వారణాసి /లక్నో: బనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్‌యూ) విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడంపై ప్రజలు, ప్రతిపక్షాల నుంచి పెద్దఎత్తున విమర్శలు చెలరేగడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. వారణాసికి చెందిన ముగ్గురు అదనపు కలెక్టర్లు సహా ఇద్దరు పోలీస్ అధికారులపై వేటు వేసింది. లాఠీచార్జికి సంబంధించి గుర్తుతెలియని పోలీసులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన అధికారులు, వర్సిటీలో హింసకు పాల్పడ్డారన్న ఆరోపణలతో దాదాపు 1,000 మంది విద్యార్థులపై కేసు నమోదు చేశారు.
లాఠీచార్జి వివాదాస్పదం కావడంతో ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని వారిరువురు ఆదిత్యనాథ్‌కు సూచించారు. ఈ లాఠీచార్జిని చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకోవాలని సీఎం పోలీసులను ఆదేశించారు. యూపీ గవర్నర్ రామ్‌నాయక్ మాట్లాడుతూ, ఈ ఘటనపై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో విచారణ కమిటీని ఏర్పాటు చేశామనీ, నివేదిక అందిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.