మళ్లీ మైక్రో ఫైనాన్స్ వేధింపులు | Micro-finance harassment | Sakshi
Sakshi News home page

మళ్లీ మైక్రో ఫైనాన్స్ వేధింపులు

Published Thu, Aug 8 2013 3:37 AM | Last Updated on Fri, Sep 1 2017 9:42 PM

Micro-finance harassment

కందుకూరు, న్యూస్‌లైన్: ‘షేర్ మిలా...’ఈ పేరు వినపడిందంటే గ్రామాల్లోని ప్రజలకు ఒకప్పుడు వణుకుపుట్టేది. మైక్రో ఫైనాన్స్ సంస్థకు చెందిన ప్రతినిధులు గ్రామాల్లోకి వస్తున్నారంటేనే రుణం తీసుకున్న సామాన్య, మధ్యతరగతి ప్రజలు అదిరిపోయే వారు. అవసరాలకు వారి వద్ద రుణం తీసుకుంటే వారం వారం కచ్చితంగా కట్టాల్సిందే. వారి వద్ద అప్పు తీసుకొని తిరిగి చెల్లించడానికి మళ్లీ అప్పు చేయాల్సిన పరిస్థితులు నెలకొనేవి. ఇది 2008 - 10 సంవత్సరాల్లోని మాట. మైక్రో ఫైనాన్స్ సంస్థ ప్రతినిధుల ఆగడాలకు గ్రామాల్లో రుణాలు తీసుకుని తీర్చలేక ఆత్మహత్యలు చేసుకున్న వారూ ఉన్నారు. ప్రజల అవస్థలు ప్రభుత్వ దృష్టికి వెళ్లడంతో ఆయా సంస్థలపై చర్యలకు ఉపక్రమించింది. దీంతో సంస్థల ప్రతినిధులు తట్టాబుట్టా సర్దుకొని వెనక్కి తగ్గారు. అయితే అప్పటి వేధింపులు ఇప్పుడు మళ్లీ వెంటాడడం ప్రారంభించాయి.
 
  షేర్ మైక్రో ఫైనాన్స్ సంస్థ 2009 సంవత్సరంలో ఒక్క కందుకూరు ప్రాంతంలోనే సుమారు 2,300 మందికిపైగా అప్పులిచ్చింది. అప్పట్లో ప్రభుత్వ చర్యలకు భయపడి వసూళ్లకు వెనకాడిన సంస్థ ప్రతినిధులు తాజాగా వారం పది రోజుల నుంచి  రుణాలు తిరిగి చెల్లించాలంటూ బకాయిదారులకు నోటీసులు పంపించడం ప్రారంభించారు. కొంత మంది తిరిగి కట్టినా..మళ్లీ తీసుకున్న రుణం మొత్తం కట్టాలని నోటీసులు వచ్చాయి. దీంతో ఇప్పటికే డబ్బు కట్టేసిన వారు ఆందోళనలో ఉన్నారు. తీసుకున్న రుణానికి వడ్డీ, ప్రాసెసింగ్ ఫీజులతో పాటు అదనంగా కొంత చెల్లించాలంటూ షేర్ మైక్రో ఫైనాన్స్‌కు చెందిన ప్రతినిధులు బాధితుల వద్దకు రావడం ప్రారంభించారు. దాదాపు 90 శాతం వరకు రుణం తిరిగి చెల్లించిన వారు తమ వద్ద ఉన్న ఆధారాలను చూపించినా..లేదు మొత్తం కట్టాల్సిందేనని మొండికేయడంతో కందుకూరుకు చెందిన శ్రీనివాసరావు, నాగూర్ అనే బాధితులు మంగళవారం కందుకూరు పోలీసులను ఆశ్రయించారు.
 
 రూ.3 వడ్డీ అని ముందు చెప్పి రూ. 12 వరకు వసూలు
 రుణం ఇచ్చేటప్పుడు నెలకు నూటికి మూడు రూపాయలు మాత్రమే వడ్డీ పడుతుందని సంస్థ ప్రతినిధులు నమ్మబలుకుతారు.   కానీ నెలవారీ కిస్తీలకు వచ్చే సరికి బాధితులు కట్టే అదనపు మొత్తం ఒక సారి లెక్కేసి చూసుకుంటే రూ.100లకు సరాసరిన రూ. 12ల వరకు వడ్డీ పడుతుంది.
 
 సాధారణంగా సరాసరిన వేసే వడ్డీకి వారం వారం లేక నెల నెలా కట్టే కిస్తీ మొత్తాన్ని తీసివేసి ఆ తర్వాత ఉన్న మొత్తానికి వడ్డీ వేయాలి. అయితే అసలుకు ముందే వడ్డీ నిర్ణయించి కిస్తీలు వేయడం వల్ల బాధితునిపై అదనపు భారం  పడుతోంది.
 
 చివరి మూడు నెలలు కట్టాలి
 2009 డిసెంబర్‌లో  రూ. 30 వేలు రుణం తీసుకున్నా. మొత్తం 12 నెలల్లో వడ్డీతో కలిపి మొత్తం చెల్లిస్తానని సంస్థ ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకున్నా.  చివరి మూడు నెలలు మాత్రమే కుస్తీలు చెల్లించాల్సి ఉంది. అందుకు తగిన ఆధారాలు కూడా నా వద్ద ఉన్నాయి. కానీ మొత్తం చెల్లించాలని సంస్థ ప్రతినిధులు ఒత్తిడి చేస్తున్నారు. అందులో భాగంగా నోటీసులు కూడా పంపించారు.
 - నాగూర్, కందుకూరు
 
 తిరిగి చెల్లిద్దామంటే ఎవరూ రాలేదు
 కందుకూరులోని రైతు బజారు వద్ద కోడి గుడ్ల వ్యాపారం చేసుకుంటున్నాను. 2010లో రూ.30 వేలు వ్యాపార అవసరాల కోసం తీసుకున్నాను. కానీ అప్పటి నుంచి తిరిగి చెల్లిద్దామంటే ఎవరూ రాలేదు. ఇప్పుడేమో రెండింతలు మొత్తం చెల్లించాలని నోటీసులు పంపించారు. అంత మొత్తం చెల్లించడం ఇప్పట్లో నావల్ల అయ్యే పని కాదు. మూడు సంవత్సరాలకు రెట్టింపు కట్టమంటే వడ్డీ రూపంలో చాలా పడుతుంది. సాధారణ వడ్డీ అయితే కట్టేందుకు సుముఖంగానే ఉన్నాను.
 - నల్లూరి శ్రీనివాసరావు, కోడిగుడ్ల వ్యాపారి
 
 పరిశీలించి కేసు నమోదు చేస్తా
 మైక్రో ఫైనాన్స్ సంస్థకు సంబంధించిన ప్రభుత్వ అనుమతులు, వాళ్ల విధి విధానాలను పరిశీలిస్తున్నాను. బాధితులు కొంత మంది మమ్మల్ని ఆశ్రయించారు. కొంత రుణం తిరిగి చెల్లించినా కట్టలేదని ప్రతినిధులు చెప్తున్నట్లు బాధితులు మా దృష్టికి తీసుకొచ్చారు. సంస్థకు సంబంధించిన అన్ని విషయాలను లోతుగా అధ్యయనం చేస్తున్నాం. అక్రమాలు ఉన్నాయని తేలితే కేసు నమోదు చేస్తాం.
 - హుస్సేన్‌బాషా, పట్టణ ఎస్సై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement