సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:
జిల్లాలో బంద్ సంపూర్ణంగా జరిగింది. ప్రజారవాణా పూర్తిగా నిలిచిపోయింది. శాంతి ర్యాలీకి అనుమతిని నిరాకరించడాన్ని నిరసిస్తూ టీజేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా జనజీవనం స్తంభించింది. వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడగా, విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్‌కు మద్దతు పలికాయి. ఆర్టీసీ కార్మికులు బంద్‌కు సంఘీభావం పలకడంతో బస్సులు డిపోలకే పరిమితయ్యాయి. దీంతో జనరవాణాకు తీవ్ర విఘాతం కలిగింది. తెలంగాణవాదులు వేకువ జాము నుంచే రోడ్డెక్కడంతో బంద్ ప్రభావం బాగా కనిపించింది. సమైక్య సభకు అనుమతి ఇవ్వడాన్ని నిరసిస్తూ టీ జేఏసీ సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి.
టీఆర్‌ఎస్, తెలంగాణవాదులు బంద్ పాటించాలని వికారాబాద్, శంషాబాద్, తాండూరు, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, పరిగి తదితర చోట్ల బైక్ ర్యాలీలు జరపగా... పరిగి ఆర్టీసీ కార్మికులు వినూత్నంగా బస్సుల ర్యాలీ చేపట్టారు. రెవెన్యూ ఉద్యోగులు కలెక్టరేట్, మండల కార్యాలయాల్లో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మరోవైపు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా బంద్ ప్రశాంతంగా ముగిసిందని ఎస్పీ రాజకుమారి తెలిపారు. ఇదిలావుండగా హయత్‌నగర్, శంషాబాద్ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల్లో సీమాంధ్ర నుంచి సమైక్యసభకు తరలివచ్చిన ఉద్యోగుల వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు.. వారికి రక్షణగా హైదరాబాద్ వరకు నిలిచారు.
బంద్ ప్రశాంతం: ఎస్పీ రాజకుమారి
Published Sun, Sep 8 2013 6:09 AM | Last Updated on Tue, Aug 28 2018 5:36 PM
Advertisement