Benaras hindhu university
-
బోధనపై ఆంక్షలా?
వివేచనపైనా, వివేకంపైనా పిడివాదమే గెలిచింది. వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యా లయం(బీహెచ్‌యూ)లోని సంస్కృత విద్యా ధర్మ విజ్ఞాన్(ఎస్వీడీవీ) విభాగంలో సంస్కృత విద్యా బోధన కోసం అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా నియమితుడైన ఫిరోజ్‌ఖాన్ దాన్నుంచి తప్పుకుని మరో విభాగంలో చేరవలసి వచ్చింది. విశ్వవిద్యాలయం నిర్వహించిన పరీక్ష, ఇంటర్వ్యూల్లో ఆయన మరో 9మందితో పోటీపడి రెండు నెలలక్రితం ఆ పోస్టుకు ఎంపికయ్యాడు. ఆయనను ఏకగ్రీవంగా ఎంపిక చేసిన బోర్డులో ప్రముఖ సంస్కృత పండితుడు ప్రొఫెసర్ రాధావల్లభ్ త్రిపాఠీతోసహా హేమాహేమీలున్నారు. ఇతరులతో పోలిస్తే ఆ పోస్టుకు కావాల్సిన సకల అర్హతలూ ఆయనకు ఉన్నాయని, ఫిరోజ్‌ఖాన్ సంస్కృతంలో సాహిత్య సంబంధ అంశాలే బోధిస్తారు తప్ప మతపరమైన అంశాలతో ఆయనకు ప్రమేయం ఉండదని బీహెచ్‌యూ వైస్‌చాన్సలర్ రాకేష్ భట్నాగర్, సంస్కృత సాహిత్య విభాగం అధిపతి ప్రొఫెసర్ ఉమాకాంత్ చతుర్వేది, విశ్వవిద్యాలయ పాలకమండలి నచ్చ జెప్పినా విద్యార్థులు అంగీకరించలేదు. సంస్కృతాన్ని మతంతో లేదా కులంతో ముడిపెట్టడం, దాన్ని ఫలానా మతం వారు మాత్రమే నేర్చుకోవాలని, వారు మాత్రమే బోధించాలని ఆంక్షలు పెట్టడం రాజ్యాంగ విలువలకు అపచారం చేయడం మాత్రమే కాదు. ఆ భాషకు కూడా అన్యాయం చేసినట్టే. ప్రజల్లో విస్తృతంగా వాడుకలో ఉన్నప్పుడే ఏ భాషైనా అభివృద్ధి చెందుతుంటుంది. చిర కాలం వర్థిల్లుతుంది. కొందరికే పరిమితమైనప్పుడు కుంచించుకుపోతుంది. సంస్కృత వ్యాకరణం, సాహిత్యం, వేదాలు, ఉపనిషత్తులు ఔపోసనపట్టిన ఫిరోజ్‌ఖాన్‌ను విధ్వంసక శక్తిగా చూడటం, ఆయన బోధనాచార్యుడిగా వస్తే ఏదో అపచారం జరిగిపోతుందని బెంబేలెత్తడం ఆశ్చర్యం కలిగి స్తుంది. రాజస్తాన్‌కు చెందిన ఫిరోజ్ కుటుంబం మూడు తరాలనుంచి సంస్కృతంపైనా, హిందూ మత ఆచారాలపైనా ఆసక్తి, అనురక్తీ పెంచుకుంది. ఒకపక్క మసీదులో నమాజు చేస్తూనే గోవును పూజించడం, వారి స్వస్థలమైన బంగ్రూలో ఉన్న దేవాలయాల్లో భజన గీతాలు పాడటం ఫిరోజ్ తండ్రి రంజాన్ఖాన్కు దశాబ్దాలుగా అలవాటు. రంజాన్‌ఖాన్ సంస్కృతంలో పట్టభద్రుడు. తన కుటుంబం అనుసరిస్తున్న ఆచారాల విషయంలోగానీ, దేవాలయాల్లో భజనగీతాలు పాడటం విషయంలోగానీ ముస్లింలెవరూ అభ్యంతరం చెప్పలేదని ఆయనంటున్నాడు. సంస్కృతంపై తనకు వల్లమాలిన ప్రేమ ఉండబట్టే కుమారుణ్ణి ఆ భాషలో నిష్ణాతుడయ్యేలా ప్రోత్సహించానని చెబుతున్నాడు. ఫిరోజ్‌ఖాన్ సంస్కృత భాషపై చేసిన పరిశోధనైనా, ఆయన మాట్లాడే సంస్కృత భాషైనా అత్యున్నత ప్రమాణాలతో ఉన్నదని ఇంటర్వ్యూ బోర్డులోని సభ్యులు తెలిపారు. ఈ విషయమే ఆందోళన చేస్తున్న విద్యార్థులకు తెలియజెప్పి వారిని ఒప్పించాలని చూశారు. కానీ ఫలితం లేకపోయింది. ఈ ఆందోళన కొనసాగినంతకాలం ఫిరోజ్‌ఖాన్ అజ్ఞాతవాసం గడపవలసి వచ్చింది. చిత్రమేమంటే అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో సంస్కృత విభాగ అధిపతిగా ఉన్న సల్మా మఫీజ్కు ఇలాంటి అడ్డంకులు ఎదురుకాలేదు. అందరూ అత్యంత సంక్లిష్టమైనదిగా భావించే పాణిని విరిచిత సంస్కృత వ్యాకరణం అష్టాధ్యాయిని ఆమె అలవోకగా బోధిస్తారు. సంస్కృత భాషలో పాండిత్యం గడించిన తొలి ముస్లిం మహిళగా ఆమె ప్రపంచ రికార్డు నెలకొల్పారు. ఇప్పుడు పీహెచ్డీ చేస్తున్న 15మంది విద్యార్థులకు ఆమె గైడ్. వారణాసికి చరిత్రలో విశిష్ట స్థానముంది. అక్కడ షా జహాన్ చక్రవర్తి పెద్ద కుమారుడు దారా షికో సంస్కృత భాషను అధ్యయనం చేయడమే కాదు... అందులో నిష్ణాతుడై భగవద్గీతను, 52 ఉపనిషత్తులను పర్షియన్ భాషలోకి అనువదించాడు. సాగర సంగమం పేరుతో హిందూ, ఇస్లాం, ఇతర మతాల మధ్య ఉన్న వైవిధ్యతలనూ, ఏకత్వాన్ని సోదాహరణంగా వివరిస్తూ పర్షియన్ భాషలో గ్రంథం రచించాడు. ఆయనకన్నా ఏడువందల ఏళ్ల ముందు అల్–బిరూని అనే ముస్లిం విద్యాధికుడు ఇప్పటి ఉజ్బెకిస్తాన్, తుర్కుమెనిస్తాన్ల నుంచి భారత్ వచ్చి సంస్కృతంలో పాండిత్యం గడించి ఈ దేశంలోని సంస్కృతి, మతం, జీవనవిధానం, తాత్విక చింతనలను చాటిచెబుతూ ఉద్గ్రంథాన్ని రచించాడు. పర్షియన్ ప్రపంచానికి హిందూ మతాన్ని పరిచయం చేసే వంద గ్రంథాలు వెలువరించాడు. సూఫీ కవి, పండితుడు అమిర్ ఖుస్రో వేదాల్ని, పురాణాల్ని ఔపోసన పట్టి, సంస్కృతంలోనే అనేక రచనలు చేశాడంటారు. ఆయన వచనంలోనూ, కవిత్వంలోనూ అడుగడుగునా అనేక సంస్కృత పదాలుంటాయి. వీరు మాత్రమే కాదు... యూరప్ దేశాలకు చెందిన ఎందరో సంస్కృతాన్ని నేర్చుకున్నారు. 1785లో చార్లెస్ విల్కిన్స్తో మొదలుపెట్టి జర్మనీకి చెందిన మాక్స్ ముల్లర్ వరకూ అనేకులు సంస్కృత కావ్యాలను, గ్రంథాలను ఇంగ్లిష్, జర్మన్ తది తర భాషల్లోకి అనువదించారు. కొందరు పర్షియన్ భాషలోకి అనువాదమైన సంస్కృత కావ్యాలను తర్జుమా చేశారు. సంస్కృతభాషను నిశితంగా అధ్యయనం చేసి భిన్న శతాబ్దాల్లో వెలువడిన సంస్కృత కావ్యాల్లోని భాషా ప్రయోగాల్లో చోటుచేసుకున్న మార్పులపై పరిశోధనలు చేసిన కొలం బియా యూనివర్సిటీ ప్రొఫెసర్ షెల్డన్ పొలాక్ వర్తమాన ప్రపంచంలోని సంస్కృత భాషా పండి తుల్లో అగ్రగణ్యుడు. భాష నేర్చుకోవడానికి కులమో, మతమో అడ్డురావడం అంతిమంగా దానికి ప్రతిబంధక మవుతుంది తప్ప అది విస్తరించడానికి దోహదపడదు. మన దేశంలో ఉన్న కుల వ్యవస్థ ఇలాంటి ప్రతిబంధకాలు సృష్టించబట్టే ఆర్యభట, కణాదుడు, వరాహమిహిరుడు, చరకుడు, సుశ్రుతుడు, బ్రహ్మగుప్తుడు తదితరులు సంస్కృత భాషలో అభివృద్ధి చేసిన ఎన్నో విజ్ఞానశాస్త్రాలు అనంతర కాలంలో విస్తరించలేకపోయాయి. నిజానికి ఇలాంటివి మనకు గుణపాఠాలు కావాలి. మన దృష్టి కోణాన్ని విశాలం చేయాలి. మరింతమంది ఫిరోజ్‌ఖాన్‌లు రూపొందేందుకు దోహదపడాలి. కానీ జరుగుతున్నదంతా అందుకు విరుద్ధం. అది విచారకరం. -
విద్యార్థిని కాల్చి చంపిన దుండగులు
లక్నో : బెనారస్ హిందు యూనివర్సిటీ క్యాంపస్‌లో దారుణం చోటుచేసుకుంది. యూనివర్సిటీ విద్యార్థిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో అతడు మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.. యూనివర్సిటీలో ఎంసీఏ చదువుతున్న గౌరవ్ సింగ్(23) హాస్టల్ ముందు తన స్నేహితులతో మాట్లాడుతుండగా మోటార్ సైకిళ్లపై వచ్చిన దుండగులు అతనిపై కాల్పులు జరిపి, అక్కడి నుంచి పారిపోయారు. పొట్టలోకి బులెట్లు దూసుకుపోవడంతో తీవ్రగాయాల పాలైన గౌరవ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వ్యక్తిగత కారణాలతోనే దుండగులు కాల్పులు జరిపినట్లు తమ ప్రాథమిక విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు. కాగా కాలేజీలో హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నాడనే కారణంగా గౌరవ్ సింగ్‌ను యూనివర్సిటీ యాజమాన్యం 2017లో అతడిని సస్పెండ్ చేసింది. ఓ నిరసన కార్యక్రమం సందర్భంగా.. బస్సును దహనం చేసిన ఘటనతో గౌరవ్‌కు సంబంధం ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతడు హత్యకు గురికావడం కలకలం రేపింది. కాగా మృతుని తండ్రి రాకేష్ సింగ్ యూనివర్సిటీలోనే కార్మికుడిగా పని చేస్తుండటం గమనార్హం. -
బీహెచ్‌యూలో ఆగని లైంగిక వేధింపులు
వారణాసి: ప్రతిష్టాత్మక బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ)లో విద్యార్థినులపై లైంగిక వేధింపులు కొనసాగుతున్నాయి. వర్సిటీలో విద్యార్థినులపై లైంగిక దాడులకు వ్యతిరేకంగా విద్యార్థినులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగిన కొద్దిరోజులకే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. సోషల్ సైన్స్ ఫ్యాకల్టీ ప్రాంగణంలో గురువారం ఓ విద్యార్థినిపై యువకుడు వేధింపులకు పాల్పడటం కలకలం రేపింది. వర్సిటీలో ఎంఏ రెండో సంవత్సరం చదువుతున్న బాధితురాలు సైన్స్ ఫ్యాకల్టీ ప్రొఫెసర్ ఛాంబర్‌కు వెళుతుండగా ఎస్ఎస్ గోండ్ అనే పీజీ విద్యార్థి అడ్డగించి తోసివేశాడు. ఆమె మొబైల్ ఫోన్‌ను ధ్వంసం చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు క్యాంపస్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. జరిగిన ఘటనపై వర్సిటీ ప్రొక్టోరల్ బోర్డుకు విద్యార్థిని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
‘విద్యార్థినులపై లాఠీచార్జి జరగలేదు’
సాక్షి, వారణాసి : లైంగిక వేధింపులకు నిరసనగా ఇటీవల బెనారస్ హిందూ యూనివర్సిటీలో జరిగిన ఆందోళనల్లో విద్యార్థినులపై పోలీసులు లాఠీచార్జి జరగలేదని వర్సిటీ వీసీ గిరీష్ చంద్ర త్రిపాఠి పేర్కొన్నారు. విద్యార్థినులపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని, వారిపై లాఠీచార్జి చేశారనే వార్తలను తోసిపుచ్చారు. ‘ఈవ్‌టీజింగ్‌ను వ్యతిరేకిస్తూ నిరసనకు దిగిన విద్యార్థినులపై పోలీసులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. బయటినుంచి వచ్చి హింసకు పాల్పడిన వారిపైనే పోలీసులు చర్య తీసుకున్నార’ని వీసీ స్పష్టం చేశారు. సంకుచిత ప్రయోజనాల కోసం బయటివ్యక్తులే ప్రతిష్టాత్మక వర్సిటీలో ఈ ఘటనకు పాల్పడ్డారని త్రిపాఠి అన్నారు. వారణాసిలో ప్రధాని పర్యటన నేపథ్యంలోనే ఇవన్నీ కొందరు పనిగట్టుకుని చేశారని ఆయనే ఆరోపించారు. వర్సిటీలో పరిస్థితి ప్రశాంతంగా ఉందని, కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. మరోవైపు వర్సిటీలో విద్యార్థినులపై పోలీసుల చర్యను పలువురు ఖండించారు. పోలీసులు సంయమనం పాటించాలని ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సహా పలు రాజకీయ పార్టీల అగ్రనేతలు కోరారు. -
1000 మందిపై ఎఫ్ఐఆర్
వారణాసి /లక్నో: బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్‌యూ) విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడంపై ప్రజలు, ప్రతిపక్షాల నుంచి పెద్దఎత్తున విమర్శలు చెలరేగడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. వారణాసికి చెందిన ముగ్గురు అదనపు కలెక్టర్లు సహా ఇద్దరు పోలీస్ అధికారులపై వేటు వేసింది. లాఠీచార్జికి సంబంధించి గుర్తుతెలియని పోలీసులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అధికారులు, వర్సిటీలో హింసకు పాల్పడ్డారన్న ఆరోపణలతో దాదాపు 1,000 మంది విద్యార్థులపై కేసు నమోదు చేశారు. లాఠీచార్జి వివాదాస్పదం కావడంతో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో ఫోన్లో మాట్లాడారు. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని వారిరువురు ఆదిత్యనాథ్‌కు సూచించారు. ఈ లాఠీచార్జిని చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవాలని సీఎం పోలీసులను ఆదేశించారు. యూపీ గవర్నర్ రామ్‌నాయక్ మాట్లాడుతూ, ఈ ఘటనపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో విచారణ కమిటీని ఏర్పాటు చేశామనీ, నివేదిక అందిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. -
బేటీ బచావో.. బేటీ పడావో ఇదేనా
హైదరాబాద్: ఉత్తరప్రదేశ్ లోని బనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ)లో విద్యార్థినులుపై జరుగుతున్న లైంగిక దాడులకు నిరసనగా తెలంగాణ యువజన కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. ట్యాంక్ బండ్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద సోమవారం నేతలు సామూహిక శిరోమండనంతో నిరసన తెలిపారు. విద్యార్థులను అక్రమంగా నిర్భంధించి పలు రకాలు ఆంక్షలు విధించడాన్ని యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ కుమార్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. బేటీ బచావో బేటీ పడావో అంటే ఇదేనా అంటూ ప్రధాని మోదీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. -
బనారస్ వర్సిటీలో హింస
వారణాసి/లక్నో: ఈవ్ టీజింగ్ ఘటనకు నిరసనగా బనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ)లో విద్యార్థులు శనివారం రాత్రి చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. పోలీసులు లాఠీచార్జీ చేయడంతో పలువురు విద్యార్థులు, ఇద్దరు జర్నలిస్టులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిలో విద్యార్థినులు కూడా ఉన్నారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని డివిజినల్ కమిషనర్‌ను ఆదేశించారు. ‘గత గురువారం చోటుచేసుకున్న ఈవ్ టీజింగ్ ఘటనపై ఆందోళన చేపట్టిన విద్యార్థులు వర్సిటీ వైస్ చాన్స్‌లర్‌ను ఆయన నివాసంలో కలిసేందుకు శనివారం రాత్రి యత్నించారు. దీంతో వీసీ నివాస సెక్యూరిటీ గార్డులు పోలీసులకు సమాచారమిచ్చి, విద్యార్థులను నిలిపేశారు. అయినా వినకుండా లోనికి వెళ్లేందుకు విద్యార్థులు విఫల యత్నం చేశారు. ఆ సమయంలో విద్యార్థులతో కలసిపోయిన బయటి వ్యక్తులు రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు’ అని పోలీసు, వర్సిటీ వర్గాలు తెలిపాయి. ఘర్షణలో పోలీసులకు కూడా గాయాలయ్యాయని పోలీసు అధికారులు తెలిపారు. తాజా ఘటన నేపథ్యంలో సోమవారం నుంచి అక్టోబర్ 2 వరకు యూనివర్సిటీ సెలవులు ప్రకటించింది. విద్యార్థినులపై లాఠీచార్జీని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఖండించారు. బీజేపీ దృష్టిలో బేటీ బచావో, బేటీ పడావో అంటే ఇదేనా అంటూ ఎద్దేవా చేశారు. -
ప్రాసంగికత కోల్పోని ప్రసంగం
దక్షిణాఫ్రికా నుంచి భారత్‌కి 1915లో తిరిగొచ్చిన మోహన్ దాస్ కరమ్‌చంద్ గాంధీకి 1916 ఫిబ్రవరి 4 నుంచి 8 వరకు జరగనున్న బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రసంగించాలని ఆహ్వానం అందింది.. పలు సంస్థానాధిపతులు, విద్యావేత్తలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో 1916 ఫిబ్రవరి 6 సాయం త్రం గాంధీ ఆహూతులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశ భాషలను పక్కనబెట్టి ఇంగ్లిష్ భాషకు నాటి పాలకులు ఇస్తున్న ప్రాధాన్యం, స్వయంపాలన, పరిశుభ్రతపై అవగా హనా లేమి, అరాచకవాదుల లక్ష్య రహిత పోరాటం (అరా చకవాదులను ఖండిస్తూ గాంధీ చేసిన ప్రసంగాన్ని అనీబి సెంట్ అడ్డుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది) సంపన్నుల సంపద ప్రదర్శనలు, ధనిక-పేద మధ్య అంతరాలు వంటి అంశాలపై గాంధీ ప్రసంగంలోని అంశాలు వందేళ్ల తర్వాత కూడా తమ ప్రాసంగికతను కోల్పోకపోవడమే విషాదం. గాంధీ ప్రసంగ విశేషాలు క్లుప్తంగా ఆయన మాటల్లో... ఈ పవిత్ర నగరంలో ఈ గొప్ప కళాశాల నీడలో నిల బడి ఈ సాయంత్రం నాది కాని విదేశీ భాషలో నా దేశ వాసులను ఉద్దేశించి ప్రసంగించడం కంటే మించిన అవ మానకరమైన విషయం ఇంకొకటిలేదు. మన భాష మనకు ప్రతిబింబం. ఉత్తమమైన ఆలోచనను మన భాష వ్యక్తం చేయలేదని మీరు నాకు చెప్పినట్లయితే, అతి త్వరలోనే మనం ఉనికిని కోల్పోవడం ఖాయం. ఇంగ్లిష్ భాష ద్వారానే జ్ఞానం పొందుతున్న ప్రతి యువతీయువకులూ ఆరేళ్ల విలువైన జీవితాన్ని కోల్పోతున్నారని కొందరు పూనా ప్రొఫెసర్లు నాతో చెప్పారు. మన స్కూళ్లు, కాలేజీలలోని విద్యార్థులకూ, మనకు కూడా దీన్ని వర్తింపజేస్తే జాతి ఎన్ని వేల సంవత్సరాలను నష్టపోతూ వచ్చిందో సులభంగా అర్థమవుతుంది. భారతీయులకు చొరవ, ప్రేరణ లేవని ఆరోపిస్తున్నారు. నిజమే మరి. విదేశీ భాషను నేర్చుకోవ డంలోనే జీవితంలోని విలువైన సంవత్సరాలను మనం వెచ్చిస్తున్నప్పుడు మనకు ఇక చొరవ ఎక్కడుంటుంది? గత 50 ఏళ్ల కాలంలో దేశభాషల్లోనే విద్య నే ర్చుకోగలిగినట్ల యితే, మనం నేడు స్వేచ్ఛా భారత్‌లో ఉండేవాళ్లం. నిన్నటి సాయంత్రం నేను కాశీ విశ్వనాథుని ఆలయం సందర్శించాను. ఆలయ వీధుల్లో నడుస్తుంటే కొన్ని ఆలో చనలు నన్ను వెంటాడాయి. పైనుంచి ఒక కొత్త వ్యక్తి ఈ ఆలయంలోకి ఊడిపడి, హిందువులుగా మనం ఎలాంటి వారిమని పరిశీలించినట్లయితే, మనల్ని ఖండించి తీరు తాడు. ఈ గొప్ప ఆలయం మన గుణశీలాలకు ప్రతిబింబం కాదా? మన పవిత్ర ఆలయం ఇంత మురికిగా ఉండటం సరైందేనా? ఆలయవీధులు ఎంతో ఇరుగ్గాను, క్రమరహి తంగాను ఉన్నాయి. చివరకు మన ఆలయాలు కూడా కాస్తంత విశాలంగాను, కాస్త పరిశుద్ధంగాను లేకపోతే మనం కోరుకుంటున్న స్వయం పాలనకు అర్థం ఏమిటి? రైలు ప్రయాణంలో మూడో తరగతి ప్రయాణికుల కష్టాన్ని గమనించాను. కాని వారి కష్టాలకు రైల్వే యం త్రాంగాన్ని తప్పుపట్టకూడదు. మనకు పరిశుభ్రతకు సం బంధించిన ప్రాథమిక సూత్రాలు కూడా తెలీవు. బోగీల్లో ఎక్కడపడితే అక్కడ ఉమ్మి వేస్తుంటాం. ఫలితం బోగీలో భయంకరమైన మురికి. స్వయం పాలన కావాలంటే ఇలాంటి పరిస్థితులను ముందుగా మెరుగుపర్చాలి. నిన్నటి సాయంత్రం సభకు అధ్యక్షత వహించిన మహారాజావారు దేశ దారిద్య్రం గురించి మాట్లాడారు. ఇతర వక్తలూ దీనిపై నొక్కి చెప్పారు. కానీ వైస్రాయ్ గారు తొలి రోజు ప్రారంభోత్సవం నిర్వహించిన సభామంట పంలో మనం చూసిందేమిటి? ఆపాద మస్తకం ధరించిన నగలతో కళ్లు మిరిమిట్లు గొలిపే స్థాయి ప్రదర్శన. మీరు ధరించిన ఈ నగలన్నింటినీ తీసివేసి భారత్‌లోని మీ దేశవాసులకోసం దాన్ని ధర్మనిధిగా ఉంచనంతకాలం భారత్‌కు విముక్తి లేదు. బ్రిటిష్ ఇండియాలో కానీ, మన సంస్థానా లలో కాని ఉన్న గొప్ప గొప్ప రాజ మందిరాలను చూసిన వెంటనే నాకు అసూయ కలుగుతుంటుంది. ఓహో.. ఈ డబ్బంతా వ్యవసాయ దారులనుంచే వచ్చింది కదా? జనాభాలో 75 శాతంపైగా వ్యవసా యదారులున్నారు. వారి శ్రమ ఫలితాలను మొత్తంగా మనమే తీసుకున్నా లేక తీసుకోవడానికి ఇతరులను అను మతించినా.. మనలో స్వయంపాలన స్ఫూర్తి కొరవడినట్లే. మన విముక్తి రైతుల ద్వారానే వస్తుంది. న్యాయవాదులు, వైద్యులు, ధనిక భూస్వాములు దాన్ని సాధించలేరు. నేటి భారత్ తన అసహనంలోంచి అరాచకవాదుల సైన్యాన్ని తయారు చేస్తోందని మనం మర్చిపోవద్దు. నేను కూడా అరాచకవాదినే. కాని నాది మరొక రకం. నేను వారిని కలసిన పక్షంలో భారత్‌లో వారి అరాచకవాదానికి తావు లేదని చెబుతాను. దేశంపట్ల తన ప్రేమకు గాను నేను ఆరాచకవాదిని గౌరవిస్తాను. దేశం కోసం ప్రాణ తర్పణ చేసేందుకు సిద్ధపడే అతడి ధీరత్వాన్ని గౌరవిస్తాను. కాని నాదొక ప్రశ్న. హత్య చేయడం గౌరవప్రదమైనదేనా? హంతకుడి కత్తి గౌరవప్రదమైన మృత్యువుకు ముందు షరతుగా ఉంటుందా? ఆంగ్లేయులు భారత్‌నుంచి వైదొల గడం, వారిని పారదోలడం భారత్ విముక్తికి అవసరం అని నేను గ్రహించినట్లయితే, వారు వెళ్లిపోవలిసిందేనని చెప్ప డానికి, ఆ విశ్వాసానికి మద్దతుగా చావడానికైనా నేను సిద్ధ పడతాను వీరమరణం అంటే ఇదే. రహస్య పథకాలు సృష్టించి బాంబులు విసిరేవారు బయటకు రావడానికి భయపడుతున్నారు. పట్టుబడినప్పుడు తమ లక్ష్య రహిత సాధనకు పరిహారాన్ని అనుభవిస్తున్నారు. మనం ఇలా చేయకపోతే, కొంతమంది బాంబులు విసరకపోతే, బ్రిటిష్ పాలన నుంచి వేరుపడే ఉద్యమానికి సంబంధించి మనం ఏమీ సాధించలేమని కొందరు నాతో చెప్పి ఉన్నారు. (ఇక్కడ అనీబిసెంట్, గాంధీ ప్రసంగాన్ని అడ్డుకుని ‘దయ చేసి ఆపండి’ అన్నారు). నేను చెబుతున్నది అవసరమే అని భావిస్తున్నా. ప్రసంగాన్ని ఆపివేయాలని చెబితే దానికి నేను కట్టుబడతాను. (సభా చైర్మన్ వైపు తిరిగి) నా ఈ ప్రసంగం ద్వారా నేను దేశానికి, చక్రవర్తికి సేవ చేయడం లేదని మీరు భావిస్తున్నట్లయితే నేను తప్పక ఆపివేస్తాను. (ఇక్కడ శ్రోతలు ‘మాట్లాడండి’ అంటూ అరిచారు). (చైర్మన్: ‘దయచేసి మీ లక్ష్యాన్ని వివరించండి’ అన్నారు). నేను... (మరోసారి అంతరాయం కలిగింది) మిత్రులారా, ఈ అంతరాయం పట్ల ఆగ్రహించకండి. నన్ను మాట్లాడటం ఆపివేయమని అనీబిసెంట్ అంటున్నారంటే ఆమె భారత్‌ను ప్రేమిస్తున్నారు మరి. యువతముందు నేను తప్పుగా మాట్లాడుతున్నానని ఆమె భావిస్తున్నారు. కాని ఇప్పుడు సైతం.. మరో వైపునుంచి వస్తున్న ఈ అనుమాన పూరిత వాతావరణాన్ని భారత్‌నుంచి ప్రక్షాళన చేయాలని కోరుకుంటున్నాను. మన లక్ష్యసాధనకు పరస్పర ప్రేమ, విశ్వాసం ప్రాతిపదికన ఒక సామ్రాజ్యాన్ని కలిగి ఉండాలి. ....స్వయంపాలన చేపట్టాలంటే దాన్ని మనం సాధిం చవలసిందే. దాన్ని మనకు ఎవరూ మంజూరు చేయరు. స్వతంత్రం అనేది ఒక పార్టీ ఇస్తే వచ్చేది కాదు. బోయెర్ యుద్ధం నుంచి మీరు పాఠం నే ర్చుకోండి. కొన్నేళ్ల క్రితం ఆ సామ్రాజ్యానికి శత్రువులుగా ఉన్నవారు ఇప్పుడు స్నేహితు లుగా మారారు. (ఈ సమయంలో ప్రసంగానికి అంతరా యం కలిగింది. వేదిక నుంచి కొందరు వెళ్లిపోసాగారు. దీంతో గాంధీ ప్రసంగం అర్ధంతరంగా నిలిచిపోయింది. (భారత్ తిరిగొచ్చాక ఎంకే గాంధీ 1916 ఫిబ్రవరి 6న చేసిన తొలి ప్రసంగానికి వందేళ్లు పూర్తయిన సందర్భంగా) - ప్రత్యూష