
వారణాసి/లక్నో: ఈవ్ టీజింగ్ ఘటనకు నిరసనగా బనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ)లో విద్యార్థులు శనివారం రాత్రి చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. పోలీసులు లాఠీచార్జీ చేయడంతో పలువురు విద్యార్థులు, ఇద్దరు జర్నలిస్టులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిలో విద్యార్థినులు కూడా ఉన్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని డివిజినల్ కమిషనర్‌ను ఆదేశించారు. ‘గత గురువారం చోటుచేసుకున్న ఈవ్ టీజింగ్ ఘటనపై ఆందోళన చేపట్టిన విద్యార్థులు వర్సిటీ వైస్ చాన్స్‌లర్‌ను ఆయన నివాసంలో కలిసేందుకు శనివారం రాత్రి యత్నించారు.
దీంతో వీసీ నివాస సెక్యూరిటీ గార్డులు పోలీసులకు సమాచారమిచ్చి, విద్యార్థులను నిలిపేశారు. అయినా వినకుండా లోనికి వెళ్లేందుకు విద్యార్థులు విఫల యత్నం చేశారు. ఆ సమయంలో విద్యార్థులతో కలసిపోయిన బయటి వ్యక్తులు రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు’ అని పోలీసు, వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఘర్షణలో పోలీసులకు కూడా గాయాలయ్యాయని పోలీసు అధికారులు తెలిపారు. తాజా ఘటన నేపథ్యంలో సోమవారం నుంచి అక్టోబర్ 2 వరకు యూనివర్సిటీ సెలవులు ప్రకటించింది. విద్యార్థినులపై లాఠీచార్జీని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఖండించారు. బీజేపీ దృష్టిలో బేటీ బచావో, బేటీ పడావో అంటే ఇదేనా అంటూ ఎద్దేవా చేశారు.