రామాయంపేటలో మూతపడ్డ దుకాణాలు
- రెవెన్యూ డివిజన్ చేయాల్సిందే
- కాంగ్రెస్ నాయకుల డిమాండ్
- పట్టణంలో భారీ బైక్ ర్యాలీ
- మూతపడిన దుకాణాలు, హోటళ్లు
రామాయంపేట: రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రామాయంపేట బంద్ నిర్వహించారు. పట్టణ బంద్ సంపూర్ణం, ప్రశాంతంగా కొనసాగింది. ఉదయంనుంచే హోటళ్లు, పాన్‌షాపులు, కిరాణా దుకాణాలు మూతపడ్డాయి. బ్యాంకులు సైతం మూడపడటంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. పార్టీ కార్యకర్తలు పట్టణలో బైక్ ర్యాలీ నిర్వహించి తెరచి ఉన్న దుకాణాలు మూయించారు.
రామాయంపేటకు అన్యాయం
గతంలో రామాయంపేట నియోజకవర్గాన్ని ఎత్తివేయడంతో తమకు అడుగడుగునా అన్యాయం జరుగుతోందని పీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని, ఇందుకుగాను అన్ని పార్టీల వారు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆందోళనకు అందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఆందోళనలో మాజీ ఎంపీపీ రమేశ్‌రెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పుట్టిరాజు, విప్లవ్‌కుమార్, మెదక్ అసెంబ్లీ కన్వీనర్ హస్నొద్దీన్, పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బైరం కుమార్, జిల్లా ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు గణేశ్ నాయక్, ఇతర నాయకులు చింతల యాదగిరి, స్వామి, సిద్దరాంలు తదితరులు పాల్గొన్నారు.