Ramayampeta
-
మృతదేహాన్ని ఒకరోజు దాచి.. చెరువులో వేశారు
సాక్షి, రామాయంపేట(మెదక్): పంటచేను చుట్టూ పెట్టిన కరెంటువైర్లు తగిలి ఒక వ్యక్తి మృతిచెందగా, ఈసంఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించడానికి విఫలయత్నంచేసిన కొందరు మృతదేహాన్ని ఒక రోజు దాచిఉంచిన తరువాత పధకం ప్రకారం చెరువులో పడవేశారు. సరిగా ఈ సంఘటన జరిగిన 9 రోజుల తరువాత అసలు విషయం ఆదివారం వెలుగులోకి వచ్చింది. చెరువులో మృతదేహం లభ్యం.. మృతుని కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కిషన్ తండా పంచాయతీ పరిధిలోని లాక్యతండాకు చెందిన చౌహాప్ బుచ్యానాయక్ (55) ఈనెల ఒకటిన ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. 3వ తేదీన అతని మృతదేహాం ఘన్పూర్ మండలంలోని బ్యాతోల్ తిమ్మాయపల్లి శివారులో ఉన్న చెరువులో లభ్యమైంది. మృతుని రెండుకాళ్లకు కరెంటుషాకుతో గాయాలుకాగా, ఈవిషయమై తండాగిరిజనులు అనమానం వ్యక్తంచేశారు. కీలకమైన సీసీ ఫుటేజ్ ఆధారం.. కరెంటుషాకుతో మృతిచెందిన బుచ్యానాయక్ మృతదేహాన్ని చెరువులో వేశారని ఆరోజే మృతుని కుటుంబసభ్యులు ఆరోపించారు. ఒకటిన రాత్రి బుచ్యానాయక్ కాట్రియాల గ్రామంలో ఆటోదిగి తన స్వగ్రామానికి కాలినడకన వెళ్లినట్లు గ్రామంలోని సీసీ పుటేజీతో నిక్షిప్తమైంది. దీనిని పరిశీలించిన మృతుని కుటుంబసభ్యులు ఈవిషయమై పోలీసులకు సమాచారం అందజేశారు. కాట్రియాల నుంచి మృతుడు నివాసం ఉంటున్న లాక్యతండాకు మధ్య దారిలో పరిశీలిస్తూ వెళ్లిన తండావాసులకు ఒకచోట అనుమానాస్పదంగా అగుపించింది. పంటచేను చుట్టూ కరెంటు కనెక్షన్ ఉండటంతోపాటు నేలపై పచ్చిగడ్డి చిందరవందరగా మారడంతో వారు అనుమానంతో ఆపంటచేనును ఖాస్తు చేస్తున్న వారిని ప్రశ్నించగా, వారు తప్పును అంగీకరించారు. ఒకటిన రాత్రి ఇదే స్థలంలో బుచ్యానాయక్ కరెంటుషాకుతో మృతిచెందగా, ఒకరోజు మృతదేహాన్ని ఇక్కడే దాచి ఉంచిన అనంతరం కారులో తీసుకెళ్లి బ్యాతోల్ తిమ్మాయపల్లి చెరువులో పడవేసినట్లు వారు అంగీకరంచారు. ఈ మేరకు వారిని ఇద్దరిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయమై తండాలో సంచలనంగా మారింది. మృతునికి ఇద్దరు బార్యలతోపాటు ముగ్గురు సంతానం ఉన్నారు. -
అధికారులను హడలెత్తించిన మంటలు
సాక్షి, రామాయంపేట(మెదక్): రామాయంపేట పట్టణశివారులో మెదక్ రూటులో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదం ప్రజలతోపాటు అధికారులను హడలెత్తించింది. సుమారు మూడు కిలోమీటర్లమేర వ్యాపించిన మంటలతో సమీపప్రాంతంలో ఉన్న రైతులు, ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈప్రమాదంలో రెండు పూరిగుడిసెల్లో కొనసాగుతున్న హోటళ్లతో పాటు సోడాబండి, నిత్యావసర సరుకులు మంటలకు ఆహుతయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. పట్టణశివారులో మెదక్ రోడ్డులో ఉన్న బ్రిడ్జివద్ద రోడ్డుపక్కన అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గాలితోపాటు మంటలు వేగంగా వ్యాపించడంతో టీహోటల్లో ఉన్న లంబాడి లక్ష్మి, గోపాల్ దంపతులు భయాందోళనతో బయటకు పరుగులుతీశారు. ఈ హోటల్‌తోపాటు పక్కనే ఉన్న మ్యాధరి సాయిలుకు చెందిన తాళంవేసి ఉన్న మరో హోటల్ సోడాబండి మంటలకు వారికళ్లముందే ఆహుతైనాయి. ఈ ప్రమాదంలో రెండు గుడిసెల్లో ఉన్న బియ్యం, ఫ్యాను, గ్యాస్ సిలిండర్, ఇతర వంటసామగ్రి మొత్తం మంటలకు ఆహుతైనాయి.దీనితో మంటలు వేగంగా మూడుకిలోమీటర్లమేర వ్యాపించడంతో వ్యవసాయబోర్లవద్ద ఉన్న పశువులను వాటి యజమానులు ఆదరాబాదరాగా కట్లువిప్పారు. మంటల ధాటికి తట్టుకోలేక పొదల్లో ఉన్న కుందేళ్లు, ఇతర వణ్యప్రాణులు భయంతో పరుగులుతీయడం కనిపించింది. స్థానిక ఫైర్‌ఇంజన్ అందుబాటులో లేకపోవడంతో మెదక్ నుంచి వచ్చిన ఫైర్‌ఇంజన్ మంటలను ఆర్పివేయగా, చాలా సేపటి వరకు మంటలు అదుపులోకి రాలేదు. స్థానిక ఎస్ఐ మహేందర్ దగ్గరుండి మంటలను ట్రాఫిక్‌ను నియంత్రించి మంటలను ఆర్పించారు. స్థానిక ఆర్ఐ సత్యనారాయణ సంఘటనాస్థలిని సందర్శించారు. బాధితులకు ఆదుకుంటామని ఆయన హామీఇచ్చారు. -
వసతి గృహాల్లో నిఘా నేత్రం
రామాయంపేట(మెదక్): వంద మంది చేయలేని పనిని ఒక సీసీ కెమెరా చేస్తుందంటారు. రోజురోజుకు సీసీ కెమెరాల వినియోగం పెరుగుతోంది. తాజాగా జిల్లాలో సాంఘీక సంక్షేమశాఖ అధ్వర్యలో కొనసాగుతున్న అన్ని గిరిజన హాస్టళ్లలో సీసీ కెమెరాలు బిగించారు. గిరిపుత్రులకు మంచి భోజనంతో పాటు హాజరు శాతాన్ని పెంచడం, అవినీతి, అక్రమాలను అరికట్టడానికిగాను ఈ సీసీ కెమెరాలను బిగించినట్లు సమాచారం. ఒక్కో హాస్టల్లో సుమారుగా రూ. 50 వేల ఖర్చుతో నాలుగు కెమరాలతో పాటు ఒక మానిటర్‌ను ఏర్పాటు చేశారు. జిల్లా పరిధిలోని ఆరు ఎస్టీ హాస్టళ్లలో, మూడు ఆశ్రమ పాఠశాలల్లో వీటిని ఇప్పటికే ఏర్పాటు చేశారు. కెమెరాలు బిగించిన తర్వాత హాస్టళ్లలో విద్యార్థుల హాజరుశాతం పెరగడంతో పాటు హాస్టళ్ల సంక్షేమాధికారులు క్రమం తప్పకుండా విధులకు హాజరవుతున్నట్లు సమాచారం. విద్యార్థులకు నాణ్యమైన భోజనం కూడా అందుతుంది. కెమెరా కనుసన్నల్లో సిబ్బంది జాగ్రత్తగా విధులు నిర్వర్తిస్తున్నారు. విద్యార్థులుసైతం క్రమశిక్షణతో మెదులుతున్నారని జిల్లా పరిధిలోని ఒక హాస్టల్ సంక్షేమాధికారి తెలిపారు. హాస్టళ్లలోని ప్రధాన ద్వారం, సామగ్రి ఉంచే ప్రదేశం, భోజనం, ప్రార్థన చేసే ప్రాంతంలో, వీటిని ఏర్పాటు చేశారు. నాలుగు కెమెరాల నుంచి వచ్చే వీడియోలకు సంబంధించి సమాచారం ఒక గదిలో ఉంచిన మానిటర్(టీవీ సెట్టు)లో నిక్షిప్తమవుతుంది. దీంతో హాస్టళ్లకు ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినా ఇట్టే తెలిసిపోతుంది. ఇప్పటివరకు కెమెరాలు బిగించిన గిరిజిన హాస్టళ్లు రామాయంపేట, చిన్నశంకరంపేట, మెదక్, నర్సాపూర్, శివ్వంపేట, కౌడిపల్లి, టేక్మాల్ (బాలికల హాస్టల్) ఆశ్రమ సంక్షేమ వసతి గృహం, మహమ్మదాబాద్( నర్సాపూర్) ఆశ్రమ వసతి గృహం, కౌడిపల్లి (ఆశ్రమ వసతి గృహం). -
తెగబడ్డ దొంగలు
మెదక్‌రూరల్ : ఓ కుటుంబం దైవ దర్శనానికి వెళ్లి వచ్చే సరికి గుర్తు తెలియని దుండగులు ఇళ్లంతా గుళ్ల చేసిన ఘటన మెదక్ మండలం మంబోజిపల్లిలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పాపన్నపేట మండలం కొత్తపల్లికి చెందిన గుడ్డెంగల్ కిషన్ మంబోజిపల్లిలోని ఎన్డీఎస్ఎల్ కార్మికుడిగా పనిచేస్తూ, అదే ఎన్డీఎస్ఎల్ కాలనీలోనే నివసిస్తున్నాడు. ఈ నెల 8న ఇంటికి తాళం వేసి కుటుంబ సమేతంగా దైవ దర్శనం కోసం తిరుపతికి వెళ్ళారు. గురువారం ఉదయం తిరిగి ఇంటికి వచ్చి తాళం తీసి లోపలి వెళ్లగా ఇంట్లో రెండు బీరువాలు తెరిచి ఉండడం, వస్తువులన్నీ చిందరవందరగా పడేసి ఉండడం చూసి ఖంగు తిన్నారు. వెనక భాగంలో ఉన్న బాత్రూం పైభాగాన ఉన్న సిమెంట్ రేకులను పగులకొట్టి దొంగలు ఇంట్లోకి చొరబడ్డట్లు గుర్తించారు. బీరువాలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసు, అర తులం బంగారు రింగుతో పాటు రూ.4వేల నగదు అపహరణకు గురైనట్లు గుర్తిచారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మెదక్‌రూరల్ ఎస్ఐ లింబాద్రి తెలిపారు. క్లూస్‌టీం ఘటనా స్థలంలో ఆధారలను సేకరించినట్లు తెలిపారు. రామాయంపేటలో పట్టపగలు చోరీ తొమ్మిది తులాల బంగారం, 20 తులాల వెండి, రూ. 10 వేలు ఎత్తుకెళ్లిన దొంగలు రామాయంపేట(మెదక్): రామాయంపేట పట్టణంలో పట్టపగలు తాళం వేసి ఉన్న ఇంటిలో దొంగలు జొరబడ్డారు. తొమ్మిది తులాల బంగారం, 20 తులాల వెండి, రూ. 10 వేలు ఎత్తుకెళ్లారు. పట్టణానికి చెందిన చిట్టిమల్లి శ్రీనివాస్ తన కుటుంబంతో కలిసి స్థానికంగా ఉన్న ఎస్వీఆర్ అపార్ట్మెంటులో నివాసం ఉంటున్నాడు. కిరాణా దుకాణం నడుపుతున్న శ్రీనివాస్ ఉదయమే దుకాణానానికి వచ్చాడు. అతని భార్య ఇంటికి తాళం వేసి కిరాణా దుకాణానికి రాగా, గుర్తు తెలియని దుండగులు ఇంటి తలుపుల గొళ్లెం ఊడదీసి చోరీకి పాల్పడ్డారు. సజ్జపై ఉంచిన బీరువా తాళాలు దొరికించుకున్న దుండగులు అందు లో ఉంచిన తొమ్మిది తులాల బంగారు, 20 తులాల వెండి ఆభరణాలు, రూ. పదివేల నగదును ఎత్తుకెళ్లారు. స్థానిక ఎస్ఐ మహేందర్ సంఘటన స్థలాన్ని సందర్శించారు. కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. జహీరాబాద్‌లో చోరీ రెండున్నర తులాల బంగారం, రూ.25వేల నగదు అపహరణ జహీరాబాద్: జహీరాబాద్ పట్టణంలోని ఆనంద్‌నగర్ కాలనీలో బుధవారం రాత్రి దొంగలు తెగబడ్డారు. స్థానికంగా నివాసం ఉంటున్న రాజ్‌కుమార్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి ఊరెళ్లాడు. ఇదే అదనుగా భావించిన దొంగలు ఇంటికి వేసి ఉన్న తాళం పగులగొట్టి బీరువాలో ఉన్న రెండున్నర తులాల బంగారం, రూ.25వేల నగదు ఎత్తుకెళ్లారు. గమనించిన స్థానికులు దొంగతనం సమాచారాన్ని ఇంటి యజమానికి అందించారు. జహీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కంట్రాక్టు లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయండి...
రామాయంపేట: అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వ జూనియర్ కళాశాల కంట్రాక్టు లెక్చరర్లు డిమాండ్ చేశారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ సుప్రింకోర్టు ఆదేశాలమేరకు తమకు పెంచిన వేతనాలు చెల్లించాలన్నారు. అంతేగాకుండా ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ అరుణకు వినతిపత్రం అందజేశారు. వినతి పత్రం ఇచ్చినవారిలో కంట్రాక్టు లెక్చరర్లు బాపూరావు, అశోక్, దీప్లానాయక్, నర్సింలుగౌడ్, శ్రీదేవి, మాదవి, హాజీమా తదితరులు ఉన్నారు. టేక్మాల్: కాంట్రాక్టు లెక్చరర్ల సమస్యలను పరిష్కరించాలి స్థానిక జూనియర్ కళాశాల కాంట్రాక్టు లెక్చరర్లు ప్రిన్సిపాల్ సత్యనారాయణకు మంగళవారం వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గతంలో కాంట్రాక్టు లెక్చరర్లను రెగ్యూలర్ చేస్తానని హమీ ఇచ్చిన ప్రభుత్వం నేటికీ చేయలేదన్నారు. కనీసం వేతనాలను కూడా పెంచడంలేదని అసంతృప్తిని వ్యక్తం చేశారు. తమ సమస్యలను నేడు హైదరాబాద్‌లో జరిగే ప్రిన్సిపల్ రివ్యూమీటింగ్‌లో విద్యాశాఖామంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. వినతి పత్రం ఇచ్చినవారిలో కాంట్రాక్టు లెక్చరర్లు శ్రీనివాస్, రఘునాథరావు, పరమేశ్వర్, సంజీవ్, బాలేశ్వరమ్మ, అనిత ఉన్నారు. -
క్లస్టర్లు రద్దు
రామాయంపేట: వైద్యశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న క్లస్టర్ (సామాజిక ఆరోగ్య, పోషక కార్యాలయం) కేంద్రాలను ప్రభుత్వం రద్దుచేసింది. గత ఐదేళ్ల క్రితం ఏర్పాటైన క్లస్టర్ల ద్వారానే ఇప్పటివరకు 104 సర్వీసుల నిర్వహణతో పాటు రాష్ట్రీయ బాల స్వస్థ్(ఆర్వీఎస్కే) కార్యక్రమాలు, కుటుంబ నియంత్రణ కార్యక్రమం పర్యవేక్షణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సంబంధించి పూర్తి వివరాలు నమోదు చేసే కార్యక్రమాలు కొనసాగాయి. మొదట్లో క్లస్టర్ కేంద్రాలకు ప్రజలనుంచి మంచి ఆదరణ లభించగా.. అధికారుల పర్యవేక్షణా లోపం, సరిగా మందులు రాకపోవడంతో ఇవి నామమాత్రంగా మారాయి. గత ప్రభుత్వ హయాంలో మంచి ఉద్దేశంతో ఈక్లస్టర్లు ఏర్పాటు చేయగా కొందరు ఉన్నతాధికారుల నిర్లక్ష్యంతో వీటి ఏర్పాటు అసంబద్ధంగా జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. ఒక్కో క్లస్టర్ పరిధిలో నాలుగునుంచి ఆరువరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను చేర్చి వీటిని ఏర్పాటు చేశారు. వైద్యసేవలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలనే ఉద్దేశంతోనే గతంలో ఏర్పాటైన క్లస్టర్ కేంద్రాలగురించి సరిగా పట్టించుకోకపోవడంతో ఈ కేంద్రాలు నామమాత్రంగా మారాయి. కాగా నిబంధనలకు విరుద్ధంగా అప్పట్లో రామాయంపేట క్లస్టర్ ఏర్పాటైందని ఆ శాఖ సిబ్బంది పేర్కొన్నారు. సాధారణంగా ఆరు లోపే పీహెచ్సీలతోనే క్లస్టర్ల ఏర్పాటు జరుగగా... రామాయంపేట క్లస్టర్ పధిలో మాత్రం మెదక్ ఏరియా ఆసుపత్రిని కలుపుకొని ఏకంగా పది పీహెచ్‌సీలను చేర్చారు. రాష్ట్రవ్యాప్తంగా పది పీహెచ్‌సీలు ఏ క్లస్టర్లో లేవని, అప్పటి అధికారులు ఏకపక్షంగా నిబంధనలకు విరుద్దంగా రామాయంపేట క్లస్టర్‌ను ఏర్పాటు చేశారని ఆరోపణలు వచ్చాయి. రామాయంపేట క్లస్టర్ పరిధిలో మొదట్లో నాలుగు 104 వాహనాలు సమకూరగా ప్రస్తుతం మూడు మాత్రమే కొనసాగుతున్నాయి. ఇవికూడా గ్రామాలకు సక్రమంగా రావడంలేదని, పూర్తి స్థాయిలో మందులు ఇవ్వడంలేదనే ఆరోపణలున్నాయి. కాగా పర్యవేక్షణ లోపంతో ఈక్లస్టర్లతో ప్రజలకు పెద్దగా లాభం చేకూరలేకపోగా 104 సర్వీసులు కూడా నామమాత్రంగా మారాయి. గతంలో 104 సర్వీసులు నెలకోమారు ప్రతి గ్రామానికి వెళ్లి బీపీ, షుగర్‌తోపాటు అన్ని రకాల వ్యాధులకు గ్రామాల్లోనే పూర్తి స్థాయిలో మందులు అందజేసేవారు. ఈవాహనంలో డాక్టర్‌తోపాటు ఏఎన్ఎం, గైనకాలజిస్ట్, ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నిషియన్, నర్స్ గ్రామాలకు వెళ్లి రోగులను పరీక్షించి మాత్రలు అందజేయాలనే ఆదేశాలు ఉన్నా ఏనాడు అమలు కాలేదు. 104తో గ్రామాల్లో పేషంట్లకు ఎంతో మేలు చేకూర్చినా... రాను రాను ఈసర్వీసులు నామమాత్రంగా మారాయి. ప్రస్తుతం కేవలం బీపీతోపాటు షుగర్ వ్యాధులకు మాత్రమే మాత్రలు వస్తున్నాయని, అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఈవాహనంలో ఒకరిద్దరు సిబ్బంది మాత్రమే వస్తున్నారని, వారు ఇచ్చే మందులు కూడాపూర్తి స్థాయిలో ఇవ్వడంలేదని గ్రామాల్లోని రోగులు వాపోయారు. ఈవిషయమై ‘సాక్షి’ ప్రతినిధి ఫోన్లో జిల్లా వైధ్యాధికారి డాక్టర్ అమర్‌సింగ్‌ను సంప్రదించగా... క్లస్టర్ల రద్దుకు సంబంధించి తమకు ఎలాంటి ఆదేశాలు అందలేదన్నారు. -
బ్యాంకులో బురిడీ
నగదు, బంగారు ఆభరణాలతో ఉడాయించిన యువకుడు రామాయంపేట: బ్యాంకులో సహాయం చేస్తున్నట్లు నటించిన ఓ యువకుడు తాను ఇదే బ్యాంకులో పని చేస్తానంటూ నమ్మ బలికి ఓ జంటను మోసగించి రూ.50 వేలతోపాటు రెండున్నర తులాల బంగారు ఆభరణాలు అపహరించుకుపోయాడు. స్థానిక ఎస్ఐ నాగార్జున్‌గౌడ్ కథనం ప్రకారం ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని రాయిలాపూర్ గ్రామానికి చెందిన గణేష్ ఇటీవల కూతురు పెళ్లి చేశాడు. కల్యాణలక్ష్మి పథకం కింద అతడి ఖాతాలో రూ. 50 వేలు జమయ్యాయి. ఆ డబ్బులు తీసుకునేందుకు బుధవారం గణేష్ తన భార్యతో కలిసి రామాయంపేటలోని ఎస్బీఐకి చేరుకున్నాడు. ఈమేరకు ఆయన బ్యాంకు సిబ్బందిని సంప్రదించగా ఆధార్ కార్డు తీసుకురావాలని సూచించారు. అక్కడే ఉన్న గుర్తు తెలియని యువకుడు గణేష్ దంపతులతో మాటలు కలిపి బ్యాంకు ఆవరణలోకి తీసుకెళ్లాడు. తాను ఇదే బ్యాంకులో పని చేస్తానని, ఆధార్‌కార్డు తీసుకురావడానికి వెళదామని వారిని నమ్మించాడు. దీంతో గణేష్ సదరు యువకుడిని బైక్‌పై ఎక్కించుకొని రాయిలాపూర్‌కు వెళ్లి ఆధార్‌కార్డు తెచ్చారు. ప్రస్తుతం మంజూరైన రూ.51వేలతోపాటు మరో రూ. 60వేలు అదనంగా మంజూరవుతాయని ఆ యువకుడు నమ్మబలికాడు. గణేష్ బ్యాంకుకు వచ్చిన తరువాత డబ్బులు డ్రాచేసుకోగానే డబ్బులు లెక్కిస్తానంటూ సదరు యువకుడు ఆ డబ్బులు తీసుకున్నాడు. అలాగే గణేష్ భార్య మెడలో ఉన్న రెండున్నర తులాల పుస్తెలతాడును సైతం వారిని మభ్యపెట్టి తీసుకున్న యువకుడు కనిపించకుండా పోయాడు. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన గణేష్ దంపతులు ఈ విషయంపై గురువారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా సదరు యువకుడి ఆనవాలు రోడ్డు మీదున్న సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డైంది. కాగా బ్యాంకులో సీసీ కెమెరాలు పని చేయక పోవడం గమనార్హం. -
కొండగొర్రె మాంసం స్వాధీనం
రామాయంపేట: పట్టణంలోని అంబేద్కర్ కాలనీలో ఒక ఇంట్లో రహస్యంగా దాచి ఉంచిన నాలుగు కిలోల కొండగొర్రె మాంసాన్ని మంగళవారంరాత్రి అటవీశాఖ అధికారులు స్వాధీనపర్చుకొని ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. స్థానిక అటవీ రేంజీ అధికారి చంద్రశేఖర్ తెలిపిన వివరాల మేరకు... కాలనీకి చెందిన పిట్టల రాజు కొంత కాలంగా అడవి జంతువుల మాంసాన్ని విక్రయిస్తున్నాడు. ఈ క్రమంలో అతడు కొండగొర్రె మాంసాన్ని తన ఇంటిలో దాచిఉంచగా.. ఈవిషయాన్ని కొందరు స్థానిక ఎస్ఐ నాగార్జునగౌడ్కు ఫిర్యాదు చేశారు. దీనితో ఎస్ఐ విషయాన్ని అటవీఅధికారికి దృష్టికి తెచ్చారు. డిప్యూటీ రేంజ్ అధికారి కిరణ్, సెక్షన్ అధికారి దుర్గయ్య, బీట్ అధికారులు చిరంజీవి, కిశోర్ కలిసి రాజు ఇంటిపై దాడి చేసి మాంసాన్ని స్వాధీనపర్చుకొని రాజును కస్టడీలోకి తీసుకున్నారు. ఈమేరకు అతన్ని అరెస్ట్ చేసి మాంసంతోపాటు జంతువులను వధించడానికి వినియోగించే కత్తి, తక్కెడను స్వాధీనపర్చుకున్నారు. -
రామాయంపేట బంద్ సంపూర్ణం
రెవెన్యూ డివిజన్ చేయాల్సిందే కాంగ్రెస్ నాయకుల డిమాండ్ పట్టణంలో భారీ బైక్ ర్యాలీ మూతపడిన దుకాణాలు, హోటళ్లు రామాయంపేట: రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రామాయంపేట బంద్ నిర్వహించారు. పట్టణ బంద్ సంపూర్ణం, ప్రశాంతంగా కొనసాగింది. ఉదయంనుంచే హోటళ్లు, పాన్‌షాపులు, కిరాణా దుకాణాలు మూతపడ్డాయి. బ్యాంకులు సైతం మూడపడటంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. పార్టీ కార్యకర్తలు పట్టణలో బైక్ ర్యాలీ నిర్వహించి తెరచి ఉన్న దుకాణాలు మూయించారు. రామాయంపేటకు అన్యాయం గతంలో రామాయంపేట నియోజకవర్గాన్ని ఎత్తివేయడంతో తమకు అడుగడుగునా అన్యాయం జరుగుతోందని పీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని, ఇందుకుగాను అన్ని పార్టీల వారు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆందోళనకు అందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో మాజీ ఎంపీపీ రమేశ్‌రెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పుట్టిరాజు, విప్లవ్‌కుమార్, మెదక్ అసెంబ్లీ కన్వీనర్ హస్నొద్దీన్, పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బైరం కుమార్, జిల్లా ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు గణేశ్ నాయక్, ఇతర నాయకులు చింతల యాదగిరి, స్వామి, సిద్దరాంలు తదితరులు పాల్గొన్నారు. -
రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలి
రామాయంపేట:రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని రోజురోజుకు ఆందోళన తీవ్రతరమవుతుంది. ఈమేరకు శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు స్థానిక తహసీల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు మాట్లాడుతూ అన్ని హంగులున్న రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. గతంలో ఎవరూ పట్టించుకోకపోవడంతో రామాయంపేట తాలూకా కేంద్రం రద్దయిందని, ప్రస్తుతం మండలంలో అత్యదికంగా ఉన్న 70వేల జనాభాకు తీరని అన్యాయం జరుగుతుందని ఆయన వాపోయారు. జాతీయ రహదారిపై ఉన్న రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేసి ఇందులో చేగుంట, చిన్నశంకరంపేట, దౌల్తాబాద్, నార్సింగి, బిక్కనూరు తదితర మండలాలను కలిపే అవకాశం ఉంటుందని సుప్రభాతరావు పేర్కొన్నారు. ఈవిషయమై ప్రభుత్వం పట్టించుకోకపోతే త్వరలో రామాయంపేట బందు నిర్వహించడంతో పాటు ఆందోళన ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ ఆనందరావుకు వినతిపత్రం అందజేశారు . ఈఆందోళనలో పార్టీ బీసీ సెల్ కన్వీనర్ విప్లవ్‌కుమార్, యూత్ కాంగ్రెస్ మెదక్ అసెంబ్లీ కన్వీనర్ హాస్నోద్దీన్, పార్టీ ఎస్టీ విభాగం జిల్లా ఉపాద్యక్షుడు గణేశ్‌నాయక్, బీసీ సెల్ మండలశాఖ అధ్యక్షుడు చింతల స్వామి, పట్టణశాఖ కార్యదర్శి అల్లాడి వెంకటేశ్, ఇతర నాయకులు మధూగౌడ్, రాకేశ్, రాంకీ, అలీం, జీడిపల్లి సత్యం, భూమ సిద్దరాంలు తదితరులు పాల్గొన్నారు. -
డ్రంక్ అండ్ డ్రైవ్.. యువకుడికి జైలు
రామాయంపేట: మద్యం తాగి వాహనం నడిపిన (డ్రంక్ అండ్ డ్రైవ్) కేసులో యువకుడికి రూ. 5 వందల జరిమానాతోపాటు ఐదు రోజుల జైలు శిక్ష పడినట్లు స్థానిక ఎస్ఐ నాగార్జునగౌడ్ తెలిపారు. నాగార్జునగౌడ్ గత నెల 28న రామాయంపేట వద్ద వాహనాల తనిఖీ చేపట్టగా కామారెడ్డికి చెందిన ఎండీ మోసిన్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డాడు. ఈ కేసులో యువకుడిని బుధవారం మెదక్ కోర్టుకు తరలించారు. నిందితుడికి రూ.500 జరిమానాతోపాటు ఐదు రోజుల జైలు శిక్ష విధిస్తూ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ బల్జిత్సింగ్ తీర్పు చెప్పినట్లు ఎస్ఐ తెలిపారు. -
మరణంలోనూ వీడని స్నేహం
రోడ్డు ప్రమాదంలో వృద్ధ రైతుల దుర్మరణం పొలాలకు వెళుతుండగా ఎదురొచ్చిన మృత్యువు రామాయంపేటలో విషాదం రామాయంపేట: రెక్కాడితేగాని డొక్కాడని కుటుంబాలు వారివి.. ఇంటి పెద్దలు కష్టపడితేనే కుటుంబాలు గడువని దుస్థితి.. వృద్ధాప్యం మీదపడ్డా వ్యవసాయం చేసుకుంటూ గుట్టుగా సంసారాలను నెట్టుకొస్తున్న ఇద్దరు రైతులు గురువారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం స్థానికులను కలిచివేసింది. బతికున్నపుడు కలిసిమెలిసి ఉన్న స్నేహితులిద్దరూ మరణంలోనూ వీడలేదు. వివరాల్లోకి వెళితే... రామాయంపేటలోని హరిజనవాడలో నివాసం ఉంటున్న బైరం లస్మయ్య(55), గావు లింగం (60) ఇరుగు పొరుగున ఉంటారు. వారు కాలనీలో అందరితో కలిసిమెలిసి ఉంటారు. వారిద్దరు వ్యవసాయ పనులకు వెళ్లినా కలిసే వెళుతారు. ఈ క్రమంలో సాయంత్రం వారిద్దరు ఒకే సైకిల్‌పై తమ పొలాల వద్దకు వెళుతున్నారు. పిచ్చాపాటి మాట్లాడుకుంటూ వెళుతుండగా, ఎదురుగా కంకరలోడుతో వస్తున్న లారీ దూసుకొచ్చింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ వీరిని చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ప్రమాదంతో సైకిల్ దెబ్బతిన్నది. లస్మయ్యకు భార్య ఆండాలుతోపాటు ముగ్గురు కుమారులు, కూతురు ఉన్నారు. గావు లింగానికి భార్య శాంతవ్వతోపాటు కుమారుడు, కూతురు ఉన్నారు. ఈ ఘటనతో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. స్థానిక ఎస్ఐ ప్రకాశ్‌గౌడ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మొక్కలకు ‘గ్లూకోజ్’
సంరక్షణలో భాగంగా నీటి వసతి విద్యార్థుల వినూత్న ఆలోచన రామాయంపేట: నాటిన మొక్కల్ని సంరక్షించేందుకు విద్యార్థులు వినూత్నంగా ఆలోచించారు. వారికి ఉపాధ్యాయులు తోడయ్యారు. ఈక్రమంలో ఒక్కో విద్యార్థి.. ఒక్కో మొక్కను దత్తత తీసుకున్నారు. ఆపై ఖాళీ గ్లూకోజ్ బాటిళ్లు కట్టి.. ఒక్కో చుక్క పడేలా ఏర్పాట్లు చేశారు. రామాయంపేట మండలంలోని కాట్రియాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు మొత్తం 247 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇటీవల హరితహారం కార్యక్రమం కింద పాఠశాల ఆవరణలో సుమారు 100 మొక్కలు నాటారు. కాగా, నాటిన మొక్కల్ని సంరక్షించుకునేందుకు వినూత్నంగా ఆలోచించారు. ఉపాధ్యాయులకు ఈ విషయం తెలుపగా.. ఒక్కో మొక్కను ఒక్కో విద్యార్థికి దత్తత ఇచ్చారు. ఈ మేరకు మొక్కల సంరక్షణ, వాటికి ప్రతిరోజు నీరు పోసే విధానంపై టీచర్లతో కలిసి అభిప్రాయాలు పంచుకున్నారు. దత్తత తీసుకున్న మొక్కలకు విద్యార్థుళు రాఖీలు కట్టారు. ప్రైవేటు ఆస్పత్రుల నుంచి ఖాళీ గ్లూకోజ్ బాటిళ్లు తీసుకొచ్చి.. మొక్కల పైభాగంలో ఏర్పాటు చేశారు. చుక్క చుక్క పడేలా ఏర్పాట్లు చేశారు. విద్యార్థులంతా ఒకే రోజు ఈ కార్యక్రమం చేపట్టడం విశేషం. విద్యార్థుల ఆలోచన నాటిన మొక్కల్ని సంరక్షించుకునేందుకు విద్యార్థులు కొత్తగా ఆలోచించారు. ఖాళీ సెలైన్ బాటిళ్లు సేకరించి మొక్కలకు కట్టారు. మొక్క నాది అనే భావన వారిలో కలిగింది. - బి తిరుపతి, హెచ్ఎం మొక్కలకు రాఖీ కట్టాం మొక్కల్ని అందరం దత్తత తీసుకున్నాం. అట్టపై మా పేర్లు రాసి మొక్కలకు కట్టాం. రాఖీలు కూడా కట్టాం. టీచర్లు చాలా హెల్ప్ చేశారు. ప్రతిరోజు బాటిళ్లలో నీళ్లు పోస్తున్నాం. - రమ్య, పదో తరగతి మొక్కలకు మా పేర్లు మొక్కలకు మా పేర్లు పెట్టారు. దీంతో రోజు వాటికి నీళ్లు పోస్తున్నాం. టీచర్లు కొత్తగా ఆలోచించి, సూచనలు ఇస్తున్నారు. మొక్కలు ఎండిపోకుండా చూస్తున్నాం. - శేఖర్, తొమ్మిదో తరగతి -
మంచం పట్టిన తండాలు
జ్వరాలతో వణికిపోతున్న జనాలు సుభాష్‌తండా, బిల్లా తండాల్లో 25 మందికి అస్వస్థత అందని వైద్య సేవలు.. ఆందోళనలో జనం రామాయంపేట: విష జ్వరాలతో గిరిజన తండాల వాసులు వణికిపోతున్నారు. ఏ ఇంట్లో చూసినా జ్వరంతో బాధపడుతున్నవారే కన్పిస్తున్నారు. వైద్య సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో ఇంట్లోనే బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతూ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. మండలంలోని దంతేపల్లి పంచాయతీ పరిధిలోని సుభాష్‌తండా, బిల్లా తండాలు మంచం పట్టాయి. ఈ రెండు తండాల్లో సమారు 25 మంది జ్వరంతో బాధపడుతున్నారు. ప్రభుత్వ వైద్యసేవలు అందక పోవడంతో వారు ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. దోమల దాడితో గిరిజనులు రోగాల బారిన పడుతున్నారు. ఏ ఇంట్లో చూసినా జ్వరంతో వణికిపోతున్నారు. రెండో ఏఎన్ఎంలు సమ్మెలో ఉండడంతో వైద్య సేవలందక గిరిజనులు తల్లడిల్లిపోతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో జ్వరం వచ్చినా గడప దాటడం లేదు. తమ ఇంటిల్లిపాదికీ జ్వరం వచ్చిందని.. ఇంటికి తాళంవేసి ఆసుపత్రికి వెళ్లినట్టు సుభాష్ తండాకు చెందిన హరి, దేవీసింగ్ తెలిపారు. రెండు తండాల్లో జ్వరాలు సోకడంతో స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రాల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. పారిశుద్ధ్యం అస్తవ్యస్తం ఈ తండాల్లో పారిశుద్ధ్యం లోపించింది. పెంట కుప్పలు ఇళ్లకు సమీపంలో ఉన్నాయి. నీటి గుంతలు ఉన్నాయి. దోమలు వృద్ధి చెందుతున్నాయి. దీంతో వీధులన్నీ కంపు కొడుతున్నాయి. వెంటనే తమ తండాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్యం అందించాలని గిరిజనులు కోరుతున్నారు. పారిశుద్ధ్య పనులు కూడా చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. -
అధికారులకు ప్రశంసాపత్రాలు
రామాయంపేట: ఉత్తమ ప్రతిభ కనబర్చిన అధికారులు ప్రశంసా పత్రాలు అందుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా సోమవారం జిల్లా మంత్రి హరీశ్‌రావుతోపాటు జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్, జిల్లా పరిషత్ చైర్మన్ రాజమణి చేతులమీదుగా ఎంపీడీవో రాణి, మండల వ్యవసాయ అధికారి రమేశ్, ఐసీడీఎస్ సీడీపీవో జ్యోతిర్మయి. స్థానిక ఎంపీపీ సూపరిండెంట్ గఫూర్‌ఖాన్ ప్రశాంసాపత్రాలను అందుకున్నారు. మండలానికి చెందిన అధికారులు సన్మానం పొందడంపై ఆయా పార్టీల ప్రతినిధులతోపాటు అధికారులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. -
కరువు ముంగిట్లో లక్ష్మాపూర్
వానలు లేక బోసిపోతున్న చెరువులు, కుంటలు వరద నీటికీ నోచుకోని గ్రామం ముందుకు సాగని సాగు పనులు ఆందోళనలో రైతులు జోగయ్య ఒర్రె నుంచి కాలువ తీయాలని వినతి రామాయంపేట: ‘వాన దేవుడు మా ఊరిపై కన్నెర్ర జేసిండా’.. అని లక్ష్మాపూర్ వాసులు ఆందోళన చెందుతున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో వానలు పడుతున్నా మా ఊర్లో మాత్రం లేవని వారంటున్నారు. వానలు లేక వరద నీరు రాక రెండు చెరువులూ బోసిపోయాయని వాపోతున్నారు. ఇప్పటికైనా కరుణించవా వాన దేవుడా.. అంటూ వేడుకుంటున్నారు. మండలంలోని లక్ష్మాపూర్ గ్రామం కరువుతో విలవిలలాడుతోంది. ఇటీవల కురిసిన వర్షాలతో ఇతర గ్రామాల్లోని చెరువుల్లోకి కొంతమేర నీరు చేరగా, ఇక్కడ మాత్రం ఉన్న రెండు చెరువులూ బోసిపోయాయి. ఈ చెరువుల్లోకి చుక్కనీరు చేరకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. చుట్టుపక్కల గ్రామాల్లో వ్యవసాయ పనులు ఊపందుకోగా, ఇక్కడ మాత్రం నెమ్మదిగా కొనసాగుతున్నాయి. అటవీప్రాంతాన్ని ఆనుకునే ఉన్న ఊర చెరువు, మైసమ్మ చెరువు చిన్నపాటి వర్షాలకే నీటితో నిండి కళకళలాడాల్సిందిపోయి చుక్క నీరు చేరకపోవడంతో కనీసం పశువులు తాగడానికి సైతం నీరు దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో గ్రామ పరిధిలో భూగర్భ జలాలు పూర్తిగా తగ్గిపోయి వ్యవసాయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గతంలో చిన్న చినుకులు కురిసినా అటవీప్రాంతం నుంచి వరద నీరు చెరువుల్లోకి చేరేదని రైతులు గుర్తు చేస్తున్నారు. అటవీ ప్రాంతంలోని జోగయ్య ఒర్రె నుంచి కాలువ తీస్తేనే... లక్ష్మాపూర్, కాట్రియాల పరిధిలోని అటవీప్రాంతంలోని జోగయ్య ఒర్రె ప్రాంతం నుంచి ప్రత్యేకంగా కాలువ తీస్తేనే ఈ రెండు చెరువుల్లోకి నీరు చేరే అవకాశం ఉంది. నాలుగైదేళ్ల క్రితం చేపట్టినన ఈ కాలువ తవ్వకం పనులు అటవీ శాఖ వారు మధ్యలోనే నిలిపివేశారు. దీంతో ఈ చెరువులోకి చుక్క నీరు చేరడంలేదు. నాలుగైదేళ్లుగా చెరువులు నిండక తాము ఇబ్బందులపాలవుతున్నామని రైతులు వాపోతున్నారు. వర్షాలు కురిస్తే ఈ చెరువుల్లోకి నీరు వచ్చే కాలువలు పూర్తిగా పూడుకుపోవడం కూడా మరో కారణమని స్థానికులు చెబుతున్నారు. కాలువ తవ్వించాలి నాలుగేళ్ల నుంచి ఊరి పక్కన ఉన్న రెండు చెరువులకు చుక్క నీరు వస్తలె. గోదలు తాగేతందుకు కూడా నీళ్లు దొరుకుతలె. చెరువులు మైదానం లెక్క అయినయి. బోర్లు కూడా పోస్తలేవు. అడవిల ఉన్న జోగయ్య ఒర్రెనుంచి చెరువులకు కాలువ తీస్తేనే నిండుతయి. లేకపోతే ఇట్లనే ఉంటయి. - సైదు పెద్ద సిద్దయ్య, రైతు వరద నీళ్లు చెర్లకు మళ్లించాలి అడవిల పడ్డ నీళ్లు సుక్క కూడా రెండు చెర్లకు వస్తలేవు. వర్షం నీళ్లు పెద్ద వరద ఊరి పక్కనుంచే వృథాగా పోతున్నయి. ఈ వరద నీళ్లను రెండు చెర్లకు మళ్లించేతందుకు కాలువ తీయించి ఆదుకోవాలి. బోర్లు నీళ్లు పోస్తలేవు. వెంటనే కాలువ తీయించేతందుకు సార్లు ఆడర్ ఇయ్యాలి. - కాసుల కిషన్, గ్రామ రైతు వానలు లేక చెర్లకు నీళ్లు రాలె చుట్టుపక్కల వానలు పడుతున్నా.. మా ఊరిలో పడుతలెవ్వు. రెండు చెర్లల్ల సుక్క నీరు రాలేదు. బోర్లల్ల నీళ్లు సరిగా రాక చాలామంది నాట్లు ఏస్తలేరు. చెరువులు నింపితేనే మేము బతికేది. గత నాలుగైదేళ్లుగా చెర్లు నిండక మస్తు కష్టపడుతున్నం. సర్కారు ఆదుకోవాలి.- యాకం దుర్గయ్య, రైతు కాలువ నిర్మాణానికి చర్యలు లక్ష్మాపూర్ గ్రామంలో వర్షపాతం తక్కువగా నమోదైంది. సరైన వర్షాలు కురవలేదు. గ్రామంలోని రెండు చెరువులకు నీరు చేరలేదు. వరద రాలేదని స్థానికులు నా దృష్టికి తెచ్చారు. జోగయ్య ఒర్రెనుంచి చెరువులకు కాలువ తీసేందుకు గాను సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశించాం. త్వరలో పనులు మొదలయ్యేలా చర్యలు తీసుకుంటా. - పద్మాదేవేందర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ -
వర్మివాష్‌తో పంటలకు మేలు
రామాయంపేట: సేంద్రీయ ద్రావణమైన వర్మీవాష్‌తో పంటలకు మేలు చేకూరుతుందని మండల వ్యవసాయ విస్తరణ అధికారి గణేశ్ పేర్కొన్నారు. మండలంలోని కోనాపూర్‌లో ఆదర్శ రైతు పోచమైన కిషన్ తయారు చేసిన ద్రావణాన్ని పరిశీలించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎకరాకు మూడు లీటర్ల చొప్పున ద్రావణాన్ని పిచకారీ చేస్తే శిలీంద్రాలను రూపుమాపవచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ ద్రావణంతో భూమి కూడా సారవంతంగా తయారవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని రైతులు వినియోగించుకోవాలని గణేశ్ సూచించారు. కార్యక్రమలో రైతు కిషన్, ఇతర రైతులు అశోక్, భీరయ్య పాల్గొన్నారు. -
బాలకార్మికులను అదుపులోకి తీసుకున్న అధికారులు
రామాయంపేట : ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా బాలల సంరక్షణ అధికారులు బుధవారం రామాయంపేట పట్టణంలో తొమ్మిది మంది బాలకార్మికులను గుర్తించి పట్టుకున్నారు. బాలల సంరక్షణ జిల్లా అధికారి భాస్కర్‌రావు ఆధ్వర్యంలో షీం టీం హెడ్ కానిస్టేబుల్ రాజు, కానిస్టేబుళ్లు మధు, సోమలత పట్టణంలోని పలు దుకాణాలు, మెకానిక్ షెడ్డులు, కిరాణా దుకాణాల్లో పనిచేస్తున్న బాలకార్మికులను గుర్తించి 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ముందే పసిగట్టిన పలు దుకాణాల్లో పనిచేస్తున్న బాలకార్మికులను మరోచోటుకు తరలించారు. పట్టుబడ్డ వారిలో విద్యార్థులు నిసాక్, ప్రవీణ్, నవీన్, ఇమ్రాన్‌ఖాన్, నరేశ్, భానుప్రసాద్, ఇలియాస్, ఫారూఖ్, ప్రశాంత్ ఉన్నారు. వీరిని దొంతి గ్రామంలో ఉన్న బాలల సంరక్షణ కేంద్రానికి తరలిస్తామని భాస్కర్‌రావు పేర్కొన్నారు. -
నాలుగిళ్లలో చోరీ
రామాయంపేట: నాలుగిళ్లలో చోరీ జరిగిన సంఘటన పట్టణంలో శుక్రవారం రాత్రి జరిగింది. రామాయంపేట పోలీసుల కథనం మేరకు పట్టణంలోని వడ్లపాండు ఇంట్లోంచి అరతులం బంగారం, పది తులాల వెండి ఆభరణాలు, యాదగిరి అనే వ్యక్తి ఇంట్లోంచి రూ.20వేల నగదు, ఐదు తులాల వెండి ఆభరణాలు, ప్రభాకర్ అనే వ్యక్తి ఇంట్లోంచి 15తులాల వెండి ఆభరణాలు, లంబాడి గంగమ్మ ఇంట్లోంచి 20 తులాల వెండి ఆభరణాలు, అరతులం బంగారు ఆభరాణాలు, రూ. 3వేల నగదు ఎత్తుకెళ్లారు. కాగా రాజు, జయమ్మ అనే వ్యక్తుల ఇళ్ల తాళాలు పగులు గొట్టినప్పటికీ వారింట్లో ఏమీ ఎత్తుకెళ్లలేదని తెలిపారు. మరో రెండు బైక్‌లు ఎత్తుకెళ్లిన దుండగులు గ్రామశివారులో వదిలి వెళ్లారు. దొంగలు మొత్తం రూ.23 వేల నగదు, 50 తులాల వెండి ఆభరణాలు, తులం బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఈ మేరకు రామాయంపేట ఎస్ఐ నాగార్జునగౌడ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కలెక్టర్ కారులో తరలించినా ప్రాణం దక్కలేదు
రామాయంపేట: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ యువకుడిని ఆదుకునేందుకు నిజామాద్ జిల్లా కలెక్టర్ ముందుకొచ్చారు. ప్రమాదస్థలం నుంచి బాధితుడిని తన వాహనంలో ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆ యువకుడు ప్రాణాలు వదలడంతో ఆమె చేసిన సాయం ఫలించలేదు. ఈ సంఘటన బుధవారం రాత్రి మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ శివారులో జరిగింది. ఎస్ఐ నాగార్జునగౌడ్ కథనం మేరకు.. హైదరాబాద్‌లోని మెడ్లీ ఫార్మసీలో ఏరియా మేనేజర్లుగా పనిచేస్తున్న రామకృష్ణ భరద్వాజ్, గంగల్ల నరేశ్‌కుమార్ బైక్‌పై కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు. రామాయంపేట శివారులో వీరి బైక్ ముందు వెళ్తున్న ఆటోను ఢీకొట్టి అదుపుతప్పి పడిపోయింది. బైక్‌పై ఉన్న ఇద్దరూ కిందపడిపోయారు. వీరిలో రామకృష్ణ భరద్వాజ్ (30)కు తీవ్ర గాయాలయ్యాయి. సకాలంలో 108 రాకపోవడంతో నరేశ్‌కుమార్ రోడ్డుకు అడ్డంగా నిలబడి పలువుర్ని సాయం కోరాడు. ఎవరూ స్పందించలేదు. అదే సమయంలో కారులో హైదరాబాద్ వెళ్తున్న నిజామాబాద్ జిల్లా కలెక్టర్ యోగిత రాణా తన కారులో క్షతగాత్రుడిని ఎక్కించుకుని నార్సింగిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే రామకృష్ణ మృతి చెందాడు. నరేశ్‌కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తండాల్లో అగ్ని ప్రమాదాలు
భారీ ఆస్తి నష్టంరూ. లక్షా 65 వేల నగదు..లబోదిబోమన్న బాధితులు రామాయంపేట : మండలంలోని రాంపూర్, జడ్చెరువు తండాల్లో శనివారం ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదాల్లో నగదుతోపాటు బంగారు, వెండి ఆభరణాలు, నిత్యవసర సరుకులు, దుస్తులు ఆహుతయ్యాయి. రాంపూర్‌లో లంబాడి గణేశ్, తన భార్యతో కలిసి నివాస గుడిసెకు తాళంవేసి చెరకు నరకడానికి వెళ్లాడు. సాయంత్రం ప్రమాదవశాత్తు ఇంట్లోనుంచి మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో ఉన్న రూ. లక్షా 60 వేలు నగదుతోపాటు మూడు క్వింటాళ్ల బియ్యం, మూడు తులాల బంగారు, వెండి ఆభరణాలు, కూలర్, వంట సామగ్రి, దుస్తులు కాలిపోయాయి. ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని చూసిన గ్రామస్థులు మంటలను చల్లార్చడానికి ప్రయత్నించగా, సాధ్యం కాలేదు. ఈ ప్రమాదంలో గుడిసె పూర్తిగా కాలిపోవడంతో బాధిత కుటుంబం కట్టుబట్టలతో మిగిలింది. ఆర్ఐ చంద్రశేఖర్ సంఘటన స్థలాన్ని సందర్శించి నష్టం వివరాలు నమోదు చేసుకున్నారు. జడ్చెరువు తండాలో... జడ్చెరువు తండాలో శనివారం లంబాడి శంకర్ అనే వ్యక్తి ఇంటికి ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. వంట సామగ్రితోపాటు దుస్తులు, కొంత నగుదు, బంగారు వెండి ఆభరణాలు బుగ్గి అయ్యాయి. శంకర్ తన ఇం టికి తాళంవేసి భార్యతోపాటు పని నిమిత్తం బయటకు వెళ్లగా ఇంట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. -
ముగ్గురు యువతుల అదృశ్యం
మెదక్ టౌన్: ముగ్గురు యువతులు అదృశ్యమైన ఘటనలు ఆలస్యంగా వెలుగుచూశాయి. మెదక్ పట్టణ పోలీసుల కథనం ప్రకారం.. రామాయంపేట మండలం దామరచెర్వు గ్రామానికి చెందిన జెల్ల శృతి (19) పట్టణంలోని చర్చికాంపౌండ్‌లో గల తన బంధువుల ఇంటికి ఇటీవల వచ్చింది. గత నెల 27న ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ లేకపోవడంతో శనివారం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే హైదరాబాద్‌లోని మియాపూర్‌లో ఉండే సౌమ్య (19) హైదరాబాద్‌లో బీటెక్ చేస్తోంది. మెదక్ పట్టణంలోని అజంపురా వీధిలో ఉండే మేనమామ అల్లం సంతోష్ ఇంటికి సంక్రాంతి సెలవులకు వచ్చింది. జనవరి 25న కడుపునొప్పిగా ఉంది. టాబ్లెట్స్ తెచ్చుకుంటానని చెప్పి ఇంట్లోంచి బయటకు వెళ్లిన సౌమ్య తిరిగి రాలేదు. దీంతో ఆమె మేనమామ శనివారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అలాగే పాపన్నపేట మండలం నార్సింగి గ్రామానికి చెందిన వంజరి రాధ (20) మెదక్ పట్టణంలో రెండేళ్లుగా ఉంటూ ఓపెన్ డిగ్రీ చేస్తుంది. ఈనెల 25న స్నేహితురాలి వద్దకు వెళ్తానని చెప్పి తిరిగి రాలేదు. దీంతో బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మూడు కేసులు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సాయీశ్వర్‌గౌడ్ తెలిపారు. -
రైతు కుటుంబాలను ఆదుకుంటాం
రామాయంపేట: ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని మెదక్ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆమె రామాయంపేటలో విలే కరులతో మాట్లాడుతూ రైతు ఆత్మహత్యలకు సంబంధించి గతంలోఉన్న ప్యాకేజీకి అనుగుణంగా చర్యలు చేపడతామని, ఇందుకోసం సీఎం కేసీఆర్ సబ్‌కమిటీ నియమించారన్నారు. రైతు సంక్షేమంకోసం కృషి చేస్తామని, గ్రామాలు, పట్టణాల అభివృద్ధికిగాను ప్రతిపాదనలు తయారు చేసి సీఎంకు అందజేశామన్నారు. మెదక్- సిద్దిపేట రోడ్డు, వడియారం- మెదక్ రోడ్డు విస్తరణతోపాటు రూ.20 కోట్లతో ఇంటర్నల్ రోడ్లను మరమ్మతు చేయిస్తామన్నారు. మండలంలోని శివ్వాయపల్లి, సుతారిపల్లి, కోమటిపల్లి, తదితర గ్రామాల రహదార్లకు మహర్దశ పట్టనుందన్నారు. రామాయంపేటలోని మల్లెచెరువుకు మొదటి విడతలోనే మరమ్మతులు చేయిస్తామని హామీ ఇచ్చారు. వ చ్చే మూడేళ్లలో ప్రతి ఇంటికి తాగునీటి వసతి కల్పిస్తామన్నారు. ఆహార భద్రత కార్డులు, పింఛన్ల విషయమై ఎవరూ ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు. పాలమద్దతు ధర పెంపుతో రైతులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని ఆపే ప్రసక్తే లేదని, ఈవిషయమై అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అధ్యక్షురాలు పుట్టి విజయలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యురాలు బిజ్జ విజయలక్ష్మి, టీఆర్ఎస్ మండలశాఖ అధ్యక్షుడు రమేశ్‌రెడ్డి, పట్టణ శాఖ అధ్యక్షుడు పుట్టి యాదగిరి, ఎంపీపీ ఉపాధ్యక్షుడు జితేందర్‌గౌడ్, పార్టీ జిల్లా కార్యదర్శి అందె కొండల్‌రెడ్డి, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మానెగల్ల రామకిష్టయ్య, ఎంపిటీసీ సభ్యులు శ్యాంసుందర్, మైసాగౌడ్, సర్పంచులు పాతూరి ప్రభావతి, సంగుస్వామి, మాజీ ఎంపీపీ సంపత్, ఇతర నాయకులు కొండల్‌రెడ్డి, చంద్రం, నవాత్ కిరణ్ తదితతరులు పాల్గొన్నారు. -
రైతన్నలపై లాఠీ
* కరెంటు కోతలపై అన్నదాతల రాస్తారోకో * లాఠీలతో విరుచుకుపడిన పోలీసులు * పలువురు రైతులకు తీవ్రగాయాలు * సీఎం సొంత జిల్లాలోనే ఘటన * ప్రజా సంఘాలు, రైతు సంఘాల మండిపాటు * ఇతర జిల్లాల్లోనూ భారీగా ఆందోళనలు * సబ్స్టేషన్ల ముట్టడి, సిబ్బంది నిర్బంధం (సాక్షి నెట్వర్క్): కరెంట్ కోసం ఆందోళనకు దిగిన అన్నదాతలపై పోలీసులు ప్రతాపం చూపించారు. విచక్షణారహితంగా లాఠీలు ఝుళిపించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా మెదక్‌లో చోటుచేసుకున్న ఈ లాఠీచార్జ్‌లో అనేకమంది రైతులు గాయపడ్డారు. జిల్లాలో నాలుగు రోజులుగా విద్యుత్ కోతలు ఎక్కువయ్యాయి. రోజుకు రెండు గంటలు కూడా కరెంట్ ఇవ్వకపోవడంతో పంటలు ఎండుతున్నాయన్న ఆవేదనతో రైతులు సోమవారం పలుచోట్ల ఆందోళన చేపట్టారు. చేగుంట మండలం నార్సింగిలోని 44వ నంబర్ జాతీయ రహదారిపై ఉదయం 8 గంటల నుంచే రాస్తారోకోకు దిగారు. దాదాపు నాలుగు గంటల పాటు ఇది కొనసాగింది. సమీపంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు ఇందులో పాల్గొన్నారు. రోడ్డు మీద టైర్లు వేసి నిప్పు పెట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే సమయంలో సహనం కోల్పోయిన రామాయంపేట సీఐ గంగాధర్, ఆయన వెంట వచ్చిన ప్రత్యేక పోలీసు బలగాలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. చేతికి దొరికిన నారాయణ అనే రైతును చావబాదారు. అతని తలకు తీవ్రమైన గాయమైంది. వల్లబోయిని శ్రీను, ఇక్బాల్‌తో పాటు మరికొందరు రైతులకు తీవ్రగాయాలయ్యాయి. దీంతో కోపోద్రిక్తులైన అన్నదాతలు ఎదురుతిరిగారు. రైతుల ధాటికి తట్టుకోలేక సీఐ గంగాధర్ తప్పించుకుని పారిపోతుండగా పోలీసు వాహనం టైర్లలో గాలిని తీసేశారు. వాహనాలను వెళ్లనీయకుండా రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మెదక్ ఆర్డీవో వనజాదేవి సంఘటన స్థలానికి చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు శాంతించలేదు. ఆమె వాహనానికి అడ్డుగా నిలిచారు. తమపై లాఠీచార్జి చేసిన సీఐకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులంతా సబ్‌స్టేషన్ వద్దకు వస్తే విద్యుత్ సమస్యపై చర్చిస్తానని, ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తానని ఆర్డీవో హామీ ఇవ్వడంతో కాస్త శాంతించి రాస్తారోకో విరమించారు. పలు ప్రజా సంఘాలతోపాటు యువజన సంఘాలు, రైతు సంఘాల నాయకులు పోలీసుల చర్యను ఖండించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై లాఠీచార్జి చేసిన సీఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఇతర జిల్లాల్లోనూ నిరసనలు కరెంటు కోతలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇతర జిల్లాల్లోనూ రైతులు రోడ్డెక్కారు. నల్లగొండ, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లలో ఆందోళనలు, రాస్తారోకోలు, నిర్బంధాలకు దిగారు. నల్లగొండ జిల్లా తుర్కపల్లి సబ్‌స్టేషన్ గదికి తాళాలు వేసి, ఏఈని చుట్టుముట్టి నిలదీశారు. మోత్కూరులోనూ సబ్‌స్టేషన్, ఏఈ కార్యాలయంపై దాడి చేశారు. రోడ్డుపై ట్రాక్టర్లను అడ్డుగా నిలిపి రాస్తారోకో నిర్వహించారు. వలిగొండ సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా చేసి, సిబ్బందిని నిర్బంధించారు. సంస్థాన్ నారాయణపురంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆరుతడి పంటలపై అవగాహన సదస్సును అడ్డుకున్నారు. చిట్యాల మండలం వట్టిమర్తి, వనిపాకల, గుమ్మలబావి గ్రామాలకు చెందిన రైతులు రామన్నపేట సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. బొమ్మలరామారం మండలంలోని సోలిపేట్ సబ్‌స్టేషన్ సిబ్బందిని నిర్బంధించారు. తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో మిర్యాలగూడ ట్రాన్స్‌కో డీఈ కార్యాలయాన్ని రైతులు ముట్టడించారు. మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు. భూదాన్‌పోచంపల్లి మండలంలోని కనుముకుల, వంకమామిడి, ధర్మారెడ్డిపల్లి, దంతూర్, జిబ్లక్‌పల్లి గ్రామాలకు చెందిన 300 మంది రైతులు పోచంపల్లి చౌరస్తాలో ధర్నా చేశారు. తిరుమలగిరి సబ్ స్టేషన్ ఎదుట వివిధ గ్రామాల రైతులు మూడు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. ఇక మహబూబ్‌నగర్ జిల్లాలో బిజినేపల్లి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ముట్టడించి కార్యాలయానికి తాళం వేశారు. ఈ నిరసనలో పాల్గొన్న పాలెం గ్రామానికి చెందిన సొప్పరి బాలస్వామి అనే రైతు పురుగు మందు డబ్బాతో కలకలం సృష్టించాడు. అయిజ, వడ్డేపల్లి మండలాలకు చెందిన రైతులు అయిజ విద్యుత్ సబ్ స్టేషన్‌ను ముట్టడించారు. పలువురు రైతులు పురుగుమందు డబ్బాలను చేతబట్టుకుని ఆందోళనకు దిగారు. కర్నూలు ప్రధాన రహదారిపై ముళ్లకంచె వేసి రాస్తారోకో చేపట్టారు. గోపాల్పేట మండలం బుద్దారంలోనూ ఇదే రకమైన ఆందోళన కొనసాగింది. మరోవైపు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గం కల్లెడిలో సబ్‌స్టేషన్‌పై రైతులు దాడి చేసి ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. భీమ్‌గల్ మండలం కుప్కల్లో సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. మోర్తాడ్ మండలంలోని వడ్యాట్ రైతులు సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. బాన్సువాడ నియోజకవర్గంలోని వర్ని మండలం లక్ష్మాపూర్, బీర్కూరు మండలం నస్రుల్లాపూర్ గ్రామాల్లో ఆందోళన చేశారు. పిట్లం మండలం తిమ్మానగర్, కొడప్గల్, బిచ్కుందలలోనూ నిరసన తెలియజేశారు. కామారెడ్డి నియోజకవర్గం దోమకొండ మండలం బీబీపేటలో ధర్నా నిర్వహించారు. భిక్కనూరు, మాచారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గం లింగంపేట, ఎల్లారెడ్డి మండలాల్లో రైతులు రాస్తారోకోలు చేపట్టారు. కాగా, దోమకొండ మండలంలో పర్యటించిన వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డికి స్థానిక రైతులు తమ గోడు వెల్లడించారు. కోతలు లేకుండా చూస్తామని ఈ సందర్భంగా మంత్రి హామీ ఇచ్చారు. రైతులు రోడ్లపైకి రావొద్దు: పోచారం రైతులు రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్‌కు ఇబ్బందులు కలిగించవద్దని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి కోరారు. కరెంట్ సమస్యను రాజకీయం చేసే శక్తుల మాయలో పడవద్దని విజ్ఞప్తిచేశారు. థర్మల్‌విద్యుత్ ఉత్పాదనలో ఇబ్బందులు తలెత్తడంతో రెండురోజులుగా రైతులకు సరిగ్గా కరెంట్‌ను ఇవ్వలేకపోయామన్నారు. ఇప్పుడు సమస్య పరిష్కారమైనందున కరెంట్ సమస్యలు ఉత్పన్నం కాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మెదక్జిల్లాలో రైతులపై పోలీసులు లాఠీచార్జి చేయడం బాధ కలిగించిందని దాన్ని ఖండిస్తున్నామన్నారు. సోమవారం సచివాలయం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తామని, ఈ విషయంలో సీఎం కేసీఆర్ జోక్యంచేసుకుని కరెంట్ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నారని’ అన్నారు. కరెంట్ అడిగితే కొడతారా: పొన్నాల మెదక్ జిల్లా రైతాంగంపై పోలీసుల లాఠీచార్జ్ అమానుషమని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య వ్యాఖ్యానించారు. కరెం ట్ సరఫరా చేయాలని ఆందోళన చేస్తే లాఠీలతో జవాబిస్తారా? అని ఆయన సోమవారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. కాంగ్రెస్ పదేళ్ల పాలనలో ఒక్క రైతుపైనా దాడి జరగలేదనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రెండు నెలల కేసీఆర్ పాలనలో 120 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పేర్కొన్నారు. మూడు రోజుల్లోనే ఏడుగురు రైతులు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమన్నారు. అన్నదాతల ఆత్మహత్యలు రాష్ట్రానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదన్నారు. పోలీసు కొత్త వాహనాల కొనుగోలుకు రూ.వందల కోట్లు కేటాయించడంతోపాటు వాటిని పరిశీలించేందుకు గంటల కొద్ది సమయం వెచ్చించిన కేసీఆర్.. రైతుల సమస్యలపై పదినిమిషాలు సమయం కేటాయించినా ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. లాఠీచార్జి అమానుషం: కిషన్‌రెడ్డి కరెంటు కోతలను నిరసిస్తూ రోడ్డెక్కిన రైతులపై లాఠీచార్జి చేయడం అమానుషమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా పిట్లం, మెదక్ జిల్లా చేగుంటల్లో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు అకారణంగా లాఠీచార్జి చేసి కేసులు పెట్టడాన్ని ఓ ప్రకటనలో ఆయన ఖండించారు. వారిపై బనాయించిన కేసులను బేషరతుగా ఎత్తివేయాలని, నిరంతర విద్యుత్తు సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఎంసెట్ కౌన్సిలింగ్ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వును యథాతథంగా అమలు చేయాలని కిషన్‌రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. ఇప్పటికే జాప్యం జరిగినందున సత్వరమే ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు. లాఠీదెబ్బలు తినడానికేనా తెలంగాణ?: షబ్బీర్‌అలీ మెదక్‌లో విద్యుత్‌కోతలపై ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసుల లాఠీచార్జ్‌ను శాసనమండలిలో కాంగ్రెస్ ఉపనేత షబ్బీర్‌అలీ తీవ్రంగా ఖండించారు. తెలంగాణ కోసం పోరాడిన రైతాంగానికి కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చే బహుమతి ఇదేనా అని ఆయన ప్రశ్నించారు. సీఎల్పీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘నాలుగైదు రోజులుగా కరెంట్ రాక పొలాలు ఎండిపోతుంటే రైతులు రోడ్డెక్కారు. అయినా పట్టని కేసీఆర్ ప్రభుత్వం విందులు, వినోదాలతో జల్సా చేసుకుంటోంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుపు కోసం టీఆర్ఎస్ నేతలు మంతనాలు చేస్తున్నారు. తెలంగాణ సాధించుకున్నది లాఠీదెబ్బలు తినడానికేనా?’అని షబ్బీర్‌అలీ మండిపడ్డారు. -
రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయుడి దుర్మరణం
మెదక్ రూరల్, న్యూస్‌లైన్: రోడ్డుప్రమాదంలో ఓ ఉపాధ్యాయుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మెదక్-రామాయంపేట ప్రధాన రహదారి పాతూరు శివారులో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. రూరల్ పోలీసులు, మృతుడి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం...మండల పరిధిలోని పోచమ్మరాళ్ గిరిజనతండాకు చెందిన మేఘావత్ హరిసింగ్(38) మెదక్ పట్టణంలో ఉంటూ రామాయంపేటలోని ఓ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో రామాయంపేట నుండి తన బైక్‌పై మెదక్ వస్తుండగా పాతూరు శివారులోని బిడ్జి సమీపంలో గుర్తుతెలియని వాహనం హరిసింగ్ బైక్‌ను ఢీ కొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృత్యువాతపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య రేణుకతోపాటు ఏడేళ్ల వయసు గల కూతురు ఉంది. అందరికీ తలలో నాలుకగా వ్యవహరించే హరిసింగ్ మృతితో పోచమ్మరాళ్తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి.