సికింద్రాబాద్ స్టేషన్‌లో తనిఖీల్లో పట్టుబడ్డ 3 వేలమంది
సాక్షి, హైదరాబాద్: టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న వారిపై రైల్వే అధికారులు కొరడా ఝలిపించారు. దక్షిణ మధ్య రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజర్ లక్ష్మినారాయణ్, సీనియర్ డివిజినల్ కమర్షియల్ మేనేజర్ రవి పి.పాడి ఆధ్వర్యంలో 145 మంది సిబ్బంది మంగళవారం ఏకకాలంలో సికింద్రాబాద్ స్టేషన్‌లో తనిఖీలు జరిపారు. మొత్తం 34 ఎక్స్‌ప్రెస్, 6 ప్యాసింజర్, 36 ఎంఎంటీఎస్ రైళ్లలో తనిఖీలు జరిపి 3,090 మందిని పట్టుకున్నారు. ఇందులో 1,005 మంది టికెట్ లేకుండా ప్రయాణిస్తుండగా.. 1,851 మంది టికెట్‌తో సంబంధంలేని తరగతుల్లో ప్రయాణిస్తున్నారు. 234 మంది బుకింగ్ చేయకుండా సరుకు తరలిస్తూ పట్టుబడ్డారు. వీరందరిపై కేసులు నమోదు చేసిన అధికారులు, రూ.16.67 లక్షల జరిమానా విధించారు. స్టేషన్ పరిసరాలను అపరిశుభ్రంగా మారుస్తున్నందుకు 66 మందికి పెనాల్టీ విధించటం విశేషం.
కాకినాడ నుంచి ప్రత్యేక రైలు..
ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో కాకినాడ-సికింద్రాబాద్ మధ్య 25న ప్రత్యేక రైలు నడుపుతున్నారు. ఆ రోజు సాయంత్రం 6.50కి కాకినాడలో బయలుదేరే ప్రత్యేక రైలు (నంబర్ 07012) మరుసటి రోజు ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
టికెట్ లేని ప్రయాణికులకు రూ.16.67 లక్షల జరిమానా
Published Wed, Oct 21 2015 12:24 AM | Last Updated on Sun, Sep 3 2017 11:15 AM
Advertisement
Advertisement