ఒంగోలు , న్యూస్‌లైన్ : రాష్ట్రంలో ప్రజాభిప్రాయాన్ని గౌరవించింది వైఎస్‌ఆర్ సీపీ ఒక్కటేనని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ డాక్టర్ నూకసాని బాలాజీ అన్నారు. వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా స్థానిక పార్టీ జిల్లా క్యార్యాలయంలో చేపట్టిన దీక్షలు బుధవారానికి మూడో రోజుకు చేరుకున్నాయి. మూడో రోజు పార్టీ బీసీ సెల్ నాయకులు దీక్షలో కూర్చున్నారు. వీరికి బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్, చీరాల నియోజకవర్గ సమన్వయకర్త అవ్వారు ముసలయ్య, కందుకూరు మున్సిపల్ మాజీ చైర్మన్ బూర్సు మాలకొండయ్యలు పూలదండలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా నూకసాని బాలాజీ మాట్లాడుతూ రాష్ట్ర విభజన చేస్తారని తెలియగానే సమైక్యాంధ్ర ప్రజలకు మొట్టమొదట అండగా నిలిచిన పార్టీ వైఎస్‌ఆర్ సీపీయేనన్నారు. అందులో భాగంగానే తమ పార్టీకి చెందిన 16 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని గుర్తు చేశారు. సీమాంధ్ర కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల నాయకులు ఇంకా పదవుల కోసం పాకులాడటం సిగ్గుచేటన్నారు.
తెలంగాణకు అనుకూలంగా కేంద్రానికి లేఖ ఇచ్చే ముందు సీమాంధ్ర ప్రజల ఆకాంక్ష తెలుసుకోవాలన్న కనీస జ్ఞానం చంద్రబాబుకు లేకపోవడం విచారకరమన్నారు. కొందరు నేతలు రాజీనామా డ్రామా ఆడుతున్నారని, వారికి చిత్తశుద్ధి ఉంటే సమైక్య ఉద్యమాన్ని ముందుండి నడిపించాలన్నారు. శ్రీకృష్ణ కమిటీ ఇచ్చిన నివేదికను సైతం తుంగలో తొక్కి తెలంగాణను హడావుడిగా ప్రకటించడం వెనుక కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ స్వప్రయోజనాలున్నాయని ఆరోపించారు. ఆమె తన కుమారుడిని ప్రధాని చేసేందుకే తెలుగు రాష్ట్రాన్ని ముక్కలు చేయాలనుకున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి తగిన రీతిలో బుద్ధి చెప్పేందుకు సిద్ధం కావాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. సమైక్యవాదులపై నాన్‌బెయిలబుల్ కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేయడాన్ని ఖండించారు. పోలీసుల తీరు తెలంగాణ వాదానికి అనుకూలంగా ఉందేమోనన్న అనుమానం బాలాజీ వ్యక్తం చేశారు.
పార్టీ బీసీ సెల్ జిల్లా కన్వీనర్ కఠారి శంకర్ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చామన్న మెప్పు పొందేందుకే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని ముక్కలు చేసిందని విమర్శించారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు సిగ్గు ఉంటే ఇప్పటికైనా రాజీనామాలు చేసి సమైక్య ఉద్యమంలో పాలుపంచుకోవాలని కోరారు. చీరాల నియోజకవర్గ సమన్వయకర్త అవ్వారు ముసలయ్య మాట్లాడుతూ మహానేత వైఎస్‌ఆర్ బతికున్నప్పుడు సీమాంధ్రులను ఉద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యలను ఆయన సమర్థంగా తిప్పికొట్టారని గుర్తు చేశారు. ఇప్పటి నేతలు కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించకపోవడం దారుణమన్నారు. సమైక్యవాదులకు మద్దతుగా వైఎస్‌ఆర్‌సీపీ చేపట్టిన ఉద్యమం దేశచరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోనుందన్నారు. బీసీ సెల్ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు వెంకటరాజు, బీసీ విభాగం నగర కన్వీనర్ బొప్పరాజు కొండలరావు, స్టీరింగ్ కమిటీ సభ్యులు జాజుల కృష్ణ, వల్లెపు మురళి, కండే రమణయ్య యాదవ్, పొగర్త చెంచయ్య, జంపని శ్రీనివాసగౌడ్, కొణతం విల్సన్‌బాబు, గంజి ప్రసాద్ తదితరులు దీక్షలో కూర్చున్నారు. దీక్షలో కూర్చున్న వారిని పార్టీ నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్, జిల్లా అధికార ప్రతినిధి నరాల రమణారెడ్డి, గిద్దలూరు నియోజకవర్గ కో ఆర్డినేటర్ వై.వెంకటేశ్వరరావు, యువజన విభాగం జిల్లా కన్వీనర్ కేవీ రమణారెడ్డి, ట్రేడ్ యూనియన్ జిల్లా కన్వీనర్ కేవీ ప్రసాద్, ఎస్సీ సెల్ జిల్లా కన్వీనర్ కంచర్ల సుధాకర్, ట్రేడ్ యూనియన్ నగర కన్వీనర్ ముదివర్తి బాబూరావు, స్టీరింగ్ కమిటీ జిల్లా సభ్యులు తోటపల్లి సోమశేఖర్, నాగిశెట్టి బ్రహ్మయ్య, సింగరాజు వెంకట్రావులు అభినందించారు.
చంద్రబాబు లేఖతోనే రాష్ట్ర విభజన
Published Thu, Aug 8 2013 3:32 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM
Advertisement
Advertisement