సీసీ కెమెరాలో రికార్డైన నిందితుడి చిత్రం
- నగదు, బంగారు ఆభరణాలతో ఉడాయించిన యువకుడు
రామాయంపేట: బ్యాంకులో సహాయం చేస్తున్నట్లు నటించిన ఓ యువకుడు తాను ఇదే బ్యాంకులో పని చేస్తానంటూ నమ్మ బలికి ఓ జంటను మోసగించి రూ.50 వేలతోపాటు రెండున్నర తులాల బంగారు ఆభరణాలు అపహరించుకుపోయాడు. స్థానిక ఎస్‌ఐ నాగార్జున్‌గౌడ్ కథనం ప్రకారం ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మండలంలోని రాయిలాపూర్ గ్రామానికి చెందిన గణేష్ ఇటీవల కూతురు పెళ్లి చేశాడు. కల్యాణలక్ష్మి పథకం కింద అతడి ఖాతాలో రూ. 50 వేలు జమయ్యాయి. ఆ డబ్బులు తీసుకునేందుకు బుధవారం గణేష్ తన భార్యతో కలిసి రామాయంపేటలోని ఎస్‌బీఐకి చేరుకున్నాడు. ఈమేరకు ఆయన బ్యాంకు సిబ్బందిని సంప్రదించగా ఆధార్ కార్డు తీసుకురావాలని సూచించారు. అక్కడే ఉన్న గుర్తు తెలియని యువకుడు గణేష్ దంపతులతో మాటలు కలిపి బ్యాంకు ఆవరణలోకి తీసుకెళ్లాడు.
తాను ఇదే బ్యాంకులో పని చేస్తానని, ఆధార్‌కార్డు తీసుకురావడానికి వెళదామని వారిని నమ్మించాడు. దీంతో గణేష్ సదరు యువకుడిని బైక్‌పై ఎక్కించుకొని రాయిలాపూర్‌కు వెళ్లి ఆధార్‌కార్డు తెచ్చారు. ప్రస్తుతం మంజూరైన రూ.51వేలతోపాటు మరో రూ. 60వేలు అదనంగా మంజూరవుతాయని ఆ యువకుడు నమ్మబలికాడు. గణేష్ బ్యాంకుకు వచ్చిన తరువాత డబ్బులు డ్రాచేసుకోగానే డబ్బులు లెక్కిస్తానంటూ సదరు యువకుడు ఆ డబ్బులు తీసుకున్నాడు.
అలాగే గణేష్ భార్య మెడలో ఉన్న రెండున్నర తులాల పుస్తెలతాడును సైతం వారిని మభ్యపెట్టి తీసుకున్న యువకుడు కనిపించకుండా పోయాడు. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన గణేష్ దంపతులు ఈ విషయంపై గురువారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా సదరు యువకుడి ఆనవాలు రోడ్డు మీదున్న సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డైంది. కాగా బ్యాంకులో సీసీ కెమెరాలు పని చేయక పోవడం గమనార్హం.