‘గ్యాస్’ మంటలు
తంజావూరు జిల్లా కదిరిమంగళం గ్రామ పంట పొలాల్లో ఏడుచోట్ల ఓఎన్‌జీసీ బావులను ఏర్పాటుచేసి క్రూడాయిల్ తోడే పనులు జరుగుతున్నాయి. ఈ దశలో శుక్రవారం సాయంత్రం బావికి అడుగుభాగంలో అమర్చిన పైప్‌లైన్‌కు పగుళ్లు ఏర్పడగా క్రూడాయిల్ లీకై పంట పొలాల్లో ప్రవహించింది. దీంతో ఆగ్రహానికి గురైన గ్రామస్తులు క్రూడాయిల్ వెలికతీత పనులు నిలిపివేయాలని రాస్తారోకో చేపట్టారు. ఓఎన్‌జీసీ ఉద్యోగులను వెళ్లనీయకుండా అడ్డుకున్నారు.
దీంతో ఆందోళకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో క్రూడాయిల్ లీకవుతున్నచోట కొందరు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. పెద్దఎత్తున మంటలు రేగడంతో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పారు. ఈ దుశ్చర్యకు కారకులైన కొందరు ఆందోళనకారులను అరెస్ట్‌చేసి జైళ్లలో పెట్టారు. అరెస్టులకు నిరసనగా శనివారం గ్రామంలో దుకాణాలను మూసివేశారు. ఐదు వందల మందికి పైగా పోలీసులు గ్రామంలో పహారా కాస్తున్నారు. గ్రామాల్లో శాంతి సామరస్యాన్ని కాపాడాల్సిన అధికారులు సాయుధ పోలీసులతో లాఠీచార్జ్ జరిపించడమా అని విమర్శలు వెల్లువెత్తాయి.
ఇదిలా ఉండగా, తంజావూరు జిల్లా కలెక్టర్ అన్నాదురై శనివారం ఉదయం 10 గంటలకు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఓఎన్‌జీసీ సమస్యపై ప్రజలతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ప్రజల కోర్కెను తప్పక నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. ఓన్‌ఎజీసీ
బావుల వల్ల ప్రజలకు ఎటువంటి నష్టం కలుగకుండా చూస్తామని చెప్పారు. క్రూడాయిల్ ప్రవహించిన ప్రాంతంలో వందురోజుల ఉపాధి పథకాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.
పోలీసుల వలయంలో మెరీనా
తంజావూరు గ్రామంలో పోలీసుల జరిపిన లాఠీ చార్జ్‌కి, అరెస్టులకు నిరసనగా ఆందోళనకారులకు సంఘీభావం తెలుపుతూ చెన్నై మెరీనా బీచ్‌లో దీక్షలు చేపట్టాలని కొన్ని యువజన సంఘాలు నిర్ణయించుకున్నాయి. పోలీసులకు శుక్రవారం రాత్రి ఈ సమాచారం అందింది. జల్లికట్టు తరహాలో ఉద్యమాన్ని చేపట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచాలని యువకులు సిద్ధం కావడంతో ఆందోళన చెందిన పోలీసు శాఖ రాత్రికి రాత్రే మెరీనా బీచ్‌ను తన అదుపులోకి తీసుకుంది. సుమారు 200 మంది పోలీసులు మెరీనా బీచ్ రోడ్డులోని లైట్‌హౌస్ నుంచి నెప్పియార్ బ్రిడ్జి వరకు బందోబస్తు చేపట్టారు. షిప్టు పద్ధతిలో 24 గంటలపాటూ బందోబస్తు కొనసాగనుంది. నగర పౌరులు ప్రతిరోజూ ఉదయాన్నే మెరీనాబీచ్ సర్వీసు రోడ్డులో వాహనాలను పార్కింగ్ చేసి జాగింగ్ చేయడం పరిపాటి. అయితే ఓఎన్‌జీసీ ఆందోళన నేపధ్యంలో వాహనాలను అనుమతించలేదు. దీంతో లైట్‌హౌస్ సమీపంలోని వాలాజా రోడ్డులో వాహనాలను నిలిపి జాగింగ్ చేశారు.