సాక్షి, హైదరాబాద్: అపరిశుభ్రమైన బోగీలు. మంచినీళ్లు రాని కుళాయిలు.. తిరగని ఫ్యాన్‌లు, వెలగని లైట్లు.. పనిచేయని ఏసీ.. ట్రైన్‌లో ప్రయాణికులకు సాధారణంగా ఎదురయ్యే సమస్యలివి. గంటల తరబడి ప్రయాణం చేయవలసిన రైల్లో ఏ ఒక్క సదుపాయం లేకపోయినా ఇబ్బందిగానే ఉంటుంది. శుచి, రుచి లేని ఆహారం, ఏ ట్రైన్ ఎప్పుడు వస్తుందో తెలియని అనిశ్చితి వంటి ఇబ్బందులు ఉంటాయి. ప్రయాణికుల ఫిర్యాదుల పరిష్కారం కోసం టోల్‌ఫ్రీ నంబర్లు, సహాయ కేంద్రాలు ఉన్నప్పటికీ సకాలంలో సమస్యలు పరిష్కారం కావడం లేదు. దీంతో రైల్వే సేవలపైన ప్రజల్లో నమ్మకం సడలుతోంది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేందుకు దక్షిణమధ్య రైల్వే వారం క్రితం ప్రవేశపెట్టిన ‘ట్రైన్ కెప్టెన్’వ్యవస్థ సత్ఫలితాలనిస్తోంది. ప్రయాణికుల ఫిర్యాదుల పరిష్కారంలో ట్రైన్ కెప్టెన్‌లు సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
ఫిర్యాదులపై అప్రమత్తమైన రైల్వే
ఇటీవల కేటరింగ్‌పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తడంతో రైల్వే అప్రమత్తమైంది. శుచి, రుచి లేని ఆహారపదార్థాలను అందజేయడం పట్ల ప్రయాణికుల నుంచి తరచుగా ఫిర్యాదులు వస్తున్నాయి. అన్ని ప్రధాన రైళ్లలో ఆన్‌బోర్డు హౌస్ కీపింగ్ సిబ్బంది, ప్యాంట్రీ కారు, తదితర అన్ని సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ సత్వర పరిష్కారం లభించకపోవడం వల్ల రైల్వేలు పెద్ద ఎత్తున అప్రతిష్టను మూటగట్టుకోవాల్సి వచ్చింది. కాగ్ నివేదిక సైతం రైల్వే సేవల్లోని డొల్లతనాన్ని కడిగి పారేసింది. దీంతో రైల్వే అధికారుల్లో చలనం వచ్చింది.
ఏడు రైళ్లలో ‘కెప్టెన్’సేవలు
ప్రయాణికుల సదుపాయాల్లో పారదర్శకతను పెంచేందుకు ‘ట్రైన్ కెప్టెన్’సేవలకు శ్రీకారం చుట్టారు. రైళ్లలో విధులు నిర్వహించే టికెట్ ఎగ్జామినర్లు, కమర్షియల్ సిబ్బంది, కేటరింగ్ సిబ్బంది, ఎలక్ట్రికల్ సిబ్బంది తదితర అన్ని కేటగిరీలకు చెందిన ఉద్యోగులకు ట్రైన్ కెప్టెన్ సమన్వయకర్తగా వ్యవహరిస్తాడు. ప్రయాణికుల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరిస్తాడు. వారు కోరుకున్న సేవలకు అనుగుణంగా సిబ్బందిని పంపిస్తాడు. దీంతో జాప్యానికి తావు లేకుండా ప్రయాణికుల సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తోందని దక్షిణమధ్య రైల్వే ఉన్నతాధికారులు తెలిపారు. ప్రతి ట్రైన్‌లో సుమారు 2,000 మంది ప్రయాణికులకు ట్రైన్ కెప్టెన్ అందుబాటులో ఉంటారు. దక్షిణమధ్య రైల్వే ప్రస్తుతం ఏడు రైళ్లలో కెప్టెన్ సేవలను అమలు చేస్తోంది. దశలవారీగా అన్ని రైళ్లలో కెప్టెన్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణికులు ట్రైన్ ఎక్కడానికి ముందు బోగీ డోర్ వద్ద అతికించిన చార్ట్ లిస్టులో ట్రైన్ కెప్టెన్ పేరు, ఫోన్ నంబర్ ఉంటాయి.
ప్రస్తుతానికి కెప్టెన్ ఉండే రైళ్లు ఇవీ..
- హైదరాబాద్ –న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్ (12723)
- చిత్తూరు–కాచిగూడ వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ (12798)
- నాందేడ్–అమృత్‌సర్ సచ్‌కండ్ ఎక్స్‌ప్రెస్ (12715)
- విజయవాడ–విశాఖపట్టణం రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ (12718)
- గుంటూరు–వికారాబాద్ పల్నాడు ఎక్స్‌ప్రెస్ (12747)
- తిరుపతి–సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ (12731)
- తిరుపతి–నిజామాబాద్ రాయలసీమ ఎక్స్‌ప్రెస్ (12793)
కెప్టెన్ పరిష్కరించగల సమస్యలివీ..
- టికెట్ కన్ఫర్మేషన్‌పై సందేహాల నివృత్తి
- బోగీల్లో నీళ్లు లేకపోవడం.
- బోగీలు అపరిశుభ్రంగా ఉండటం
- రైళ్లలో భద్రత లేకపోవడం. సెల్‌ఫోన్‌లు, బ్యాగులు చోరీకి గురికావడం
- ఆహారపదార్థాల్లో నాణ్యత, రుచి, శుచిపై..
- ట్రైన్ ఎక్కినప్పటి నుంచి దిగేవరకు అన్ని ఫిర్యాదులకు పరిష్కారంగా నిలుస్తారు.
స్పందన బాగుంది: ప్రమీల
బెర్తులు తెలుసుకోవడంలో ఇబ్బందైంది. ఫోన్ చేయగానే సిబ్బంది వెంటనే వచ్చారు. సెక్యూరిటీ గురించి కొన్ని సందేహాలను నివృత్తి చేసుకున్నాం. అధికారుల స్పందన చాలా బాగుంది.
ఎదురు చూడాల్సి వచ్చేది: రాజేశ్
గతంలో ట్రైన్ ఎక్కి నప్పుడు ఫిర్యాదు చేస్తే దిగి వెళ్లిపోయే వరకు కూడా వచ్చే వాళ్లు కాదు. పైగా ఏ సమస్యకు ఎవరిని సంప్రదిం చా లో తెలిసేది కాదు. ఇప్పుడు అన్నింటికీ ఒకే నంబర్‌తో పరిష్కారం లభిస్తుంది.
అడిగి తెలుసుకుంటున్నారు: సరోజిని
సాధారణంగా ఫిర్యాదు చేసినప్పుడే వస్తారు. కానీ ట్రైన్ ఎక్కగానే ఏవైనా ఇబ్బందులు ఉంటే చెప్పాలని వాళ్లే అన్నీ అడిగి తెలుసుకుంటున్నారు. చాలా సంతోషం.
Comments
Please login to add a commentAdd a comment