వైఎస్‌ఆర్ సీపీ బంద్ సక్సెస్
Published Sun, Aug 4 2013 4:36 AM | Last Updated on Fri, May 25 2018 9:10 PM
సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్‌ఆర్ సీపీ ఇచ్చిన బంద్ పిలుపు విజయవంతమైంది. శనివారం వేకువ జామున 4 గంటలకే వైఎస్‌ఆర్ సీపీ జిల్లా కన్వీనర్ డాక్టర్ నూకసాని బాలాజీ, జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్‌లతో పాటు పలు విభాగాల కన్వీనర్లు, నాయకులు పెద్ద ఎత్తున ఒంగోలు ఆర్టీసీ డిపో గ్యారేజీ గేటు ముందు బైఠాయించారు. బస్టాండ్‌లో నుంచి బస్సులు వెళ్లకుండా మోటారు బైకులు అడ్డంగా ఉంచారు. ఉదయం 5 గంటల సమయంలో పార్టీ విప్ బాలినేని శ్రీనివాసరెడ్డి స్వయంగా బస్టాండ్‌కు వచ్చి పార్టీ కార్యకర్తలతో గ్యారేజీ గేటు ఎదుట బైఠాయించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీమాంధ్ర ఉద్యోగులను ఉద్దేశించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. తెలంగాణ కేసీఆర్ జాగీరు కాదన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో సీమాంధ్రుల కృషి ఉందని చెప్పారు.
సీమాంధ్రులకు అన్యాయం చేయాలని చూస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర విభజనపై సంకేతాలు ముందుగానే వచ్చినా లగడపాటి, కావూరిలు తమ స్వప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారని మండిపడ్డారు. దమ్ము, ధైర్యం ఉంటే పదవులకే కాకుండా పార్టీకి సైతం రాజీనామా చేసి స్పీకర్ వద్ద ఆమోదింపజేసుకోవాలని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ నేతలను ఉద్దేశించి బాలినేని సవాల్ విసిరారు. చంద్రబాబునాయుడు నిజస్వరూపం తెలుసుకుని తెలుగుదేశం నాయకులు కూడా సమైక్యాంధ్ర ఉద్యమంలోకి రావాలని పిలుపునిచ్చారు. అనంతరం 6.30 గంటలకు డిపో గ్యారేజీ భద్రత సిబ్బందితో మాట్లాడారు. బంద్ ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని కోరారు. జనం ఆగ్రహంతో ఉన్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగులు సంయమనం పాటించాలని సూచించారు. అనంతరం బస్టాండ్‌లోని షాపులను మూసివేయించారు.
ర్యాలీ ఇలా..
ఉదయం 10 గంటల సమయంలో బాలినేని స్వయంగా బైకు నడుపుతూ పార్టీ కార్యకర్తలు, నాయకులను హుషారెత్తించారు. ముందువరుసలో ఉండి షాపులన్నింటినీ మూయించారు. ర్యాలీ లాయరుపేట సాయిబాబా ఆలయం, మంగమూరు డొంక, అంజయ్యరోడ్డు మీదుగా బస్టాండుకు చేరుకుంది. అక్కడి నుంచి తులసీరాం థియేటర్, అద్దంకి బస్టాండు, పాత మార్కెట్ సెంటర్ మీదుగా చర్చి సెంటర్ వరకు కొనసాగింది. చర్చి సెంటర్‌లో సోనియా గాంధీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పాటు వైఎస్‌ఆర్ ఆశయాలు కొనసాగించేంత వరకూ తమ పోరాటం ఆగదంటూ ప్రతిన బూనారు. అనంతరం సోనియా గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. మరో వైపు సమైక్యాంధ్ర ఉద్యమానికి సామాన్య ప్రజలు సైతం కదిలి వచ్చారు.
అంజయ్యరోడ్డులోని ఓ విద్యాసంస్థపై ఇద్దరు యువకులు రాళ్లు విసిరారు. దీంతో ఆ విద్యాసంస్థ ముందుభాగంలోని కిటికీ అద్దం ముక్కలైంది. కర్నూలు, కడప జిల్లాల్లో జరుగుతున్న బంద్ కారణంగా సంబంధిత ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు శుక్రవారం నిలిచిపోవడంతో నష్టాన్ని ఆర్టీసీ చవిచూసింది. వైఎస్‌ఆర్‌సీపీ ఇచ్చిన పిలుపుతో ప్రజలు ఉత్సాహంగా ముందుకు రావడంతో అన్ని బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. శనివారం ఒక్కరోజే ఆర్టీసీ అరకోటికిపైగా ఆదాయం కోల్పోయి ఉంటుందని భావిస్తున్నట్లు ఒంగోలు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వి.నాగశివుడు తెలిపారు.
బంద్‌లో వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి నరాల రమణారెడ్డి, ప్రచార విభాగం జిల్లా కన్వీనర్ వేమూరి సూర్యనారాయణ(బుజ్జి), బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, యువజన విభాగం జిల్లా కన్వీనర్ కేవీ రమణారెడ్డి, గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటేశ్వరరావు, ట్రేడ్ యూనియన్ జిల్లా కన్వీనర్ కేవీ ప్రసాద్, యువజన విభాగం జిల్లా అధికార ప్రతినిధి చిన్నపురెడ్డి అశోక్‌రెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా కన్వీనర్ రవీంద్రబాబులతో పాటు నగర కన్వీనర్లు ముదివర్తి బాబూరావు, నెరుసుల రాము, యరజర్ల రమేశ్, మోడుబోయిన సురేశ్‌యాదవ్, సింగరాజు వెంకట్రావు, పి.అనూరాధ, గంగాడ సుజాత, బడుగు ఇందిర, కావూరి సుశీల, రమాదేవి, కత్తినేని రామకృష్ణారెడ్డి, తోటపల్లి సోమశేఖర్, దేవరపల్లి అంజిరెడ్డి, దుగ్గిరెడ్డి ఆంజనేయరెడ్డి, విద్యార్థులు, వ్యాపారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Advertisement
Advertisement