
త్రివిధ దళాల్లో యువతను చేర్చుకోవడానికి కేంద్రం ప్రకటించిన ‘అగ్నిపథ్’పై మూడు రోజులుగా ఉత్తరాదిలో సాగుతున్న హింసాత్మక ఆందోళనలు దక్షిణాదికి కూడా వ్యాపించాయి. సికింద్రాబాద్ స్టేషన్‌లో శుక్రవారం వేలాదిమంది యువకులు హింసకు పాల్పడటం, పోలీసు కాల్పుల్లో ఒకరు మరణించగా పలువురు గాయపడటం, రైళ్లకు నిప్పెట్టడం, పొద్దు పోయే వరకూ ఉద్రిక్తతలు కొన సాగటం దిగ్భ్రాంతికరం. దాదాపు పది గంటల అనంతరం అక్కడ పరిస్థితి చక్కబడింది.
చాలాసేపు పోలీసులను నిస్సహాయత ఆవరించింది. తమపై ఎలాంటి హెచ్చరిక లేకుండా కాల్పులు జరిపారని ఆందోళన కారుల ఆరోపణ. అల్లర్లకు దిగినవారిని అదుపు చేయడానికి కాల్పులు తప్పనిసరను కుంటే మోకాళ్లకింది భాగంలోనే కాల్చాలని నిబంధనలు చెబుతున్నాయి. మరి అలా జరిగిందా? ఉత్తరాదిన జరుగుతున్న ఘటనల పరంపర తీరును సరిగా అధ్యయనం చేసి, ముందస్తు చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదు.
ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర నిఘా విభాగాల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతోంది. నిర్ణయం ప్రకటించాక ఆలోచించుకోవడం కన్నా, ఆలోచించి నిర్ణ యించడం అన్నివిధాలా మంచిదని ఎన్‌డీఏ సర్కారుకు ఇటీవల తెలియజెప్పిన మరో ఉదంతమిది. లోగడ సాగు చట్టాల విషయంలోనూ ఇదే తంతు నడిచింది. ‘కీలకమైన చట్టాలు తెచ్చేటపుడు సంబంధిత పక్షాలతో మాట్లాడాలి కదా’ అన్నవారి నోళ్లు మూయించడం కోసం ఇన్ని లక్షలమంది రైతులతో, ఇన్ని వేల సంఘాలతో చర్చించామని అప్పటి కేంద్ర వ్యవసాయ మంత్రి లెక్కలు చెప్పారు. కానీ ఆర్‌టీఐ ద్వారా వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తే సంబంధిత రికార్డులు లేవన్న జవాబు వచ్చింది.
చివరికేమైంది? ఆ సాగు చట్టాలను ఉపసంహరించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు సికింద్రాబాద్ ఘటనలకు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అలజడి వెనుక టీఆర్‌ఎస్, ఎంఐఎం ఉందని బీజేపీ ఆరోపిస్తోంది. మరి వరసగా మూడోరోజైన శుక్రవారం కూడా ఉత్తరప్రదేశ్, బిహార్, హరియాణా, మధ్యప్రదేశ్‌లలో కొనసాగిన ఘటనల వెనుక ఎవరున్నట్టు? అస్సాంలో సైతం ఆందోళనలు ఎందుకు జరుగుతున్నట్టు? అక్కడ బీజేపీ, బీజేపీ కూటమి ప్రభుత్వాలే కదా ఉన్నాయి!
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో యువకులు మాట్లాడిన తీరు వారిలో గూడుకట్టుకున్న తీవ్ర అసహనాన్ని, అసంతృప్తిని వెల్లడిస్తున్నాయి. వారిని సమస్యగా పరిగణించి, బలప్రయోగంతో అణచడానికి బదులు సానుభూతితో అర్థం చేసుకోవడం అవసరం. ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినందుకు వారిపై ఎటూ కేసులు ముసురుకుంటాయి. వాటి సంగతలా ఉంచి సైన్యానికి ఎంపికైతే ఎదురయ్యే కష్టాలు తెలిసి కూడా వీరంతా ఎందుకు సిద్ధపడతారో గ్రహించాలి.
గ్రామీణ భారతంలో అలుముకున్న దారిద్య్రం, తగిన విద్యార్హతలు పొందడానికి సహకరించని ఆర్థిక స్థితిగతులు, కనుచూపు మేరలో కనబడని ఉద్యోగావకాశాలు వగైరా వీరిని సైన్యంలో చేరడానికి సిద్ధపడేలా చేస్తాయనడంలో సందేహం లేదు. కానీ అంతకుమించిన ధైర్యసాహసాలు, తెగువ, మీదుమిక్కిలి దేశంపై ప్రేమాభిమానాలు గుండెనిండా ఉన్నవారే ఆ బాట పట్టగలరని గుర్తించాల్సి వుంది.
దేశభక్తి గురించి గంటలతరబడి మాట్లాడే స్థితిమంతుల పిల్లల్లో ఎంతమంది నిత్యం ప్రాణాలకు ముప్పు పొంచివుండే కొలువుకు సిద్ధపడతారు? ఎప్పుడేం జరుగుతుందో తెలియని సరిహద్దు ప్రాంతాల్లో, ఉగ్రవాద ప్రాబల్య ప్రాంతాల్లో సైనికుడిగా పనిచేసేందుకు వారిలో ఎందరు వెళ్తారు? కనుక నిరసనకు దిగిన యువతపై ముద్రలు వేయడం మానుకోవాలి.
సైన్యంలో చేరడానికి ఇతరత్రా పరీక్షల్లో అర్హత సంపాదించి రెండేళ్లుగా రాత పరీక్ష కోసం నిరీక్షిస్తూ, అప్పో సప్పో చేసి శిక్షణ కోసం నెలనెలా వందల రూపాయలు ఖర్చు చేస్తున్న యువతకు కేంద్రం తాజా పథకం దిగ్భ్రాంతి కలిగించింది. అగ్నిపథ్ ప్రకటించినప్పుడు ప్రస్తుత నియామక ప్రక్రియకు ఇది వర్తించబోదని చెబితే సమస్య ఇంత దూరం వచ్చేది కాదు. వయోపరిమితిని ఈసారికి రెండేళ్లు పెంచుతున్నట్టు శుక్రవారం ప్రకటించారు.
ముందే ఆ పని ఎందుకు చేయలేక పోయారు? రెండేళ్లుగా ఏదో కారణాలతో నియామకాలు నిలిపేయడంతో వయసు మీరి కొందరికి అనర్హత వస్తుందన్న అంచనా లేదా? అలాగే ఉద్యోగం తాత్కాలిక ప్రాతిపదికనే ఉంటుందనీ, నాలుగేళ్ల తర్వాత కేవలం 25 శాతంమందికి మాత్రమే కొనసాగే వీలుంటుందనీ అనడం మింగుడు పడటం లేదు. ఆ 25 శాతం మందికి కూడా నాలుగేళ్ల సర్వీసు పరిగణనలోకి రాదట! శాశ్వత కొలువు లేకపోవడం, పింఛన్ లేకపోవడం యువకులను నిరాశపరుస్తోంది.
మున్ముందు ఖజానాకు భారమవుతుందని ప్రభుత్వం భావించడంవల్ల ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. కానీ ఆ విషయంలో బహిరంగ చర్చ, ఏకాభిప్రాయ సాధన అవసరం లేదా? తాము ఒక నిర్ణయం తీసుకుంటే అందరూ శిరసావహించి తీరాలన్న మనస్తత్వం ఏదైనా కావొచ్చుగానీ... ప్రజాస్వామిక దృక్పథం కాదు. ఈ పథకం సైన్యాన్ని బలహీనపరుస్తుందనీ, దేశ భద్రతకు మంచిది కాదనీ విపక్షాలంటున్నాయి.
అదే మాట బీజేపీని గట్టిగా సమర్థించే మేజర్ జనరల్ (రిటైర్డ్) జీడీ బక్షీ సైతం చెబుతున్నారు. లోటు పాట్లతో ఉన్న విధానాన్ని సరిచేద్దామనుకోవడంలో అర్థముంది. సజావుగా ఉన్నదాన్ని తీరికూర్చుని సమస్యాత్మకం చేయడం సరికాదు. కేంద్రం అన్ని వర్గాలతోనూ సమగ్రంగా చర్చించాలి. ‘అగ్ని పథ్’కు సవరణలు అవసర మో, సమూల మార్పు అవసరమో ఆలోచించాలి.
Comments
Please login to add a commentAdd a comment