సాక్షి, న్యూఢిల్లీ: అసెంబ్లీ ముట్టడికి యత్నించిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తీవ్రంగా తప్పుపట్టారు. పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని, దీన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. బుధవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రం పరాయి పాలనలో ఉన్నట్టు ఉందని, ముఖ్యమంత్రి కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సూచన మేరకే పోలీసులు లాఠీచార్జ్ చేశారన్నారు. విద్యార్థులను బూట్లతో తన్నారని.. జంతువుల మీద కూడా ఇంత కఠినంగా వ్యవహరించరని మండిపడ్డారు. విద్యార్థుల వల్లనే తెలంగాణ వచ్చిందని.. ఇప్పుడు మీరు అనుభవిస్తున్న పదవులు వారి వల్లేనని వ్యాఖ్యానించారు. (సీఎం కేసీఆర్ రాజీనామా చేస్తారా?)
ప్రగతిభవన్ గేటు కూడా దాటలేరు
తొమ్మిది యూనివర్సిటీల్లో అసలు వీసీలే లేరని ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. డిమాండ్ల సాధన కోసం వాళ్లు ధర్నా చేశారని తెలిపారు. విద్యార్థులను తక్కువ అంచనా వేయకూడదని హితవు పలికారు. ఇక ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ఇద్దరు బడా పారిశ్రామిక వేత్తలు రూపొందించారని విమర్శించారు. త్వరలోనే కేసీఆర్ ఫామ్ హౌస్‌కే పరిమితం అవుతారని వ్యాఖ్యానించారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ.. విద్యార్థుల బలిదానాల వల్లే తెలంగాణ వచ్చిందన్నారు. కానీ ఇప్పుడు వారిపైనే లాఠీచార్జ్ చేస్తూ పోలీసులు వ్యవహరించిన తీరు దారుణంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడి చేసిన పోలీసులపై హత్యాయత్న కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు తలుచుకుంటే సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ గేట్ కూడా దాటలేరని విమర్శించారు. (అసెంబ్లీ ముట్టడికి ఏబీవీపీ యత్నం)
Comments
Please login to add a commentAdd a comment