి ప్రారంభించనున్నారు. ప్రధాన మంత్రి సికింద్రాబాద్ స్టేషన్‌ను సందర్శించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. వందేభారత్ రైలు ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. నాడు అద్వానీ.. ప్రధాని హోదాలో మోదీ మొదటిసారిగా సికింద్రాబాద్ స్టేషన్‌ను సందర్శించనుండగా.. 2003 ఆగస్టు 9న దేశ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ ఈ స్టేషన్‌కు రావడం గమనార్హం. నగరంలో తొలిసారిగా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఎంఎంటీఎస్ ప్రారంభోత్సవం కోసం అద్వానీ సికింద్రాబాద్ స్టేషన్‌కు వచ్చారు. ఫలక్‌నుమా–సికింద్రాబాద్–లింగంపల్లి మధ్య ఎంఎంటీఎస్ రైలును ఆయన ప్రారంభించారు. ఎయిర్పోర్ట్ తరహాలో.. మరోవైపు ప్రధాని మోదీ సందర్శన కూడా చారిత్రాత్మకంగానే నిలిచిపోనుంది. ఎందుకంటే నిజాం కాలంనాటి ఈ పురాతన రైల్వేస్టేషన్ పూర్తిగా మారిపోనుంది. పునరభివృద్ధి కారణంగా 2025 నాటికి ఇది అత్యాధునిక రైల్వేస్టేషన్‌గా అవతరించనుంది. ఎయిర్‌పోర్టు తరహాలో సికింద్రాబాద్ స్టేషన్లో ప్రయాణికులకు రైల్వే సేవలు అందుబాటులోకి వస్తాయి. సికింద్రాబాద్ స్టేషన్ రీడెవలప్మెంట్ పనులకు కూడా ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. నిజాం కాలం నాటి చారిత్రక సికింద్రాబాద్ స్టేషన్‌ను సందర్శించిన ఘనత కూడా ప్రధానికి దక్కనుంది. అప్పుడు మొదటి దశ.. ఇప్పుడు రెండో దశ.. ఎంఎంటీఎస్ మొదటి దశ రైళ్లను అప్పటి ఉప ప్రధానిఎల్కే అద్వానీ ప్రారంభించగా ఇప్పుడు ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టును ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. మేడ్చల్– సికింద్రాబాద్, ఫలక్‌నుమా–ఉందానగర్ మధ్య ఎంఎంటీఎస్ సేవలను ఆయన నగరవాసులకు అందుబాటులోకి తేనున్నారు. దీంతో మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ మీదుగా ఫలక్‌నుమా, ఉందానగర్ వరకు ఎంఎంటీఎస్ సేవలను వినియోగించుకొనే అవకాశం లభిస్తుంది. అలాగే మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ మీదుగా లింగంపల్లి వరకు కూడా ప్రయాణికులు రాకపోకలు సాగించవచ్చు. ● 2013లో ఎంఎంటీఎస్ రెండో దశ ప్రాజెక్టును ప్రారంభించారు. సుమారు రూ.816 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు వ్యయం రూ.1150 కోట్ల వరకు చేరింది. ఇంకా కొన్ని రూట్లలో పనులు కొనసాగుతున్నాయి. మౌలాలి– సనత్‌నగర్ మధ్య సుమారు 5 కిలోమీటర్లు పూర్తి చేయాల్సి ఉంది. రెండో దశ కోసం ఇటీవల కేంద్రం రూ.600 కోట్లు మాత్రమే కేటాయించిన సంగతి తెలిసిందే. మొదట్లో రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో చేపట్టినప్పటికీ రాష్ట్ర వాటాగా పూర్తిస్థాయిలో అందజేయకపోవడంతో కేంద్రమే ఈ ప్రాజెక్టు కోసం నిధులు కేటాయించింది. -
డ్రోన్ కెమెరాలతో సెర్చ్ ఆపరేషన్
-
వాట్సాప్.. నిఘా హ్యాండ్సప్!
సాక్షి, హైదరాబాద్: రాజకీయ రంగంలో అయినా, నేర సామ్రాజ్యంలో అయినా, సామాజిక అంశాల్లో అయినా చీమ చిటుక్కుమన్నా ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాలి. కానీ, ఇప్పుడు ఆ వ్యవస్థ నిద్రమత్తులో జోగుతోందన్న విమర్శలు వెల్లువెత్తు న్నాయి. శుక్రవారం ఉదయం సికింద్రాబాద్ స్టేషన్లో జరిగిన ఆందోళనలు, విధ్వంసాలను పసిగట్టడంలో రాష్ట్ర, కేంద్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థల వైఫల్యం కొట్టిచ్చినట్టు కనిపిస్తోంది. ఇటీవల జరిగిన పలు వరుస ఘటనలపై ముందే సమాచారాన్ని సేకరించడంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ విఫలమైనట్టు విమర్శలు వినవస్తున్నాయి. కాంగ్రెస్ చలో రాజ్‌భవన్‌లో... రాహుల్‌గాంధీకి ఈడీ నోటీసులిచ్చిన నేపథ్యంలో ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీలపై, ఏఐసీసీ కార్యాలయంపై పోలీసులు జరిపిన దాడికి నిరసనగా టీపీసీసీ చలో రాజ్‌భవన్ చేపట్టింది. ఈ ఆందోళన విధ్వంసానికి దారితీసింది. కాంగ్రెస్ గతంలో గల్లీలో ధర్నా చేసేందుకు యత్నించినా, ఆందోళనలకు పిలుపునిచ్చినా పోలీసులు ప్రతీ నాయకుడిని ముందస్తుగానే హౌస్అరెస్ట్తోపాటు అదుపులోకి తీసుకునేది. కానీ, చలో రాజ్‌భవన్ ముట్టడిలో ఎందుకు అప్రమత్తత కాలేకపోయిందనే విమర్శలు వస్తున్నాయి. ఇంటెలిజెన్స్ చెప్పినా సిటీ పోలీసులు పట్టించుకోలేదా లేదంటే ఇంటెలిజెన్స్, హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ వ్యవస్థ అప్రమత్తత చేయలేదా అన్నదానిపై అనుమానాలు కలుగుతున్నాయి. అవి ఎందుకు ఇంతటి మొద్దునిద్రలో ఉందని బీజేపీ నేతలు ఒకవైపు ఆరోపిస్తున్నా ఇప్పటి వరకు అధికార వ్యవస్థ ఖండించకపోవడం లేదా స్పష్టత ఇవ్వకపోవ డంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటిని పట్టించుకోలేదు కేంద్రం అగ్నిపథ్‌ను ప్రకటించిన నాటి నుంచి దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ఉద్యోగార్థులు దీన్ని వ్యతిరేకిస్తూ గళమెత్తారు. కొన్నేళ్లుగా ఆర్మీ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నవారు.. దీనిపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ కారణంగానే రైల్వేస్టేషన్ల వద్ద నిరసనలు, విధ్వంసాలు జరిగాయి. ఈ నేపథ్యంలో అయినా రాష్ట్ర పరిస్థితులను నిఘావర్గాలు గుర్తించాలి. రైల్వేస్టేషన్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాల్సిందిగా అప్రమత్తం చేయాలి. నిఘావ్యవస్థ నిద్రావస్థకు చేరుకోవడంతోనే ఉద్యోగార్థులు ఆందోళన చేయనున్నారనే విషయం పసిగట్టలేకపోయింది. ఇంటెలిజెన్స్ వర్గాల కళ్లలో పడని సందేశాలు ఆర్మీ ఉద్యోగార్థులు ఏర్పాటు చేసుకున్న వాట్సాప్ గ్రూపుల ద్వారానే శుక్రవారం సికింద్రాబాద్ రైల్వే జంక్షన్ వద్ద నిరసన చేపట్టాలనే సందేశం సర్క్యులేట్ అ యింది. 8 వాట్సాప్ గ్రూపుల్లో మొదలైన ఈ సందేశం వేలమందికి చేరింది. అయినప్పటికీ నిఘా వర్గాల సాంకేతికత, ఇంటెలిజెన్స్ కళ్లలో పడకపోవడం గమనార్హం. సికింద్రాబాద్ స్టేషన్ వద్ద నిరసన తెలపడానికి తెలుగు రాష్ట్రాలకు చెందినవారూ అనేక మంది గురువారమే హైదరాబాద్ చేరుకున్నారు. పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థులమంటూ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల, ఇతర ప్రాంతాల్లో ఉన్న లాడ్జిల్లో బస చేశారు. ఈ విషయాన్ని రాష్ట్ర, నగర నిఘా వర్గాలు గుర్తించలేదు. వరంగల్, ఆదిలాబాద్ వైపు నుంచి వచ్చే రైళ్లల్లో ఉదయం అనేకమంది ఆందోళనకారులు నగరానికి వచ్చారు. ఈ అంశమూ నిఘావర్గాలు పసిగట్టలేకపోయాయి. -
దేశమంతటా ‘అగ్ని’గుండం
ఢిల్లీ: సైనిక దళాల్లో నియామకాలకు కేంద్రం తీసుకొచ్చిన కొత్త పథకం అగ్నిపథ్ రాజేసిన అగ్గి కార్చిచ్చుగా మారి దేశమంతటినీ కమ్మేసింది. పథకాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా యువత చేపట్టిన నిరసనలు, ఆందోళనలు శుక్రవారం మూడో రోజు తారస్థాయికి చేరాయి. రైల్వేస్టేషన్లను ముట్టడించడం, హైవేలను దిగ్బంధించడంతో పాటు చాలాచోట్ల హింసాకాండ కూడా చోటుచేసుకుంది. బిహార్, యూపీ మొదలుకుని పశ్చిమ బెంగాల్, ఒడిశా, మధ్యప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ... ఇలా పలు రాష్ట్రాల్లో ఆందోళనలు మిన్నంటాయి. కోపోద్రిక్తులైన యువకులు పలు రాష్ట్రాల్లో 7 రైళ్లకు, వందలాది వాహనాలకు నిప్పుపెట్టారు. గంటల తరబడి రోడ్లపై, పట్టాలపై బైఠాయించారు. రైళ్లు, బస్సులు, ఇతర వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. వాటిపైకి రాళ్లు రువ్వారు. ప్రభుత్వ ఆస్తులతో పాటు టోల్ ప్లాజాలను కూడా ధ్వంసం చేశారు. పలుచోట్ల రైల్వేస్టేషన్లలో విధ్వంసానికి పాల్పడ్డారు. బిహార్‌లో ఉప ముఖ్యమంత్రితో పాటు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుని నివాసాలపై దాడికి దిగారు. బీజేపీకి, కేంద్రానికి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిపారు. ‘అగ్నిపథ్‌ను వెనక్కు తీసుకోవాలి’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. లాఠీచార్జీలో వందలాది మంది గాయపడ్డారు. యువత భవిష్యత్తును అంధకారంగా మార్చే ఈ పథకాన్ని తక్షణం వెనక్కు తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఆందోళనలు, విధ్వంసాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా 200కు పైగా రైళ్లు రద్దయ్యాయి. 300 పై చిలుకు రైళ్ల రాకపోకలు ప్రభావితమయ్యాయి. చాలాచోట్ల ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ వంటి సేవలను నిలిపేయాల్సి వచ్చింది. యువతను శాంతింపజేసేందుకు కేంద్రం హుటాహుటిన రంగంలోకి దిగినా పెద్దగా ఫలితం కనిపించలేదు. అగ్నిపథ్ అన్నివిధాలా ఆలోచించి రూపొందించిన పథకమని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా వివరించారు. పైగా దీనికింద సైనిక దళాల్లో చేరేందుకు గరిష్ట వయో పరిమితిని ఈ ఏడాదికి 23 ఏళ్లకు పెంచడం యువతకు సువర్ణావకాశమని వారన్నారు. నాలుగేళ్ల సర్వీసు అనంతరం పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, సంస్థలు, ప్రైవేటు రంగంలో చక్కని ఉద్యోగావకాశాలు ఉంటాయని చెప్పారు. అయినా యువత శాంతిస్తున్న సూచనలు గానీ, ఆందోళనలు తగ్గుముఖం పడుతున్న జాడలు కానీ కన్పించడం లేదు. పైగా అగ్నిపథ్ నియామకాలకు అతి త్వరలో శ్రీకారం చుడుతున్నట్టు ర్రివిధ దళాధిపతులు ప్రకటించిన నేపథ్యంలో ఆందోళనలు మరింతగా పెరిగేలా కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అగ్నిపథ్ పథకంపై శనివారం త్రివిధ దళాధిపతులతో రాజ్‌నాథ్ సమావేశమై చర్చించే అవకాశముందని తెలుస్తోంది. యూపీ, బెంగాల్, ఒడిశాల్లో... యూపీలో కనీసం 17 నగరాల్లో భారీ ఆందోళనలు జరిగాయి. బలియాలో రాష్ట్ర రవాణా మంత్రి క్యాంపు కార్యాలయంపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఓ రైలుకు నిప్పు పెట్టారు. అలీగఢ్ వద్ద హైవేపై పలు బస్సులపై రాళ్లు రువ్వారు. వారణాసి, ఫిరోజాబాద్, అమేథీ తదితర చోట్ల పలు రైళ్లపై దాడికి పాల్పడటంతో పాటు రాళ్లు రువ్వినట్టు అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో రైల్వేస్టేషన్ ముట్టడి సందర్భంగా కాల్పుల్లో ఓ యువకుడు మరణించాడు. ఢిల్లీ, బెంగాల్, ఒడిశాల్లో హైవేల దిగ్బంధం జరిగింది. అట్టుడికిన బిహార్... అగ్నిపథ్ ఆందోళనతో బిహార్ అట్టుడికింది. రాజధాని పట్నా, హాజీపూర్, సమస్తిపూర్, లఖీసరాయ్ వంటి పలు పట్టణాల్లో రైళ్లకు నిప్పుపెట్టారు. దాంతో 10 ఇంజన్లతో పాటు 60 కోచ్‌లకు పైగా దగ్ధమయ్యాయి. హైవేలపై టైర్లు తదితరాలు తగలబెట్టి రాకపోకలను స్తంభింపజేశారు. శనివారం రాష్ట్ర బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. పట్నా శివార్లలో ఓ టోల్ ప్లాజా, నవడాలో ఓ పోలీసు జీపుకూ నిప్పు పెట్టారు. పశ్చిమ చంపారన్ జిల్లా బెట్టియాలో ఉప ముఖ్యమంత్రి రేణూ దేవి ఇంటిపై దాడి చేశారు. బిహార్ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ ఇంటిని పాక్షికంగా ధ్వంసం చేశారు. తన ఇంటిని పేల్చేసేందుకు సిలిండర్ బాంబు కూడా పెట్టారని ఆయన ఆరోపించారు. మోతీహారీలో బీజేపీ ఎమ్మెల్యే వినయ్ బిహారీ కారును తగలబెట్టారు. 320 మందిని అరెస్టు చేసినట్టు అదనపు డీజీపీ సంజయ్‌సింగ్ తెలిపారు. రాష్ట్రంలో 12 జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను రెండు రోజుల పాటు నిలిపేశారు. -
హింసాత్మక ‘అగ్నిపథం’
త్రివిధ దళాల్లో యువతను చేర్చుకోవడానికి కేంద్రం ప్రకటించిన ‘అగ్నిపథ్’పై మూడు రోజులుగా ఉత్తరాదిలో సాగుతున్న హింసాత్మక ఆందోళనలు దక్షిణాదికి కూడా వ్యాపించాయి. సికింద్రాబాద్ స్టేషన్లో శుక్రవారం వేలాదిమంది యువకులు హింసకు పాల్పడటం, పోలీసు కాల్పుల్లో ఒకరు మరణించగా పలువురు గాయపడటం, రైళ్లకు నిప్పెట్టడం, పొద్దు పోయే వరకూ ఉద్రిక్తతలు కొన సాగటం దిగ్భ్రాంతికరం. దాదాపు పది గంటల అనంతరం అక్కడ పరిస్థితి చక్కబడింది. చాలాసేపు పోలీసులను నిస్సహాయత ఆవరించింది. తమపై ఎలాంటి హెచ్చరిక లేకుండా కాల్పులు జరిపారని ఆందోళన కారుల ఆరోపణ. అల్లర్లకు దిగినవారిని అదుపు చేయడానికి కాల్పులు తప్పనిసరను కుంటే మోకాళ్లకింది భాగంలోనే కాల్చాలని నిబంధనలు చెబుతున్నాయి. మరి అలా జరిగిందా? ఉత్తరాదిన జరుగుతున్న ఘటనల పరంపర తీరును సరిగా అధ్యయనం చేసి, ముందస్తు చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర నిఘా విభాగాల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. నిర్ణయం ప్రకటించాక ఆలోచించుకోవడం కన్నా, ఆలోచించి నిర్ణ యించడం అన్నివిధాలా మంచిదని ఎన్డీఏ సర్కారుకు ఇటీవల తెలియజెప్పిన మరో ఉదంతమిది. లోగడ సాగు చట్టాల విషయంలోనూ ఇదే తంతు నడిచింది. ‘కీలకమైన చట్టాలు తెచ్చేటపుడు సంబంధిత పక్షాలతో మాట్లాడాలి కదా’ అన్నవారి నోళ్లు మూయించడం కోసం ఇన్ని లక్షలమంది రైతులతో, ఇన్ని వేల సంఘాలతో చర్చించామని అప్పటి కేంద్ర వ్యవసాయ మంత్రి లెక్కలు చెప్పారు. కానీ ఆర్టీఐ ద్వారా వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తే సంబంధిత రికార్డులు లేవన్న జవాబు వచ్చింది. చివరికేమైంది? ఆ సాగు చట్టాలను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు సికింద్రాబాద్ ఘటనలకు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అలజడి వెనుక టీఆర్ఎస్, ఎంఐఎం ఉందని బీజేపీ ఆరోపిస్తోంది. మరి వరసగా మూడోరోజైన శుక్రవారం కూడా ఉత్తరప్రదేశ్, బిహార్, హరియాణా, మధ్యప్రదేశ్‌లలో కొనసాగిన ఘటనల వెనుక ఎవరున్నట్టు? అస్సాంలో సైతం ఆందోళనలు ఎందుకు జరుగుతున్నట్టు? అక్కడ బీజేపీ, బీజేపీ కూటమి ప్రభుత్వాలే కదా ఉన్నాయి! సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో యువకులు మాట్లాడిన తీరు వారిలో గూడుకట్టుకున్న తీవ్ర అసహనాన్ని, అసంతృప్తిని వెల్లడిస్తున్నాయి. వారిని సమస్యగా పరిగణించి, బలప్రయోగంతో అణచడానికి బదులు సానుభూతితో అర్థం చేసుకోవడం అవసరం. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినందుకు వారిపై ఎటూ కేసులు ముసురుకుంటాయి. వాటి సంగతలా ఉంచి సైన్యానికి ఎంపికైతే ఎదురయ్యే కష్టాలు తెలిసి కూడా వీరంతా ఎందుకు సిద్ధపడతారో గ్రహించాలి. గ్రామీణ భారతంలో అలుముకున్న దారిద్య్రం, తగిన విద్యార్హతలు పొందడానికి సహకరించని ఆర్థిక స్థితిగతులు, కనుచూపు మేరలో కనబడని ఉద్యోగావకాశాలు వగైరా వీరిని సైన్యంలో చేరడానికి సిద్ధపడేలా చేస్తాయనడంలో సందేహం లేదు. కానీ అంతకుమించిన ధైర్యసాహసాలు, తెగువ, మీదుమిక్కిలి దేశంపై ప్రేమాభిమానాలు గుండెనిండా ఉన్నవారే ఆ బాట పట్టగలరని గుర్తించాల్సి వుంది. దేశభక్తి గురించి గంటలతరబడి మాట్లాడే స్థితిమంతుల పిల్లల్లో ఎంతమంది నిత్యం ప్రాణాలకు ముప్పు పొంచివుండే కొలువుకు సిద్ధపడతారు? ఎప్పుడేం జరుగుతుందో తెలియని సరిహద్దు ప్రాంతాల్లో, ఉగ్రవాద ప్రాబల్య ప్రాంతాల్లో సైనికుడిగా పనిచేసేందుకు వారిలో ఎందరు వెళ్తారు? కనుక నిరసనకు దిగిన యువతపై ముద్రలు వేయడం మానుకోవాలి. సైన్యంలో చేరడానికి ఇతరత్రా పరీక్షల్లో అర్హత సంపాదించి రెండేళ్లుగా రాత పరీక్ష కోసం నిరీక్షిస్తూ, అప్పో సప్పో చేసి శిక్షణ కోసం నెలనెలా వందల రూపాయలు ఖర్చు చేస్తున్న యువతకు కేంద్రం తాజా పథకం దిగ్భ్రాంతి కలిగించింది. అగ్నిపథ్ ప్రకటించినప్పుడు ప్రస్తుత నియామక ప్రక్రియకు ఇది వర్తించబోదని చెబితే సమస్య ఇంత దూరం వచ్చేది కాదు. వయోపరిమితిని ఈసారికి రెండేళ్లు పెంచుతున్నట్టు శుక్రవారం ప్రకటించారు. ముందే ఆ పని ఎందుకు చేయలేక పోయారు? రెండేళ్లుగా ఏదో కారణాలతో నియామకాలు నిలిపేయడంతో వయసు మీరి కొందరికి అనర్హత వస్తుందన్న అంచనా లేదా? అలాగే ఉద్యోగం తాత్కాలిక ప్రాతిపదికనే ఉంటుందనీ, నాలుగేళ్ల తర్వాత కేవలం 25 శాతంమందికి మాత్రమే కొనసాగే వీలుంటుందనీ అనడం మింగుడు పడటం లేదు. ఆ 25 శాతం మందికి కూడా నాలుగేళ్ల సర్వీసు పరిగణనలోకి రాదట! శాశ్వత కొలువు లేకపోవడం, పింఛన్ లేకపోవడం యువకులను నిరాశపరుస్తోంది. మున్ముందు ఖజానాకు భారమవుతుందని ప్రభుత్వం భావించడంవల్ల ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. కానీ ఆ విషయంలో బహిరంగ చర్చ, ఏకాభిప్రాయ సాధన అవసరం లేదా? తాము ఒక నిర్ణయం తీసుకుంటే అందరూ శిరసావహించి తీరాలన్న మనస్తత్వం ఏదైనా కావొచ్చుగానీ... ప్రజాస్వామిక దృక్పథం కాదు. ఈ పథకం సైన్యాన్ని బలహీనపరుస్తుందనీ, దేశ భద్రతకు మంచిది కాదనీ విపక్షాలంటున్నాయి. అదే మాట బీజేపీని గట్టిగా సమర్థించే మేజర్ జనరల్ (రిటైర్డ్) జీడీ బక్షీ సైతం చెబుతున్నారు. లోటు పాట్లతో ఉన్న విధానాన్ని సరిచేద్దామనుకోవడంలో అర్థముంది. సజావుగా ఉన్నదాన్ని తీరికూర్చుని సమస్యాత్మకం చేయడం సరికాదు. కేంద్రం అన్ని వర్గాలతోనూ సమగ్రంగా చర్చించాలి. ‘అగ్ని పథ్’కు సవరణలు అవసర మో, సమూల మార్పు అవసరమో ఆలోచించాలి. -
సికింద్రాబాద్ స్టేషన్‌కు.. ఎయిర్‌పోర్టు లుక్
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ప్రధాన రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలతో, విమానా శ్రయాల స్థాయిలో అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఎట్టకేలకు పట్టాలెక్కబోతోంది. కేంద్రం గతంలోనే ఈ ప్రతిపాదన చేసినా.. ఇండియన్ రైల్వేస్టేషన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్ఎస్ డీసీ)ని ఏర్పాటు చేసినా కార్యరూపంలోకి రాలేదు. ఐఆర్ఎస్డీసీని రద్దు చేసి ఈ బాధ్యతను రైల్ ల్యాండ్ డెవలప్మెంట్ అథారిటీ (ఆర్ఎల్డీఏ)కు అప్పగించినా అడుగు ముందుకు పడలేదు. చివరికి బాధ్య తను జోన్ల అధికారులకు కట్టబెట్టారు. తాజా బడ్జెట్లో దక్షిణ మధ్యరైల్వే పరిధిలో స్టేషన్ల అభివృ ద్ధికి రూ.325 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో రాష్ట్రంలోని సికింద్రాబాద్ స్టేషన్‌తోపాటు ఏపీలోని నెల్లూరు, తిరుపతి స్టేషన్లను తీర్చిదిద్దనున్నారు. త్వరలోనే టెండర్లు.. సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి కోసం దక్షిణమధ్య రైల్వే త్వరలోనే ఈపీసీ టెండర్లు పిలవనుంది. స్టేషన్లో పార్కింగ్ మొదలు, రైలు ఎక్కేవరకు అడుగడుగునా అంతర్జాతీయ స్థాయి వసతులను ఏర్పాటు చేస్తారు. విమానాశ్రయంలో ఉన్న తరహాలో ఆధునిక ఏర్పాట్లు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు, సినిమా హాళ్లు వంటివీ ఉంటాయి. ఈ మేరకు భవనాన్ని పూర్తిస్థాయిలో తీర్చిదిద్దుతారు. ఈ పనులకు నెల రోజుల్లో టెండర్లు పిలిచి, మూడు నెలల్లోపు వర్క్ ఆర్డర్ ఇవ్వాలని భావిస్తున్నారు. ఆ వెంటనే పనులు మొదలుకానున్నాయి. -
రైలొచ్చేలోగా.. రిలాక్స్
రైలు దిగగానే ఎక్కడో ఒక చోట అలా వాలిపోతే బావుండుననిపించేంతటి బడలిక. ఒత్తిడి. అదిగో ... సరిగ్గా అలాంటి ప్రయాణికుల కోసమే దక్షిణ మధ్య రైల్వే చక్కని సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణ బడలికను తీర్చి ఎంతో ఊరటను, హాయిని కలిగించే మసాజ్ చైర్లను తొలిసారి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ప్రారంభించింది. ఇప్పటి వరకు ఎయిర్‌పోర్టులకు మాత్రమే పరిమితమైన మసాజ్ చైర్ సేవలు ఇప్పుడు రైల్వేస్టేషన్లలో సైతం అందుబాటులోకి వచ్చాయి. గురువారం సికింద్రాబాద్ స్టేషన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై సికింద్రాబాద్ డివిజినల్ రైల్వే మేనేజర్ అమిత్ వరదాన్ ఈ మసాజ్ చైర్లను లాంఛనంగా ప్రారంభించారు. ప్రయాణికులకు విమానాశ్రయం తరహాలో సదుపాయాలను అందజేసేందుకు దక్షిణ మధ్య రైల్వే పలు చర్యలు చేపట్టిందన్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు ట్రైన్ దిగగానే కొద్ది సేపు సేదదీరేందుకు ఈ చైర్లు ఎంతో దోహదం చేస్తాయన్నారు. ఐదు నిమిషాల మసాజ్ అనంతరం తిరిగి తమ గమ్యస్థానానికి బయలుదేరవచ్చునని పేర్కొన్నారు. దక్షిణ మధ్య రైల్వేలోనే అతి పెద్ద స్టేషన్ అయిన సికింద్రాబాద్‌లో ప్రయాణికులకు ఆధునిక సదుపాయాలను అందజేస్తున్నట్లు చెప్పారు. 50 రూపాయలు 5 నిమిషాలు.. ప్రస్తుతం సికింద్రాబాద్ స్టేషన్లో ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్‌పైన రెండు, పదో నంబర్ ప్లాట్‌ఫామ్‌పైన రెండు మసాజ్ చైర్లను ఏర్పాటు చేశారు. ఈ చైర్లో 5 నిమిషాల సర్వీసుకు రూ.50 చార్జీ ఉంటుంది. దీనితో పాటు శరీరం మొత్తం రిలాక్స్ అయ్యేవిధంగా మసాజ్ అవుతుంది. శరీరంలోని ప్రతి కండరానికి రక్తసరఫరా పెరిగి ఒత్తిడి తగ్గేలా ఈ చైర్ చక్కటి మసాజ్‌ను అందజేస్తుంది. సుదూరప్రయాణాలు చేసి వచ్చే వారికి ఇది ఎంతో అవసరమని, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉన్న మసాజ్ చైర్లకు అనూహ్యమైన డిమాండ్ ఉందని నిర్వాహకుడు శివకుమార్ తెలిపారు. ‘సాధారణంగా మసాజ్ సెంటర్లు, ఫిజియోథెరపీ కేంద్రాల్లో రూ.వందల్లో ఫీజు తీసుకుంటారు. రైల్వేస్టేషన్లో కేవలం రూ.50లు తీసుకుంటున్నాం. బయట ఒక అరగంట పాటు మసాజ్ చేసినప్పుడు ఎలాంటి రిలాక్స్ అనుభూతి కలుగుతుందో ఈ చైర్లో కేవలం 5 నిమిషాల్లో కూడా అలాంటి అనుభూతినే పొందవచ్చు.’’అని చెప్పారు. ఒక్కసారిగా బడలిక ఎగిరిపోతుందన్నారు. ఇవీ ప్రయోజనాలు.. ►తల, మెడ, వెన్ను భాగం మొదలుకొని కాళ్లు, చేతుల వరకు అన్నింటికి మసాజ్ అందుతుంది. ►ఒకే సమయంలో శరీరంలోని అన్ని భాగాలు రిలాక్స్ అవుతాయి. ► క్షణాల్లో ఒత్తిడి మాయమవుతుంది. రక్తసరఫరా బాగా మెరుగు పడుతుంది. ►శరీరంలో ఉండే నొప్పులు, బాధలు తగ్గిపోతాయి. ►దశలవారీగా కాచిగూడ, నాంపల్లి, తదితర ప్రధాన స్టేషన్లలోనూ మసాజ్ చైర్లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. – సాక్షి, హైదరాబాద్ -
అదుపు తప్పితే ముప్పే!
సాక్షి, హైదరాబాద్: 676 మీటర్ల పొడవు.. రెండు వందలకుపైగా రైళ్ల రాకపోకలు.. రెండు లక్షల మందికిపైగా ప్రయాణికులు.. పది ప్లాట్‌ఫామ్‌లు.. ఇదీ స్థూలంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రూపం. కానీ ఇంత భారీ రైల్వేస్టేషన్లో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు కేవలం మూడే. ఏ రెండు రైళ్లు ఒకేసారి వచ్చినా.. ఎక్కేవారు, దిగేవారితో ఫుట్ఓవర్ బ్రిడ్జీలు కిక్కిరిసిపోతాయి. ఉదయం, సాయంత్రం సమయాల్లో అయితే ప్రయాణికులంతా తోసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. మరి అలాంటి సమయంలో ఏ చిన్న ఉపద్రవం తలెత్తినా.. ముంబై రైల్వేస్టేషన్ తొక్కిసలాట తరహా ముప్పు తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. దక్షిణ మధ్య రైల్వేకు తలమానికంగా ఉన్న సికింద్రాబాద్ స్టేషన్లో ఫుట్ ఓవర్బ్రిడ్జిల పరిస్థితిపై మంగళవారం ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది. ప్రయాణికుల రద్దీ, బయటకు వెళ్లేందుకు అందుబాటులో ఉన్న మార్గాలు, ప్రత్యామ్నాయాలను గమనించింది. ముంబై తరహా దుర్ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే వైద్య సదుపాయాలు ఎంత దూరంలో అందుబాటులో ఉన్నాయి, స్టేషన్లో ఎలాంటి సదుపాయాలున్నాయి, రద్దీకి సరిపడా ఇంకా ఎన్ని ఫుట్ ఓవర్‌బ్రిడ్జీలు అవసరమన్న అంశాలను పరిశీలించింది. బయటకు దారేదీ..? సికింద్రాబాద్ స్టేషన్లో ఒకటి, పదో నంబర్ ప్లాట్‌ఫారాలు 670 మీటర్ల పొడవు ఉండగా.. మిగతావన్నీ 600, 550 మీటర్లు పొడవున్నాయి. మధ్యలో ఉన్న ప్లాట్‌ఫారాలను ఎంఎంటీఎస్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు నిలిపేందుకు వినియోగిస్తారు. ఎక్స్‌ప్రెస్ రైళ్లు చాలా వరకు ఒకటి, రెండు, తొమ్మిది, పదో ప్లాట్‌ఫారాల్లో నిలుపుతారు. ఇక స్టేషన్లో ఉన్న మూడు ఫుట్ ఓవర్ బ్రిడ్జీల్లో మధ్యలో ఉన్నది చాలా కాలం కిందటిది. ఇది ఐదు అడుగుల వెడల్పు ఉంటుంది. మిగతా రెండింటిలో ఒకటి బోయిగూడ వైపు, మరొకటి రేతిఫైల్ బస్టాపు వైపు ఉన్నాయి. ఇవి ఆరు అడుగుల వెడల్పుతో ఉన్నాయి. బోయిగూడ వైపు ఉన్న బ్రిడ్జి మాత్రమే ప్రయాణికులు నేరుగా బయటకు వెళ్లేందుకు వీలుగా ఉండగా.. మిగతా రెండు ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్ వరకే ఉన్నాయి. దీంతో బోయిగూడ వైపున్న బ్రిడ్జీపై రద్దీ ఎక్కువగా ఉంటుంది. రద్దీ వేళల్లో ప్రయాణికులు స్టేషన్ నుంచి బయటకు వెళ్లాలన్నా.. ఒక ప్లాట్‌ఫామ్ నుంచి మరో ప్లాట్‌ఫామ్‌కు చేరుకోవాలన్నా ఈ మూడు ఫుట్ ఓవర్ బ్రిడ్జీలే ఆధారం. దీంతో సికింద్రాబాద్‌లో రైళ్లు మారేవారు, వేర్వేరు ప్లాట్‌ఫామ్‌లకు వెళ్లేవారు అంతా ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు ఎక్కుతారు. దానివల్ల రద్దీ పెరిగి తోపులాటకు ఎక్కువ అవకాశం ఉంటుంది. దారులన్నీ ఒక్క వైపే.. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ మంగళవారం ఉదయం ప్రయాణికులతో కిటకిటలాడింది. దసరా సెలవులు ముగియడంతో జంట నగరాలకు చేరుకుంటున్న లక్షల మంది ప్రయాణికులు, వారిని తీసుకెళ్లేందుకు వచ్చే బంధుమిత్రులతో గంట గంటకూ రద్దీ పెరుగుతూనే ఉంది. ఈ స్టేషన్ నుంచి సగటునరోజూ 1.80 లక్షల మంది రాకపోకలు సాగిస్తుంటారు. కానీ మంగళవారం ఉదయం 5 గంటల నుంచి 8.30 మధ్యలోనే.. 50 వేల మంది ప్రయాణికులు, సందర్శకులతో స్టేషన్ కిక్కిరిసిపోయింది. ఉదయం 5.25 గంటలకు నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్, తర్వాత 20 నిమిషాల వ్యవధిలో సింహపురి, గోదావరి ఎక్స్‌ప్రెస్‌లు దాదాపు ఒకేసారి స్టేషన్‌కు చేరుకున్నాయి. సింహపురి ఎక్స్‌ప్రెస్ 9వ నంబర్ ప్లాట్‌ఫామ్‌పై, గోదావరి 5వ నంబర్‌పై నిలిచినా... ప్రయాణికులంతా ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్ వైపు నుంచే బయటకు వెళ్లడంతో ప్రధాన ద్వారం వైపున్న ఫుట్ఓవర్ బ్రిడ్జిపై ఒక్కసారిగా రద్దీ పెరిగింది. తర్వాత అమరావతి ఎక్స్‌ప్రెస్, జన్మభూమి, తుంగభద్ర, కాగజ్‌నగర్ రైళ్లు బయలుదేరడంతో రద్దీ కొనసాగింది. ఉదయం 9.30 గంటలకు వచ్చిన ధానాపూర్ ఎక్స్‌ప్రెస్ వరకు స్టేషన్లో ఇదే పరిస్థితి నెలకొంది. అసలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లలో 80 శాతం సికింద్రాబాద్‌లోనే నిలుస్తాయి. కేవలం 20 శాతం రైళ్లు నాంపల్లి వరకు వెళ్తాయి. సికింద్రాబాద్ నుంచి జంట నగరాల్లోని అన్ని ప్రాంతాలకు బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు అందుబాటులో ఉండటంతో ఈ స్టేషన్‌పై ఒత్తిడి అధికంగా ఉంటోంది. ఎస్కలేటర్లు ఏర్పాటు చేయాలి రైల్వేస్టేషన్లో ఒక ఫుట్ ఓవర్ వంతెనకే ఎస్కలేటర్ ఉంది. మిగతా రెండింటికీ ఏర్పాటు చేయాలి. దాదాపు కిలోమీటర్ పొడవున్న ప్లాట్‌ఫామ్‌పై ప్రయాణికులంతా మధ్యలోని బ్రిడ్జి వద్దకు రావడం ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా రద్దీగా ఉండే బోయిగూడ వైపున్న వంతెనకు ఎస్కలేటర్లు అమర్చాలి.. – కృష్ణ, ప్రయాణికుడు ప్రత్యామ్నాయం ఆలోచించాలి దూర ప్రాంతాల రైళ్లు వచ్చినప్పుడు బోయిగూడ ఫుట్ ఓవర్ బ్రిడ్జి కిక్కిరిసి పోతుంది. అదే సమయంలో ఇక్కడి నుంచి బయలుదేరే రైళ్లు ఉన్నప్పుడు ఎదురుగా వచ్చే ప్రయాణికులతో తీవ్ర ఇబ్బంది ఎదురవుతుంది. దీనికి ప్రత్యామ్నాయం ఆలోచించాలి. – భార్గవ్, ప్రయాణికుడు రైళ్ల ఆలస్యంతోనూ సమస్య రైళ్లు ఆలస్యంగా నడవడం కారణంగా స్టేషన్లో ప్రయాణికులు ఎక్కువసేపు ఉండాల్సి వస్తోంది. ఎప్పటికప్పుడు రైళ్లు వస్తుంటే.. ప్రయాణికులు ఖాళీ అవుతుంటారు. వచ్చీ, పోయే రైళ్లు ఒకే సమయంలో ఉంటే రద్దీ తీవ్రంగా ఉంటోంది.. – విజయలక్ష్మి, ప్రయాణికురాలు ప్రత్యామ్నాయాలివీ.. - ప్రస్తుతమున్న మూడింటికితోడుగా మరో ఫుట్ ఓవర్ బ్రిడ్జిని తక్షణమే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఒక ప్లాట్ ఫామ్ నుంచి మరో ప్లాట్‌ఫామ్‌కు వెళ్లేం దుకు అండర్‌పాస్‌లు ఏర్పాటు చేయాలి. - భూగర్భ మార్గాల ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణికులు బయటకు వెళ్లేందుకు అవకాశం కల్పించాలి. - సందర్శకులను ఫుట్ ఓవర్ బ్రిడ్జిల వరకు వెళ్లకుండా నియంత్రించాలి. అదే సమయంలో ప్రయాణికులు కచ్చితంగా ప్లాట్ఫారాలపైనే ఉండేలా ప్రోత్సహించాలి. - లిఫ్టులు, ఎస్కలేటర్లు మరిన్ని అందు బాటులోకి తేవాలి. - దూర ప్రాంతాలకు వెళ్లే కొన్ని రైళ్లు మినహా 10వ నంబర్ ప్లాట్‌ఫామ్ ఎప్పుడు చూసినా ఖాళీగా ఉం టుంది. దీనిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలి. - ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్ నుంచి బయటకు వచ్చిన వారికి అందుబాటులో ఉన్నట్లుగానే 10వ నంబర్ ప్లాట్‌ఫామ్ వైపు బస్సులు నిలిపేందుకు వీలుగా టెర్మినల్ ఏర్పాటు చేయాలి. అటువైపు నుంచి కూడా బస్సులు వివిధ ప్రాంతాలకు వెళ్లేలా అవకాశం కల్పించాలి. దీనివల్ల ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై, ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై ఒత్తిడి తగ్గుతుంది. - ఒకటో నంబర్ ప్లాట్‌ఫాం తరహాలోనే 10వ నంబర్ వద్ద కూడా టికెట్, రిజర్వేషన్ వంటి కౌంటర్ల వినియోగాన్ని పెంచాలి. -
రైలు ప్రయాణికులకు విజ్ఞప్తి..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఫ్లాట్‌ఫాం టికెట్ చార్జీ పెంపు సాక్షి, హైదరాబాద్: దసరా సెలవులకు ఊరికి వెళుతున్న మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులకు వీడ్కోలు పలికేందుకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళుతున్నారా? అయితే ఇది గమనించండి. గురువారం నుంచి ఫ్లాట్‌ఫాం టికెట్ చార్జీలు పెరుగుతున్నాయి. దసరా రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 21 నుంచి అక్టోబర్ 3 వరకు ఫ్లాట్‌ఫాం టికెట్ చార్జీలు తాత్కాలికంగా పెంచుతున్నట్టు దక్షిణమధ్య రైల్వే బుధవారం తెలిపింది. సాధారణ రోజుల్లో ఉండే రూ.10 టికెట్‌ను రూ.20కి పెంచుతున్నట్టు ప్రకటించింది. 13 రోజుల పాటు పెంచిన చార్జీలు అమలవుతాయని వెల్లడించింది. స్టేషన్‌పై ఒత్తిడిని తగ్గించేందుకు, ప్రయాణికులు కాని వాళ్ల ప్రవేశాన్ని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అనవసరమైన వ్యక్తుల ప్రవేశాన్ని నియంత్రించి, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూసేందుకు ఫ్లాట్‌ఫాం టికెట్ చార్జీ పెంచామని వివరించింది. పండుగల రోజుల్లో ప్రయాణికులతో రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతుంటాయి. తమ వారిని ఊళ్లకు సాగనంపేందుకు ప్రయాణికులతో పాటు వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు స్టేషన్‌కు తరలివస్తుంటారు. దీంతో రద్దీ అనూహ్యంగా పెరుగుతుంది. రద్దీకి అనుగుణంగా స్టేషన్ నిర్వహణ చేపట్టడంతో పాటు, భద్రత కూడా నిర్వాహకులకు సవాల్‌గా మారుతుంది. దీంతో పండుగ సీజన్లలో అనవసర రద్దీని నియంత్రించేందుకు గత కొన్నేళ్లుగా ఫ్లాట్‌ఫాం టికెట్ చార్జీలను తాత్కాలికంగా పెంచుతూ వస్తున్నారు. -
రైల్వేలో రూపాయి అవినీతికీ తావివ్వం
సాక్షి, హైదరాబాద్: రైల్వేశాఖలో ఒక్క రూపా యి అవినీతికి కూడా తావివ్వకుండా చర్యలు తీసుకుంటున్నామని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు వెల్లడించారు. రైల్వేను గొప్ప సంస్థగా నిలిపేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి ఉద్యోగులు బాసటగా నిలవాలని కోరా రు. సోమవారం ఉదయం ఆయన సికింద్రాబాద్ స్టేషన్లో హైదరాబాద్-గుల్బర్గా ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ (డైలీ), కాజీపేట-ముంబై తడోబా ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)లను, నిజామాబాద్ స్టేషన్లో ఏర్పాటు చేసిన రెండు లిఫ్టులను రిమోట్ ద్వారా ప్రారంభించారు. హైదరాబాద్ శివారులోని నాగులపల్లి స్టేషన్-ఢిల్లీలోని తుగ్లకాబాద్ మధ్య కార్గో ఎక్స్‌ప్రెస్ (వీక్లీ)ను సికింద్రాబాద్ స్టేషన్ నుంచే ప్రారంభించారు. అలాగే మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘రైల్వేకు విపరీతంగా పెరుగుతున్న నిర్వహణ వ్యయం పెద్ద సమస్యగా మారింది. ఈ దశలో ఖర్చును నియంత్రించే చర్యలు చేపట్టడంతోపాటు ఆదాయాన్ని పెంచుకునే ప్రత్యామ్నాయాలపై దృష్టి సారిం చాలి. అందుకే సంస్కరణల దిశగా సాగుతున్నాం’’ అని అన్నారు. తాను ఇక దక్షిణాదిలో రైల్వే విస్తరణపై ప్రత్యేక దృష్టి సారిస్తానన్నారు. రైల్వే స్థలాల్లో ఉన్న చెరువులు, కుంటలు, బావులను పునరుద్ధరించి ఆ నీటిని వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. విద్యుత్ పొదుపు చర్యల వల్ల ఇటీవల రూ. 3,500 కోట్ల పొదుపు సాధ్యమైందన్నారు. తెలంగాణ అభివృద్ధికి బాసటగా నిలిచే క్రమంలో నాగులపల్లి, చర్లపల్లి స్టేషన్లలో భారీ హరిత టెర్మినళ్లను నిర్మించనున్నట్లు ప్రభు చెప్పారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రులు హన్సరాజ్ గంగారామ్ అహిర్, బండారు దత్తాత్రేయ, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయి ని నర్సింహారెడ్డి మహేందర్‌రెడ్డి, పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్ పాల్గొన్నారు. రైల్వేకు స్వర్ణయుగం తేవాలి అంతకుముందురైల్ కళారంగ్‌లో దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ స్వర్ణోత్సవాల్లో సురేశ్ ప్రభు పాల్గొన్నారు. స్వర్ణోత్సవాల విషయంలో ఉద్యోగులు చూపే ఉత్సాహాన్ని రైల్వే కు స్వర్ణయుగం తేవటంలోనూ చూపాలన్నా రు. కార్యక్రమంలో రైల్వే మజ్దూర్ యూని యన్ ప్రతినిధులు శివగోపాల్ మిశ్రా, శంకరరావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు నిరసన నినాదాలతో హోరెత్తించారు. -
గుల్బర్గా- హైదరాబాద్ ఇంటర్ సిటీకి పచ్చజెండా
హైదరాబాద్: గుల్బర్గా- హైదరాబాద్ ఇంటర్ సిటీ డైలీ, కాజీపేట్-ముంబయి వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను రైల్వేమంత్రి సురేశ్ ప్రభు సోమవారం ప్రారంభించారు. ఆయన సోమవారం ఉదయం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో వీడియో లింక్ ద్వారా పచ్చజెండా ఊపి రెండు రైళ్లను ఆరంభించారు. అలాగే వీటితోపాటు సికింద్రాబాద్ స్టేషన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫాంలో ఏసీ రిటైరింగ్ రూం, డార్మిటరీ, హైదరాబాద్, కాచిగూడ స్టేషన్లలో వందశాతం ఎల్ఈడీ లైటింగ్ వ్యవస్థను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు పద్మారావు, మహేందర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, రైల్వే జీఎం రవీందర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
టికెట్ లేని ప్రయాణికులకు రూ.16.67 లక్షల జరిమానా
సికింద్రాబాద్ స్టేషన్లో తనిఖీల్లో పట్టుబడ్డ 3 వేలమంది సాక్షి, హైదరాబాద్: టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిపై రైల్వే అధికారులు కొరడా ఝలిపించారు. దక్షిణ మధ్య రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజర్ లక్ష్మినారాయణ్, సీనియర్ డివిజినల్ కమర్షియల్ మేనేజర్ రవి పి.పాడి ఆధ్వర్యంలో 145 మంది సిబ్బంది మంగళవారం ఏకకాలంలో సికింద్రాబాద్ స్టేషన్లో తనిఖీలు జరిపారు. మొత్తం 34 ఎక్స్‌ప్రెస్, 6 ప్యాసింజర్, 36 ఎంఎంటీఎస్ రైళ్లలో తనిఖీలు జరిపి 3,090 మందిని పట్టుకున్నారు. ఇందులో 1,005 మంది టికెట్ లేకుండా ప్రయాణిస్తుండగా.. 1,851 మంది టికెట్‌తో సంబంధంలేని తరగతుల్లో ప్రయాణిస్తున్నారు. 234 మంది బుకింగ్ చేయకుండా సరుకు తరలిస్తూ పట్టుబడ్డారు. వీరందరిపై కేసులు నమోదు చేసిన అధికారులు, రూ.16.67 లక్షల జరిమానా విధించారు. స్టేషన్ పరిసరాలను అపరిశుభ్రంగా మారుస్తున్నందుకు 66 మందికి పెనాల్టీ విధించటం విశేషం. కాకినాడ నుంచి ప్రత్యేక రైలు.. ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో కాకినాడ-సికింద్రాబాద్ మధ్య 25న ప్రత్యేక రైలు నడుపుతున్నారు. ఆ రోజు సాయంత్రం 6.50కి కాకినాడలో బయలుదేరే ప్రత్యేక రైలు (నంబర్ 07012) మరుసటి రోజు ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. -
‘స్టేషన్’కు ముందే బ్రేకులు..
సికింద్రాబాద్ స్టేషన్‌పై పెరుగుతున్న ఒత్తిడి ప్లాట్‌ఫామ్‌లు లేక బయటే ఆగిపోతున్న రైళ్లు పట్టించుకోని అధికారులు సిటీబ్యూరో: గంటకు ఎనభై తొంభై కిలోమీటర్ల వేగంతో వందల కొద్దీ కిలోమీటర్లు పరుగులు తీసిన రైళ్లకు సైతం ఇక్కడ బ్రేకులు తప్పవు. ప్రయాణికులకు గంటల తరబడి పడిగాపులు తప్పవు. ఏళ్లకు ఏళ్లుగా విస్తరణకు నోచుకోని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, అభివృద్ధి చెందని ప్రత్యామ్నాయ రైల్వేస్టేషన్ల ఏర్పాట్లు సగటు ప్రయాణికుల సదుపాయాలకు శాపంగా మారాయి. వరల్డ్ క్లాస్ రైల్వేస్టేషన్ అన్నారు. భారీ ప్రయాణికుల టర్మినళ్లన్నారు. మౌలాలి, మల్కాజిగిరి, లింగంపల్లి స్టేషన్లను విస్తరిస్తామని గొప్పలు చెప్పారు. ప్రతిపాదనలన్నీ అటకెక్కాయి. ఏటా బడ్జెట్‌కు ముందు, వెనుక కాగితాలపై అంకెల గారడీలు చేయడం తప్ప సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధిలో అడుగు ముందుకు పడింది లేదు. అటు రైల్వేశాఖ, ఇటు రాష్ట్రప్రభుత్వం ప్రయాణికుల సదుపాయాలపై శీతకన్ను వేశాయి. హైదరాబాద్ మహానగరం విశ్వనగరంగా పురోగమించాలంటే రైల్వే సదుపాయాల అభివృద్ధి అత్యావశ్యం. ఆ దిశగా ప్రభుత్వం పురోగమించవలసి ఉంది. ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇది. ఆగాల్సిందే.. విశాఖ, తిరుపతి, ముంబై వంటి ఏ స్టేషన్ నుంచి వచ్చే రైళ్లయినా సరే నగర శివార్లలో బ్రేకులు పడుతాయి. విశాఖ నుంచి వాయువేగంతో దూసుకొచ్చే గరీబ్ ఎక్స్‌ప్రెస్ అయినా సరే చర్లపల్లి- ఘట్కేసర్ మధ్యలో ఆగిపోవాల్సిందే. ఉదయం నగర శివార్లకు చేరుకున్న రైళ్లు 45 నిమిషాల నుంచి గంటన్నర ఆలస్యంగా సికింద్రాబాద్ చేరుకుంటున్నాయి. ఇటు ముంబై నుంచి వచ్చే రైళ్లకు సైతం లింగంపల్లికి చేరుకోకుండానే బ్రేకులు పడుతున్నాయి. సికింద్రాబాద్ స్టేషన్లో ఉన్న 10 ప్లాట్‌ఫామ్‌లలో ఏదో ఒకటి ఖాళీ అయితే తప్ప మరో రైలు వచ్చేందుకు అవకాశం లేదు. ఉదయం 7.45కు చేరుకోవాల్సిన సింహపురి ఎక్స్‌ప్రెస్ తరచు 8.30కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఉదయం 6.35కే రావలసిన గౌతమి ఎక్స్‌ప్రెస్ 7 దాటితే త ప్ప సికింద్రాబాద్‌లో ప్రత్యక్షం కాదు. దీంతో గంటల తరబడి రైళ్లలో గడిపి మరికొద్ది సేపట్లో స్టేషన్‌కు చేరుకుంటామనుకునే ప్రయాణికులు నగర శివార్లలో దిగలేక, సకాలంలో స్టేషన్‌కు చేరుకోలేక రైళ్లలోనే బాధలు పడుతున్నారు. 10 ప్లాట్‌ఫామ్‌లు ఉన్న సికింద్రాబాద్‌లో ప్రతి రోజు 150 రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఎక్స్‌ప్రెస్‌లు, ప్యాసింజర్లు, ఎంఎంటీఎస్ రైళ్లతో ప్రతి క్షణం రద్దీ ఉంటుంది. సుమారు 1.6 లక్షల నుంచి 2 లక్షల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. స్టేషన్ అభివృద్ధి కోసం 2008లో వరల్డ్‌క్లాస్ ప్రమాణాలకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ ఇప్పటికీ ఆచరణకు నోచలేదు. అంచెలంచెలుగా.... సికింద్రాబాద్ స్టేషన్ ఒక అద్భుతమైన చారిత్రక కట్టడం. నిజామ్స్ రైల్వే 1874 అక్టోబర్‌లో మొట్టమొదట ఒక్క ప్లాట్‌ఫామ్‌తో దీన్ని ప్రారంభించింది. సికింద్రాబాద్-వాడి స్టేషన్ల మధ్య మొదట రైల్వే సేవలు ప్రారంభమయ్యాయి. క్రమంగా ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఇందుకు అనుగుణంగానే సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. అసఫ్‌జాహీల నిర్మాణ శైలిలో కట్టించిన ఈ భవనం సికింద్రాబాద్ లోనే గొప్ప పర్యాటక కేంద్రం. 1916లో కాచిగూడ రైల్వేస్టేషన్ కట్టించే వరకు నిజామ్ రైళ్ల రాకపోకలకు సికింద్రాబాద్ స్టేషన్ ఒక్కటే కీలకంగా నిలిచింది. 1951లో ఇది ఇండియన్ రైల్వేస్‌లో భాగమైంది. మొదట స్టీమ్ ఇంజన్ నడిచే రోజుల్లో ఒకే ఒక్క ప్లాట్ ఫామ్ ఉండేది. ఆ తరువాత 2 ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటు చేశారు. దశలవారీగా 4 నుంచి 6 ప్లాట్‌ఫామ్‌లకు స్టేషన్ విస్తరించింది. 1993లో సికింద్రాబాద్ స్టేషన్ ను విద్యుదీకరించారు. 2000 సంవత్సరం నుంచి రైళ్ల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. 2003 నాటికి బోయిగూడ వైపు 10 వ ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి వచ్చింది. ఆదాయం ఉన్నా అభివృద్ధి సున్నా... సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రతి రోజు రూ.1.6 కోట్ల ఆదాయం వస్తుంది. లక్షలాది మంది ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తారు. స్టేషన్‌పైన పెరిగిన ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని ఎయిర్‌లెవల్ కన్స్ట్రక్షన్స్ కట్టించి ప్లాట్‌ఫామ్‌లు పెంచాలని 2008లోనే ప్రతిపాదించారు. ఇందుకోసం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వరల్డ్‌క్లాస్ రైల్వేస్టేషన్‌గా అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పటికీ ఆ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. విస్తరణకు నోచని మౌలాలి, లింగంపల్లి స్టేషన్లు.. ప్రస్తుతం 2 ప్లాట్‌ఫామ్‌లు ఉన్న మౌలాలి స్టేషన్లో 4 ప్లాట్‌ఫామ్‌లు కట్టేందుకు కావలసినంత స్థలం ఉంది. కాజీపేట్ జంక్షన్ మీదుగా వచ్చే రైళ్లన్నిటినీ ఇక్కడి నిలిపివేయవచ్చు. పైగా సైనిక్‌పురి, ఏఎస్‌రావునగర్, ఈసీఐఎల్, చర్లపల్లి తార్నాక, సీతాఫల్మండి, ఉప్పల్, తదితర ప్రాంతాల ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం లభిస్తుంది. అలాగే మల్కాజిగిరి స్టేషన్లో ప్రస్తుతం 3 ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. మరో 3 ప్లాట్‌ఫామ్‌లు కట్టేందుకు కావలసిన స్థలం ఉంది. ఈ స్టేషన్లో మౌలిక సదుపాయాలు, అదనపు ట్రాక్‌ల నిర్మాణం వల్ల నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్‌కు వచ్చే రైళ్లను ఇక్కడ నిలిపేందుకు అవకాశం ఉంటుంది. లింగంపల్లి స్టేషన్‌ను మరింత అభివృద్ధి చేసి ట్రాక్‌లు పెంచడం వల్ల ముంబయి మీదుగా వచ్చే రైళ్లను అక్కడ నిలిపేందుకు అవకాశం లభిస్తుంది. పట్టించుకోవడం లేదు.. మల్కాజిగిరి స్టేషన్లో చాలా స్థలం ఉంది. దాన్ని అభివృద్ధి చేస్తే ప్రధానమైన రైళ్లను ఇక్కడే నిలపొచ్చు. దీనిపై ఇప్పటికే అనేక సార్లు రైల్వేకు విజ్ఞప్తి చేశాము.అయినా పట్టించుకోవడం లేదు. - నూర్, అధ్యక్షుడు, సబర్బన్ ట్రైన్ అండ్ బస్సు కమ్యూటర్స్ అసోసియేషన్ సకాలంలో చేరుకోలేకపోతున్నాం.. చాలా వరకు రైళ్లు మౌలాలి పరిసరాల్లోకి రాగానే ఆగిపోతాయి. గరీబ్థ్ ్రకు అక్కడ హాల్టింగ్ లేదు. కానీ ప్రతి రోజూ ఇక్కడికి రాగానే ఆగిపోతుంది. చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎవరూ పట్టించుకోవడం లేదు. - కృష్ణమూర్తి, ప్రయాణికుడు -
సాంకేతిక పరిజ్ఞానంతోనే పారదర్శక పాలన
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడి సికింద్రాబాద్ స్టేషన్లో వైఫై సేవలు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పాలనకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతో దోహదం చేస్తుందని, ఆ దిశగా ప్రధాని మోదీ ఏడాది పాలన అద్భుతంగా సాగిందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. మంగళవారం ఆయన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఉచిత వైఫై సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా ఇంటర్నెట్, వైఫై సేవల అభివృద్ధికి కేంద్రం రూ.లక్షల కోట్లు వెచ్చిస్తుందని తెలిపారు. త్వరలో ఉస్మానియా యూనివర్సిటీతో పాటు దేశంలోని అన్ని యూనివర్సిటీలలో ఉచిత వైఫై సేవలను అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించారు. దేశంలోనే నంబర్-1 రైల్వే స్టేషన్‌గా పేరొందిన సికింద్రాబాద్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. పాత గాంధీ ఆసుపత్రి స్థలాన్ని రైల్వేకు కేటాయిస్తే దాంతో పాటు, చిలకలగూడ వైపు ఉన్న రైల్వే క్వార్టర్స్ స్థలాన్ని కూడా కలుపుకొని సికింద్రాబాద్ స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయవచ్చునన్నారు. కాజీపేట్‌లో రాష్ట్రప్రభుత్వం స్థలం కేటాయిస్తే వచ్చే ఏడాది కల్లా వ్యాగన్ ఫ్యాక్టరీ పూర్తవుతుందని చెప్పారు. ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు మాట్లాడుతూ, ఈ ఏడాది చివరికల్లా నగరమంతటా వైఫై సేవలను విస్తరించనున్నట్లు చెప్పారు. అనంతరం దక్షిణమధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ ప్రయాణికుల పక్షోత్సవాలను ప్రారంభించారు. రైళ్లు, స్టేషన్లలో అందజేస్తున్న సదుపాయాలపై ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఆలస్యంగా ఏపీ ఎక్స్‌ప్రెస్
సాక్షి, హైదరాబాద్: సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి ఢిల్లీ బయలుదేరాల్సిన ఏపీ ఎక్స్‌ప్రెస్ 4 గంటలు ఆలస్యంగా నడవనుంది. ఢిల్లీలో పొగమంచు కారణంగా అక్కడి నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన ఏపీ ఎక్స్‌ప్రెస్ ఆలస్యంగా రావటంతో ఉదయం 6.25కు బదులు 10.25కు బయల్దేరుతుందని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్ఓ సాంబశివరావు ఓ ప్రకటనలో తెలిపారు. సికింద్రాబాద్ స్టేషన్లో రైల్వే అధికారుల తనిఖీలు సికింద్రాబాద్ స్టేషన్లో రైల్వే అధికారులు తనిఖీలు నిర్వహించారు. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న 1,118 మంది, రిజర్వేషన్ లేని టికె ట్లతో రిజర్వ్డ్ బోగీల్లో ప్రయాణిస్తున్న 1,572 మంది, బుకింగ్ లేని లగేజీని తరలిస్తున్న 133 మంది నుంచి పెనాల్టీగా రూ.14.45 లక్షలను వసూలు చేసినట్టు సీపీఆర్ఓ సాంబశివరావు తెలిపారు. -
పోలీసులు పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారు