
మసాజ్ చైర్‌లను ప్రారంభిస్తున్న సికింద్రాబాద్ డివిజినల్ రైల్వే మేనేజర్ అమిత్ వరదాన్
రైలు దిగగానే ఎక్కడో ఒక చోట అలా వాలిపోతే బావుండుననిపించేంతటి బడలిక. ఒత్తిడి. అదిగో ... సరిగ్గా అలాంటి ప్రయాణికుల కోసమే దక్షిణ మధ్య రైల్వే చక్కని సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణ బడలికను తీర్చి ఎంతో ఊరటను, హాయిని కలిగించే మసాజ్ చైర్‌లను తొలిసారి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ప్రారంభించింది. ఇప్పటి వరకు ఎయిర్‌పోర్టులకు మాత్రమే పరిమితమైన మసాజ్ చైర్ సేవలు ఇప్పుడు రైల్వేస్టేషన్‌లలో సైతం అందుబాటులోకి వచ్చాయి. గురువారం సికింద్రాబాద్ స్టేషన్‌లోని ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై సికింద్రాబాద్ డివిజినల్ రైల్వే మేనేజర్ అమిత్ వరదాన్ ఈ మసాజ్ చైర్‌లను లాంఛనంగా ప్రారంభించారు. ప్రయాణికులకు విమానాశ్రయం తరహాలో సదుపాయాలను అందజేసేందుకు దక్షిణ మధ్య రైల్వే పలు చర్యలు చేపట్టిందన్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులు ట్రైన్ దిగగానే కొద్ది సేపు సేదదీరేందుకు ఈ చైర్‌లు ఎంతో దోహదం చేస్తాయన్నారు. ఐదు నిమిషాల మసాజ్ అనంతరం తిరిగి తమ గమ్యస్థానానికి బయలుదేరవచ్చునని పేర్కొన్నారు. దక్షిణ మధ్య రైల్వేలోనే అతి పెద్ద స్టేషన్ అయిన సికింద్రాబాద్‌లో ప్రయాణికులకు ఆధునిక సదుపాయాలను అందజేస్తున్నట్లు చెప్పారు.
50 రూపాయలు 5 నిమిషాలు..
ప్రస్తుతం సికింద్రాబాద్ స్టేషన్‌లో ఒకటో నంబర్ ప్లాట్‌ఫామ్‌పైన రెండు, పదో నంబర్ ప్లాట్‌ఫామ్‌పైన రెండు మసాజ్ చైర్‌లను ఏర్పాటు చేశారు. ఈ చైర్‌లో 5 నిమిషాల సర్వీసుకు రూ.50 చార్జీ ఉంటుంది. దీనితో పాటు శరీరం మొత్తం రిలాక్స్ అయ్యేవిధంగా మసాజ్ అవుతుంది. శరీరంలోని ప్రతి కండరానికి రక్తసరఫరా పెరిగి ఒత్తిడి తగ్గేలా ఈ చైర్ చక్కటి మసాజ్‌ను అందజేస్తుంది. సుదూరప్రయాణాలు చేసి వచ్చే వారికి ఇది ఎంతో అవసరమని, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉన్న మసాజ్ చైర్‌లకు అనూహ్యమైన డిమాండ్ ఉందని నిర్వాహకుడు శివకుమార్ తెలిపారు. ‘సాధారణంగా మసాజ్ సెంటర్‌లు, ఫిజియోథెరపీ కేంద్రాల్లో రూ.వందల్లో ఫీజు తీసుకుంటారు. రైల్వేస్టేషన్‌లో కేవలం రూ.50లు తీసుకుంటున్నాం. బయట ఒక అరగంట పాటు మసాజ్ చేసినప్పుడు ఎలాంటి రిలాక్స్ అనుభూతి కలుగుతుందో ఈ చైర్‌లో కేవలం 5 నిమిషాల్లో కూడా అలాంటి అనుభూతినే పొందవచ్చు.’’అని చెప్పారు. ఒక్కసారిగా బడలిక ఎగిరిపోతుందన్నారు.
ఇవీ ప్రయోజనాలు..
►తల, మెడ, వెన్ను భాగం మొదలుకొని కాళ్లు, చేతుల వరకు అన్నింటికి మసాజ్ అందుతుంది.
►ఒకే సమయంలో శరీరంలోని అన్ని భాగాలు రిలాక్స్ అవుతాయి.
► క్షణాల్లో ఒత్తిడి మాయమవుతుంది. రక్తసరఫరా బాగా మెరుగు పడుతుంది.
►శరీరంలో ఉండే నొప్పులు, బాధలు తగ్గిపోతాయి.
►దశలవారీగా కాచిగూడ, నాంపల్లి, తదితర ప్రధాన స్టేషన్‌లలోనూ మసాజ్ చైర్‌లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
– సాక్షి, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment