సాంకేతిక పరిజ్ఞానంతోనే పారదర్శక పాలన
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడి
సికింద్రాబాద్ స్టేషన్‌లో వైఫై సేవలు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పాలనకు సాంకేతిక పరిజ్ఞానం ఎంతో దోహదం చేస్తుందని, ఆ దిశగా ప్రధాని మోదీ ఏడాది పాలన అద్భుతంగా సాగిందని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. మంగళవారం ఆయన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఉచిత వైఫై సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా ఇంటర్నెట్, వైఫై సేవల అభివృద్ధికి కేంద్రం రూ.లక్షల కోట్లు వెచ్చిస్తుందని తెలిపారు. త్వరలో ఉస్మానియా యూనివర్సిటీతో పాటు దేశంలోని అన్ని యూనివర్సిటీలలో ఉచిత వైఫై సేవలను అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడించారు. దేశంలోనే నంబర్-1 రైల్వే స్టేషన్‌గా పేరొందిన సికింద్రాబాద్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు.
పాత గాంధీ ఆసుపత్రి స్థలాన్ని రైల్వేకు కేటాయిస్తే దాంతో పాటు, చిలకలగూడ వైపు ఉన్న రైల్వే క్వార్టర్స్ స్థలాన్ని కూడా కలుపుకొని సికింద్రాబాద్ స్టేషన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయవచ్చునన్నారు. కాజీపేట్‌లో రాష్ట్రప్రభుత్వం స్థలం కేటాయిస్తే వచ్చే ఏడాది కల్లా వ్యాగన్ ఫ్యాక్టరీ పూర్తవుతుందని చెప్పారు. ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు మాట్లాడుతూ, ఈ ఏడాది చివరికల్లా నగరమంతటా వైఫై సేవలను విస్తరించనున్నట్లు చెప్పారు. అనంతరం దక్షిణమధ్య రైల్వే జీఎం శ్రీవాస్తవ ప్రయాణికుల పక్షోత్సవాలను ప్రారంభించారు. రైళ్లు, స్టేషన్‌లలో అందజేస్తున్న సదుపాయాలపై ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ధర్మారెడ్డి, జీవన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.