రైతన్నలపై లాఠీ | Police Lathicharge Protesting Farmers in Medak District | Sakshi
Sakshi News home page

రైతన్నలపై లాఠీ

Published Tue, Aug 5 2014 1:21 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Police Lathicharge Protesting Farmers in Medak District

* కరెంటు కోతలపై అన్నదాతల రాస్తారోకో
* లాఠీలతో విరుచుకుపడిన పోలీసులు
* పలువురు రైతులకు తీవ్రగాయాలు
* సీఎం సొంత జిల్లాలోనే ఘటన
* ప్రజా సంఘాలు, రైతు సంఘాల మండిపాటు
* ఇతర జిల్లాల్లోనూ భారీగా ఆందోళనలు
* సబ్‌స్టేషన్ల ముట్టడి, సిబ్బంది నిర్బంధం
 
(సాక్షి నెట్‌వర్క్): కరెంట్ కోసం ఆందోళనకు దిగిన అన్నదాతలపై పోలీసులు ప్రతాపం చూపించారు. విచక్షణారహితంగా లాఠీలు ఝుళిపించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా మెదక్‌లో చోటుచేసుకున్న ఈ లాఠీచార్జ్‌లో అనేకమంది రైతులు గాయపడ్డారు. జిల్లాలో నాలుగు రోజులుగా విద్యుత్ కోతలు ఎక్కువయ్యాయి. రోజుకు రెండు గంటలు కూడా కరెంట్ ఇవ్వకపోవడంతో పంటలు ఎండుతున్నాయన్న ఆవేదనతో రైతులు సోమవారం పలుచోట్ల ఆందోళన చేపట్టారు. చేగుంట మండలం నార్సింగిలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఉదయం 8 గంటల నుంచే రాస్తారోకోకు దిగారు. దాదాపు నాలుగు గంటల పాటు ఇది కొనసాగింది.

సమీపంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు ఇందులో పాల్గొన్నారు. రోడ్డు మీద టైర్లు వేసి నిప్పు పెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే సమయంలో సహనం కోల్పోయిన రామాయంపేట సీఐ గంగాధర్, ఆయన వెంట వచ్చిన ప్రత్యేక పోలీసు బలగాలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. చేతికి దొరికిన నారాయణ అనే రైతును చావబాదారు. అతని తలకు తీవ్రమైన గాయమైంది. వల్లబోయిని శ్రీను, ఇక్బాల్‌తో పాటు మరికొందరు రైతులకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో కోపోద్రిక్తులైన అన్నదాతలు ఎదురుతిరిగారు. రైతుల ధాటికి తట్టుకోలేక సీఐ గంగాధర్ తప్పించుకుని పారిపోతుండగా పోలీసు వాహనం టైర్లలో గాలిని తీసేశారు. వాహనాలను వెళ్లనీయకుండా రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

మెదక్ ఆర్డీవో వనజాదేవి సంఘటన స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు శాంతించలేదు. ఆమె వాహనానికి అడ్డుగా నిలిచారు. తమపై లాఠీచార్జి చేసిన సీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులంతా సబ్‌స్టేషన్ వద్దకు వస్తే విద్యుత్ సమస్యపై చర్చిస్తానని, ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తానని ఆర్డీవో హామీ ఇవ్వడంతో కాస్త శాంతించి రాస్తారోకో విరమించారు. పలు ప్రజా సంఘాలతోపాటు యువజన సంఘాలు, రైతు సంఘాల నాయకులు పోలీసుల చర్యను ఖండించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై లాఠీచార్జి చేసిన సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
 

ఇతర జిల్లాల్లోనూ నిరసనలు
కరెంటు కోతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇతర జిల్లాల్లోనూ రైతులు రోడ్డెక్కారు. నల్లగొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లలో ఆందోళనలు, రాస్తారోకోలు, నిర్బంధాలకు దిగారు. నల్లగొండ జిల్లా తుర్కపల్లి సబ్‌స్టేషన్ గదికి తాళాలు వేసి, ఏఈని చుట్టుముట్టి నిలదీశారు. మోత్కూరులోనూ సబ్‌స్టేషన్, ఏఈ కార్యాలయంపై దాడి చేశారు. రోడ్డుపై ట్రాక్టర్లను అడ్డుగా నిలిపి రాస్తారోకో నిర్వహించారు. వలిగొండ  సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా చేసి, సిబ్బందిని నిర్బంధించారు.

సంస్థాన్ నారాయణపురంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆరుతడి పంటలపై అవగాహన సదస్సును అడ్డుకున్నారు. చిట్యాల మండలం వట్టిమర్తి, వనిపాకల, గుమ్మలబావి గ్రామాలకు చెందిన రైతులు రామన్నపేట సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. బొమ్మలరామారం మండలంలోని సోలిపేట్ సబ్‌స్టేషన్ సిబ్బందిని నిర్బంధించారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మిర్యాలగూడ ట్రాన్స్‌కో డీఈ కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు.

భూదాన్‌పోచంపల్లి మండలంలోని కనుముకుల, వంకమామిడి, ధర్మారెడ్డిపల్లి, దంతూర్, జిబ్లక్‌పల్లి గ్రామాలకు చెందిన 300 మంది రైతులు పోచంపల్లి చౌరస్తాలో ధర్నా చేశారు. తిరుమలగిరి సబ్ స్టేషన్ ఎదుట వివిధ గ్రామాల రైతులు మూడు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. ఇక మహబూబ్‌నగర్ జిల్లాలో బిజినేపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించి కార్యాలయానికి తాళం వేశారు. ఈ నిరసనలో పాల్గొన్న పాలెం గ్రామానికి చెందిన సొప్పరి బాలస్వామి అనే రైతు పురుగు మందు డబ్బాతో కలకలం సృష్టించాడు.

అయిజ, వడ్డేపల్లి మండలాలకు చెందిన రైతులు అయిజ విద్యుత్ సబ్ స్టేషన్‌ను ముట్టడించారు. పలువురు రైతులు పురుగుమందు డబ్బాలను చేతబట్టుకుని ఆందోళనకు దిగారు. కర్నూలు ప్రధాన రహదారిపై ముళ్లకంచె వేసి రాస్తారోకో చేపట్టారు. గోపాల్‌పేట మండలం బుద్దారంలోనూ ఇదే రకమైన ఆందోళన కొనసాగింది.

మరోవైపు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం కల్లెడిలో సబ్‌స్టేషన్‌పై రైతులు దాడి చేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. భీమ్‌గల్ మండలం కుప్‌కల్‌లో సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. మోర్తాడ్ మండలంలోని వడ్యాట్  రైతులు సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండలం లక్ష్మాపూర్, బీర్కూరు మండలం నస్రుల్లాపూర్ గ్రామాల్లో ఆందోళన చేశారు. పిట్లం మండలం తిమ్మానగర్, కొడప్‌గల్, బిచ్కుందలలోనూ నిరసన తెలియజేశారు.

కామారెడ్డి నియోజకవర్గం దోమకొండ మండలం బీబీపేటలో ధర్నా నిర్వహించారు. భిక్కనూరు, మాచారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట, ఎల్లారెడ్డి మండలాల్లో రైతులు రాస్తారోకోలు చేపట్టారు. కాగా, దోమకొండ మండలంలో పర్యటించిన వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి స్థానిక రైతులు తమ గోడు వెల్లడించారు. కోతలు లేకుండా చూస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు.
 
రైతులు రోడ్లపైకి రావొద్దు: పోచారం
రైతులు రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగించవద్దని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కోరారు. కరెంట్ సమస్యను రాజకీయం చేసే శక్తుల మాయలో పడవద్దని విజ్ఞప్తిచేశారు. థర్మల్‌విద్యుత్ ఉత్పాదనలో ఇబ్బందులు తలెత్తడంతో రెండురోజులుగా రైతులకు సరిగ్గా కరెంట్‌ను ఇవ్వలేకపోయామన్నారు. ఇప్పుడు సమస్య పరిష్కారమైనందున కరెంట్ సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

మెదక్‌జిల్లాలో రైతులపై పోలీసులు లాఠీచార్జి చేయడం బాధ కలిగించిందని దాన్ని ఖండిస్తున్నామన్నారు. సోమవారం సచివాలయం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని, ఈ విషయంలో సీఎం కేసీఆర్ జోక్యంచేసుకుని కరెంట్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారని’ అన్నారు.
 
కరెంట్ అడిగితే కొడతారా: పొన్నాల
మెదక్ జిల్లా రైతాంగంపై పోలీసుల లాఠీచార్జ్ అమానుషమని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. కరెం ట్ సరఫరా చేయాలని ఆందోళన చేస్తే లాఠీలతో జవాబిస్తారా? అని ఆయన సోమవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో ఒక్క రైతుపైనా దాడి జరగలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.

రెండు నెలల కేసీఆర్ పాలనలో 120 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. మూడు రోజుల్లోనే ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. అన్నదాతల ఆత్మహత్యలు రాష్ట్రానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదన్నారు. పోలీసు కొత్త వాహనాల కొనుగోలుకు రూ.వందల కోట్లు కేటాయించడంతోపాటు వాటిని పరిశీలించేందుకు గంటల కొద్ది సమయం వెచ్చించిన కేసీఆర్.. రైతుల సమస్యలపై పదినిమిషాలు సమయం కేటాయించినా ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు.
 
లాఠీచార్జి అమానుషం: కిషన్‌రెడ్డి
కరెంటు కోతలను నిరసిస్తూ రోడ్డెక్కిన రైతులపై లాఠీచార్జి చేయడం అమానుషమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా పిట్లం, మెదక్ జిల్లా చేగుంటల్లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు అకారణంగా లాఠీచార్జి చేసి కేసులు పెట్టడాన్ని ఓ ప్రకటనలో ఆయన ఖండించారు. వారిపై బనాయించిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలని, నిరంతర విద్యుత్తు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఎంసెట్ కౌన్సిలింగ్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వును యథాతథంగా అమలు చేయాలని కిషన్‌రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. ఇప్పటికే జాప్యం జరిగినందున సత్వరమే ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
 
లాఠీదెబ్బలు తినడానికేనా తెలంగాణ?: షబ్బీర్‌అలీ
మెదక్‌లో విద్యుత్‌కోతలపై ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసుల లాఠీచార్జ్‌ను శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత షబ్బీర్‌అలీ తీవ్రంగా ఖండించారు. తెలంగాణ కోసం పోరాడిన రైతాంగానికి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చే బహుమతి ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. సీఎల్పీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

‘నాలుగైదు రోజులుగా కరెంట్ రాక పొలాలు ఎండిపోతుంటే రైతులు రోడ్డెక్కారు. అయినా పట్టని కేసీఆర్ ప్రభుత్వం విందులు, వినోదాలతో జల్సా చేసుకుంటోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుపు కోసం టీఆర్‌ఎస్ నేతలు మంతనాలు చేస్తున్నారు. తెలంగాణ సాధించుకున్నది లాఠీదెబ్బలు తినడానికేనా?’అని షబ్బీర్‌అలీ మండిపడ్డారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement