Bandh success
-
హోదా బంద్ సక్సెస్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘ప్రత్యేక హోదా కోసం ఎందాకైనా పోరాడతాం. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నినదించాయి. అధిష్టానం పిలుపు మేరకు మంగళవారం వైఎస్సార్ సీపీ తలపెట్టిన రాష్ట్ర బంద్ జిల్లాలో విజయవంతం అయింది. పది నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు బంద్‌లో పాల్గొని బస్టాండ్లను ముట్టడించాయి. నిరసన ర్యాలీలు చేపట్టాయి. బంద్‌ను విఫలం చేసేందుకు పోలీసుల ద్వారా ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నించింది. ఈ క్రమంలో వందల సంఖ్యలో నేతలు, కార్యకరలను అరెస్ట్ చేశారు. అయినా చాలా ప్రాంతాల్లో బంద్ సాయంత్రం వరకు సంపూర్ణంగా కొనసాగింది. విద్యాసంస్థలు మూతపడ్డాయి. నగరంతో పాటు జిల్లాలో వ్యాపార, ఇతర వాణిజ్య సముదాయాలు, కొన్ని చోట్ల ప్రభుత్వ కార్యాలయాలు మూత పడ్డాయి. జిల్లాలో సోమవారం అర్ధరాత్రి నుంచి ప్రారంభమైన బంద్ విజయవంతం అయింది. పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు, నేతలు కేంద్రం అనుసరిస్తున్న తీరు, చంద్రబాబునాయుడు వైఖరిపై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల నుంచి జిల్లాలో పార్టీ శ్రేణులు ఆర్టీసీ బస్టాండ్ల నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా డిపోల ఎదుట బైఠాయించి నిరసన తెలిపి హోదా నినాదాలు చేశారు. నెల్లూరు నగరంలో సిటీ ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్ యాదవ్ భారీ బైక్ ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. పార్టీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి కావలి, సర్వేపల్లి నియోజవర్గంలో జరిగిన బంద్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వెంకటగిరి నియోజకవర్గంలో బంద్‌లో భాగంగా కార్యకర్తలు కొందరు అర గుండు చేయించుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. గూడూరు పార్టీ సమన్వయకర్త మేరిగ మురళీ ప్రజలకు పూలు ఇచ్చిన బంద్‌కు మద్దతు పలకాని కోరారు. 40 కేసులు 777 మంది అరెస్ట్ తిరుపతి మాజీ ఎంపీ వెలగపల్లి వరప్రసాద్, పార్టీ ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్‌యాదవ్. కిలివేటి సంజీవయ్య, రామిరెడ్డి ప్రతాప్‌కుమార్ రెడ్డి, జెడ్పీ చెర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, పార్టీ సమన్వయకర్తలు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, మేరిగ మురళీతో పాటు పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు మొత్తం కలిపి 40 కేసులు నమోదు చేసి 777 మందిని అరెస్ట్ చేసి సొంత పూచికత్తు బెయిల్‌పై విడుదల చేశారు. నెల్లూరు నగరంలో ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్ తెల్ల వారుజాము న ఆత్మకూరు బస్టాండ్ వద్ద బైఠాయించి నిరసన తెలి పారు. బస్సులను బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఎమ్మెల్యే కార్యాలయం నుంచి నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సుమారు రెండు వేల బైక్‌లతో నగరంలో ర్యాలీ నిర్వహించి హోదా నినాదాలు చేశారు. పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు పి. రూప్కుమార్యాదవ్తో పాటు పార్టీ నేతలు పాల్గొన్నారు. నెల్లూరురూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సోమవారం అర్ధరాత్రి నుంచే బంద్ కార్యక్రమం నిర్వహించారు. రాత్రి 12 గంటల సమయంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. మంగళవారం నగరంలోని దూరదర్శన్ కేంద్రాన్ని ముట్టడించి ఆందోళన కొనసాగించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. సర్వేపల్లిలో పార్టీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి వెంకటాచలం మండలంలో జరిగిన బంద్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబునాయుడు తీరుపై కాకాణి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కోవూరు నియోజకవర్గంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి కోవూరులో బంద్ నిర్వహించారు. అందులో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించి దుకాణాలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయించారు. కావలిలో పార్టీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్‌రెడ్డి బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పాల్గొన్నారు. కావలి పట్టణంలో బంద్ నిర్వహించి ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయించారు. సూళ్లూరుపేటలో తిరుపతి మాజీ ఎంపీ వెలగపల్లి వరప్రసాద్, తిరుపతి పార్లమెంటరీ జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ వెలగపల్లి, ఎమ్మెల్యే సంజీవయ్య సీఎం చంద్రబాబు యూటర్న్‌తో రాష్ట్రం అధోగతి పాలవుతోందని మండిపడ్డారు. వెంకటగిరిలో పార్టీ సమన్వయకర్త జెడ్పీ చైర్మన్, బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. వెంకటగిరి పార్టీ పట్టణ అధ్యక్షుడు డి.ఢిల్లీబాబు పార్టీ నేత కలిమిలి రాంప్రసాద్ రెడ్డి బస్‌డిపో వద్ద ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయగిరిలో పార్టీ సమన్వయకర్త మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి బంద్ నిర్వహించారు. ఉదయగిరి బస్టాండ్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించి అనంతరం వరికుంటపాడులో జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గూడూరులో పార్టీ సమన్వయకర్త మేరిగ మురళి నేతృత్వంలో బంద్ కొనసాగింది. పార్టీ రాష్ట్ర నేత ఎల్లసిరి గోపాల్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పేర్నాటి శ్యాంప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి పిలుపు మేరకు పార్టీ శ్రేణులు అన్ని మండలాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. -
రామాయంపేట బంద్ సంపూర్ణం
రెవెన్యూ డివిజన్ చేయాల్సిందే కాంగ్రెస్ నాయకుల డిమాండ్ పట్టణంలో భారీ బైక్ ర్యాలీ మూతపడిన దుకాణాలు, హోటళ్లు రామాయంపేట: రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రామాయంపేట బంద్ నిర్వహించారు. పట్టణ బంద్ సంపూర్ణం, ప్రశాంతంగా కొనసాగింది. ఉదయంనుంచే హోటళ్లు, పాన్‌షాపులు, కిరాణా దుకాణాలు మూతపడ్డాయి. బ్యాంకులు సైతం మూడపడటంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. పార్టీ కార్యకర్తలు పట్టణలో బైక్ ర్యాలీ నిర్వహించి తెరచి ఉన్న దుకాణాలు మూయించారు. రామాయంపేటకు అన్యాయం గతంలో రామాయంపేట నియోజకవర్గాన్ని ఎత్తివేయడంతో తమకు అడుగడుగునా అన్యాయం జరుగుతోందని పీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు అన్నారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ రామాయంపేటను రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయాలని, ఇందుకుగాను అన్ని పార్టీల వారు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఆందోళనకు అందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలో మాజీ ఎంపీపీ రమేశ్‌రెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పుట్టిరాజు, విప్లవ్‌కుమార్, మెదక్ అసెంబ్లీ కన్వీనర్ హస్నొద్దీన్, పార్టీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు బైరం కుమార్, జిల్లా ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు గణేశ్ నాయక్, ఇతర నాయకులు చింతల యాదగిరి, స్వామి, సిద్దరాంలు తదితరులు పాల్గొన్నారు. -
సెమిస్టర్ల రద్దు కోరుతూ చేసిన బంద్ సక్సెస్
కర్నూలు(పైడాల): డిగ్రీ సెమిస్టర్ విధానం రద్దు చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ, పీడీఎస్‌యూలు శుక్రవారం ఇచ్చిన బంద్ పైడాలలో విజయమంతమయింది. అలాగే ఎల్కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించాలని, బస్ పాస్ ఆన్లైన్ విధానం రద్దు చేయాలని, సంక్షేమ హాస్టల్లో సరైన వసతులు కల్పించాలని, పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. -
బంద్ సక్సెస్
కావేరీ నదిపై కర్ణాటక ప్రభుత్వం ఆనకట్టల నిర్మాణానికి పూనుకోవడాన్ని నిరసిస్తూ అఖిలపక్ష రైతు సంఘం పిలుపుమేరకు శనివారం నాటి బంద్ విజయవంతమైంది. 90 శాతానికి పైగా అంగళ్లమూతతో దాదాపు సంపూర్ణమైంది. రైల్‌రోకో, రాస్తారోకోలకు పాల్పడిన వేలాదిమందిని పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నై, సాక్షి ప్రతినిధి:తమిళనాడుకు చెందాల్సిన కావేరీ వాటా జలాలను ఎగవేసేందుకు మేఘదాతు అనే ప్రాంతంలో కొత్తగా రెండు ఆనకట్టల నిర్మాణానికి కర్ణాటక ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఈ ఆనకట్టల నిర్మాణమే జరిగితే తమిళనాడు రైతులు 48 టీఎంసీల నీటిని కోల్పోనున్నారు. డెల్టా వ్యవసాయం పూర్తిగా దెబ్బతింటుంది. సుప్రీంకోర్టు సైతం వాటా జలాలు ఇచ్చి తీరాల్సిందేనని తీర్పు చెప్పినా తమిళనాడును దొంగదెబ్బతీసేందుకు ఆనకట్టల నిర్మాణం చేపట్టబోతోంది. నిర్మాణంపై స్టే విధించాలని తమిళనాడు ప్రభుత్వం రెండురోజుల క్రితం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అలాగే కర్ణాటక దూకుడును అడ్డుకొనేలా కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరుతూ రాష్ట్ర అసెంబ్లీ శుక్రవారం నాడు ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించింది. తమిళనాడుకు చెందిన అన్ని పార్టీల లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు 59 మంది ఈ తీర్మాన ప్రతిని ఢిల్లీలో శనివారం ప్రధాని నరేంద్రమోదీకి సమర్పించారు. బంద్‌కు పిలుపు: ఇలా ఉండగా, కేంద్రంపై మరింత వత్తిడితెచ్చేలా తిరుచ్చి కేంద్రంగా నడుస్తున్న అఖిలపక్ష రైతు సంఘం నేతృత్వంలో శనివారం నిర్వహించిన బంద్ సంపూర్ణ విజయం సాధించింది. కాంగ్రెస్, డీఎంకే, పీఎంకే, ఎండీఎంకే, డీఎండీకే, తమాక, వామపక్ష పార్టీలు, వాటి అనుబంధ సంఘాలు బంద్‌లో పాల్గొన్నాయి. బంద్‌లో ప్రధానంగా వాణిజ్య, వ్యాపార దుకాణాల మూత ద్వారా తమ నిరసన ప్రకటించాలని భావించారు. వారు ఆశించినట్లుగానే వర్తక సంఘాలు సంఘీభావం ప్రకటించగా, 95 శాతం వరకు అంగళ్లు మూతపడ్డాయి. అనేక చోట్ల ఫార్మసీ దుకాణాలను కూడా మూసివేశారు. కోయంబేడులో కాయగూరలు, పండ్లు, పూల దుకాణాలను తెరిచే ఉంచారు.చెన్నై, తిరుచ్చి, కాంచీపురం, తంజావూరు జిల్లాల్లో బంద్ ప్రభావం బాగా కనిపించింది. రైల్‌రోకోలు ః చెన్నై, ఎగ్మూరు, తంజావూర్లలో రైల్రోకోలను నిర్వహించారు.ఎగ్మూరు రైల్వేస్టేషన్ 7వ ఫ్లాట్‌ఫారంపై నిలిచి ఉన్న ఆనంద్‌పురి ఎక్స్‌ప్రెస్ రైలు ముందు నిలబడి నినాదాలు చేశారు. అయితే ఈ రైలు సాయంత్రం బయలుదేరుతుందని తెలుసుకున్న ఆందోళనకారులు 6వ ఫ్లాట్‌ఫారానికి చేరుకుని మన్నార్‌కుడి ఎక్స్‌ప్రెస్ రైలు ముందు బైఠాయించారు. సుమారు అరగంటపాటూ నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించిన 1,500 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఆందోళన కారణంగా ఉదయం 10.40 గంటలకు బయలుదేరాల్సిన రైలు 11.20 గంటలకు స్టేషన్‌ను వీడింది. అలాగే సెంట్రల్ రైల్వేస్టేషన్‌లోకి జొరబడేందుకు ప్రయత్నించగా అన్ని మార్గాల్లో పెద్ద సంఖ్యలో పోలీసులు మొహరించి ఉండడంతో వాల్టాక్స్ రోడ్డు నుంచి జొరబడ్డారు. 2వ నంబర్ ప్లాట్‌ఫారంపై ఉన్న ముంబై ఎక్స్‌ప్రెస్‌ను అడ్డుకోగా 200 మందిని అరెస్ట్ చేశారు. తంజావూరులో తంజై-చెన్నై ఎక్స్ప్రెస్రైలును అడ్డుకునే ప్రయత్నం చేసిన 200 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. రాస్తారోకో తిరువత్తియూర్ హైరోడ్డులో, తండయార్‌పేట వద్ద రాస్తారోకోలకు పాల్పడిన 170 మందిని అరెస్ట్ చేశారు. తిరువారూరులో 500 మందిని, నాగపట్నంలో 50 మందిని, మదురైలో 50 మందిని రాస్తారోకో సమయంలో అరెస్ట్‌చేశారు. బంద్ కారణంగా అనేక ప్రాంతాలకు పోలీసు బందోబస్తులో బస్సులను నడిపారు. అయితే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల మధ్య మాత్రం బస్సులు తిరగలేదు. స్వల్పసంఖ్యలో కొన్ని బస్సులు కర్ణాటక సరిహద్దులోని హొసూరు వరకు నడిచాయి. అలాగే కర్ణాటక నుంచి తమిళనాడుకు బస్సులు రాలేదు. బంద్ ప్రభావంతో కొన్ని రైళ్లు ఆలస్యంగా నడిచాయి. -
బంద్ సక్సెస్
తమిళనాడు ప్రయోజనాలను కాలరాస్తూ కావేరీ నదిపై కర్ణాటక ప్రభుత్వం రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి శ్రీకారం చుట్టడాన్ని నిరసిస్తూ డెల్టా జిల్లాల్లో శనివారం నిర్వహించిన బంద్ విజయవంతమైంది. 3 జిల్లాల్లో చేపట్టిన ఆందోళనల ఫలితంగా సుమారు 1500 మంది అరెస్టయ్యారు. చైన్నై, సాక్షి ప్రతినిధి: కావేరీ నది వాటా జలాలను తమిళనాడు ప్రభుత్వం పోరాడి సాధించుకుంది. రాజకీయపరంగానే కాక, న్యాయపరంగా సుప్రీంకోర్టు ద్వారా హక్కులను పొందగలిగింది. సుప్రీంకోర్టు తీర్పు సైతం తమిళనాడుకు అనుకూలంగా మారడంతో దిక్కుతోచని కర్ణాటక ప్రభుత్వం కావేరీ జలాల ప్రవాహాన్ని అడ్డుకునేలా కొత్తగా రెండు ప్రాజెక్టుల నిర్మాణానికి సమాయత్తం అవుతోంది. ఈ రెండు ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయిన పక్షంలో తమిళనాడులోని డెల్టా జిల్లాలైన తంజావూరు, నాగపట్నం, తిరువారూరు ప్రజలకు తాగునీటి ఇక్కట్లు తప్పవు. కావేరి నదీజలాల కిందిప్రాంతమైన తమిళనాడు అంగీకారం లేకుండా కర్ణాటక ప్రభుత్వం ప్రాజెక్టులను కట్టడం చట్టవిరుద్ధమని సీఎం పన్నీర్ సెల్వం కేంద్రానికి ఫిర్యాదు చేశారు. కర్ణాటక దుందుడుకు వైఖరికి కేంద్రం అడ్డుకట్టవేయాలని కోరుతూ డెల్టా జిల్లాలు శనివారం బంద్ పాటించాయి. మూడు జిల్లా ల్లో దుకాణాలు మూతపడ్డాయి. వ్యవసాయ, వ్యాపార సంఘాల ప్రతినిధులు బంద్‌కు నాయకత్వం వహిస్తూ ఆందోళనకు దిగారు. తంజావూరులో ఎండీఎంకే అధినేత వైగో తన అనుచరులతో కలిసి రైల్‌రోకోకు యత్నించడంతో పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. తంజావూరు జిల్లాలో 200 చోట్ల రాస్తారోకో నిర్వహించారు. తిరువారూరులో ప్రయివేటు వైద్యులు సైతం విధులను బహిష్కరించి బంద్‌లో పాల్గొన్నారు. నాగై జిల్లాల్లో పెద్ద ఎత్తున వ ర్తక సంఘాలు బంద్‌లో పాల్గొనగా ప్రయివేటు వాహనాలు నిలిచిపోయాయి. మన్నార్‌కుడిలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ సందర్భంగా వంద మందిని అరెస్ట్ చేశారు. మన్నార్‌కుడి నుంచి మయిలాడుదురై వైపు వెళ్లే రైలును ఆందోళనకారులు అడ్డగించారు. ఈ సంఘటనలో 50 మందిని పోలీసులు అరెస్టు చేశారు. కొత్త పార్టీ పెట్టబోతున్న కేంద్ర మాజీ మంత్రి జీకే వాసన్ అనుచరులు సైతం బంద్‌కు మద్దతుగా ఆందోళన నిర్వహించారు. మూడు జిల్లాల్లో డీఎంకే, ఎండీఎంకే, నామ్ తమిళర్ కట్చి తదితర పార్టీలవారు, రైతు సంఘాల నాయకులు కలిపి సుమారు 1500 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సహజంగా ఏ బంద్ అయినా మధ్యాహ్నం వేళకు ముగిసే సంప్రదాయూన్ని పారద్రోలి సాయంత్రం 6 గంటల వరకు బంద్ పాటించడం విశేషం. -
రెండో రోజూ సక్సెస్
సాక్షి, గుంటూరు :రాష్ట్రాన్ని విభజించాలని కేంద్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా చేపట్టిన బంద్ రెండో రోజు జిల్లాలో విజయవంతమైంది. వివిధ రాజకీయ పార్టీలతో పాటు ప్రజా,విద్యార్థి సంఘాలు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి యూపీఏ ప్రభుత్వానికి వ్యతి రేకంగా ఆందోళనలు చేశారు. గుంటూరుతో పాటు అన్ని పట్టణాల్లో రాస్తారోకోలు, రోడ్లపై టైర్లు దహనం చేయడం వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెల్లవారుజామునే ఆర్టీసీ డిపోల వద్ద ధర్నాలకు దిగి బస్సులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. ఈ క్రమంలో పలుచోట్ల పోలీసులకు వైఎస్సార్ సీపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. గుంటూరు నగరంలో అరెస్టులు కూడా జరిగాయి. ఏపీఎన్జీవో సంఘాలు, టీడీపీ నేతలు సైతం బైక్ ర్యాలీలతో నిరసన తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలతో పాటు వ్యాపార, వాణిజ్య దుకాణాలన్నీ మూతపడ్డాయి. సినిమా థియేటర్లలో ఉదయం వేళ ప్రదర్శనలను నిలిపివేశారు. పలు ప్రజాసంఘాల నేతలు రిలేదీక్షలకు కూర్చొన్నారు. చిలకలూరిపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ నాయకత్వాన ఐదో నంబర్ జాతీయరహదారిపై రాస్తారోకో, బైక్ ర్యాలీలు చేపట్టారు. గుంటూరులో ఆ పార్టీ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో భారీగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మాచర్లలో ఎమ్మెల్యే పీఆర్కే నేతృత్వాన స్థానిక అంబేద్కర్ సెంటర్లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. గుంటూరు నగరంలో ఉద్రిక్తత ఉదయాన్నే స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ నగర కన్వీనర్ లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. తూర్పునియోజకవర్గ సమన్వయకర్తలు షేక్ షౌకత్, నసీర్‌అహ్మద్ వేర్వేరు ప్రాంతాల నుంచి పాదయాత్ర, బైక్‌ర్యాలీలు చేసుకుంటూ ఆర్టీసీ డిపో వద్దకు రాగానే వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో పోలీసులు పార్టీ నేతల మధ్య వాగ్వాదం, తోపులాట జరగడంతో పోలీసులు లాఠీలు ఝళిపించారు. అప్పిరెడ్డి, షౌకత్, నసీర్అహ్మద్తో పాటు రాతంశెట్టి రామాంజనేయులు (రాము) గులాం రసూల్, మేరిగ విజయలక్ష్మిను పోలీసులు నెట్టివేయడంతో స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం వారిని అరెస్టు చేసి పాతగుంటూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కొద్దిసేపటి తరువాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. మాయాబజార్ సెంటర్లో టైర్లు దహనం చేశారు. యువజన విభాగం నేత కావటి మనోహర్ నాయుడు ఆధ్వర్యంలో కూడా సోనియా గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. గురజాలలో వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు, సమన్వయకర్త జంగా కృష్ణమూర్తి , పెదకూరపాడులో సమన్వయకర్త నూతలపాటి హనుమయ్య నాయకత్వంలో బైక్‌ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. బాపట్ల, తెనాలి, పొన్నూరు, నరసరావుపేటలలో కూడా వైఎస్సార్ సీపీ నేతలు ఆందోళనలు నిర్వహించి మానవహారాలు చేపట్టారు. విధులు బహిష్కరించిన ప్రభుత్వ ఉద్యోగులు.. ఏపీఎన్జీవో సంఘాల పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులంతా విధులు బహిష్కరించారు. దీంతో కార్యాలయాన్నీ మూతపడ్డాయి. ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఆర్టీసీ డిపోల నుంచి బస్సులు బయటకు రాలేదు. టీడీపీ నేతలు కూడా అన్నిచోట్లా ఆందోళనలు నిర్వహించగా, గుంటూరులో ఎమ్మెల్యేలు కొమ్మాలపాటి శ్రీధర్, నక్కా ఆనందబాబును అరండల్‌పేట పోలీసులు గృహనిర్భందం చేశారు. అదేవిధంగా సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నేతలు గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ధర్నాకు దిగగా, పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. వారిని ఐదుగంటలపాటు స్టేషన్లోనే ఉంచడంతో సమాచారం అందుకున్న వైఎస్ఆర్ సీపీ నేతలు పోలీసులతో మాట్లాడి విడిపించారు. తెనాలిలో టీడీపీ నేతలు ఓ ఆర్టీసీ బస్సును అడ్డుకుని బస్సు డ్రైవర్ జేబులో ఉన్న ఎస్ఆర్ కాపీని చించివేయడంతో స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. -
ఖమ్మం జిల్లా బంద్ సంపూర్ణం
భద్రాచలం, న్యూస్‌లైన్: భద్రాచలాన్ని తెలంగాణలోనే కొనసాగించాలంటూ సోమవారం టీజేఏసీ నాయకులు చేపట్టిన డివిజన్ బంద్ విజయవంతం అయింది. ఈసందర్భంగా భద్రాచలంతో పాటు, డివిజన్ వ్యాప్తంగా అన్ని మండలాల్లో మోటార్‌సైకిళ్ల ర్యాలీలను నిర్వహించారు. భద్రాచలాన్ని కలుపుకొని తెలంగాణ వనరులను దోచుకోవాలని సీమాంధ్ర నాయకులు పన్నుతున్న కుట్రలను అడ్డుకుంటామనిటీజేఏసీ నాయకులు హెచ్చరించారు. భద్రాచలంలో తెల్లవారుజామునుంచే ఆర్టీసి బస్సులను డిపో నుంచి బయటికి రాకుండా నాయకులు అడ్డుకున్నారు. భద్రాచలానికి వచ్చే అన్ని రహదారులను నాయకులు మూసివేసి ఆటోలను, బస్సులను అడ్డుకున్నారు. పట్టణంలోని అన్ని దుకాణాలు, పెట్రోల్‌బంక్‌లు, హోటళ్లు స్వచ్ఛందంగా మూసివేశారు. బ్యాంకులు, తహశీల్దార్ కార్యాలయం, పాఠశాలలను నాయకులు బంద్ చేయించారు. దీంతో పట్టణంలో కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. బస్సులను పూర్తిగా ఆపివేయటంతో ప్రయాణికులు పలు ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికులు సారపాక వరకు వెళ్లి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలివెళ్లారు. బంద్‌ను విజయవంతం చేసేందుకు టీజేఏసీ ఆధ్వర్యంలో వివిధ పార్టీల నాయకులు, ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. బ్రిడ్జి సెంటర్లో రాస్తారోకో చేపట్టారు. బంద్‌కు ఆదివాసీ గిరిజన సంఘా లు మద్దతు ప్రకటించాయి. చర్ల మండలంలో బంద్ సంపూర్ణంగా సాగింది. జేఏసీ నాయకులు పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహించారు. రాజకీయ జేఏసీ, నాయీ బ్రాహ్మణ సేవా సంఘం, ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు తీశారు. వెంకటాపురం మండలంలో బంద్ విజయవంతమైంది. వ్యాపారస్తులు దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. పాఠశాలలు, కళాశాలలు బంద్ చేయించారు. మండల కేంద్రానికి వచ్చిన బస్సులను తెలంగాణ వాదులు నిలిపివేశారు. వాజేడు మండలంలో బంద్ సంపూర్ణంగా జరిగింది. దుకాణాలు, హోటళ్లు స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌కు సంఘీభావం తెలిపారు. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలను తెలంగాణ వాదులు మూయించారు. తహశీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలకు తెలంగాణ వాదులు తాళాలు వేశారు. చింతూరు మండలంలోలో బంద్‌ను పురస్కరించుకొని విద్యాలయాలతో పాటు వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. జేఏసీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి, మెయిన్‌రోడ్ సెంటర్లో మానవహారం నిర్వహించారు. దుమ్ముగూడెం మండలంలో బంద్ విజయవంతంగా ముగిసింది. దుకాణాలు, హోటళ్లు మూసివేశారు. ప్రభుత్వ, ప్రయివేటు విద్యాలయాలను మూసివేశారు. వీఆర్‌పురం మండలంలో ప్రభుత్వ కార్యాలయాలను బంద్ చేయించారు. కూనవరం మండల కేంద్రంలో బంద్ విజయవంతం అయింది. వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఉద్యోగ జేఏసీ నాయకులు, విద్యార్థులు, ఎమ్మార్పీఎస్ నాయకులు పెద్దఎత్తున బంద్‌లో పాల్గొన్నారు. దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేశారు. కూనవరం నుంచి కోతులగుట్ట వరకు మోటారుసైకిళ్లపై ర్యాలీ నిర్వహించారు. -
ఆటోల బంద్ సంపూర్ణం
ఖమ్మం మయూరిసెంటర్, న్యూస్‌లైన్: జిల్లాలోని ఆటో డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆటో యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో తలపెట్టిన రెండు రోజుల ఆటోల బంద్ గురువారం సంపూర్ణంగా జరిగింది. మొదటిరోజు నగరంలోని ప్రధాన కూడళ్లలో ఆటో డ్రైవర్లు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బస్టాండ్ వద్ద జేఏసీ నాయకులు పాల్వంచ కృష్ణ, మోహన్‌రావు, ప్రసాద్, రమేష్, వసీమ్, రమణ, రవీందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ జిల్లాలో లేనివిధంగా ఇక్కడి పోలీసులు ఆటోడ్రైవర్లపై కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆటోడ్రైవర్ల పరిస్థితి దుర్భరంగా మారిందన్నారు. ఈ విషయంలో కొంత గడువు ఇవ్వాలని అడిగినప్పటికీ ఎస్పీ స్పందించకపోవడం దారుణమన్నారు. ఆటో డ్రైవర్లపై పోలీసుల వేధింపులు మానాలని డిమాండ్ చేశారు. రూ.100 ఉన్న ట్యాక్స్‌ను రూ.1000కి పెంచుతూ ప్రభుత్వం 108 జీవో జారీచేసిందని పేర్కొన్నారు. దీని వల్ల నిరుపేద ఆటోడ్రైవర్లు పూటగడవక ఇబ్బందులు పడుతున్నారన్నారు. 108 జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో డ్రైవర్ల అక్రమ అరెస్ట్‌లను నిలిపివేయాలని, నాన్ ట్రాన్స్‌పోర్టు లెసైన్స్‌ను పరిగణలోకి తీసుకోవాలని, జిల్లాలో ఆటోలకు ప్రత్యేక అడ్డాలు ఏర్పాటు చేయాలని కోరారు. 60 సంవత్సరాలు దాటిన ఆటోడ్రైవర్లకు రూ.2వేల పింఛన్ ఇవ్వాలని, ఆటో డ్రైవర్లకు బ్యాంకుల ద్వారా పావలావడ్డీకే రుణాలు ఇప్పించాలని, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపేందర్, శ్రీను, జాకీ, నబి పాల్గొన్నారు. వేధింపులు ఆపాలి పోలీసులు ఆటో డ్రైవర్లను వేధించడం మానుకోవాలని, 108 జీవోను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రెండు రోజులపాటు నిర్వహిస్తున్న ఆటోల బంద్‌కు మద్దతుగా సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. సీపీఎం కార్యాలయం నుంచి ప్రారంభమైన ప్రదర్శన బస్టాండ్ వరకు సాగింది. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్యాణం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోనెంబర్ 108 వల్ల ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. దానిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు భూక్యా శ్రీను, తుమ్మా విష్ణు వర్థన్, ఉపాధ్యక్షులు తాళ్లూరి రాము, హోటల్ వర్కర్స్ యూనియన్ నాయకులు వర్మ, ఉపేందర్, శ్రీను, జి.శ్రీనివాస్, మోహన్, అజర్ తదితరులు పాల్గొన్నారు. -
బంద్ ప్రశాంతం: ఎస్పీ రాజకుమారి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: జిల్లాలో బంద్ సంపూర్ణంగా జరిగింది. ప్రజారవాణా పూర్తిగా నిలిచిపోయింది. శాంతి ర్యాలీకి అనుమతిని నిరాకరించడాన్ని నిరసిస్తూ టీజేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడగా, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్‌కు మద్దతు పలికాయి. ఆర్టీసీ కార్మికులు బంద్‌కు సంఘీభావం పలకడంతో బస్సులు డిపోలకే పరిమితయ్యాయి. దీంతో జనరవాణాకు తీవ్ర విఘాతం కలిగింది. తెలంగాణవాదులు వేకువ జాము నుంచే రోడ్డెక్కడంతో బంద్ ప్రభావం బాగా కనిపించింది. సమైక్య సభకు అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ టీ జేఏసీ సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. టీఆర్ఎస్, తెలంగాణవాదులు బంద్ పాటించాలని వికారాబాద్, శంషాబాద్, తాండూరు, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, పరిగి తదితర చోట్ల బైక్ ర్యాలీలు జరపగా... పరిగి ఆర్టీసీ కార్మికులు వినూత్నంగా బస్సుల ర్యాలీ చేపట్టారు. రెవెన్యూ ఉద్యోగులు కలెక్టరేట్, మండల కార్యాలయాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మరోవైపు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా బంద్ ప్రశాంతంగా ముగిసిందని ఎస్పీ రాజకుమారి తెలిపారు. ఇదిలావుండగా హయత్‌నగర్, శంషాబాద్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల్లో సీమాంధ్ర నుంచి సమైక్యసభకు తరలివచ్చిన ఉద్యోగుల వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు.. వారికి రక్షణగా హైదరాబాద్ వరకు నిలిచారు. -
వైఎస్ఆర్ సీపీ బంద్ సక్సెస్
సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ఆర్ సీపీ ఇచ్చిన బంద్ పిలుపు విజయవంతమైంది. శనివారం వేకువ జామున 4 గంటలకే వైఎస్ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ డాక్టర్ నూకసాని బాలాజీ, జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్‌లతో పాటు పలు విభాగాల కన్వీనర్లు, నాయకులు పెద్ద ఎత్తున ఒంగోలు ఆర్టీసీ డిపో గ్యారేజీ గేటు ముందు బైఠాయించారు. బస్టాండ్‌లో నుంచి బస్సులు వెళ్లకుండా మోటారు బైకులు అడ్డంగా ఉంచారు. ఉదయం 5 గంటల సమయంలో పార్టీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయంగా బస్టాండ్‌కు వచ్చి పార్టీ కార్యకర్తలతో గ్యారేజీ గేటు ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీమాంధ్ర ఉద్యోగులను ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. తెలంగాణ కేసీఆర్ జాగీరు కాదన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో సీమాంధ్రుల కృషి ఉందని చెప్పారు. సీమాంధ్రులకు అన్యాయం చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర విభజనపై సంకేతాలు ముందుగానే వచ్చినా లగడపాటి, కావూరిలు తమ స్వప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని మండిపడ్డారు. దమ్ము, ధైర్యం ఉంటే పదవులకే కాకుండా పార్టీకి సైతం రాజీనామా చేసి స్పీకర్ వద్ద ఆమోదింపజేసుకోవాలని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నేతలను ఉద్దేశించి బాలినేని సవాల్ విసిరారు. చంద్రబాబునాయుడు నిజస్వరూపం తెలుసుకుని తెలుగుదేశం నాయకులు కూడా సమైక్యాంధ్ర ఉద్యమంలోకి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం 6.30 గంటలకు డిపో గ్యారేజీ భద్రత సిబ్బందితో మాట్లాడారు. బంద్ ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని కోరారు. జనం ఆగ్రహంతో ఉన్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు సంయమనం పాటించాలని సూచించారు. అనంతరం బస్టాండ్‌లోని షాపులను మూసివేయించారు. ర్యాలీ ఇలా.. ఉదయం 10 గంటల సమయంలో బాలినేని స్వయంగా బైకు నడుపుతూ పార్టీ కార్యకర్తలు, నాయకులను హుషారెత్తించారు. ముందువరుసలో ఉండి షాపులన్నింటినీ మూయించారు. ర్యాలీ లాయరుపేట సాయిబాబా ఆలయం, మంగమూరు డొంక, అంజయ్యరోడ్డు మీదుగా బస్టాండుకు చేరుకుంది. అక్కడి నుంచి తులసీరాం థియేటర్, అద్దంకి బస్టాండు, పాత మార్కెట్ సెంటర్ మీదుగా చర్చి సెంటర్ వరకు కొనసాగింది. చర్చి సెంటర్లో సోనియా గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు వైఎస్ఆర్ ఆశయాలు కొనసాగించేంత వరకూ తమ పోరాటం ఆగదంటూ ప్రతిన బూనారు. అనంతరం సోనియా గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మరో వైపు సమైక్యాంధ్ర ఉద్యమానికి సామాన్య ప్రజలు సైతం కదిలి వచ్చారు. అంజయ్యరోడ్డులోని ఓ విద్యాసంస్థపై ఇద్దరు యువకులు రాళ్లు విసిరారు. దీంతో ఆ విద్యాసంస్థ ముందుభాగంలోని కిటికీ అద్దం ముక్కలైంది. కర్నూలు, కడప జిల్లాల్లో జరుగుతున్న బంద్ కారణంగా సంబంధిత ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు శుక్రవారం నిలిచిపోవడంతో నష్టాన్ని ఆర్టీసీ చవిచూసింది. వైఎస్ఆర్సీపీ ఇచ్చిన పిలుపుతో ప్రజలు ఉత్సాహంగా ముందుకు రావడంతో అన్ని బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. శనివారం ఒక్కరోజే ఆర్టీసీ అరకోటికిపైగా ఆదాయం కోల్పోయి ఉంటుందని భావిస్తున్నట్లు ఒంగోలు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వి.నాగశివుడు తెలిపారు. బంద్‌లో వైఎస్ఆర్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి నరాల రమణారెడ్డి, ప్రచార విభాగం జిల్లా కన్వీనర్ వేమూరి సూర్యనారాయణ(బుజ్జి), బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, యువజన విభాగం జిల్లా కన్వీనర్ కేవీ రమణారెడ్డి, గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటేశ్వరరావు, ట్రేడ్ యూనియన్ జిల్లా కన్వీనర్ కేవీ ప్రసాద్, యువజన విభాగం జిల్లా అధికార ప్రతినిధి చిన్నపురెడ్డి అశోక్‌రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ రవీంద్రబాబులతో పాటు నగర కన్వీనర్లు ముదివర్తి బాబూరావు, నెరుసుల రాము, యరజర్ల రమేశ్, మోడుబోయిన సురేశ్‌యాదవ్, సింగరాజు వెంకట్రావు, పి.అనూరాధ, గంగాడ సుజాత, బడుగు ఇందిర, కావూరి సుశీల, రమాదేవి, కత్తినేని రామకృష్ణారెడ్డి, తోటపల్లి సోమశేఖర్, దేవరపల్లి అంజిరెడ్డి, దుగ్గిరెడ్డి ఆంజనేయరెడ్డి, విద్యార్థులు, వ్యాపారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.