లక్నో : బెనారస్ హిందు యూనివర్సిటీ క్యాంపస్‌లో దారుణం చోటుచేసుకుంది. యూనివర్సిటీ విద్యార్థిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో అతడు మృతిచెందాడు. ఈ ఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.. యూనివర్సిటీలో ఎంసీఏ చదువుతున్న గౌరవ్ సింగ్(23) హాస్టల్ ముందు తన స్నేహితులతో మాట్లాడుతుండగా మోటార్ సైకిళ్లపై వచ్చిన దుండగులు అతనిపై కాల్పులు జరిపి, అక్కడి నుంచి పారిపోయారు. పొట్టలోకి బులెట్లు దూసుకుపోవడంతో తీవ్రగాయాల పాలైన గౌరవ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం మరణించాడు. ఈ కేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వ్యక్తిగత కారణాలతోనే దుండగులు కాల్పులు జరిపినట్లు తమ ప్రాథమిక విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు.
కాగా కాలేజీలో హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నాడనే కారణంగా గౌరవ్ సింగ్‌ను యూనివర్సిటీ యాజమాన్యం 2017లో అతడిని సస్పెండ్ చేసింది. ఓ నిరసన కార్యక్రమం సందర్భంగా.. బస్సును దహనం చేసిన ఘటనతో గౌరవ్‌కు సంబంధం ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అతడు హత్యకు గురికావడం కలకలం రేపింది. కాగా మృతుని తండ్రి రాకేష్ సింగ్ యూనివర్సిటీలోనే కార్మికుడిగా పని చేస్తుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment