‘స్టేషన్’కు ముందే బ్రేకులు.. | 'Station' to the brakes before | Sakshi
Sakshi News home page

‘స్టేషన్’కు ముందే బ్రేకులు..

Published Mon, Aug 24 2015 8:44 AM | Last Updated on Sun, Sep 3 2017 8:00 AM

‘స్టేషన్’కు ముందే బ్రేకులు..

‘స్టేషన్’కు ముందే బ్రేకులు..

సికింద్రాబాద్ స్టేషన్‌పై పెరుగుతున్న ఒత్తిడి
ప్లాట్‌ఫామ్‌లు లేక బయటే ఆగిపోతున్న రైళ్లు
పట్టించుకోని అధికారులు

 
సిటీబ్యూరో: గంటకు ఎనభై తొంభై కిలోమీటర్ల వేగంతో వందల  కొద్దీ కిలోమీటర్లు పరుగులు తీసిన రైళ్లకు  సైతం ఇక్కడ బ్రేకులు తప్పవు. ప్రయాణికులకు గంటల తరబడి పడిగాపులు తప్పవు. ఏళ్లకు ఏళ్లుగా విస్తరణకు నోచుకోని సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, అభివృద్ధి చెందని ప్రత్యామ్నాయ రైల్వేస్టేషన్ల ఏర్పాట్లు సగటు ప్రయాణికుల సదుపాయాలకు శాపంగా మారాయి. వరల్డ్ క్లాస్ రైల్వేస్టేషన్ అన్నారు. భారీ ప్రయాణికుల టర్మినళ్లన్నారు. మౌలాలి, మల్కాజిగిరి, లింగంపల్లి స్టేషన్‌లను విస్తరిస్తామని గొప్పలు చెప్పారు.

 

ప్రతిపాదనలన్నీ అటకెక్కాయి. ఏటా బడ్జెట్‌కు ముందు, వెనుక కాగితాలపై అంకెల గారడీలు చేయడం తప్ప సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధిలో అడుగు ముందుకు పడింది లేదు. అటు రైల్వేశాఖ, ఇటు రాష్ట్రప్రభుత్వం ప్రయాణికుల సదుపాయాలపై శీతకన్ను వేశాయి. హైదరాబాద్ మహానగరం విశ్వనగరంగా పురోగమించాలంటే  రైల్వే సదుపాయాల అభివృద్ధి అత్యావశ్యం. ఆ దిశగా ప్రభుత్వం పురోగమించవలసి ఉంది. ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఇది.

ఆగాల్సిందే..
విశాఖ, తిరుపతి, ముంబై వంటి  ఏ స్టేషన్  నుంచి వచ్చే రైళ్లయినా సరే నగర శివార్లలో బ్రేకులు పడుతాయి. విశాఖ నుంచి  వాయువేగంతో దూసుకొచ్చే గరీబ్ ఎక్స్‌ప్రెస్ అయినా సరే చర్లపల్లి- ఘట్‌కేసర్ మధ్యలో ఆగిపోవాల్సిందే. ఉదయం  నగర శివార్లకు చేరుకున్న రైళ్లు 45 నిమిషాల నుంచి  గంటన్నర ఆలస్యంగా  సికింద్రాబాద్ చేరుకుంటున్నాయి. ఇటు ముంబై నుంచి వచ్చే రైళ్లకు సైతం లింగంపల్లికి  చేరుకోకుండానే  బ్రేకులు పడుతున్నాయి. సికింద్రాబాద్ స్టేషన్‌లో ఉన్న 10 ప్లాట్‌ఫామ్‌లలో  ఏదో ఒకటి ఖాళీ అయితే తప్ప మరో రైలు వచ్చేందుకు అవకాశం లేదు.

 

ఉదయం 7.45కు చేరుకోవాల్సిన  సింహపురి ఎక్స్‌ప్రెస్ తరచు 8.30కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఉదయం 6.35కే  రావలసిన  గౌతమి  ఎక్స్‌ప్రెస్  7 దాటితే  త ప్ప సికింద్రాబాద్‌లో ప్రత్యక్షం కాదు. దీంతో  గంటల తరబడి  రైళ్లలో  గడిపి మరికొద్ది సేపట్లో స్టేషన్‌కు చేరుకుంటామనుకునే ప్రయాణికులు నగర శివార్లలో దిగలేక, సకాలంలో స్టేషన్‌కు చేరుకోలేక రైళ్లలోనే బాధలు పడుతున్నారు.  10 ప్లాట్‌ఫామ్‌లు ఉన్న సికింద్రాబాద్‌లో ప్రతి రోజు 150  రైళ్లు రాకపోకలు సాగిస్తాయి. ఎక్స్‌ప్రెస్‌లు, ప్యాసింజర్లు, ఎంఎంటీఎస్ రైళ్లతో ప్రతి క్షణం రద్దీ ఉంటుంది. సుమారు 1.6 లక్షల నుంచి  2 లక్షల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. స్టేషన్ అభివృద్ధి కోసం 2008లో వరల్డ్‌క్లాస్ ప్రమాణాలకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ ఇప్పటికీ  ఆచరణకు నోచలేదు.

 అంచెలంచెలుగా....
 సికింద్రాబాద్ స్టేషన్ ఒక అద్భుతమైన చారిత్రక కట్టడం. నిజామ్స్ రైల్వే 1874 అక్టోబర్‌లో  మొట్టమొదట ఒక్క  ప్లాట్‌ఫామ్‌తో దీన్ని ప్రారంభించింది. సికింద్రాబాద్-వాడి స్టేషన్‌ల మధ్య మొదట రైల్వే సేవలు ప్రారంభమయ్యాయి. క్రమంగా ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఇందుకు అనుగుణంగానే సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. అసఫ్‌జాహీల నిర్మాణ శైలిలో కట్టించిన ఈ భవనం సికింద్రాబాద్ లోనే గొప్ప పర్యాటక కేంద్రం. 1916లో కాచిగూడ రైల్వేస్టేషన్ కట్టించే వరకు  నిజామ్ రైళ్ల రాకపోకలకు సికింద్రాబాద్ స్టేషన్ ఒక్కటే కీలకంగా నిలిచింది. 1951లో ఇది ఇండియన్ రైల్వేస్‌లో భాగమైంది. మొదట స్టీమ్ ఇంజన్ నడిచే రోజుల్లో ఒకే ఒక్క ప్లాట్ ఫామ్ ఉండేది. ఆ తరువాత  2 ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటు చేశారు. దశలవారీగా 4 నుంచి 6 ప్లాట్‌ఫామ్‌లకు స్టేషన్ విస్తరించింది. 1993లో సికింద్రాబాద్ స్టేషన్ ను విద్యుదీకరించారు. 2000 సంవత్సరం నుంచి  రైళ్ల సంఖ్య అనూహ్యంగా పెరిగింది.  2003 నాటికి బోయిగూడ వైపు  10 వ ప్లాట్‌ఫామ్ అందుబాటులోకి వచ్చింది.

 ఆదాయం ఉన్నా అభివృద్ధి సున్నా...
 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ప్రతి రోజు రూ.1.6 కోట్ల ఆదాయం వస్తుంది. లక్షలాది మంది  ఇక్కడి నుంచే రాకపోకలు సాగిస్తారు. స్టేషన్‌పైన పెరిగిన ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని ఎయిర్‌లెవల్ కన్‌స్ట్రక్షన్స్ కట్టించి  ప్లాట్‌ఫామ్‌లు పెంచాలని 2008లోనే ప్రతిపాదించారు. ఇందుకోసం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా వరల్డ్‌క్లాస్ రైల్వేస్టేషన్‌గా అభివృద్ధి చేయనున్నట్లు  ప్రకటించారు. కానీ ఇప్పటికీ  ఆ ప్రతిపాదనలు  కాగితాలకే పరిమితమయ్యాయి.  

 విస్తరణకు నోచని మౌలాలి, లింగంపల్లి స్టేషన్లు..
 ప్రస్తుతం 2 ప్లాట్‌ఫామ్‌లు ఉన్న మౌలాలి స్టేషన్‌లో 4 ప్లాట్‌ఫామ్‌లు కట్టేందుకు కావలసినంత స్థలం ఉంది. కాజీపేట్ జంక్షన్ మీదుగా వచ్చే రైళ్లన్నిటినీ ఇక్కడి నిలిపివేయవచ్చు. పైగా  సైనిక్‌పురి, ఏఎస్‌రావునగర్, ఈసీఐఎల్, చర్లపల్లి  తార్నాక, సీతాఫల్‌మండి, ఉప్పల్, తదితర ప్రాంతాల ప్రయాణికులకు ఎంతో ప్రయోజనం లభిస్తుంది. అలాగే మల్కాజిగిరి స్టేషన్‌లో ప్రస్తుతం  3 ప్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. మరో 3 ప్లాట్‌ఫామ్‌లు కట్టేందుకు కావలసిన స్థలం ఉంది. ఈ స్టేషన్‌లో మౌలిక సదుపాయాలు, అదనపు ట్రాక్‌ల నిర్మాణం వల్ల నిజామాబాద్ నుంచి సికింద్రాబాద్‌కు వచ్చే రైళ్లను  ఇక్కడ నిలిపేందుకు అవకాశం ఉంటుంది. లింగంపల్లి స్టేషన్‌ను మరింత అభివృద్ధి చేసి ట్రాక్‌లు పెంచడం వల్ల ముంబయి మీదుగా  వచ్చే రైళ్లను  అక్కడ నిలిపేందుకు అవకాశం లభిస్తుంది.
 
 పట్టించుకోవడం లేదు..

 మల్కాజిగిరి స్టేషన్‌లో చాలా స్థలం ఉంది. దాన్ని అభివృద్ధి చేస్తే  ప్రధానమైన రైళ్లను ఇక్కడే నిలపొచ్చు. దీనిపై ఇప్పటికే అనేక సార్లు రైల్వేకు విజ్ఞప్తి చేశాము.అయినా పట్టించుకోవడం లేదు.   - నూర్, అధ్యక్షుడు,  సబర్బన్ ట్రైన్ అండ్ బస్సు కమ్యూటర్స్ అసోసియేషన్
 
 సకాలంలో చేరుకోలేకపోతున్నాం..
 చాలా వరకు రైళ్లు మౌలాలి పరిసరాల్లోకి రాగానే ఆగిపోతాయి. గరీబ్థ్ ్రకు అక్కడ  హాల్టింగ్ లేదు. కానీ ప్రతి రోజూ ఇక్కడికి రాగానే ఆగిపోతుంది. చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎవరూ పట్టించుకోవడం లేదు. - కృష్ణమూర్తి, ప్రయాణికుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement