సాక్షి, హైదరాబాద్: 676 మీటర్ల పొడవు.. రెండు వందలకుపైగా రైళ్ల రాకపోకలు.. రెండు లక్షల మందికిపైగా ప్రయాణికులు.. పది ప్లాట్‌ఫామ్‌లు.. ఇదీ స్థూలంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రూపం. కానీ ఇంత భారీ రైల్వేస్టేషన్‌లో ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు కేవలం మూడే. ఏ రెండు రైళ్లు ఒకేసారి వచ్చినా.. ఎక్కేవారు, దిగేవారితో ఫుట్‌ఓవర్ బ్రిడ్జీలు కిక్కిరిసిపోతాయి. ఉదయం, సాయంత్రం సమయాల్లో అయితే ప్రయాణికులంతా తోసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. మరి అలాంటి సమయంలో ఏ చిన్న ఉపద్రవం తలెత్తినా.. ముంబై రైల్వేస్టేషన్ తొక్కిసలాట తరహా ముప్పు తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది.
దక్షిణ మధ్య రైల్వేకు తలమానికంగా ఉన్న సికింద్రాబాద్ స్టేషన్‌లో ఫుట్ ఓవర్‌బ్రిడ్జిల పరిస్థితిపై మంగళవారం ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన జరిపింది. ప్రయాణికుల రద్దీ, బయటకు వెళ్లేందుకు అందుబాటులో ఉన్న మార్గాలు, ప్రత్యామ్నాయాలను గమనించింది. ముంబై తరహా దుర్ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలు, ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే వైద్య సదుపాయాలు ఎంత దూరంలో అందుబాటులో ఉన్నాయి, స్టేషన్‌లో ఎలాంటి సదుపాయాలున్నాయి, రద్దీకి సరిపడా ఇంకా ఎన్ని ఫుట్ ఓవర్‌బ్రిడ్జీలు అవసరమన్న అంశాలను పరిశీలించింది.
బయటకు దారేదీ..?
సికింద్రాబాద్ స్టేషన్‌లో ఒకటి, పదో నంబర్ ప్లాట్‌ఫారాలు 670 మీటర్ల పొడవు ఉండగా.. మిగతావన్నీ 600, 550 మీటర్లు పొడవున్నాయి. మధ్యలో ఉన్న ప్లాట్‌ఫారాలను ఎంఎంటీఎస్ రైళ్లు, ప్యాసింజర్ రైళ్లు నిలిపేందుకు వినియోగిస్తారు. ఎక్స్‌ప్రెస్ రైళ్లు చాలా వరకు ఒకటి, రెండు, తొమ్మిది, పదో ప్లాట్‌ఫారాల్లో నిలుపుతారు. ఇక స్టేషన్‌లో ఉన్న మూడు ఫుట్ ఓవర్ బ్రిడ్జీల్లో మధ్యలో ఉన్నది చాలా కాలం కిందటిది. ఇది ఐదు అడుగుల వెడల్పు ఉంటుంది. మిగతా రెండింటిలో ఒకటి బోయిగూడ వైపు, మరొకటి రేతిఫైల్ బస్టాపు వైపు ఉన్నాయి. ఇవి ఆరు అడుగుల వెడల్పుతో ఉన్నాయి. బోయిగూడ వైపు ఉన్న బ్రిడ్జి మాత్రమే ప్రయాణికులు నేరుగా బయటకు వెళ్లేందుకు వీలుగా ఉండగా.. మిగతా రెండు ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్ వరకే ఉన్నాయి. దీంతో బోయిగూడ వైపున్న బ్రిడ్జీపై రద్దీ ఎక్కువగా ఉంటుంది. రద్దీ వేళల్లో ప్రయాణికులు స్టేషన్ నుంచి బయటకు వెళ్లాలన్నా.. ఒక ప్లాట్‌ఫామ్ నుంచి మరో ప్లాట్‌ఫామ్‌కు చేరుకోవాలన్నా ఈ మూడు ఫుట్ ఓవర్ బ్రిడ్జీలే ఆధారం. దీంతో సికింద్రాబాద్‌లో రైళ్లు మారేవారు, వేర్వేరు ప్లాట్‌ఫామ్‌లకు వెళ్లేవారు అంతా ఫుట్ ఓవర్ బ్రిడ్జీలు ఎక్కుతారు. దానివల్ల రద్దీ పెరిగి తోపులాటకు ఎక్కువ అవకాశం ఉంటుంది.
దారులన్నీ ఒక్క వైపే..
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ మంగళవారం ఉదయం ప్రయాణికులతో కిటకిటలాడింది. దసరా సెలవులు ముగియడంతో జంట నగరాలకు చేరుకుంటున్న లక్షల మంది ప్రయాణికులు, వారిని తీసుకెళ్లేందుకు వచ్చే బంధుమిత్రులతో గంట గంటకూ రద్దీ పెరుగుతూనే ఉంది. ఈ స్టేషన్ నుంచి సగటునరోజూ 1.80 లక్షల మంది రాకపోకలు సాగిస్తుంటారు. కానీ మంగళవారం ఉదయం 5 గంటల నుంచి 8.30 మధ్యలోనే.. 50 వేల మంది ప్రయాణికులు, సందర్శకులతో స్టేషన్ కిక్కిరిసిపోయింది. ఉదయం 5.25 గంటలకు నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్, తర్వాత 20 నిమిషాల వ్యవధిలో సింహపురి, గోదావరి ఎక్స్‌ప్రెస్‌లు దాదాపు ఒకేసారి స్టేషన్‌కు చేరుకున్నాయి. సింహపురి ఎక్స్‌ప్రెస్ 9వ నంబర్ ప్లాట్‌ఫామ్‌పై, గోదావరి 5వ నంబర్‌పై నిలిచినా... ప్రయాణికులంతా ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్ వైపు నుంచే బయటకు వెళ్లడంతో ప్రధాన ద్వారం వైపున్న ఫుట్‌ఓవర్ బ్రిడ్జిపై ఒక్కసారిగా రద్దీ పెరిగింది. తర్వాత అమరావతి ఎక్స్‌ప్రెస్, జన్మభూమి, తుంగభద్ర, కాగజ్‌నగర్ రైళ్లు బయలుదేరడంతో రద్దీ కొనసాగింది. ఉదయం 9.30 గంటలకు వచ్చిన ధానాపూర్ ఎక్స్‌ప్రెస్ వరకు స్టేషన్‌లో ఇదే పరిస్థితి నెలకొంది. అసలు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లలో 80 శాతం సికింద్రాబాద్‌లోనే నిలుస్తాయి. కేవలం 20 శాతం రైళ్లు నాంపల్లి వరకు వెళ్తాయి. సికింద్రాబాద్ నుంచి జంట నగరాల్లోని అన్ని ప్రాంతాలకు బస్సులు, ఆటోలు, క్యాబ్‌లు అందుబాటులో ఉండటంతో ఈ స్టేషన్‌పై ఒత్తిడి అధికంగా ఉంటోంది.
ఎస్కలేటర్లు ఏర్పాటు చేయాలి
రైల్వేస్టేషన్‌లో ఒక ఫుట్ ఓవర్ వంతెనకే ఎస్కలేటర్ ఉంది. మిగతా రెండింటికీ ఏర్పాటు చేయాలి. దాదాపు కిలోమీటర్ పొడవున్న ప్లాట్‌ఫామ్‌పై ప్రయాణికులంతా మధ్యలోని బ్రిడ్జి వద్దకు రావడం ఇబ్బంది అవుతుంది. ముఖ్యంగా రద్దీగా ఉండే బోయిగూడ వైపున్న వంతెనకు ఎస్కలేటర్లు అమర్చాలి..
– కృష్ణ, ప్రయాణికుడు
ప్రత్యామ్నాయం ఆలోచించాలి
దూర ప్రాంతాల రైళ్లు వచ్చినప్పుడు బోయిగూడ ఫుట్ ఓవర్ బ్రిడ్జి కిక్కిరిసి పోతుంది. అదే సమయంలో ఇక్కడి నుంచి బయలుదేరే రైళ్లు ఉన్నప్పుడు ఎదురుగా వచ్చే ప్రయాణికులతో తీవ్ర ఇబ్బంది ఎదురవుతుంది. దీనికి ప్రత్యామ్నాయం ఆలోచించాలి.
– భార్గవ్, ప్రయాణికుడు
రైళ్ల ఆలస్యంతోనూ సమస్య
రైళ్లు ఆలస్యంగా నడవడం కారణంగా స్టేషన్‌లో ప్రయాణికులు ఎక్కువసేపు ఉండాల్సి వస్తోంది. ఎప్పటికప్పుడు రైళ్లు వస్తుంటే.. ప్రయాణికులు ఖాళీ అవుతుంటారు. వచ్చీ, పోయే రైళ్లు ఒకే సమయంలో ఉంటే రద్దీ తీవ్రంగా ఉంటోంది..
– విజయలక్ష్మి, ప్రయాణికురాలు
ప్రత్యామ్నాయాలివీ..
- ప్రస్తుతమున్న మూడింటికితోడుగా మరో ఫుట్ ఓవర్ బ్రిడ్జిని తక్షణమే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఒక ప్లాట్ ఫామ్ నుంచి మరో ప్లాట్‌ఫామ్‌కు వెళ్లేం దుకు అండర్‌పాస్‌లు ఏర్పాటు చేయాలి.
- భూగర్భ మార్గాల ద్వారా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణికులు బయటకు వెళ్లేందుకు అవకాశం కల్పించాలి.
- సందర్శకులను ఫుట్ ఓవర్ బ్రిడ్జిల వరకు వెళ్లకుండా నియంత్రించాలి. అదే సమయంలో ప్రయాణికులు కచ్చితంగా ప్లాట్‌ఫారాలపైనే ఉండేలా ప్రోత్సహించాలి.
- లిఫ్టులు, ఎస్కలేటర్లు మరిన్ని అందు బాటులోకి తేవాలి.
- దూర ప్రాంతాలకు వెళ్లే కొన్ని రైళ్లు మినహా 10వ నంబర్ ప్లాట్‌ఫామ్ ఎప్పుడు చూసినా ఖాళీగా ఉం టుంది. దీనిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేవాలి.
- ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్ నుంచి బయటకు వచ్చిన వారికి అందుబాటులో ఉన్నట్లుగానే 10వ నంబర్ ప్లాట్‌ఫామ్ వైపు బస్సులు నిలిపేందుకు వీలుగా టెర్మినల్ ఏర్పాటు చేయాలి. అటువైపు నుంచి కూడా బస్సులు వివిధ ప్రాంతాలకు వెళ్లేలా అవకాశం కల్పించాలి. దీనివల్ల ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై, ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై ఒత్తిడి తగ్గుతుంది.
- ఒకటో నంబర్ ప్లాట్‌ఫాం తరహాలోనే 10వ నంబర్ వద్ద కూడా టికెట్, రిజర్వేషన్ వంటి కౌంటర్ల వినియోగాన్ని పెంచాలి.
Comments
Please login to add a commentAdd a comment